ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు మార్పులు చేటుచేసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విశ్రాంతి పేరిట ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని భావించగా.. శుబ్‌మన్ గిల్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.
ఆకాశ్ దీప్ స్థానంలో యువ పేసర్
మరోవైపు.. ఆకాశ్ దీప్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ఓ యువ పేసర్ ఏడాది కాలం తర్వాత పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ప్రధాన పేసర్, వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు.. ఈసారి మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది.
కోహ్లి, రోహిత్ విఫలం
ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో భాగంగా ఇప్పటికి నాలుగు పూర్తి కాగా.. తొలి మ్యాచ్‌లో శతకం సాధించడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో పదే పదే తప్పుల్ని పునరావృతం చేస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు.
మరోవైపు.. రోహిత్ సారథిగా, బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టుతో జట్టులోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి మరీ దారుణంగా31 పరుగులే చేశాడు.
ఇక అతడి సారథ్యంలో రెండో టెస్టులో ఓడిన భారత్, బ్రిస్బేన్ టెస్టును డ్రాగా ముగించగలిగింది. అయితే, మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.
సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగిన రోహిత్!
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని.. అతడు వెంటనే తప్పుకొని యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆసీస్‌తో ఆఖరి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు తానుగా సిడ్నీ టెస్టు నుంచి వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌తో ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ మరోసారి బరిలోకి దిగనుండగా.. శుబ్‌మన్ గిల్(Shubhman Gill) మూడో స్థానంలో ఆడనున్నట్లు సమాచారం. అదే విధంగా గాయపడిన పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ తుదిజట్టుకు ఎంపికైనట్లు తెలుస్తోంది.
రెండే మార్పులు
ఈ రెండు మార్పులు మినహా.. పాత జట్టుతోనే భారత్ సిడ్నీ టెస్టుకు సన్నద్ధమైనట్లు సమాచారం. కాగా శుక్రవారం నుంచి మంగళవారం(జనవరి 3-7) వరకు ఆసీస్- భారత్ మధ్య ఐదో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.
ఇందులో గెలిస్తేనే టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 అవకాశాలు కూడా సజీవంగా ఉంటాయి.
ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment