సిడ్నీ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను తప్పించడం పట్ల భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథినే పక్కనపెట్టడం ద్వారా మేనేజ్‌మెంట్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు ఇస్తోందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటన మునుపెన్నడూ జరుగలేదంటూ బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో కంగారూ జట్టుతో తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడి స్థానంలో భారత జట్టును ముందుండి నడిపించిన బుమ్రా.. పెర్త్ టెస్టులో విజయాన్ని అందించాడు.
రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత
అయితే, రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత టీమిండియా వరుసగా వైఫల్యాలే ఎదురయ్యాయి. అడిలైడ్‌లో ఓడిపోయిన భారత్.. బ్రిస్బేన్‌లో డ్రా చేసుకున్నా.. మెల్‌బోర్న్‌లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఫలితంగా సిరీస్‌లో 1-2తో వెనుకబడింది.
బ్యాటర్‌గానూ విఫలం
ఇక బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. ముఖ్యంగా అనవసరపు షాట్లకు పోయి అతడు వికెట్ పారేసుకున్న తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఆసీస్‌తో ఆఖరిదైన ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట రోహిత్ స్వయంగా తప్పుకొన్నాడని తెలిపాడు.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ వంటి వాళ్లు రోహిత్ నిర్ణయాన్ని సమర్థించగా.. నవజ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం భిన్నంగా స్పందించాడు.
తప్పుడు నిర్ణయం.. రోహిత్‌నే పక్కన పెడతారా?
‘‘ఇది చాలా ఆశ్చర్యకరంగా, వింతగా ఉంది. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అతడిని కెప్టెన్‌ను ఎందుకు చేశారు?.. అయినా సారథిగానే కాకుండా కీలక ఆటగాడిగా భారత క్రికెట్‌కు అతడు ఇప్పటికే ఎంతో సేవ చేశాడు.
అలాంటి ఆటగాడి ఫామ్ బాగున్నా.. లేకున్నా అదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే అతడు కెప్టెన్. జట్టు ప్రయోజనాల కోసం తనను తాను బెంచ్‌కే పరిమితం చేసుకోవడం ఏమిటి? ఇలా చేయడం ద్వారా టీమిండియా మేనేజ్‌మెంట్ తప్పుడు సంకేతాలు ఇస్తోంది.
అతడిపై వేటు వేయడమో.. లేదంటే తనకు తానుగా తప్పుకొనేలా చేయడమో సరికాదు. జట్టును నిర్మించిన సారథి అతడు. యువ ఆటగాళ్లలో చాలా మంది అతడిని తమ తండ్రి సమానుడిలా భావిస్తారు. వాళ్ల నుంచి అతడు అంతటి గౌరవాన్ని పొందాడు. ఏ కెప్టెన్ అయినా నౌకను మధ్యలోనే వీడి వెళ్లిపోడు.
అది మునిగిపోతుందని తెలిసినా గట్టెక్కించే ప్రయత్నమే చేస్తాడు గానీ.. తానే ముంచేయాలని చూడడు. అతడొక గౌరవప్రదమైన వ్యక్తి. కానీ మీరు మాత్రం అతడి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు.
రోహిత్ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సింది. అతడిపై నమ్మకం ఉంచాల్సింది’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
సిడ్నీలో తొలి రోజు ముగిసిందిలా
కాగా ఆసీస్‌తో సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా ఫర్వాలేదనిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్‌కు ఆదిలోనే షాకిచ్చింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి ఆసీస్ తొమ్మిది పరుగులు చేసింది.
చదవండి: కొన్‌స్టాస్ ఓవరాక్షన్.. బుమ్రా ఆన్ ఫైర్!.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది!
Comments
Please login to add a commentAdd a comment