
చాంపియన్‌కు చుక్కలు
ఓ దశలో మారిన్ 15-12 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ సైనా పుంజుకుని స్కోరును 21-21తో సమం చేసి... క్రాస్ షాట్స్‌తో వరుసగా రెండు పాయింట్లతో గేమ్‌ను చేజిక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో ఊహించని రీతిలో హైదరాబాదీ ఆట గాడి తప్పింది. స్కోరు 5-5తో సమమైన తర్వాత మారిన్ ఒక్కసారిగా చెలరేగిపోయింది. వరుసగా ఐదు, ఆరు పాయింట్ల చొప్పున సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైనా తన వ్యూహాన్ని పూర్తిగా మార్చింది. రక్షణాత్మకంగా కాకుండా అటాకింగ్ గేమ్‌తో వణికించింది. స్కోరు 4-4తో సమమైన తర్వాత సైనా తన అనుభవాన్ని రంగరించి 10-5 ఆధిక్యంలో వెళ్లింది. తర్వాత మారిన్ పుంజుకోవడంతో ఆధిక్యం 8-11కు తగ్గింది. ఈ దశలో మారిన్ చేసిన అనవసర తప్పిదాలను హైదరాబాద్ అమ్మాయి అందిపుచ్చుకుంది. చకచకా పాయింట్లతో 16-8 స్కోరు సాధించింది. తర్వాత అద్భుతమైన క్రాస్ కట్స్‌తో 19-9 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మారిన్ పోరాడినా... రెండు సూపర్ స్మాష్‌లతో సైనా గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.