గ్రూప్ దశలో సునాయాస ‘డ్రా’
నాకౌట్ దశ నుంచి మేటి ప్రత్యర్థులు సిద్ధం
ప్రణయ్, లక్ష్య సేన్‌లలో ఒక్కరే ముందుకు
పారిస్ ఒలింపిక్స్ ‘డ్రా’ విడుదల
కౌలాలంపూర్: ఒలింపిక్స్ చరిత్రలో గతంలో ఏ భారతీయ ప్లేయర్‌కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకోవాలంటే... భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ‘డ్రా’ వివరాలను శుక్రవారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన సింధు ‘పారిస్’లోనూ పతకం గెలిస్తే... భారత్ నుంచి ఒలింపిక్స్ చరిత్రలో మూడు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తుంది.
‘డ్రా’ ప్రకారం సింధుకు గ్రూప్ దశలో సునాయాస ప్రత్యర్థులు ఎదురుకానున్నారు. గ్రూప్ ‘ఎం’లో ఉన్న సింధు ప్రపంచ 75వ ర్యాంకర్ క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)తో, ప్రపంచ 111వ ర్యాంకర్ ఫాతిమత్ నభా (మాల్దీవులు)తో ఆడుతుంది. గ్రూప్ విజేత హోదాలో సింధు ప్రిక్వార్టర్ చేరితే ఆరో సీడ్ హి బింగ్‌జియావో (చైనా)తో తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 9–11తో వెనుకంజలో ఉంది. హి బింగ్‌జియావోపై నెగ్గితే సింధుకు క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యు ఫె (చైనా) ఎదురవుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 6–6తో సమంగా ఉంది.
చెన్ యు ఫెను కూడా ఓడిస్తే సింధుకు సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ విజేత, మూడుసార్లు వరల్డ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) సిద్ధంగా ఉండే అవకాశముంది. ముఖాముఖి రికార్డులో సింధు 5–12తో వెనుకంజలో ఉంది. ఒకవేళ మారిన్‌పై ఈసారి సింధు గెలిస్తే పతకం ఖరారవుతుంది. మారిన్ చేతిలో సింధు ఓడిపోతే కాంస్య పతకం కోసం రేసులో నిలుస్తుంది. కాంస్య పతకం కోసం మరో పార్శ్వంలో ఉన్న వరల్డ్ నంబర్‌వన్ అన్ సె యంగ్ (దక్షిణ కొరియా), ప్రపంచ మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), ప్రపంచ ఐదో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)లలో ఒకరితో సింధు ఆడే చాన్స్ ఉంటుంది.
పురుషుల సింగిల్స్‌లో భారత్
నుంచి ప్రణయ్, లక్ష్య సేన్ బరిలో ఉన్నారు. గ్రూప్ ‘కె’లో ప్రణయ్... గ్రూప్ ‘ఎల్’లో లక్ష్య సేన్ ఉన్నారు. లక్ష్య సేన్ గ్రూప్‌లోనే ఈ ఏడాది ఆసియా చాంపియన్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, ప్రపంచ 3వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) ఉన్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాలంటే లక్ష్య సేన్ తప్పనిసరిగా క్రిస్టీపై గెలవాల్సి ఉంటుంది. స్థాయికి తగ్గట్టు ఆడితే గ్రూప్ ‘కె’ నుంచి ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంటాడు.
‘డ్రా’ ప్రకారం ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్, లక్ష్య సేన్ ముఖాముఖిగా తలపడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇద్దరు భారత ఆటగాళ్లలో ఒకరికి మాత్రమే పతకం నెగ్గే అవకాశం ఉంటుంది. మహిళల డబుల్స్‌లో నాలుగు జోడీలు ఉన్న గ్రూప్ ‘సి’లో అశ్విని పొన్నప్ప–తనీషాలకు చోటు లభించింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే భారత జోడీ రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి.
మరోవైపు పురుషుల డబుల్స్ ‘డ్రా’లో ఎన్ని జోడీలు ఉండాలనే విషయంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ విభాగం ‘డ్రా’ను ప్రకటించలేదు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో భారత స్టార్ ద్వయం సాతి్వక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టిపై భారీ అంచనాలు ఉన్నాయి. పారిస్ ఒలింపిక్స్ ఈనెల 26 నుంచి జరగనుండగా... బ్యాడ్మింటన్ ఈవెంట్ 27న మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment