డ్రింక్స్ సమయంలో బుమ్రా, పంత్‌తో రోహిత్ (PC: X)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ప్రశంసలు కురిపించాడు. నిజమైన, దిగ్గజ నాయకుడు అంటూ హిట్‌మ్యాన్‌ను కొనియాడాడు. జట్టు ప్రయోజనాల కోసం తనంతట తానుగా తప్పుకోగలిగిన నిస్వార్థపరుడంటూ రోహిత్ శర్మకు కితాబులిచ్చాడు.
ఐదు టెస్టుల సిరీస్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. తదుపరి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు. అడిలైడ్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్ టెస్టుల్లో కలిపి కేవలం 31 పరుగులే చేసిన రోహిత్.. వీటిలో ఒక్క మ్యాచ్‌లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు. ఫలితంగా సిరీస్‌లో భారత జట్టు 1-2తో వెనుకబడింది.
చావో రేవో తేల్చుకునేందుకు
ఈ క్రమంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకోవడం సహా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2025 అవకాశాలను భారత్ సజీవం చేసుకోగలుగుతుంది.
ఇంతటి కీలక మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫామ్‌లేమి దృష్ట్యా స్వయంగా తుదిజట్టు నుంచి తప్పుకొని.. శుబ్‌మన్ గిల్‌కు లైన్ క్లియర్ చేశాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసమే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.
డ్రింక్స్ బ్రేక్ సమయంలో
ఇక జట్టులో స్థానం లేకపోయినా.. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ డగౌట్‌లో చురుగ్గా కనిపించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ల దగ్గరికి వచ్చి వ్యూహాల గురించి చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సురేశ్ రైనా షేర్ చేస్తూ.. రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని కొనియాడాడు.
నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్
‘‘తన నిజాయితీ, నిస్వార్థగుణం ద్వారా నాయకుడంటే ఎలా ఉండాలో రోహిత్ శర్మ నిరూపిస్తున్నాడు. వ్యక్తిగతంగా కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ.. జట్టు విజయానికే అతడు మొదటి ప్రాధాన్యం ఇచ్చాడు. అవసరమైన సమయంలో స్వయంగా తానే తప్పుకొన్నాడు.
టీమిండియా జోరు
ఈ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ భారత జట్టు సక్సెస్ కోసం కనబరుస్తున్న అంకిత భావం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆటలో అతడొక నిజమైన దిగ్గజం’’ అని సురేశ్ రైనా రోహిత్ శర్మను ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టులో టీమిండియా జోరు కనబరుస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బుమ్రా సేన.. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో ఆసీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
ఇక శనివారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి తమ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
మూడో రోజు గనుక కాస్త ఓపికగా ఆడి.. కనీసం మరో వంద పరుగులు జమచేస్తే ఆతిథ్య జట్టు ముందు మెరుగైన లక్ష్యం ఉంచగలుగుతుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి క్రీజులో ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(8*), వాషింగ్టన్ సుందర్(6*)లపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది.
చదవండి: IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'
Rohit Sharma exemplifies leadership through honesty and selflessness. Despite personal challenges, he prioritizes team success, stepping aside when necessary. His leadership in the current Test series reflects his unwavering dedication to India’s success. A true legend of the… pic.twitter.com/L3rPlMlRT6
— Suresh Raina🇮🇳 (@ImRaina) January 4, 2025
Comments
Please login to add a commentAdd a comment