టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు తొలిరోజు ఆట రసవత్తరంగా సాగింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఇరుజట్ల క్రికెటర్లు పోటీపడ్డారు. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతికి చోటు చేసుకున్న పరిణామాలు టీమిండియా అభిమానులకు మాంచి కిక్కిచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్‌లో బుమ్రా కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా.. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలో అడిలైడ్‌లో ఓడిపోయి.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది.
రోహిత్ లేకుండానే
అయితే, మెల్‌బోర్న్ టెస్టులో కనీసం డ్రా చేసుకునే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమైన రోహిత్ శర్మ(ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 31 రన్స్) ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.
ఇక ఆసీస్‌తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, టాపార్డర్ విఫలమైన కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4)తో పాటు శుబ్‌మన్ గిల్(20), విరాట్ కోహ్లి(17) నిరాశపరిచారు.
పంత్ పోరాటం.. బుమ్రా మెరుపులు
మిడిలార్డర్‌లో రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) రాణించగా.. నితీశ్ రెడ్డి(0) పూర్తిగా విఫలమయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్(14), ప్రసిద్ కృష్ణ(3) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. పదో స్థానంలో వచ్చిన బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 22 పరుగులు సాధించాడు.
185 పరుగులకు ఆలౌట్
ఇక బుమ్రా మెరుపుల కారణంగానే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు కూల్చగా.. నాథన్ లియాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
కొన్‌స్టాస్ ఓవరాక్షన్
ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. సిడ్నీలో శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతి పడటానికి ముందు ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) ఓవరాక్షన్ చేశాడు.
బుమ్రా బౌలింగ్‌కు వస్తున్న సమయంలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కాస్త ఆగమన్నట్లుగా సైగ చేయగా.. బుమ్రా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నాన్- స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్ బుమ్రాను చూస్తూ ఏదో అనగా అతడు సీరియస్ అయ్యాడు.
వైల్డ్ ఫైర్‌లా బుమ్రా.. ఓ రేంజ్‌లో టీమిండియా సంబరాలు
ఈ క్రమంలో కొన్‌స్టాస్ అతి చేస్తూ బుమ్రా వైపు రాగా.. బుమ్రా కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. దీంతో అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు. అయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే తన అద్భుత బంతితో ఖవాజా(2)ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టగానే టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది.
‘‘నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’’ అన్నట్లుగా బుమ్రా కొన్‌స్టాస్ వైపునకు రాగా.. అక్కడే ఉన్న యువ పేసర్ ప్రసిద్ కృష్ణ కూడా కొన్‌స్టాస్‌కు కౌంటర్ ఇచ్చాడు. దీంతో ముఖం మాడ్చుకున్న 19 ఏళ్ల ఈ టీనేజర్ ఆట ముగిసిన నేపథ్యంలో నిరాశగా మైదానాన్ని వీడాడు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆఖరి బంతికి అద్భుతం చేశావు భయ్యా అంటూ టీమిండియా ఫ్యాన్స్ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కొన్‌స్టాస్‌కు ఇలాంటి ఓవరాక్షన్ కొత్తేం కాదు.
మెల్‌బోర్న్‌లో తన అరంగేట్ర టెస్టులో కోహ్లితో గొడవ పెట్టుకున్న కొన్‌స్టాస్‌కు.. బుమ్రా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈసారి తనతో నేరుగా పెట్టుకున్నందుకు.. ఆసీస్‌ను దెబ్బతీసేలా వికెట్‌తో బదులిచ్చాడు.
చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!
Fiery scenes in the final over at the SCG!
How's that for a finish to Day One 👀#AUSvIND pic.twitter.com/BAAjrFKvnQ— cricket.com.au (@cricketcomau) January 3, 2025
Comments
Please login to add a commentAdd a comment