సింధు శ్రమించి... | Saina Nehwal, PV Sindhu, Kidambi Srikanth Enter Quarters | Sakshi
Sakshi News home page

సింధు శ్రమించి...

Published Fri, Aug 25 2017 12:59 AM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM

సింధు శ్రమించి...

సింధు శ్రమించి...

క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్‌  
శ్రీకాంత్, సైనా ముందుకు.. సాయి ప్రణీత్‌ అవుట్‌
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌  


సింధు ప్రిక్వార్టర్స్‌ ప్రత్యర్థి ఎన్గాన్‌ యి చెయుంగ్‌. ఈ హాంకాంగ్‌ అమ్మాయిపై గతంలో మూడు సార్లు అలవోక విజయం సాధించిన రికార్డు సింధుది. ఆమె ఫామ్‌ దృష్ట్యా ఈసారి కూడా అదే ఫలితమని భావించినా... మ్యాచ్‌ మాత్రం మరోలా సాగింది. ఎన్గాన్‌ పట్టుదలగా  ఆడటంతో మ్యాచ్‌ తుదికంటా హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు ఒక దశలో  రెండో గేమ్‌లోనూ వెనుకబడింది. చివరకు తన అనుభవాన్నంతా రంగరించి  మ్యాచ్‌లో నిలిచిన తెలుగమ్మాయి, మూడో గేమ్‌ విజయంతో గట్టెక్కింది.  

గ్లాస్గో: అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో పీవీ సింధు ఆపసోపాలు పడింది. సులువైన ప్రత్యర్థితో తలపడుతూ కూడా ఓటమి దిశగా వెళ్లినట్లు కనిపించింది. అయితే చివరకు తన అసలు సత్తాను ప్రదర్శించి కీలక సమరంలో విజయాన్ని అందుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌ ఫైనల్లో సింధు 19–21, 23–21, 21–17తో ఎన్గాన్‌ యి చెయుంగ్‌ (హాంకాంగ్‌)పై గెలిచి ఊపిరి పీల్చుకుంది.

మరో వైపు సైనా నెహ్వాల్‌ అలవోక విజయంతో క్వార్టర్స్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 13వ సీడ్‌ అజయ్‌ జయరామ్, 15వ సీడ్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. అజయ్‌ 11–21, 10–21తో ఐదో సీడ్‌ చెన్‌ లాంగ్‌ చేతిలో పరాజయం చవిచూడగా, సాయిప్రణీత్‌ 21–19, 10–21, 12–21తో ఆరో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో కంగుతిన్నాడు.

ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ సింధు ప్రతీ పాయింట్‌ కోసం శ్రమించాల్సివచ్చింది. 13వ సీడ్‌ ఎన్గాన్‌ ఆరంభం నుంచి పట్టుబిగించడంతో పోటాపోటీగా సాగిన తొలి గేమ్‌ను హాంకాంగ్‌ ప్లేయర్‌ వశం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ తన దూకుడు పెంచడంతో సింధు 13–16తో వెనుకంజలో నిలిచింది. ఈ దశలో సర్వశక్తులు ఒడ్డి నాలుగు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వచ్చింది. ఐతే చెయుంగ్‌ కూడా దీటుగా పాయింట్లు సాధిస్తుండటంతో ఉత్కంఠ పెరిగింది చివరకు 21–21 వద్ద వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు గేమ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌ స్వరూపాన్ని అర్థం చేసుకున్న హైదరాబాదీ స్టార్‌ నిర్ణాయక మూడో గేమ్‌లో మొదటి నుంచి జాగ్రత్తగా ఆడింది. నెట్‌ వద్ద చురుగ్గా స్పందించిన ఆమె స్మాష్‌లతో రాణించింది. 5–1తో టచ్‌లోకి వచ్చిన ఆమె 12–8 స్కోరు వరకు ఆధిక్యంలోనే ఉంది. ఈ దశలో ఎన్గాన్‌ వరుసగా 4 పాయింట్లు చేసి 12–12తో స్కోరును సమం చేసింది. దీనికి దీటుగా బదులిచ్చిన సింధు వరుసగా మూడు పాయింట్లు చేసి జోరు పెంచింది. 21–17తో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలిచింది. మరో ప్రి క్వార్టర్స్‌లో 12వ సీడ్‌ సైనా 21–19, 21–15తో రెండో సీడ్‌ సుంగ్‌ జీ హున్‌ (కొరియా)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది.  

పురుషుల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21–14, 21–18తో 14వ సీడ్‌ ఆండర్స్‌ ఆంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించాడు. వరుస గేముల్లో 42 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. తొలి గేమ్‌ ఆరంభంలో కాసేపు మాత్రమే పోటీనిచ్చిన డెన్మార్క్‌ ఆటగాడు ఆ తర్వాత తేలిగ్గానే చేతులెత్తేశాడు. 5–6తో ఉన్న శ్రీకాంత్‌ వరుసగా 6 పాయింట్లు సాధించి 11–6తో ఆధిక్యంలోకి వచ్చాడు ఆ తర్వాత వెనుదిరిగి చూసే అవకాశం రాని హైదరాబాద్‌ ఆటగాడు నిమిషాల వ్యవధిలో గేమ్‌ను ముగించాడు. తర్వాత రెండో గేమ్‌లో రెట్టించిన ఉత్సాహాన్ని కనబరిచిన అతను 11–3తో ఆధిపత్యాన్ని చాటాడు. అయితే ఆంటోన్‌సెన్‌ వరుసగా ఆరు పాయింట్లు సాధించి నిలువరించే ప్రయత్నం చేసినా... శ్రీకాంత్‌ నెట్‌వద్ద తెలివిగా ఆడి పైచేయి కొనసాగించాడు.

చివరి దాకా ఆధిక్యంలోనే నిలిచిన ఈ ప్రపంచ పదో ర్యాంకర్‌ 21–18తో గేమ్‌ను మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 15వ సీడ్‌ సిక్కిరెడ్డి– ప్రణవ్‌ చోప్రా ద్వయం 22–20, 18–21, 18–21తో ఆరో సీడ్‌ డెబ్బి సుశాంటో–ప్రవీణ్‌ జోర్డాన్‌ జంట చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌... టాప్‌సీడ్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)తో, మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సింధు... ఐదో సీడ్‌ సన్‌ యూ (చైనా)తో, గిల్మోర్‌ (స్కాట్లాండ్‌),  బింగ్‌ జియావో (చైనా) మ్యాచ్‌ విజేతతో సైనా తలపడుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement