టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ఎంతో హుందాగా ఉంటారని కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. కానీ అదే పనిగా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ప్రత్యర్థులకు చేదు అనుభవం తప్పదని పేర్కొన్నాడు. తమ జోలికి వచ్చిన వాళ్లకు సరైన రీతిలో బదులివ్వడంలో ఎలాంటి తప్పులేదని బుమ్రా సేనను సమర్థించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే.
ఈ సిరీస్‌లో ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి, ఒక టెస్టు డ్రా చేసుకున్న టీమిండియా.. 1-2తో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు మొదలైంది.
గెలిస్తేనే కనీసం డ్రా
ఇందులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను కనీసం డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఫామ్‌లేమి, వరుస ఓటముల నేపథ్యంలో రోహిత్ శర్మ విశ్రాంతి పేరిట తనంతట తానే సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు.
ఈ నేపథ్యంలో పెర్త్‌లో తొలి టెస్టుకు టీమిండియాకు సారథ్యం వహించిన జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరోసారి పగ్గాలు చేపట్టాడు. ఇక ఐదో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26), జస్‌ప్రీత్ బుమ్రా(22), శుబ్‌మన్ గిల్(20) రాణించారు.
బుమ్రాపైకి దూసుకు వచ్చిన ఆసీస్ బ్యాటర్
ఈ క్రమంలో తొలిరోజే ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టగా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) కాస్త అతి చేశాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనే సమయంలో కాస్త ఆగమని చెప్పాడు.
ఇందుకు బుమ్రా కాస్త అసహనంగా కదలగా.. కొన్‌స్టాస్ ఏంటీ అన్నట్లుగా బుమ్రా వైపు దూసుకువచ్చాడు. దీంతో బుమ్రా కూడా బదులిచ్చేందుకు సిద్ధం కాగా.. అంపైర్ జోక్యం చేసుకుని నచ్చజెప్పాడు.
అనంతరం బౌలింగ్ చేసిన బుమ్రా ఖవాజా వికెట్ తీసి .. కొన్‌స్టాస్‌తో.. ‘‘చూశావా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటదో?’’ అన్నట్లు తన ముఖకవళికల ద్వారా మనసులోని భావాలను కాస్త దూకుడుగానే వ్యక్తం చేశాడు. అలా ఆఖరి బంతికి వికెట్ తీసి టీమిండియా తొలిరోజు ఆట ముగించింది.
ఈ ఘటనపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడుతున్న సమయంలో బుమ్రా- కొన్‌స్టాస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘మా వాళ్లు నిర్ణీత సమయం వరకు ఓపికపడతారు. కానీ సహనాన్ని పరీక్షించాలని చూస్తే మాత్రం ఊరుకోరు.
పిచ్చి పనులు మానుకోండి
అనవసరంగా గొడవ పెట్టుకోవాలని చూస్తే.. అంతే ధీటుగా బదులిస్తారు. మేము ఇక్కడకు వచ్చింది క్రికెట్ ఆడటానికి మాత్రమే’’ అని బుమ్రా చర్యను సమర్థించాడు. అంతేకాదు.. ‘‘దయచేసి ఇలా చెత్తగా వ్యవహరించకండి. పిచ్చి పనులు మానుకోండి. ఇలాంటివి చూడటానికి అస్సలు బాగోదు’’ అంటూ కంగారూలకు రోహిత్ కౌంటర్ ఇచ్చాడు.
అదే విధంగా.. ‘‘మా వాళ్లు క్లాసీగా ఉంటారు. ఆటపైనే వారి దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. ఇక శుక్రవారం ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచడంలో సఫలమై వికెట్ తీయడం సంతోషకరం’’ అని రోహిత్ శర్మ తమ జట్టును అభినందించాడు.
చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!
Comments
Please login to add a commentAdd a comment