15 పాయింట్లతో మూడు గేమ్‌లు! | BWFs thoughts on changes in scoring | Sakshi
Sakshi News home page

15 పాయింట్లతో మూడు గేమ్‌లు!

Published Fri, Feb 7 2025 4:11 AM | Last Updated on Fri, Feb 7 2025 4:11 AM

BWFs thoughts on changes in scoring

స్కోరింగ్‌లో మార్పులపై బీడబ్ల్యూఎఫ్‌ యోచన

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా మెరుపు వేగంలో ముగిసే ఆటలపై పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా బ్యాడ్మింటన్‌ కూడా అటువైపే పయనించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌ ) 21 పాయింట్లతో మూడు గేముల (బెస్టాఫ్‌ త్రీ) స్కోరింగ్‌ విధానాన్ని అమలు చేస్తోంది. ఆయా దేశాల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే స్కోరింగ్‌తో టోర్నీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆట మరింత రసవత్తరంగా జరిగేందుకు, మ్యాచ్‌ చకచకా ముగిసిపోయేందుకు కొత్త స్కోరింగ్‌ విధానం అమలు చేసేందుకు బీడబ్ల్యూఎఫ్‌ సిద్ధమైంది. 

ఇప్పుడున్న మూడు గేమ్‌లను 15 పాయింట్లతో ముగించి ఆటలో వేగం పెంచనుంది. తద్వారా కొత్తతరం ప్రేక్షకుల్ని ఆకర్శించాలని, సుదీర్ఘంగా సాగదీయకుండా, నిమిషాల్లో మ్యాచ్‌ ఫలితం వచ్చేలా కొత్త స్కోరింగ్‌ విధానాన్ని ఈ ఏప్రిల్‌ నుంచే అమలు చేయాలని బీడబ్ల్యూఎఫ్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. నవంబర్లో కౌలాలంపూర్‌లో జరిగే బీడబ్ల్యూఎఫ్‌ అత్యున్నత సమావేశానికి ముందు ఆరు నెలల పాటు ఈ స్కోరింగ్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాక... ఆ సమావేశంలో సమీక్షించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. 

‘కాంటినెంటల్‌ చాంపియన్‌షిప్‌లు, గ్రేడ్‌–3 టోర్నమెంట్‌లు, జాతీయ, అంతర్జాతీయ లీగ్‌లు, జాతీయ టోర్నీల్లో ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఈ కొత్త స్కోరింగ్‌ పద్ధతిని అవలంభిస్తారు’ అని బీడబ్ల్యూఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త విధానం వల్ల మ్యాచ్‌ల్లో పోటీ మరింత పెరుగుతుందని, ప్రతీ పాయింట్‌ కోసం ప్రత్యర్థులు దీటుగా సన్నద్ధమై బరిలోకి దిగుతారని, మ్యాచ్‌ త్వరగా ముగియడం కాదు... పోటాపోటీగా జరగడం ఖాయమని బీడబ్ల్యూఎఫ్‌ వివరణ ఇచ్చింది. 

నిజానికి 15 పాయింట్ల ‘బెస్టాఫ్‌ త్రీ’ గేమ్‌లు కొత్తేం కాదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో గతంలో ఏళ్ల తరబడి ఈ స్కోరింగ్‌ పద్ధతిలో మ్యాచ్‌లు జరిగాయి. తర్వాత 7 పాయింట్లతో ‘బెస్టాఫ్‌ ఫైవ్‌’ పద్ధతిలోనూ కొన్నాళ్లు జరిగాయి. క్రమానుగతంగా మారుతుండగా 2014లో తొలిసారి 11 పాయింట్లతో ‘బెస్టాఫ్‌ ఫైవ్‌’ స్కోరింగ్‌ పద్ధతి తెరపైకి వచ్చింది. 

కానీ బీడబ్ల్యూఎఫ్‌లోని సభ్యదేశాలు సమ్మతించకపోవడంతో ఆ ఏడాది, తర్వాత 2021లో బీడబ్ల్యూఎఫ్‌ కౌన్సిల్‌లో కనీస మద్దతు లభించక మరోసారి ఇలా రెండుసార్లూ ప్రతిపాదన దశలోనే ఆ స్కోరింగ్‌ (11 పాయింట్ల బెస్టాఫ్‌ ఫైవ్‌) పద్ధతిని ఉపసంహరించుకున్నారు. దీంతో 2006 నుంచి స్థిరంగా ప్రస్తుత 21 పాయింట్ల స్కోరింగే కొనసాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement