
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కొత్తగా అమల్లోకి తేవాలనుకుంటున్న షెడ్యూలుపై భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ అసంతృప్తి వెలిబుచ్చింది. తీరిక లేకుండా వరుస టోర్నీల్లో పాల్గొంటే గెలవడం కష్టమవుతుందని చెప్పింది. బీడబ్ల్యూఎఫ్ కొత్త షెడ్యూల్ ప్రకారం ప్రపంచ టాప్–15 సింగిల్స్ క్రీడాకారులు ఏడాదిలో కనీసం 12 పెద్ద టోర్నీల్లో తప్పనిసరిగా ఆడాలి. లేదంటే పెనాల్టీ పాయింట్లు విధిస్తారు. ‘బీడబ్ల్యూఎఫ్ షెడ్యూల్ మేటి క్రీడాకారుల ప్రయోజనాలను కాలరాసేలా ఉంది. నా వరకైతే అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు, తిరిగి పుంజుకునేందుకు సమయం అవసరం. వరుసబెట్టి టోర్నీలు ఆడలేను. అలాగైతే గెలవలేను. పీబీఎల్ తర్వాత మూడు టోర్నీలున్నాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు మరో మూడు సూపర్ సిరీస్ ఈవెంట్లున్నాయి. దీంతో ఆటగాళ్లు బాగా అలసిపోతారు. ఇది చాలా సవాలుతో కూడుకున్నది’ అని సైనా చెప్పింది. టెన్నిస్‌తో బ్యాడ్మింటన్‌ను పోలుస్తూ సైనా మరో సూచన చేసింది. బ్యాడ్మింటన్‌ను టెన్నిస్‌లా చేయాలనుకుంటే నాలుగైదు గ్రాండ్ స్లామ్‌లకు పరిమితం చేయాలి. దీంతో డబ్బుకు డబ్బు, కవరేజ్ కవరేజ్ వస్తుందని వ్యాఖ్యానించింది.
పీబీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ...
స్టార్ ఆటగాళ్ల మధ్య పీబీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ఒక్క సింధు మినహా మేటి ప్లేయర్లంతా పాల్గొన్నారు. శనివారం (ఈ నెల 23) నుంచి 23 రోజుల పాటు జరగనున్న ఈ మూడో సీజన్‌లో కొత్తగా రెండు ఫ్రాంచైజీలు జతయ్యాయి. దీంతో ఐపీఎల్ లాగే మొత్తం 8 ఫ్రాంచైజీలతో పీబీఎల్ ముస్తాబైంది. బుధవారం జరిగిన కార్యక్రమంలో సైనా, ప్రణయ్, అజయ్ జయరామ్, మారిన్, సన్‌వాన్, తియన్ హౌవీ పాల్గొన్నారు.