రోహిత్‌, బుమ్రా కాదు!.. సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ అతడే! | Not Bumrah: This Player Replacing Rohit As Captain In Sydney Rumour Viral | Sakshi
Sakshi News home page

రోహిత్‌, బుమ్రా కాదు!.. సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ అతడే!

Published Thu, Jan 2 2025 4:05 PM | Last Updated on Thu, Jan 2 2025 5:33 PM

Not Bumrah: This Player Replacing Rohit As Captain In Sydney Rumour Viral

ఆస్ట్రేలియాతో టీమిండియా ఆఖరి టెస్టుకు సమయం ఆసన్నమైంది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో శుక్రవారం ఈ మ్యాచ్‌ మొదలుకానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. సిడ్నీలో గెలిచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది.

మరోవైపు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తామే కైవసం చేసుకోవాలని ఆసీస్‌ పట్టుదలగా ఉన్నాయి. ఫలితంగా భారత్‌- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. అయితే, ఈ కీలక టెస్టుకు ముందు టీమిండియా డ్రెసింగ్‌రూమ్‌లో విభేదాలు తలెత్తాయనే వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.

హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌తో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma)కు సమన్వయం కుదరడం లేదని.. అదే విధంగా ఆటగాళ్ల తీరు పట్ల కోచ్‌ అసంతృప్తితో ఉన్నాడనే వదంతులు వచ్చాయి. అయితే, గౌతీ మాత్రం ఇవన్నీ అబద్దాలేనని కొట్టిపారేశాడు. అయినప్పటికీ, టీమిండియా కెప్టెన్‌ మార్పు అంశం మీద మాత్రం ఊహాగానాలు ఆగటం లేదు.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్టుకు ముందు కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అతడి గైర్హాజరీలో పెర్త్‌లో టీమిండియాను గెలిపించిన జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah) పగ్గాలు చేపట్టడం లాంఛనమేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, బెంగాల్‌ మాజీ క్రికెటర్‌, ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఆడిన శ్రీవత్స్‌ గోస్వామి మాత్రం భిన్నంగా స్పందించాడు.

సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ అతడే!
‘‘టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే.. సిడ్నీ టెస్టులో గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించునున్నాడని అనిపిస్తోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ సైకిల్‌ కోసం మేనేజ్‌మెంట్‌ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదెంతో ఆసక్తికరంగా ఉంది’’ అని శ్రీవత్స్‌ ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

సరైన నాయకుడు బుమ్రానే
అయితే, మెజారిటీ మంది నెటిజన్లు మాత్రం శ్రీవత్స్‌ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. గిల్‌కు తుదిజట్టులోనే చోటు దక్కనపుడు కెప్టెన్‌ ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో గిల్‌కు పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని.. ఇప్పుడు మాత్రం బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు ప్రస్తుత పరిస్థితుల్లో బుమ్రానే సరైన నాయకుడు అని పేర్కొంటున్నారు. ఏదేమైనా శుక్రవారం సిడ్నీ టెస్టు మొదలైన తర్వాతే ఈ ఊహాగానాలకు చెక్‌ పడుతుంది.

ఇదిలా ఉంటే.. ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాకు సానుకూల ఫలితాలు రావడం లేదు. పెర్త్‌లో గెలిచిన భారత జట్టు.. అడిలైడ్‌ పింక్‌ బాల్‌ టెస్టులో ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కగలిగింది. అయితే, మెల్‌బోర్న్‌ వేదికగా నాలుగో టెస్టులో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

రోహిత్‌ వైఫల్యాల వల్లే ఇలా
ఈ బాక్సింగ్‌ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్‌ చేతిలో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. సిరీస్‌లో 1-2తో వెనుకబడింది. ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ సారథిగా, బ్యాటర్‌గా విఫలం అవుతుండటంతో అతడు వెంటనే రాజీనామా చేసి.. రిటైర్మెంట్‌ ప్రకటించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్‌ అంశం తెరమీదకు వచ్చింది.

చదవండి: లవ్‌ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement