న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నమెంట్లలో టైటిల్స్ గెలుస్తున్న మేటి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు టార్గెట్ ఒలింపిక్స్ పోడియం (టాప్) పథకాన్ని పొడిగించారు. సింగిల్స్‌లో వీరిద్దరితో పాటు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, హెచ్.ఎస్.ప్రణయ్‌లకూ టోక్యో ఒలింపిక్స్–2020 దాకా ‘టాప్’ చేయూతనిచ్చేందుకు కేంద్ర క్రీడాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన ‘టాప్’ జాబితాను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) బుధవారం ప్రకటించింది. అయితే మరో తెలుగుతేజం భమిడిపాటి సాయిప్రణీత్, లక్ష్య సేన్‌లను ఈ జాబితా నుంచి తప్పించింది. డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రాలు ‘టాప్’ జాబితాలో ఉన్నారు. కాగా ప్రదర్శన బాగుంటే టాప్‌లో చేర్చే ‘వాచ్‌లిస్ట్’ లో జక్కంపూడి మేఘన, పూర్వీషారామ్, మను అత్రి, సుమీత్ రెడ్డిలు ఉన్నారు. ‘2024 ఒలింపిక్స్ డెవలప్‌మెంటల్ గ్రూప్’లో సైక్లింగ్‌ను చేర్చే అంశాన్ని బుధవారం నాటి సమావేశంలో చర్చించారు. జూనియర్ ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇటీవల భారత్ 10 పతకాలు సాధించింది. దీంతో సైక్లిస్ట్‌లు అల్బెన్, రొనాల్డో సింగ్, జేమ్స్ సింగ్, రోజిత్ సింగ్‌లను ఈ డెవలప్‌మెంటల్ తుది జాబితాలో చేర్చారు.
పారాలింపియన్లకు అండదండ...
తాజా ‘టాప్’ పథకంలో పారా అథ్లెట్లకు పెద్దపీట వేశారు. పారాలింపిక్స్, పారా ఆసియా క్రీడల్లో భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాలతో దేశానికి కీర్తిప్రతిష్టలు తెస్తుండటంతో ఈసారి ఏకంగా 12 మంది పారా అథ్లెట్లను ఎంపిక చేశారు. పారా ఆసియా క్రీడల స్వర్ణ విజేత శరద్ కుమార్ (హైజంప్), వరుణ్ భటి (హైజంప్), జావెలిన్ త్రోయర్లు సందీప్ చౌదరి, సుమిత్, సుందర్ సింగ్ గుర్జార్, రింకు, అమిత్ సరోహ (క్లబ్ త్రోయర్), వీరేందర్ (షాట్‌పుట్), జయంతి బహెరా (మహిళల 400 మీ. పరుగు) ‘టాప్’ జాబితాలో ఉన్నారు.
టోక్యో ఒలింపిక్స్ వరకు... ‘టాప్’లో సైనా, సింధు, శ్రీకాంత్
Published Thu, Jan 31 2019 1:00 AM | Last Updated on Thu, Jan 31 2019 1:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment