టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. ప్రాణం పెట్టి మరీ సిడ్నీ టెస్టులో జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు కృషి చేశాడని కొనియాడాడు. పదునైన బంతులు శరీరానికి గాయం చేస్తున్నా పట్టుదలగా నిలబడ్డ తీరు ప్రశంసనీయమని పేర్కొన్నాడు.
చావో రేవో
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడి ఉన్న భారత్.. చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా శుక్రవారం ఆఖరిదైన ఐదో టెస్టు మొదలుపెట్టింది.
ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) సారథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు త్వరత్వరగానే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4) పూర్తిగా విఫలం కాగా.. శుబ్‌మన్ గిల్(20) ఫర్వాలేదనిపించాడు.
;పంత్ పోరాటం
అయితే, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి(17) మాత్రం మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant).. రవీంద్ర జడేజాతో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్ల నుంచి దూసుకువస్తున్న బంతుల కారణంగా శరీరానికి గాయాలవుతున్నా.. పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న పంత్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు.
అయితే, దురదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో పంత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగిలిన వాళ్లలో జడ్డూ 26 పరుగులు చేయగా.. నితీశ్ రెడ్డి డకౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 14, ప్రసిద్ కృష్ణ 3, కెప్టెన్ బుమ్రా 22, సిరాజ్ 3* పరుగులు చేశారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం ఆసీస్ బ్యాటింగ్‌కు దిగి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి కేవలం తొమ్మిది పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. పంత్ పోరాట పటిమను ప్రశంసించాడు.
ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఆడాడు
‘‘రిషభ్ పంత్ ఆట గురించి మనం చాలానే మాట్లాడేశాం. అయితే, ఐదో టెస్టులో మాత్రం అతడి అద్భుత, కీలకమైన ఇన్నింగ్స్‌ను కొనియాడకతప్పదు. అలాంటి పరిస్థితుల్లో అంతసేపు బ్యాటింగ్ చేయడం సులువుకాదు.
భారత బ్యాటర్లలో ఒక్కరూ కనీసం 30 పరుగుల మార్కును చేరుకోలేదు. పంత్ ఒక్కడు మాత్రం 40 రన్స్‌తో టాప్ స్కోరర్ అయ్యాడు. పదే పదే బంతులు అతడి శరీరానికి తగిలాయి.
అయినా.. సరే పంత్ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికే అతడిపై మానసికంగా ఒత్తిడి ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో శరీరం కూడా గాయపడింది. అయినా అద్బుతంగా పోరాడాడు. అత్యద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు.
రోహిత్ దూరం
కాగా ఆసీస్‌తో తొలి నాలుగు టెస్టుల్లో పంత్ నిరాశపరిచాడు. కుదురుకుంటాడనుకున్న సమయంలో నిర్లక్ష్యపు రీతిలో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, సిడ్నీ టెస్టులో మాత్రం అద్భుత పోరాటం కనబరిచాడు. ఈ మ్యాచ్‌కు విశ్రాంతి పేరిట రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు.
చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!
Comments
Please login to add a commentAdd a comment