కొత్త సంవత్సరం వచ్చేసింది. నవ వసంతాన్ని తెచ్చింది. చేదు జ్ఞాపకాలను వదిలేసి.. మధురానుభూతులను పదిలం చేసుకుంటూ ముందుకు సాగిపొమ్మంటోంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు అక్కడే కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఐదో టెస్టు కోసం మంగళవారమే సిడ్నీకి చేరుకుని న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది.
అనుష్కతో విరాట్
ఇక భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మ(Viat Kohli- Anushka Sharma)తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, ప్రసిద్ కృష్ణతో కలిసి కొత్త సంవత్సర వేడులకు హాజరయ్యాడు. మరోవైపు.. యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ తదితరులు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ
ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 2024కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. ‘‘ఎన్నో ఎత్తు-పళ్లాలు.. అయినప్పటికీ ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది. థాంక్యూ 2024’’ అంటూ గతేడాదికి సంబంధించిన జ్ఞాపకాలను వీడియో రూపంలో షేర్ చేశాడు.
టీ20 ప్రపంచకప్ గెలిచిన సారథిగా
కాగా 2024 రోహిత్ శర్మకు ఎన్నో ఆనందాలతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలను ఇచ్చింది. కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్-2024 గెలవడం రోహిత్ కెరీర్‌లోనే అత్యంత గొప్ప విషయం. అయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవగానే హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు.
ఐపీఎల్‌లో మాత్రం పరాభవం
ఇక అంతకంటే ముందే.. అంటే ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడిన రోహిత్ బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోయాడు. జట్టు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుగన పదో స్థానంలో నిలిచి ఘోర పరాభవం చవిచూసింది. అయితే, ఆ తర్వాత ప్రపంచ కప్ గెలుపు రూపంలో రోహిత్‌కు ఊరట దక్కింది.
అదొక మాయని మచ్చగా
అనంతరం.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ కావడం రోహిత్ శర్మ కెప్టెన్సీ కెరీర్‌లోనే ఓ మాయని మచ్చగా మిగిలింది. సొంతగడ్డపై ఇంతకు మునుపెన్నడూ భారత టెస్టు జట్టు ప్రత్యర్థి చేతిలో ఇలా 3-0తో వైట్‌వాష్ కాలేదు. అలా అత్యంత చెత్త కెప్టెన్సీ రికార్డు 2024లో రోహిత్ పేరిట నమోదైంది.
కుమారుడి రాక
ఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ రోహిత్ శర్మకు 2024 మరుపురానిదిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. గతేడాదే రోహిత్- రితికా జంట తమ రెండో సంతానం కుమారుడు అహాన్ శర్మకు జన్మనిచ్చారు. ఇక ఈ శుభవార్త తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మకు అక్కడ మాత్రం గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. బ్యాటర్‌గా, సారథిగానూ అతడు విఫలమయ్యాడు.
అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్నా.. మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఇక ఆఖరిదైన సిడ్నీ టెస్టు(జనవరి 3-7)లో గెలిస్తేనే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంటుంది.
చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?
Comments
Please login to add a commentAdd a comment