కొంచెం ముందుకు.. కొంచెం వెనక్కి | sports review of 2015 sakshi special | Sakshi
Sakshi News home page

కొంచెం ముందుకు.. కొంచెం వెనక్కి

Published Mon, Dec 28 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

కొంచెం ముందుకు.. కొంచెం వెనక్కి

కొంచెం ముందుకు.. కొంచెం వెనక్కి

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన వారు ఒకరు... నిలకడైన ఆటతీరుకు అర్థం చెబుతూ ప్రపంచ టైటిల్స్‌ను కూడా అలవోకగా సాధించొచ్చని నిరూపించిన వారు మరొకరు... పక్కాగా నిర్వహిస్తే గ్రామీణ క్రీడ కూడా అందరి హృదయాలను దోచుకోవచ్చని... ముందు చూపులేకపోతే ఎన్నాళ్లయినా తమ నాణ్యతా ప్రమాణాలను పెంచుకోలేమని... ఈ ఏడాది భారత క్రీడారంగానికి అనుభవంలోకి వచ్చింది. ఈ సంవత్సరం కొన్ని క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు మెరుగ్గా రాణించి తమ ఉనికిని మరింత చాటుకోగా... మరికొన్నింటిలో మాత్రం అంతంత ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు.                                                                
                                                                                                                                       - సాక్షి క్రీడావిభాగం
 
  సైనా... సాధించెన్
 కొన్నేళ్లుగా భారత బ్యాడ్మింటన్‌కు పర్యాయ పదంగా నిలుస్తోన్న సైనా నెహ్వాల్ ఈ ఏడాది అనుకున్నది సాధించింది. సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌లో విజేతగా నిలిచి శుభారంభం చేసిన సైనా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తొలిసారి టైటిల్ నెగ్గి, అలాగే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అనంతరం ఎంతోకాలంగా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని దక్కించుకొని ఊరట చెందింది.
 
  ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సైనా రజత పతకం సొంతం చేసుకొని మరో అరుదైన ఘనత సాధించింది. చైనా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సైనా... సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో మాత్రం లీగ్ దశలో నిష్ర్కమించింది. ఈ ఏడాది సైనా మొత్తం 49 మ్యాచ్‌లు ఆడి... 37 విజయాలు, 12 పరాజయాలు నమోదు చేసింది. మరోవైపు పీవీ సింధుకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు మిగిల్చింది. గాయాలతో బాధపడిన సింధు చివర్లో మెరిసింది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సింధు, మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో వరుసగా మూడో ఏడాది విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.
 
 ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు ఈ ఏడాది చేదు, తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఈ హైదరాబాదీ వరుస వారాల్లో స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించాడు. అయితే ఆ తర్వాత శ్రీకాంత్ ఆటతీరు గాడితప్పింది. వరుసగా 14 టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన శ్రీకాంత్ చివర్లో ఇండోనేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి ఫామ్‌లోకి వచ్చాడు.
 
  అయితే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గకుండా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాడు. మరో ప్లేయర్ అజయ్ జయరామ్ కొరియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, డచ్ ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్ నెగ్గి సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన పారుపల్లి కశ్యప్... ఇండోనేసియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం కెనడా ఓపెన్‌లో... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంట మెక్సికో ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గి తమ ఉనికిని చాటుకున్నారు.
 
 కబడ్డీ కేక...
 గతేడాది మొదలైన ప్రొ కబడ్డీ లీగ్‌కు ఈసారి మరింత ఆదరణ పెరిగింది. క్రితంసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్న యు ముంబా జట్టు ఈసారి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో యు ముంబా ఆరు పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. తెలుగు టైటాన్స్ జట్టు కూడా ఆకట్టుకొని మూడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌కు లభించిన ఆదరణతో నిర్వాహకులు వచ్చే ఏడాది రెండుసార్లు ఈ లీగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.
 
 అదే ‘గురి’
 ఈ సంవత్సరం కూడా మన ‘షూటర్లు’ మెరిశారు. ఇప్పటివరకైతే ఎనిమిది మంది భారత షూటర్లు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. అంతర్జాతీయ ఈవెంట్‌లలో మెరుగైన ప్రదర్శన ఆధారంగా అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), గగన్ నారంగ్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్), గుర్‌ప్రీత్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), ప్రకాశ్ నంజప్ప, జీతూ రాయ్ (50 మీటర్ల పిస్టల్), చెయిన్ సింగ్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), మేరాజ్ అహ్మద్ ఖాన్ (స్కీట్), అపూర్వీ చండిలా (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్) రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు.
 
 అలవోకగా ప్రపంచ టైటిల్స్...
 క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో తనకు తిరుగులేదని భారత స్టార్ పంకజ్ అద్వానీ ఈసారీ నిరూపించుకున్నాడు. ప్రపంచ టైటిల్స్ నెగ్గడం ఇంత సులభమా అన్నట్లుగా ఈ సంవత్సరం ఈ బెంగళూరు ప్లేయర్ మూడు ప్రపంచ టైటిల్స్ (బిలియర్స్ టైమ్ ఫార్మాట్, స్నూకర్, సిక్స్ రెడ్ స్నూకర్)ను సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఉమా దేవి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది.
 
 
 మందగమనమే
 గతంతో పోలిస్తే ఈసారీ మన పరుగు మందగమనంగానే ఉంది. అంతర్జాతీయ వేదికలపై భారత అథ్లెట్స్ పతకాల పంట పండించకపోయినా... వ్యక్తిగత ప్రదర్శనతో ఏకంగా 15 మంది రియో ఒలింపిక్స్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. మహిళా అథ్లెట్ ద్యుతీచంద్ శరీరంలో హైపర్‌ఆండ్రోజెనిజమ్ (పురుష హార్మోన్ లక్షణాలు) ఉన్నాయనే కారణంగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నిషేధం విధించగా... ద్యుతీచంద్ న్యాయం కోసం కోర్టు ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో కేసు వేసింది. వాదనలు విన్నాక కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ మహిళా అథ్లెట్స్ విషయంలో హైపర్‌ఆండ్రోజెనిజమ్ నిబంధనలను రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. దాంతో ద్యుతీచంద్ మళ్లీ పోటీల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.
 
 మళ్లీ డోపింగ్ భూతం
 గతేడాది డోపింగ్ రహితంగా కనిపించిన భారత వెయిట్‌లిఫ్టింగ్‌లో ఈసారి మళ్లీ ఆ జాఢ్యం వచ్చింది. ఆయా టోర్నీల్లో పాల్గొన్న లిఫ్టర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించగా 26 మంది వెయిట్‌లిఫ్టర్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పోటీపడిన ప్రమీలా కృసాని, మినాతి సేథి డోపింగ్‌లో పట్టుబడ్డారు. ఒక దేశానికి చెందిన లిఫ్టర్లు ఒకే ఏడాది అంతర్జాతీయ టోర్నీల్లో మూడుసార్లు డోపింగ్‌లో విఫలమైతే ఆ దేశం లిఫ్టర్లపై ఏడాదిపాటు నిషేధం విధిస్తారు. గతంలో భారత్‌పై మూడుసార్లు నిషేధం విధించారు.
 
 ఎక్కడ వేసిన బంతి అక్కడే
 ఒకప్పుడు ఒలింపిక్స్‌లో మెరిసిన భారత ఫుట్‌బాల్ పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా కనిపించడంలేదు. గ్వామ్‌లాంటి చిన్న జట్టు చేతిలోనూ భారత్‌కు ఓటమి తప్పడంలేదు. ప్రపంచకప్-2018 క్వాలిఫయింగ్ పోటీల్లో భారత్ ఒకే ఒక్క విజయం సాధించి మరోసారి నిరాశపరిచింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో చెన్నైయిన్ జట్టు విజేతగా నిలువగా... ఐఎస్‌ఎల్‌లో భారత ఫుట్‌బాల్‌కు ఏరకంగా మేలు జరుగుతుందో తెలియదని గోవా జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన బ్రెజిల్ దిగ్గజం జికో వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 166వ స్థానంలో ఉన్న భారత్ తమ ఉనికిని చాటుకోవాలంటే క్షేత్రస్థాయి నుంచి మార్పులు మొదలవ్వాలి.
 
 జోష్నా జిగేల్
 ఐదేళ్ల తర్వాత దీపిక పళ్లికల్‌ను వెనక్కి నెట్టి భారత నంబర్‌వన్  స్క్వాష్ ప్లేయర్‌గా నిలిచిన జోష్నా చినప్ప ఈ ఏడాది మెరిపించింది. ఖతార్ క్లాసిక్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ రానిమ్ ఎల్ వెలిలీ (ఈజిప్టు)ను బోల్తా కొట్టించి సంచలనం సృష్టించింది. మెల్‌బోర్న్, ముంబై టోర్నీల్లో విజేతగా నిలిచిన జోష్నా ఈ క్రమంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరుకుంది. పురుషుల విభాగంలో సౌరవ్ ఘోషాల్ నాలుగు అంతర్జాతీయ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకొని ఒకదాంట్లో విజేతగా నిలిచాడు.
 
 ‘ఫోర్స్’ పెరిగింది
 ఫార్ములావన్‌లో భారత్ నుంచి బరిలో ఉన్న ఏకైక జట్టు ‘ఫోర్స్ ఇండియా’కు ఈ ఏడాది కలిసొచ్చింది. ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ (78 పాయింట్లు), నికో హుల్కెన్‌బర్గ్ (58 పాయింట్లు) డ్రైవర్స్ చాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో వరుసగా తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు. 30 రేసుల తర్వాత ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్ టాప్-3లో నిలిచాడు. రష్యా గ్రాండ్‌ప్రి రేసులో సెర్గియో పెరెజ్ మూడో స్థానాన్ని దక్కించుకొని ఈ ఘనత సాధించాడు. ఇక కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో 136 పాయింట్లతో ఐదో స్థానాన్ని సంపాదించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement