అన్నదాతలకు అండగా..  | Jan 1st 2025 Modi Cabinet Meeting Live Updates, Highlights And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు అండగా.. 

Published Wed, Jan 1 2025 10:14 AM | Last Updated on Thu, Jan 2 2025 5:59 AM

Jan 1st 2025 Modi Cabinet Meeting Live Updates Highlights

డీఏపీపై వన్‌–టైమ్‌ స్పెషల్‌ ప్యాకేజీ పొడిగింపు  

50 కిలోల డీఏపీ ఎరువు రూ.1,350కి లభ్యం 

రెండు పంటల బీమా పథకాలు మరో ఏడాది పొడిగింపు  

పథకాల అమలుకు రూ.824.77 కోట్లతో  ‘ఫండ్‌ ఫర్‌ ఇన్నోవేషన్, టెక్నాలజీ’ 

నిధుల కేటాయింపులు రూ.69,515.71 కోట్లకు పెంపు  

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు   

న్యూఢిల్లీ: రైతన్నలకు మరింత చేయూతనిచ్చేలా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. డై అమ్మోనియం ఫాస్ఫేట్‌(డీఏపీ)పై అదనపు రాయితీ  గడువును పొడిగించింది. 50 కిలోల డీఏపీ ఎరువు రూ.1,350కి లభించనుంది. ఈ రాయితీ వల్ల ప్రభుత్వంపై రూ.3,850 కోట్ల భారం పడనుంది. వాస్తవానికి అదనపు రాయితీ గడువు గత ఏడాది డిసెంబర్‌ 31న ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ బుధవారం సమావేశమైంది. 

డీఏపీపై వన్‌–టైమ్‌ స్పెషల్‌ ప్యాకేజీని పొడిగించాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. జనవరి 1వ తేదీ నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఈ ప్యాకేజీ కింద టన్ను డీఏపీ రాయితీని రూ.3,500గా నిర్ణయించారు. గత ఏడాది ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 దాకా అమల్లో ఉంది. డీఏపీ ధరను నియంత్రించడానికి ప్రభుత్వం రూ.2,625 కోట్లు ఖర్చు చేసింది. ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా అదనపు రాయితీ గడువును మరోసారి పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

 తక్కువ ధరలకే రైతులకు డీఏపీ అందించాలన్నదే లక్ష్యమని స్పష్టంచేసింది. అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ మన దేశంలో 2024–25 రబీ, ఖరీఫ్‌ సీజన్లలో తగినంత డీఏపీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. కేంద్ర కేబినెట్‌ భేటీ వివరాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు తెలియజేశారు. రైతన్నలు 50 కిలోల డీఏపీని ఇకపై కూడా రూ.1,350కే కొనుగోలు చేయవచ్చని చెప్పారు. అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.

 డీఏపీపై వన్‌–టైమ్‌ స్పెషల్‌ ప్యాకేజీ రూ.3,850 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, యుద్ధాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో డీఏపీ ధరలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు.  2014 నుంచి 2024 దాకా ఎరువుల రాయితీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11.9 లక్షల కోట్లు ఖర్చు చేసింది. 2004 నుంచి 2014 దాకా ఇచ్చిన దానికంటే(రూ.5.5 లక్షల కోట్లు) ఇది రెండు రెట్లు అధికం కావడం గమనార్హం. 28 గ్రేడ్ల  ఫాస్ఫేటిక్‌ అండ్‌ పొటాసిక్‌ ఎరువులను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది.  

రెండు పథకాలకు కేటాయింపులు పెంపు  
రెండు పంటల బీమా పథకాల గడువును కేంద్రం పొడిగించింది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై), రీస్ట్రక్చర్డ్‌ వెదర్‌ బేస్డ్‌ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌)ను మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ సమావేశంలో బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగింది. రెండు బీమా పథకాల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

15వ ప్లానింగ్‌ కమిషన్‌ గడువు ప్రకారం 2025–26 వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఈ రెండు బీమా పథకాల అమలు కోసం ప్రత్యేకంగా ఫండ్‌ ఫర్‌ ఇన్నోవేషన్, టెక్నాలజీ(ఎఫ్‌ఐఏటీ) పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం విశేషం. ఈ నిధికి ప్రభుత్వం రూ.824.77 కోట్లు కేటాయించింది. రెండు పథకాలకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. అందుకే వీటికి నిధుల కేటాయింపులు పెంచుతున్నట్లు వివరించారు. 

పంటల బీమా పథకాల్లో పంటల నష్టం అంచనా, క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ను వేగంగా పూర్తిచేయడానికి ఫండ్‌ ఫర్‌ ఇన్నోవేషన్, టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాలసీల సంఖ్యలో పీఎంఎఫ్‌బీవై అనేది దేశంలో అతిపెద్ద బీమా పథకం. ప్రీమియంల విషయంలో మూడో అతిపెద్ద పథకం. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతోంది. పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ అమలుకు 2020–21 నుంచి 2024–25 దాకా రూ.66,550 కోట్లు కేటాయించగా, 2021–22 నుంచి 20253–26 వరకు ఈ కేటాయింపులను రూ.69,515.71 కోట్లకు పెంచారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement