World Badminton Championship
-
కాంస్యంతో సరి
కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): అసాధారణ ఆటగాడు అక్సెల్సన్కు సొంతగడ్డపైనే చుక్కలు చూపించిన భారత షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ పోరు సెమీ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్íÙప్లో ఈ కేరళ స్టార్ కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు. క్వార్టర్స్‌లో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ వరుస గేమ్‌లను గెలిచి పతకం ఖాయం చేసుకున్న భారత ఆటగాడు చిత్రంగా సెమీస్‌లో తొలి గేమ్ గెలిచి జోరు మీదుండి తర్వాత రెండు గేమ్‌లను గెలువలేక మ్యాచ్ ఓడిపోయా డు. శనివారం 76 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో హెచ్.ఎస్. ప్రణయ్ 21–18, 13–21, 14–21తో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌లో తెలివైన షాట్లతో ప్రత్యర్థిని కోర్టులో పరుగు పెట్టిస్తూ స్కోరు సాధించాడు. నెట్‌వద్ద చురుగ్గా పాయింట్లు సాధించిన ప్రణయ్ స్మాష్‌లతో చెలరేగి... తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. తర్వాత రెండో గేమ్ కూడా ప్రణయ్ ఆధిపత్యంతోనే మొదలైంది. వరుసగా 4–0తో పైచేయి సాధించాడు.ఈ దశలో చేసిన అనవసర తప్పిదాలతో భారత షట్లర్ పాయింట్లను కోల్పోయాడు. పదే పదే ఇవే తప్పిదాలు కొనసాగించడంతో ఆధిక్యాన్ని, ఆపై గేమ్నే కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ప్రణయ్ తప్పిదాలనే ఆసరాగా చేసుకొని పుంజుకున్న థాయ్ ప్రత్యర్థి చివరిదాకా ఆధిపత్యాన్ని కొనసాగించాడు. -
క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ
కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 19–21, 21–9తో లియో రాలీ కార్నండొ–డానియెల్ మారి్టన్ (ఇండోనేసియా) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 14–21, 9–21తో టాప్ సీడ్ చెన్ క్వింగ్ చెన్–జియా యి ఫ్యాన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ ప్రణయ్ (భారత్) 21–18, 15–21, 21–19తో 2021 ప్రపంచ చాంపియన్ లో కియాన్ యూ (సింగపూర్)పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరగా... లక్ష్య సేన్ (భారత్) 14–21, 21–16, 13–21తో మూడో సీడ్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
సింధుకు చుక్కెదురు
కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో ఈ మాజీ చాంపియన్ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్లో ఆమెకు ‘బై’ లభించడంతో నేరుగా రెండో రౌండ్లో పోటీపడింది. ప్రతీసారి కనీసం క్వార్టర్ ఫైనలిస్ట్‌గా నిలిచిన ఆమె బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 14–21, 14–21తో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయింది. రెండు గేముల్లో కూడా ఆరంభంలో ప్రత్యర్థికంటే మెరుగ్గా, ప్రత్యర్థికి దీటుగా ఆడిన 16వ సీడ్ సింధు గేమ్ సాగే కొద్దీ డీలా పడటంతో వరుస గేముల్లోనే ఓడింది. రెండో గేమ్‌లో సింధు ఒకదశలో 9–0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ జపాన్ షట్లర్ వరుసగా పాయింట్లు నెగ్గుకుంటూ రావడంతో మళ్లీ సింధు ఆధిక్యాన్ని, ఆ తర్వాత మ్యాచ్‌నే కోల్పోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్స్ ప్రణయ్, లక్ష్యసేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో లక్ష్యసేన్ 21–11, 21–12తో జియోన్ హ్యోక్ (కొరియా)పై, ప్రణయ్ 21–9, 21–14తో చికొ అర వర్డొయో (ఇండోనేసియా)పై గెలుపొందారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)తో ప్రణయ్; కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో లక్ష్య సేన్ తలపడతారు. -
ప్రణయ్, శ్రీకాంత్, లక్ష్య సేన్లపై భారత్ ఆశలు
కొపెన్ హాగెన్ (డెన్మార్క్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్లపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేటి నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో భారత ఆటగాళ్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. మహిళల విభాగంలో మాజీ చాంపియన్ పీవీ సింధుకు తొలి రౌండ్లో బై లభించింది. మాజీ ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్), తుయ్ లిన్ గుయెన్ (వియత్నాం) మధ్య తొలి రౌండ్ విజేతతో 2019 ప్రపంచ చాంపియన్ సింధు రెండో రౌండ్లో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్‌కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. మొదటి రౌండ్లోనే అతను 14వ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)ను ఎదుర్కొంటాడు. 11వ సీడ్ లక్ష్య సేన్...జార్జెస్ జులియన్ పాల్ (మారిషస్)తో, 9వ సీడ్ ప్రణయ్... కెల్లే కొల్జనెన్ (ఫిన్లాండ్)తో పోటీపడతారు. పురుషుల డబుల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకింగ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఈసారి స్వర్ణంపై కన్నేసింది. గత ఏడాది జరిగిన ఈ టోర్నీలో మేటి డబుల్స్ జోడీ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మహిళల డబుల్స్‌లో 15వ సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటకు తొలి రౌండ్లో బై లభించింది. సిన్సినాటి ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్తో జొకోవిచ్ ‘ఢీ’ కెరీర్లో 39వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించేందుకు సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్... కెరీర్లో ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గేందుకు స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ అమీతుమీ తేల్చుకోనున్నారు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరుగుతున్న సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో వీరిద్దరూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో అల్కరాజ్ 2–6, 7–6 (7/4), 6–3తో హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించగా... జొకోవిచ్ 7–6 (7/5), 7–5తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను ఓడించాడు. ఈ క్రమంలో 36 ఏళ్ల జొకోవిచ్ ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన పెద్ద వయసు్కడిగా గుర్తింపు పొందాడు. అల్కరాజ్తో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 1–2తో వెనుకంజలో ఉన్నాడు. -
కాంస్యంతో ముగింపు
టోక్యో: కెరీర్లో నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న సాత్విక్–చిరాగ్ జోడీ కాంస్య పతకంతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 22–20, 18–21, 16–21తో ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) చేతిలో పోరాడి ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సాత్విక్–చిరాగ్ ప్రదర్శనతో వరుసగా తొమ్మిదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో పతకం చేరింది. 77 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో రెండు జోడీలు అద్భుతంగా ఆడినా కీలకదశలో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ పైచేయి సాధించి విజయాన్ని అందుకున్నారు. ఆరోన్ చియా–సో వుయ్ యిక్ జోడీ చేతిలో సాత్విక్–చిరాగ్ శెట్టిలకిది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. ‘ముఖ్యమైన మ్యాచ్‌లలో కీలకదశల్లో మాకు అదృష్టం కలిసి రావడంలేదు. కీలక సందర్భాల్లో అదృష్టం మావైపు ఉండాలంటే మేము మరిన్ని పూజలు చేసి దేవుడిని ప్రార్థించాలేమో. ఓవరాల్‌గా మా ప్రదర్శనపట్ల సంతృప్తిగా ఉన్నా సెమీఫైనల్ మ్యాచ్ ఫలితం మాత్రం నిరాశ కలిగించింది. తొలి గేమ్ గెలిచాక రెండో గేమ్‌లో మేము మలేసియా జోడీపై మరింత ఒత్తిడి పెంచాల్సింది. పతకం సాధించాలనే లక్ష్యంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు వచ్చాం. పతకం గెలిచినందుకు సంతోషంగా ఉన్నా ఫైనల్ చేరితే మా ఆనందం రెట్టింపు అయ్యేది. భవిష్యత్‌లో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాం’ అని సాత్విక్ వ్యాఖ్యానించాడు. -
BWF World Championships 2022: షటిల్ సమరం...
థామస్ కప్‌లో చారిత్రక విజయం... కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల పంట... ఈ రెండు గొప్ప ప్రదర్శనల తర్వాత భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి జపాన్ రాజధాని టోక్యోలో మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాలలో కలిపి మొత్తం 26 మంది భారత క్రీడాకారులు సత్తా చాటుకునేందుకు సై అంటున్నారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధికంగా ఐదు పతకాలు గెలిచిన భారతీయ ప్లేయర్‌గా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధు గాయం కారణంగా తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం లేదు. 2011 నుంచి జరిగిన ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కనీసం ఒక్క పతకమైనా లభిస్తోంది. టోక్యో: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై గత పదిహేనేళ్లుగా నిలకడగా రాణిస్తూ... ‘బ్యాడ్మింటన్ పవర్‌హౌస్’గా భావించే చైనా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, కొరియా, జపాన్ దేశాలకు దీటుగా ఎదిగిన భారత క్రీడాకారులు మరో సమరానికి సిద్ధమయ్యారు. తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న జపాన్ గడ్డపై భారత ఆటగాళ్లు పతకాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు మినహా మిగతా అగ్రశ్రేణి క్రీడాకారులు భారత్ తరఫున బరిలో ఉన్నారు. గత ఏడాది స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్యం సాధించి సంచలనం సృష్టించగా... కేరళ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్‌తోపాటు ఈసారి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో 20వ ర్యాంకర్ సాయిప్రణీత్... 39వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో 13వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్... 19వ ర్యాంకర్ విటింగస్ (డెన్మార్క్)తో 10వ ర్యాంకర్ లక్ష్య సేన్... 94వ ర్యాంకర్ లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)తో 18వ ర్యాంకర్ ప్రణయ్ తలపడనున్నారు. సాయిప్రణీత్ ‘డ్రా’ పై భాగంలో... శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ముగ్గురూ ‘డ్రా’ కింది భాగంలో ఉన్నారు. దాంతో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లలో ఒక్కరు మాత్రమే సెమీఫైనల్ చేరుకోగలరు. ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. పతకాలు సాధించాలంటే వీరందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి లక్ష్య సేన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చౌ తియెన్ చెన్‌తో ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్ ఓడిపోవడం... కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోవడంతో సాయిప్రణీత్ తొలి రౌండ్ అడ్డంకి దాటడం అనుమానమే. డిఫెండింగ్ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్), మాజీ చాంపియన్స్ కెంటో మొమోటా (జపాన్), అక్సెల్సన్ (డెన్మార్క్), జిన్‌టింగ్ (ఇండోనేసియా), లీ జి జియా (మలేసియా) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. సైనా మెరిసేనా... మహిళల సింగిల్స్‌లో ఈసారి భారత్ నుంచి ఇద్దరే బరిలో ఉన్నారు. గాయం కారణంగా పీవీ సింధు వైదొలగగా... సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. నేడు జరిగే తొలి రౌండ్లో లినె క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)తో మాళివిక... మంగళవారం జరిగే తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (వియత్నాం)తో సైనా ఆడతారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 12వసారి ఆడుతున్న సైనా 2015లో రజతం, 2017లో కాంస్యం గెలిచింది. అయితే ఈ ఏడాది సైనా గొప్ప ఫామ్‌లో లేదు. ఈ సీజన్లో ఆమె తొమ్మిది టోర్నీలలో ఆడితే ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ అకానె యామగుచి (జపాన్), రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), మూడుసార్లు చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), ఆన్ సె యంగ్ (కొరియా), చెన్ యు ఫె, హి బింగ్ జియావో (చైనా) టైటిల్ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరిపైనే... పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం రాలేదు. అంతా సవ్యంగా సాగితే ఈసారి సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం ఆ లోటు తీర్చే అవకాశముంది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన సాత్విక్–చిరాగ్ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ఇక మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు అంతగా పతకావకాశాలు లేవు. భారత ఆటగాళ్ల వివరాలు పురుషుల సింగిల్స్: లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్. మహిళల సింగిల్స్: సైనా నెహ్వాల్, మాళవిక. పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి–మనూ అత్రి, అర్జున్–ధ్రువ్ కపిల, కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్. మహిళల డబుల్స్: సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప, దండు పూజ–సంజన, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని భట్–శిఖా. మిక్స్డ్ డబుల్స్: ఇషాన్–తనీషా క్రాస్టో, వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్. మన పతక విజేతలు.. 1983: ప్రకాశ్ పడుకోన్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం); 2011: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్‌లో కాంస్యం); 2013: సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2014: సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2015: సైనా (మహిళల సింగిల్స్‌లో రజతం); 2017: సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం); 2017: సైనా (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2018: సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం); 2019: సింధు (మహిళల సింగిల్స్‌లో స్వర్ణం); 2019: సాయిప్రణీత్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం); 2021: శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్‌లో రజతం); 2021: లక్ష్య సేన్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం). -
స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు సీఎం జగన్ సత్కారం
సాక్షి, అమరావతి: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్.. కిడాంబి శ్రీకాంత్‌ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో.. 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, శాప్ ఎండీ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: అమూల్‌లో పాలు పోసే రైతులే యజమానులు -
షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు సీఎం జగన్ సత్కారం
-
World Badminton Championship: భారత్‌కు రజత, కాంస్యాలు.. ప్రైజ్‌మనీ మాత్రం ఉండదు!
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు లక్ష్య సేన్. అయితే, తన ప్రదర్శన పట్ల మాత్రం సంతృప్తిగా లేనని, వచ్చే ఏడాది స్వర్ణ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. కాగా ఈ మెగా ఈవెంట్లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ పసిడి గెలిచే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోగా... సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్ (భారత్) కాంస్యం గెలుచుకున్నాడు. దీంతో.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లోభారత్ ఖాతాలో ఒకేసారి రజత, కాంస్య పతకాలు చేరాయి. ఇలా జరగడం ఇది రెండోసారి. అంతకుముందు... 2017లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు రజతం, సైనా నెహ్వాల్ కాంస్యం సాధించారు. ఈసారి పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ పతకాలు సాధించారు. కాగా ఈ మెగా టోర్నీలో విజేతలకు కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ప్రైజ్‌మనీ ఉండదు. సంతోషమే.. కానీ.. పతకం గెలిచిన లక్ష్య సేన్ మాట్లాడుతూ... ‘చరిత్ర సృష్టించడానికి చేరువగా వచ్చి సెమీఫైనల్లో ఓడటం బాధగా ఉంది. ఏదైతేనేం... నాకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం దక్కింది. అయితే నేను ఈ పతకంతో సంతృప్తి చెందడంలేదు. ఓవరాల్‌గా టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఆడుతున్నప్పటికీ... కాంస్యం సాధించి నా గురువు ప్రకాశ్ పదుకొనే సరసన నిలవడం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని పేర్కొన్నాడు. -
వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన తొలి భారత ఆటగాడు..
‘స్వర్ణ ప్రపంచాన్ని’ అందుకోవాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చివరకు రజత సంబరం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ విశ్వవిజేతగా అవతరించలేకపోయాడు. సింగపూర్‌కు చెందిన 24 ఏళ్ల లో కీన్ యుతో జరిగిన తుది పోరులో శ్రీకాంత్ ఓటమి రుచి చూసి రన్నరప్‌గా నిలిచాడు. శ్రీకాంత్ ఆటలో అడపాదడపా మెరుపులు కనిపించినా కీలకదశలో అనవసర తప్పిదాలు అతడిని పసిడి పతకానికి దూరం చేశాయి. హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ తుది మెట్టుపై తడబడ్డాడు. ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 43 నిమిషాల్లో 15–21, 20–22తో అన్‌సీడెడ్, ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యు (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. ఈ ఓటమితో శ్రీకాంత్ రజత పతకం సొంతం చేసుకోగా... లో కీన్ యు స్వర్ణ పతకం దక్కించుకొని కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్ (భారత్), ఆంటోన్సెన్ (డెన్మార్క్)లకు కాంస్య పతకాలు లభించాయి. ఆధిక్యంలోకి వెళ్లి... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో లో కీన్ యుపై వరుస గేముల్లో గెలిచిన 28 ఏళ్ల శ్రీకాంత్ ఈసారి కూడా గెలుపు రుచి చూస్తాడనిపించింది. ఆరంభంలో జంపింగ్ స్మాష్‌లు, నెట్ ఫ్లిక్ షాట్లతో అలరించిన శ్రీకాంత్ 9–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే గత నాలుగేళ్లలో ఎంతో మెరుగుపడ్డ లో కీన్ యు ఈసారి శ్రీకాంత్ ఆటతీరుపై పూర్తి హోంవర్క్ చేసి వచ్చినట్లు కనిపించింది. 3–9తో వెనుకబడ్డా ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా నిగ్రహంతో ఆడిన లో కీన్ యు నెమ్మదిగా గాడిలో పడ్డాడు. శ్రీకాంత్ సంధించిన స్మాష్‌లను లో కీన్ యు అద్భుతంగా డిఫెండ్ చేశాడు. శ్రీకాంత్ కూడా అనవసర తప్పిదాలు చేయడం సింగపూర్ షట్లర్‌కి కలిసి వచ్చింది. నిలకడగా పాయింట్లు స్కోరు చేసిన లో కీన్ యు ఎట్టకేలకు 11–11తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత లో కీన్ యు జోరు పెంచగా శ్రీకాంత్ ఒత్తిడికి లోనై చాలా షాట్లు నెట్‌పైకి, బయటకు కొట్టి పాయింట్లు సమర్పించుకున్నాడు. దాంతో లో కీన్ యు తొలి గేమ్‌ను 16 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు. తప్పిదాలతో మూల్యం... రెండో గేమ్‌లోనూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ దశలో శ్రీకాంత్ 9–6తో ముందంజ వేసినా ఆ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఈ స్కోరు వద్ద లో కీన్ యు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఒకట్రెండుసార్లు శ్రీకాంత్ ఆధిక్యంలోకి రావడం... అంతలోనే చేసిన అనవసర తప్పిదాలతో లో కీన్ యు మళ్లీ పుంజుకోవడం జరిగింది. ఈ క్రమంలో లో కీన్ యు 20–18తో ముందంజ వేశాడు. శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి స్కోరును 20–20తో సమం చేశాడు. అయితే వెంటనే లో కీన్ యు రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని ప్రపంచ చాంపియన్ అయ్యాడు. సూపర్ ఫినిష్... మలేసియాలోని పెనాంగ్ నగరంలో పుట్టిన లో కీన్ యు తన 13వ యేట కుటుంబసభ్యులతో కలిసి సింగపూర్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. గత ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో సింగపూర్ బృందానికి పతాకధారిగా వ్యవహరించిన లో కీన్ యు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచిన తొలి సింగపూర్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న లో కీన్ యు విశ్వవిజేతగా నిలిచిన క్రమంలో అద్భుత విజయాలు అందుకున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించిన లో కీన్ యు సెమీఫైనల్లో మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై, ఫైనల్లో మాజీ వరల్డ్ నంబర్‌వన్ శ్రీకాంత్‌పై గెలిచి తన విజయం గాలివాటం కాదని నిరూపించాడు. టైటిల్ గెలిచే క్రమంలో లో కీన్ యు తన ప్రత్యర్థులకు కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. ఈ వారం అద్భుతంగా గడిచింది. ఫైనల్లో రెండు గేముల్లోనూ నేను మంచి స్థితిలో ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఈ ఓటమితో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మున్ముందు మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తాను. పాజిటివ్‌గా ఆడాలనే ఆలోచనతో బరిలోకి దిగాను. అనవసర తప్పిదాలతో చికాకు కలిగింది. అయితే మ్యాచ్ అన్నాక ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడిపోతారు. నాలుగేళ్ల క్రితం చివరిసారి లో కీన్ యుతో తలపడ్డాను. అప్పటికి ఇప్పటికి అతని ఆటలో ఎంతో మార్పు వచ్చింది. వాస్తవానికి నేను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడతానో లేదోననే అనుమానం కలిగింది. ఈనెల 12న టోర్నీ మొదలవ్వగా 6వ తేదీ వరకు నాకు వీసా లభించలేదు. ఈ ఏడాది ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ ఉన్నాయి. ఈ అనుభవంతో వచ్చే ఏడాది మంచి ఫలితాలు సాధిస్తానని విశ్వాసంతో ఉన్నాను. –కిడాంబి శ్రీకాంత్ -
శభాష్ శ్రీకాంత్...
ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ విశ్వకిరీటాన్ని అందుకునేందుకు విజయం దూరంలో నిలిచాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో బరిలోకి దిగిన ఈ తెలుగు తేజం అద్వితీయ ఆటతీరుతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌తో నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ సమరంలో తుదకు అనుభవజ్ఞుడైన శ్రీకాంత్‌దే పైచేయిగా నిలిచింది. లక్ష్య సేన్ ఓడిపోయినప్పటికీ తన ఆటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. ప్రకాశ్ పదుకొనే (1983), సాయిప్రణీత్ (2019) తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. హుఎల్వా (స్పెయిన్): ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఇద్దరు భారతీయుల మధ్య జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ అందర్నీ అలరించింది. 69 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 17–21, 21–14, 21–17తో భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌పై విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్ ఘనత వహించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా సాధించలేకపోయాడు. ఇప్పుడా లోటును తీర్చుకోవడానికి అతడు కేవలం విజయం దూరంలో నిలిచాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యె (సింగపూర్) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో శ్రీకాంత్ తలపడతాడు. భారత కాలమానం ప్రకారం పురుషుల సింగిల్స్ ఫైనల్ నేటి సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే అవకాశముంది. అన్ని విభాగాల ఫైనల్స్‌ను స్టార్ స్పోర్ట్స్–3, హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హోరాహోరీగా... అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి శ్రీకాంత్, లక్ష్య సేన్ తలపడగా... ప్రతీ పాయింట్‌కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ముఖ్యంగా శ్రీకాంత్ కళ్లు చెదిరే రీతిలో స్మాష్‌లు సంధించాడు. అయితే శ్రీకాంత్ సంధించిన స్మాష్‌లకు అంతే చాణక్యంగా లక్ష్య సేన్ తిప్పి కొట్టాడు. 17 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్‌లో శ్రీకాంత్ అనవసర తప్పిదాలతోనే లక్ష్య సేన్ ఖాతాలో ఎక్కువ పాయింట్లు చేరాయి. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ అలసిపోయినట్లు కనిపించాడు. రెండో గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్ 6–9తో వెనుకబడినా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. డ్రాప్ షాట్లు, క్రాస్‌కోర్టు షాట్లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన శ్రీకాంత్ 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న శ్రీకాంత్ రెండో గేమ్‌ను 21 నిమిషాల్లో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించారు. ఈ క్రమంలో కొన్ని సుదీర్ఘ ర్యాలీలు కనిపించాయి. తుదకు ఈ సుదీర్ఘ ర్యాలీలకు కళ్లు చెదిరే షాట్లతో ముగింపు ఇస్తూ వీరిద్దరు తమ ఖాతాలో పాయింట్లు వేసుకున్నారు. చివరి గేమ్‌లో రెండుసార్లు శ్రీకాంత్ వెనుకంజ వేసినా వెంటనే తేరుకొని స్కోర్లను సమం చేశాడు. స్కోరు 16–16 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో ఒత్తిడికి లోనైన లక్ష్య సేన్ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. శ్రీకాంత్ రిటర్న్ షాట్‌ను లక్ష్య సేన్ నెట్‌కు కొట్టడంతో గేమ్‌తోపాటు మ్యాచ్ శ్రీకాంత్ వశమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన మూడో భారతీయ ప్లేయర్ శ్రీకాంత్. గతంలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు మూడుసార్లు (2017, 2018–రన్నరప్; 2019–విన్నర్), సైనా నెహ్వాల్ ఒకసారి (2015–రన్నరప్) ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత్ నుంచి ఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా శ్రీకాంత్ నిలిచాడు. -
44 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర...
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడనున్నారు. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే పురుషుల సింగిల్స్‌లో తొలిసారి భారత ప్లేయర్ ప్రపంచ చాంపియన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాగా మహిళల సింగిల్స్‌లో 2019లో పీవీ సింధు విశ్వవిజేతగా నిలిచింది. హుఎల్వా (స్పెయిన్): రెండు నెలల క్రితం థామస్ కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ టోర్నీ మ్యాచ్‌లో ఓడిపోయి జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన యువతార లక్ష్య సేన్... నిలకడలేని ఆటతీరుతో గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా నెగ్గలేకపోయిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి పది గంటలకు మొదలయ్యే సెమీఫైనల్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ ముఖాముఖిగా తలపడతారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–7తో ప్రపంచ 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)ను చిత్తు చేయగా... ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 67 నిమిషాల్లో 21–15, 15–21, 22–20తో 42వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచాడు. జున్ పెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్య సేన్ 19–20 వద్ద మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. ఈ స్కోరు వద్ద ఒక్కసారిగా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ ప్రణయ్ కూడా గెలిచి ఉంటే భారత్‌కు మూడో పతకం ఖరారయ్యేది. కానీ క్వార్టర్ ఫైనల్లో కీన్ యియు (సింగపూర్) 21–14, 21–12 తో ప్రణయ్‌ను ఓడించి రెండో సెమీఫైనల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో పోరుకు సిద్ధమయ్యాడు. సింధుకు నిరాశ... మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 17–21, 13–21తో ఓడిపోయింది. తై జు చేతిలో సింధు ఓడటం ఇది 15వ సారి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో పతకాలు నెగ్గిన భారత క్రీడాకారుల సంఖ్య. గతంలో ప్రకాశ్ పదుకొనే (1983లో), సాయిప్రణీత్ (2019లో) కాంస్య పతకాలు నెగ్గారు. ఈసారి లక్ష్య సేన్, శ్రీకాంత్‌లలో ఒకరికి కనీసం రజతం లేదా స్వర్ణం... మరొకరికి కాంస్య పతకం ఖరారు కానుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ నెగ్గిన మొత్తం పతకాలు. మహిళల సింగిల్స్‌లో సింధు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు), సైనా నెహ్వాల్ రెండు పతకాలు (ఒక కాంస్యం, ఒక రజతం) సాధించారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట ఒక కాంస్యం గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే, సాయిప్రణీత్ ఒక్కో కాంస్యం నెగ్గారు. శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా ఒక్కో పతకం ఖరారు చేశారు. -
క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి
స్పెయిన్‌లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021 క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి చెందింది. తైవాన్‌కు చెందిన వరల్డ్ నెం1 తైజుయింగ్ చేతిలో 21-17,13-21 ఓటమి చెందింది. 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తైజుయింగ్.. సింధుపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఆరో పతకాన్ని చేజార్చుకుంది. ఇక చైనా స్టార్ షట్లర్ జాంగ్ నింగ్‌తో ఐదు పతకాలతో సింధు సమంగా నిలిచింది. చదవండి: IND Vs SA: అతడిని కచ్చితంగా భారత జట్టులోకి తీసుకోవాలి.. ఎందుకంటే! -
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రణయ్ సంచలనం..
హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–18, 21–19తో ప్రపంచ 9వ ర్యాంకర్ ఎన్జీకా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. అక్సెల్సన్కు షాక్ మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యెవ్ (సింగపూర్) 14–21, 21–9, 21–6తో రెండో సీడ్ అక్సెల్సన్ను ఓడించి రెండో రౌండ్‌కు చేరాడు. చదవండి: 21 బంతుల్లోనే సెంచరీ.. టీమిండియా బతికిపోయింది -
శ్రీకాంత్ శుభారంభం.. తొలి రౌండ్లోనే సాయిప్రణీత్‌కు షాక్
World Badminton Championship: Kidambi Srikanth Wins First Round (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేయగా... 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–12, 21–16తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో 16వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–17, 7–21, 18–21తో 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 16–21, 15–21తో జోయెల్ ఎల్పీ–రస్ముస్ జార్ (డెన్మార్క్) జంట చేతిలో పరాజయం పాలైంది. చదవండి: KS Bharat Century: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం.. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ భారీ ధర కన్ఫర్మ్ -
పీవీ సింధు సత్తాకు పరీక్ష
హుఎల్వా (స్పెయిన్): రెండేళ్ల క్రితం విశ్వ విజేతగా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షట్లర్‌గా చరిత్ర సృష్టించిన పీవీ సింధు టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో మళ్లీ ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగనుంది. నేడు మొదలై ఈనెల 19న ముగిసే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్‌గా సింధు పోటీపడనుంది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సింధు మంగళవారం జరిగే రెండో రౌండ్లో స్లోవేకియా ప్లేయర్ మార్టినా రెపిస్కాతో ఆడుతుంది. రెపిస్కా, రుసేలి హర్తావన్ (ఇండోనేసియా) మధ్య తొలి రౌండ్ జరగాల్సింది. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ నుంచి చివరి నిమిషంలో ఇండోనేసియా క్రీడాకారులందరూ వైదొలిగారు. ఇండోనేసియా తప్పుకునే సమయానికి ‘డ్రా’ పూర్తి కావడంతో వారి స్థానాలను ఇతర క్రీడాకారులతో భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. దాంతో రెపిస్కాకు తొలి రౌండ్లో ‘వాకోవర్’ లభించింది. రెపిస్కాపై గెలిస్తే సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో ఆడాల్సి రావచ్చు. చోచువోంగ్ను ఓడిస్తే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) రూపంలో సింధుకు క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశాలున్నాయి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరు క్వార్టర్ ఫైనల్లో ఎదురుకాగా, సింధు పైచేయి సాధించింది. ఆ ఈవెంట్ తర్వాత తై జు యింగ్‌తో ఆడిన నాలుగుసార్లూ సింధుకు ఓటమి ఎదురైంది. ఒకవేళ తై జు యింగ్ అడ్డంకిని దాటితే సెమీఫైనల్లో సింధుకు చైనా ప్లేయర్ హి బింగ్జియావో ఎదురయ్యే చాన్స్ ఉంది. మరో పార్శ్వం నుంచి కొరియా స్టార్ ఆన్ సెయంగ్, అకానె యామగుచి (జపాన్), ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)లలో ఒకరు ఫైనల్ చేరుకోవచ్చు. మూడుసార్లు ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), 2017 విశ్వవిజేత నొజోమి ఒకుహారా (జపాన్) గాయాల కారణంగా ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడటం లేదు. ఈ ఏడాది సింధు మొత్తం 10 అంతర్జాతీయ టోర్నీలలో ఆడింది. అయితే ఒక్క టోర్నీలోనూ టైటిల్ సాధించలేకపోయింది. స్విస్ ఓపెన్‌లో, వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. రెండో రౌండ్లో సిక్కి–అశ్విని జంట పురుషుల డబుల్స్‌లో భారత్ తరఫున సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమిత్ రెడ్డి–మనూ అత్రి; అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా; అర్జున్–ధ్రువ్ కపిల జోడీలు... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; దండు పూజ–సంజన జంటలు... మిక్స్డ్ డబుల్స్‌లో అనుష్క–సౌరభ్ శర్మ; జూహీ–వెంకట్ ప్రసాద్; కరిష్మా–ఉత్కర్‡్ష అరోరా జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. సిక్కి–అశ్విని తొలి రౌండ్ ప్రత్యర్థి జోడీ డెల్ఫిన్–లియా పలెర్మో (ఫ్రాన్స్) వైదొలగడంతో భారత జంట రెండో రౌండ్‌కు చేరుకుంది. ఒకే పార్శ్వంలో ముగ్గురు... పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి శ్రీకాంత్, సాయిప్రణీత్, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ బరిలో ఉన్నారు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సాయిప్రణీత్, శ్రీకాంత్, లక్ష్య సేన్ ఒకే పార్శ్వంలో ఉండటంతో ఒక్కరు మాత్రమే సెమీఫైనల్ చేరుకునే అవకాశముంది. లక్ష్య సేన్ తొలి రౌండ్ ప్రత్యర్థి వీస్కెర్చిన్ (జర్మనీ) టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత షట్లర్ రెండో రౌండ్ చేరుకున్నాడు. నేడు తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పాబ్లో అబియాన్ (స్పెయిన్)తో శ్రీకాంత్, మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)తో సాయిప్రణీత్ ఆడతారు. డిఫెండింగ్ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) గాయంతో వైదొలగడం, ఇండోనేసియా ఆటగాళ్లు కూడా దూరం కావడంతో భారత ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్టు ఆడితే పతకంతో తిరిగి రావచ్చు. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మారిన్ దూరం
మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... రేపటి నుంచి తన సొంతగడ్డపై మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి వైదొలుగుతున్నట్లు స్పెయిన్ స్టార్ ప్లేయర్ కరోలినా మారిన్ ప్రకటించింది. 2014, 2015, 2018లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 28 ఏళ్ల మారిన్ ఈ ఏడాది స్విస్ ఓపెన్ సందర్భంగా మోకాలి గాయానికి గురైంది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్రీడలతోపాటు మరే టోర్నీలోనూ ఆమె బరిలోకి దిగలేదు. -
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు మొమోటా దూరం
Kento Momota Ruled Out From World Badminton Championship.. వెన్ను నొప్పి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... డిఫెండింగ్ చాంపియన్ కెంటో మొమోటా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగాడు. ఈనెల 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. మొమోటా 2018, 2019లలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్స్‌ను సాధించాడు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇండోనేసియా ఆటగాళ్లందరూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడటంలేదని ప్రకటించారు. -
పీవీ సింధు కోచ్ రాజీనామా
న్యూఢిలీ: ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు గెలవడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మహిళల సింగిల్స్ కోచ్‌గా నాలుగు నెలలు మాత్రమే సేవలందించిన హ్యుస్ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతలను నుంచి తప్పుకున్నారు. గత నాలుగు నెలలుగా ఆమె పీవీ సింధుకు శిక్షణ ఇచ్చారు. వరల్డ్ నంబర్ 5 బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఉన్న సింధు వరల్డ్ ఛాంపియన్‌గా మారడంలో హ్యున్ ముఖ్య భూమిక పోషించారు. హ్యున్ భర్త కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయనకు సర్జరీ కావడంతో ఆరు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ ఆరు నెలల పాటు భర్తను చూసుకునేందుకు హ్యున్ వెళ్లారు. ఆమె మళ్లీ వచ్చే అవకాశం లేనట్లు తెలిసింది. దాంతోనే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పీవీ సింధు ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించినా.. ఈ సీజన్లో వరల్డ్ టూర్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. చైనా ఓపెన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సింధు.. రెండో రౌండ్లోనే ఓడి తీవ్రంగా నిరాశపరిచింది. అయితే, ఈ పరాజయం నుంచి వెంటనే కోలుకుని.. మంగళవారం నుంచి జరిగే కొరియా ఓపెన్‌లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. -
ఉపరాష్ట్రపతిని కలిసిన పీవీ సింధూ ఫ్యామిలీ
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. దేశం ఖ్యాతిని సింధూ ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. కుటుంబంతో కలిసి సింధూ ఉపరాష్ట్రపతిని హైదరాబాద్‌లో శనివారం కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా సింధూ కొత్త చరిత్ర లిఖించారని వెంకయ్య అన్నారు. ఆమె సాధించిన విజయాలు, కఠోర శ్రమ యువతకు ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. సింధూలాంటి అథ్లెట్లు దేశ యువతకు రోల్స్‌మోడల్స్‌గా నిలుస్తారని చెప్పారు. కఠినమైన ఆహార నియమాలు, కఠోర శ్రమ, క్రమశిక్షణ లక్ష్యాన్ని సాధించేందుకు ఆమెకు దోహదం చేశాయని వ్యాఖ్యానించారు. (చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం) హెల్తీ అయితే దేశం వెల్తీ అవుతుంది.. ఇక జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ జాతీయోద్యమంగా ముందుకు సాగాలని వెంకయ్య ఆకాక్షించారు. ఆధునిక జీవన విధానంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌గా ఉండటం తప్పనిసరని పేర్కొన్నారు. ఆహార పద్ధతుల్లో మార్పులు, వ్యాయామం చేస్తే ఫిట్‌గా ఉండొచ్చని సూచించారు. ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌కు ఇదే సరైన సమయమని అన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ఉన్నారని, వారంతా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నప్పుడే దేశం పురోగమిస్తుందని చెప్పారు. ఆరోగ్యం ఉండటం మాత్రమే కాకుండా ఫిట్‌గా ఉంటేనే లక్ష్యాల్ని సాధింంచగులుగుతామన్నారు. దేశం హెల్తీగా ఉంటేనే వెల్తీగా మారుతుందని అన్నారు. -
సింధు సన్నాహాలకు సహకారం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వపరంగా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ బుధవారం ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిశారు. తనకు వచ్చిన గోల్డ్ మెడల్‌ను కేసీఆర్‌కు సింధు చూపించింది. రెండు రాకెట్లను కూడా సీఎంకు బహూకరించింది. ఈ సందర్భంగా సింధుకు సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. ‘పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేసింది. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యంకాదు’ అని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ సహా సింధు భవిష్యత్తులో పాల్గొనే టోర్నమెంట్లకు సమాయత్తం కావడానికి, ఇతరత్రా ఏర్పాట్లకు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. టోక్యోలో స్వర్ణం ఖాయం: గవర్నర్ నరసింహన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం పీవీ సింధుపై తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె బంగారు పతకం సాధించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన సింధు నేటి తరానికి ఆదర్శమని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుతో పాటు, పారా బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన మానసి జోషిలను బుధవారం గవర్నర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ ‘పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని సింధు, మానసి నిరూపించారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణం. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి మళ్లీ రాజ్‌భవన్‌కు రావాలని కోరుకుంటున్నా’ అని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాము నెగ్గిన స్వర్ణ పతకాలను గవర్నర్‌కు చూపిస్తున్న మానసి, సింధు -
2020 ఒలంపిక్స్‌లో కూడా స్వర్ణం ఆమెదేనా?
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్షిప్-2019లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె సాధించిన ఈ ఘనతపై జాతీయంగా, అంతర్జాతీయంగా సింధుపై అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ప్రతీ చిన్నవిశేషం కూడా క్రీడాభిమానులను, యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మరో భారతీయ గోల్డెన్ గర్ల్ , పరుగుల రాణి పద్మశ్రీ పీటీ ఉషతో కలిసి వున్న సింధు చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఆకర్షిస్తోంది. పీటీ ఉష సింధుకు అభినందనలు తెలుపుతూ పీవీ సింధు చిన్నప్పుడు తనతో కలిసి దిగిన 18 ఏళ్ల క్రితంనాటి ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో మీరిద్దరు దేశానికి గర్వ కారణమని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా, పలువురు క్రీడాభిమానులు, ఇతర అభిమానులు అరుదైన ఆ ఫోటోకు లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చదవండి :‘దారుణమైన వర్కవుట్లు; కాబట్టే సింధూ గెలిచింది’ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు బంగారు పతకం గెలవడంతో ఆమెని అభినందించిన పీటీ ఉష 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు స్వర్ణాన్ని గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఆమె ఇప్పటికే రజత పతకం గెలిచింది. పసిడిపై గురి పెడితే కచ్చితంగా చేజిక్కించుకోగలదంటూ ట్వీట్ చేశారు. మరోవైపు పీవీ సింధు ప్రపంచ పోటీకి ముందు కఠోర సాధన చేస్తున్న వీడియో ఒకటి టాక్ ఆఫ్ ది యూత్‌గా నిలిచింది. 2020 స్వర్ణం కూడా సింధూకే సొంతం కావాలంటూ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. (చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం) The passion and dedication for the sport will always be rewarded when hardwork comes into play. @Pvsindhu1 success will inspire generations to come! Hefty congratulations on winning the Gold at #BWFWorldChampionships2019 🇮🇳 pic.twitter.com/xBP7RgOHnt — P.T. USHA (@PTUshaOfficial) August 25, 2019 -
పీవీ సింధూపై ట్వీట్ వైరల్...
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూపై చేసిన ట్వీట్ వైరల్ అయింది. సింధూ వర్కవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన ఆయన.. ‘పీవీ సింధూ బ్యాడ్మింటన్‌లో వరల్డ్ చాంపియన్‌గా నిలవడంలో రహస్యమేముంది. ఆమె చేస్తున్న దారుణమైన వర్కవుట్లు చూసి మతిపోయింది. అంతలా కష్టపడుతోంది కాబట్టే ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. యావత్ భారతంలోని యువ క్రీడాకారులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఆమెలా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరాలి’ అని ట్వీట్ చేశారు. సింధూ వర్కవుట్కు సంబంధించిన ఈ వీడియో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు బయల్దేరే ముందు హైదరాబాద్‌లోని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడెమీలోనిది. (చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం) ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై జయకేతనం ఎగరేసింది. బీడబ్ల్యూఎఫ్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు కొత్త చరిత్ర లిఖించింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. -
ఆత్మీయ స్వాగతాలు... అభినందనలు..!
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు... మంత్రి నుంచి ప్రధాన మంత్రి వరకు అందరి అభినందనల వర్షంలో పూసర్ల వెంకట సింధు తడిసి ముద్దయింది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్వదేశం తిరిగొచ్చిన ఆమెకు ముందుగా దేశ రాజధానిలో, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ముందుగా కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజుతో భేటీ జరగ్గా... దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో ఆమెను ఆశీర్వదించారు. అనంతరం స్వస్థలంలో సహచర పతక విజేత సాయిప్రణీత్‌తో కలిసి సింధు మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సింధు, సాయి, కోచ్ గోపీచంద్ స్పందనలు వారి మాటల్లోనే... దేశం గర్వపడే చాంపియన్ పీవీ సింధు: ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం పీవీ సింధుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన చాంపియన్ సింధు అంటూ పొగడ్తలు కురిపించారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పీవీ సింధుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్, తండ్రి పీవీ రమణ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో కలసి ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా సింధు సాధించిన స్వర్ణ పతకాన్ని ఆమె మెడలో వేసి మోదీ అభినందించారు. ‘బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన చాంపియన్ సింధు. ఆమెను కలవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ మోదీ ట్వీట్ చేసి ఫోటోను పంచుకున్నారు. అంతకుముందు సింధుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఎన్నాళ్లో వేచిన విజయం... వరల్డ్ చాంపియన్‌గా నిలవడం చాలా గర్వంగా అనిపిస్తోంది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావట్లేదు. ఎంతో కాలంగా ఆశించిన ఈ విజయాన్ని ఎట్టకేలకు సాధించాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. అందుకు సహకరించిన నా కోచింగ్ బృందానికి కృతజ్ఞతలు. కాంస్య, రజతాలు సాధించినప్పుడు కూడా సంతోషం కలిగింది కానీ ఇంకా సాధించాల్సి ఉందని అనిపించింది. గత రెండు ఫైనల్స్‌లో ఓడినప్పుడు కొంత నిరాశ చెందినా నా ఆటను నేను నమ్మాను. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ దూసుకొచ్చాను. అంతిమ లక్ష్యం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే అయినా అంతకుముందు నేను ఇంకా చాలా గెలవాల్సి ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నేను ప్రతీ మ్యాచ్‌కు ప్రత్యేకంగా సిద్ధమయ్యాను. ప్రత్యర్థులకు నా ఆట గురించి బాగా తెలుసు కాబట్టి ఒకే తరహా ఆటతో విజయాలు సాధించలేం. ఇకపై కూడా కొత్త అంశాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఓడిపోతాననే భయం లేకుండా ఆడాను కాబట్టే ఫైనల్ ఏకపక్షంగా గెలవగలిగాను. –పీవీ సింధు, ప్రపంచ బ్యాడ్మింటన్ స్వర్ణ పతక విజేత ఒలింపిక్స్ క్వాలిఫయింగే లక్ష్యం... వారం రోజుల వ్యవధిలో అర్జున పురస్కారానికి ఎంపిక కావడం, ఇటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలవడం నా ఆనందాన్ని రెట్టింపు చేశాయి. క్వార్టర్స్‌లో క్రిస్టీపై గెలవగానే కాంస్యం ఖాయమైందని తెలుసు కాబట్టి గొప్పగా అనిపించింది. ఆ సమయంలో ప్రకాశ్ సర్ 36 ఏళ్ల రికార్డులాంటి విషయాలు ఏవీ నా మనసులోకి రాలేదు. ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో కీలక సమయంలో గోపీ సర్ చేసిన సూచనల వల్లే గెలవగలిగాను. మొమోటాతో గతంలోనూ ఆడిన అనుభవం ఉంది కాబట్టి సెమీస్‌లో ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగాను. అయితే అతను నాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లాంటి ఈవెంట్లో మనం 100 శాతం శ్రమించినా కొంతయినా అదృష్టం కూడా కలిసి రావాలి. గతంలో అనేక మందికి సాధ్యం కానిది నేను సాధించాను కాబట్టి వారికంటే గొప్పగా భావించడం లేదు. ఇప్పుడు నా తదుపరి లక్ష్యం వచ్చే టోర్నీలలో బాగా ఆడి ప్రస్తుత ర్యాంక్ (15)ను నిలబెట్టుకోవడం, టోక్యోకు అర్హత సాధించడం. –సాయిప్రణీత్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత ప్లాన్ ‘బి’ అవసరం రాలేదు... నాకు వ్యక్తిగతంగా ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. మన ప్లేయర్ స్వర్ణం సాధించాలనేది చాలా కాలంగా నా కల. అది ఇప్పుడు నెరవేరింది. నా దృష్టిలో రెండు పతకాలు అమూల్యమైనవే. సింధు అంచనాలను నిజం చేస్తే, సాయిప్రణీత్ అద్భుతం చేసి చూపించాడు. 2013లో సింధు తొలిసారి కాంస్యం గెలిచినప్పుడు ఎంతో సంతోషించాం. ఆ తర్వాత మరో కాంస్యం, రెండు రజతాలు వచ్చినప్పుడు కూడా ఎంతో సాధించిన సంతృప్తి కలిగింది. అయితే అదే సమయంలో స్వర్ణం సాధించగలమనే విశ్వాసం కూడా ఏర్పడింది. సింధు సూపర్ ఫిట్నెస్ కూడా ఆమె గెలుపునకు ఒక కారణం. ఆమె అన్ని మ్యాచ్‌లు చాలా తెలివిగా ఆడింది. యమగూచి ఆరంభంలోనే వెనుదిరగ్గా... తైజుపై క్వార్టర్స్‌లో గెలవడంతోనే స్వర్ణంపై నమ్మకం ఏర్పడింది. మొదటి నుంచి అటాక్ మాత్రమే చేయాలనేది కొత్త వ్యూహం. ఇది విఫలమైతే ఏం చేయాలో ఆలోచించేవాళ్లం. కానీ సింధు దీనిని సమర్థంగా అమలు చేయడంతో ప్లాన్ ‘బి’ అవసరమే లేకపోయింది. –పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ -
సింధును కలవడం ఆనందంగా ఉంది: మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమె.. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. సింధుతో పాటు తన నివాసానికి వచ్చిన కోచ్ గోపీచంద్‌లను మోదీ అభినgదించారు. దీనిలో భాగంగా సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ పసిడి పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన చాంపియన్ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో అద్భుత విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్ గోపీచంద్‌లను మోదీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. భారత స్టార్ క్రీడాకారిణి సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించారు. ఈ సిరీస్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఐదో సీడ్ సింధు 21-7,21-7తో మూడో సీడ్ నొజొమి ఒకుహర(జపాన్)ను చిత్తు చేసి చాంపియన్‌గా అవతరించారు సింధు. India’s pride, a champion who has brought home a Gold and lots of glory! Happy to have met @Pvsindhu1. Congratulated her and wished her the very best for her future endeavours. pic.twitter.com/4WvwXuAPqr — Narendra Modi (@narendramodi) August 27, 2019 -
క్రీడల మంత్రిని కలిసిన పీవీ సింధు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అనంతరం కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజును ఆమె కలిశారు. ఈ సందర్భంగా పీవీ సింధును కేంద్ర మంత్రి అభినందించారు. మధ్యాహ్నం ఆమె హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. (చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం) ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై జయకేతనం ఎగరేసింది. బీడబ్ల్యూఎఫ్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు కొత్త చరిత్ర లిఖించింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. -
ఈ విజయం ఎంతో ప్రత్యేకం
న్యూఢిల్లీ: పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలవడంతో అందరికంటే అమితానందం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్. తన శిష్యురాలి తాజా ప్రదర్శన గోపీచంద్‌ను గర్వపడేలా చేసింది. స్వర్ణం సాధించడంతో ఒక పనైపోయిందని ఆయన అన్నారు. ‘నాకు సంబంధించి ఇది చాలా పెద్ద విజయం. వరల్డ్ చాంపియన్ అనిపించుకోవడం నిజంగా చాలా గొప్ప ఘనత. దీనిని ఆమె సాధించిన తీరు ఇంకా అపూర్వం. రెట్టింపు గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక మన దేశం నుంచి ఇప్పటికే కాంస్యం, రజతం చూశాం. ఇప్పుడు స్వర్ణం కూడా దక్కింది’ అని గోపీచంద్ భావోద్వేగంతో చెప్పారు. ఒకుహారాతో జరిగిన మ్యాచ్‌పై ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాల్సిన అవసరం లేకపోయిందని, ఒక్కసారి మ్యాచ్‌లో పట్టు చిక్కితే ఆమె దూసుకుపోతుందనే విషయం తనకు తెలుసని కోచ్ వ్యాఖ్యానించారు. ‘ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు... ఇలా అన్ని చోట్లా సింధు రాణించింది. బయటి వారి సంగతి ఎలా ఉన్నా ఆమె ఆటపై నాకు మాత్రం ఎలాంటి సందేహాలు లేవు. ఫైనల్లో ఫలితం ప్రతికూలంగా వచ్చినా నేను బాధపడకపోయేవాడిని. మన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ముఖ్యం’ అని మాజీ ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్కే అభినందన... సింధు విజయంపై భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో గోపీచంద్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు ‘సింధు కఠోర శ్రమ, అంకితభావం, నైపుణ్యానికి దక్కిన ఫలితమిది. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. భారత బ్యాడ్మింటన్‌కు వెన్నెముకలా నిలిచి శ్రమించిన గోపీచంద్‌కు కూడా నా అభినందనలు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఆత్మీయ మిత్రుడు. ఇంతటి అంకితభావం ఉన్న కోచ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు’ అని ప్రసాద్ అన్నారు. చాముండేశ్వరీనాథ్ కారు కానుక... వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం గెలిచిన పీవీ సింధుకు అత్యాధునిక హై ఎండ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో దీనిని అందజేసే అవకాశం ఉంది. -
సింధు స్వర్ణ ప్రపంచం
నిరీక్షణ ముగిసింది. పసిడి స్వప్నం సాకారమైంది. స్విట్జర్లాండ్‌లో ఆదివారం అద్భుతం ఆవిష్కృతమైంది. బ్యాడ్మింటన్‌లో అందని ద్రాక్షగా ఉన్న విశ్వకిరీటం మన సొంతమైంది. గత రెండు పర్యాయాల్లో పసిడి మెట్టుపై బోల్తా పడిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు మూడో ప్రయత్నంలో తన బంగారు కలను నిజం చేసుకుంది. రెండేళ్ల క్రితం హోరాహోరీగా సాగిన విశ్వ సమరంలో తనను ఓడించిన జపాన్ అమ్మాయి ఒకుహారాను ఈసారి సింధు చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో భారత్ తరఫున తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన ఘనతను సాధించింది. బాసెల్ (స్విట్జర్లాండ్): ఎట్టకేలకు తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రపంచ పసిడి కల నిజమైంది. ప్రత్యర్థిపై చిరుతలా విరుచుకుపడిన సింధు అనుకున్నది సాధించింది. ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా ఈ తెలుగమ్మాయి కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. ఒకుహారాపై తాజా విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు ఆ«ధిక్యాన్ని 9–7కు పెంచుకుంది. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుకు 13 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు. వారికి కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ఆహా... ఏమి ఆట... తన చిరకాల ప్రత్యర్థి ఒకుహారాతో జరిగిన ఫైనల్లో సింధు తొలి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు దూకుడుగానే ఆడింది. ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో తొలి పాయింట్‌ను 22 షాట్ల ర్యాలీలో కోల్పోయిన సింధు ఆ తర్వాత విశ్వరూపమే చూపించింది. వరుసగా 8 పాయింట్లు గెల్చుకొని 8–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఎనిమిది పాయింట్లలో ఆరు సింధు ధాటికి ఒకుహారా చేసిన అనవసర తప్పిదాలతోనే వచ్చాయి. మిగతా రెండు పాయింట్లను సింధు విన్నర్స్‌తో సాధించింది. ఆ తర్వాత ఒకుహారా ఒక పాయింట్ గెలిచినా... సింధు మళ్లీ చెలరేగింది. ఈసారీ వరుసగా 8 పాయింట్లు గెలిచి 16–2తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో సింధు తొలి గేమ్‌ను కేవలం 16 నిమిషాల్లో దక్కించుకుంది. ఎక్కడా తగ్గలేదు... తొలి గేమ్ గెల్చుకున్న సింధు రెండో గేమ్‌లోనూ హడలెత్తించింది. ఒకుహారా ఆటతీరుపై పూర్తి హోంవర్క్ చేసినట్లు కనిపించిన ఈ హైదరాబాదీ ఆటలో వైవిధ్యం కనబరిచింది. సింధు జోరుకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఏదశలోనూ ఒకుహారాకు అంతుచిక్కలేదు. నేరుగా ఒకుహారా శరీరంపై సింధు సంధించిన కొన్ని స్మాష్ షాట్లకు జపాన్ క్రీడాకారిణి వద్ద సమాధానమే లేకపోయింది. సింధు కొట్టిన స్మాష్‌లకు ఒకుహారా రిటర్న్ చేసినా ఆ స్మాష్‌ల వేగానికి కొన్నిసార్లు షటిల్స్ బయటకు వెళ్లిపోయాయి. ఫలితంగా రెండో గేమ్‌లో విరామానికి సింధు 11–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా సింధు ఆధిపత్యం కొనసాగించి క్రమం తప్పకుండా పాయింట్లు సాధించగా... ఒకుహారా పూర్తిగా డీలా పడిపోయింది. స్కోరు 20–7 వద్ద సింధు కొట్టిన స్మాష్ షాట్‌ను ఒకుçహారా రిటర్న్ చేయలేకపోవడంతో పాయింట్, గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ భారత స్టార్ కైవసం చేసుకుంది. 2006లో 21 పాయింట్ల విధానం ప్రవేశ పెట్టాక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకపక్షంగా ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్ ఇదే కావడం గమనార్హం. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ మొమోటా 21–9, 21–3తో ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)ను ఓడించాడు. బాయ్ నజరానా రూ. 20 లక్షలు ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 20 లక్షలు నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించింది. 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచిన సాయిప్రణీత్‌కు రూ. 5 లక్షలు నగదు బహుమతి ఇస్తామని ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. ఆ పిలుపు... చెప్పలేని ఆనందం నా రాకెట్‌తోనే సమాధానమిచ్చా సాక్షితో సింధు భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన సింధు... తనపై ఇప్పటివరకు వచ్చిన అన్ని విమర్శలకు రాకెట్‌తో సమాధానమిచ్చింది. ‘గొప్ప టోర్నీలు ఆడగలదు కానీ ఫైనల్స్ గెలవలేదు’ అని ధ్వజమెత్తిన విమర్శకుల నోళ్లన్నీ ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణంతో మూగబోయేలా చేసింది. ఇక నుంచి పట్టిందల్లా బంగారమే అనే స్థాయిలో బరిలో దిగుతానంటూ, గెలవాలనే స్ఫూర్తి తనలో నిరంతరం రగులుతూనే ఉంటుందంటూ స్విట్జర్లాండ్ నుంచి ‘సాక్షి క్రీడా ప్రతినిధి’తో ఫోన్లో తన అభిప్రాయాలను పంచుకుంది. ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే... ఈ విజయం ఎలా అనిపిస్తోంది? చాలా చాలా ఆనందంగా ఉంది. నా అనుభూతి చెప్పడానికి మాటలు రావట్లేదు. ఈ గెలుపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా. చివరికి ‘ప్రపంచ చాంపియన్’ అనే హోదా దక్కింది. రజతాలు, కాంస్యాలు ఎన్ని సాధించినా ... ‘సింధు ప్రపంచ చాంపియన్’ అనే పిలుపు చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. దీన్నిమించిన ఒలింపిక్స్ పతకమే ఉందిగా? ఈ విజయాన్ని ఒలింపిక్స్ పతకంతో పోల్చవద్దు. ఒలింపిక్స్ అత్యున్నత స్థాయి టోర్నీ అయినప్పటికీ ప్రపంచ ఈవెంట్ కూడా దీనికి తక్కువేమీ కాదు. నా దృష్టిలో రెండూ వేర్వేరు. దేని విలువ దానిదే. ఈ టోర్నీ కోసం ఎలా సన్నద్ధమయ్యారు? కోచ్‌లు గోపీ సర్‌తో పాటు కిమ్ జి హ్యూన్ టోర్నీ కోసం నన్ను చాలా బాగా సిద్ధం చేశారు. వ్యూహాల్ని పక్కాగా అమలు చేశా. కొత్త ట్రెయినర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నా ఫిట్నెస్ మరో స్థాయికి చేరింది. గతంలో ర్యాలీలు ఆడాల్సినప్పుడు చాలా అలసిపోయేదాన్ని. కానీ ఇప్పుడు సమర్థంగా ఎదుర్కొంటున్నా. తదుపరి లక్ష్యం? టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలి. నేనెప్పుడు ఇక చాల్లే అని అనుకోలేదు. ఇంకా గెలవాలి, బాగా ఆడాలనే అనుకుంటా. ప్రతీ గెలుపు మరింత బాగా ఆడాలనే స్ఫూర్తినిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్ హోదా వచ్చాక నా బాధ్యత మరింత పెరిగింది. నాపై అంచనాలు పెరుగుతాయి. కాబట్టి మరింత బాగా ఆడాలి. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కూడా సాధించాల్సి ఉంది. ప్రశంసల వెల్లువ.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన సింధుకు అభినందనలు. యావత్ దేశం గర్వించదగ్గ క్షణాలివి. ఈ మీ విజయం లక్షలాది మందికి ప్రేరణగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. –రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి నీ ప్రదర్శనతో దేశం మొత్తం మళ్లీ గర్వపడేలా చేశావ్. ఆటపట్ల ఉన్న అంకితభావం, గెలవాలన్న కసి భావితరాల క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ప్రపంచ చాంపియన్ షిప్లో టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన సింధుకు అభినందనలు. ఇదొక చారిత్రక విజయం. కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్‌కు కూడా శుభాకాంక్షలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం సింధుకు శుభాకాంక్షలు. నీ విజయం దేశానికే గర్వకారణం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి. –కేసీఆర్, తెలంగాణ సీఎం సింధు... నీ చారిత్రక విజయంతో దేశం మొత్తం గర్విస్తోంది. – నరసింహన్, తెలంగాణ గవర్నర్ సింధుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాంపియన్స్‌ను తయారు చేయడానికి ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుంది. – కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడల మంత్రి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో విజయం సాధించిన తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనలు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలి. –విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ గవర్నర్ గొప్ప ప్రదర్శన. ప్రపంచ చాంపియన్ అయినందుకు అభినందనలు. మరోసారి దేశం గర్వపడేలా చేశావ్. –సచిన్ టెండూల్కర్ సింధు అభినందనలు. అత్యద్భుత ప్రదర్శన చేశావ్. నీ ప్రదర్శన ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. – కేటీఆర్, తెలంగాణ, బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు 2.0 ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు ఖాతాలో ఉన్నాయి. అంతకుమించి మూడేళ్ల క్రితమే ఒలింపిక్స్ రజత మాల తన మెడలో పడింది. ఇక సూపర్ సిరీస్ టోర్నీ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవార్డులు, రివార్డులు... ఆర్జనలో మేటి అని ‘ఫోర్బ్స్’ అంకెలు అగ్ర తాంబూలమిస్తున్నాయి. 24 ఏళ్ల వయసులో ఇన్ని ఘనతల తర్వాత మరో ప్లేయర్ అయితే తాము సాధించినదానితో సంతృప్తి పడిపోయేవారేమో... కొత్తగా స్ఫూర్తి పొందడానికి వారికి ఏమీ ఉండకపోయేదేమో. కానీ మన సింధు అలా అనుకోలేదు. ప్రపంచ వేదికపై ఆమె స్వర్ణదాహం తీరలేదు. అందుకే ఈసారి బంగారం పట్టాలని పట్టుదలగా బరిలోకి దిగింది. తై జు యింగ్‌పై క్వార్టర్స్‌లో అద్భుత విజయం తర్వాత ‘ఇంకా నా ఆట పూర్తి కాలేదు’ అంటూ సవాల్ విసిరిన సింధు మరో రెండు మ్యాచ్‌లలో అదే జోరు ప్రదర్శించింది. అందకుండా ఊరిస్తున్న పసిడిని తన ఖాతాలో వేసుకొని షటిల్ శిఖరాన నిలిచింది. ‘వరల్డ్’ అరంగేట్రంలోనే అదుర్స్... 2013లో సింధు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆమెపై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే ఇద్దరు చైనా స్టార్లపై సాధించిన రెండు విజయాలు సింధు భవిష్యత్తును చూపించాయి. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ వాంగ్ యిహాన్‌ను, క్వార్టర్ ఫైనల్లో వాంగ్ షిజియాన్లను ఆమె అలవోకగా ఓడించింది. తర్వాతి ఏడాది కూడా షిజియాన్‌ను చిత్తు చేసి అప్పటి నుంచి చైనా మనకు ఏమాత్రం అడ్డుగోడ కాదని సింధు నిరూపించింది. టీనేజీ దాటకుండానే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలుచుకున్న సింధు తర్వాతి లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోయింది. 2015 కొంత నిరాశపర్చినా... తర్వాతి ఏడాది సింధు గర్జన ‘రియో’లో వినిపించింది. 2016 ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన తర్వాత ఈ తెలుగు తేజం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు ఆమె విశ్వ సమరంలో పతకం గెలవకపోతే ఆశ్చర్యపడాలి కానీ గెలిస్తే అందులో విశేషం ఏమీ లేని స్థితికి చేరుకుంది! ఇలాంటి లెక్కలను సింధు నిజం చేసి చూపించింది. వరుసగా రెండేళ్లు 2017, 2018లలో వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన సింధు సత్తా వెండి వెన్నెల కురిపించింది. లోపాలపై దృష్టి పెట్టి... సహజంగానే సింధు ఈసారి స్వర్ణానికి గురి పెట్టింది. చెట్టు చిటారు కొమ్మన నిలిచిన పక్షిని కొడితే రజతంతో ఆగిపోవాల్సి వస్తోంది తప్ప బంగారం మెరుపు దక్కడం లేదు. అందుకే ఇప్పుడు పక్షి కన్నుపైకే గెలుపు బాణాన్ని సంధించింది. అందు కోసం తీవ్రంగా శ్రమించింది. ప్రత్యేకంగా తన లోపాలపై దృష్టి పెట్టి సాధన చేసింది. క్వార్టర్స్‌లో తై జుతో జరిగిన మ్యాచ్‌లో ఇది కనిపించింది. తొలి గేమ్‌ను చిత్తుగా కోల్పోయినా... తర్వాత చెలరేగింది. మ్యాచ్ ఆసాంతం చూస్తే ప్రత్యర్థి శరీరంపైకి స్మాష్‌లను సంధించడం సింధు ఆటలో కొత్త కోణం. చివర్లో ఒత్తిడిలో పడే సమస్య రాకుండా ఆరంభం నుంచే దూకుడుకు ప్రాధాన్యతనిచ్చింది. తన ఎత్తు కారణంగా డ్రాప్ షాట్లను రిటర్న్ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందిని కూడా అధిగమించింది. తనకు స్మాష్ కొట్టే అవకాశం వచ్చే వరకు ప్రత్యర్థిని సాధ్యమైనంతగా ర్యాలీలతోనే ఆడించే ప్రయత్నం చేయడం ఫలితాన్నిచ్చింది. 360 డిగ్రీల కోణంలో చురుకైన కదలికలతో కోర్టు మొత్తాన్ని కవర్ చేస్తూ ఈ మెగా టోర్నీలో సింధు ఆడిన ఆట నిజంగా సూపర్బ్. తదుపరి స్వర్ణ గురి ‘టోక్యోలో’... నిజానికి 2019లో సింధుకు గొప్ప ఫలితాలు ఏమీ రాలేదు. ఇండోనేసియా మాస్టర్స్‌లో క్వార్టర్స్‌లో ఓడగా, ఆల్ ఇంగ్లండ్‌లో తొలి రౌండ్లోనే ఓడటం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది. ఇండియా ఓపెన్‌లో, సింగపూర్ ఓపెన్‌లోనూ సెమీస్‌కే పరిమితం కాగా, మలేసియా ఓపెన్‌లో కనీసం క్వార్ట ర్స్ ఆనందం కూడా దక్కలేదు. ఆసియా చాంపియన్‌షిప్, ఆస్ట్రేలియన్ ఓపెన్దీ అదే కథ. ఇండోనేసియాలో రన్నరప్‌గా నిలవడంతో కొంత సంతృప్తి దక్కగా, తర్వాతి వారమే జపాన్‌లో ఆనందం ఆవిరైంది. వరల్డ్ చాంపియన్‌షిప్ సన్నాహాల కోసం థాయిలాండ్ ఓపెన్‌కు దూరమైన ఈ హైదరాబాదీ చివరకు తన లక్ష్యాన్ని చేరింది. తాజా ఫామ్, సర్క్యూట్లో ఉన్న ప్రత్యర్థులను బట్టి చూస్తే మరో ఒలింపిక్ పతకం సింధు కోసం ఎదురు చూస్తున్నట్లే కనిపిస్తోంది. బ్రెజిల్ గడ్డపై చేజారిన కనకపు హారాన్ని టోక్యోలో వరిస్తే భారత అభిమానులకు కావాల్సిందేముంది! చాలా గర్వంగా ఉంది సింధు ఫైనల్స్‌లోనూ గెలవగలదని నిరూపించింది. ప్రపంచ చాంపియన్ స్వర్ణం సాధించడం గొప్పగా అనిపిస్తోంది. ఈ క్షణంలో తనతో ఉండటం చాలా గర్వంగా ఉంది. సింధు టోర్నీ కోసం చాలా కష్టపడింది. ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. – పీవీ రమణ (సింధు తండ్రి) అమ్మకు అంకితం... హైదరాబాద్‌కు వచ్చాకే సంబరాలు చేసుకుంటా. ప్రస్తుతం టీమ్‌తో కలిసి డిన్నర్‌కి వెళ్తున్నా. ఈ విజయాన్ని మా అమ్మకు అంకితమిస్తున్నా. నేడు (ఆదివారం) ఆమె పుట్టినరోజు. తనకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నా. చివరకు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాన్ని ఆమెకు ఇస్తున్నా. వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. –పీవీ సింధు –సాక్షి క్రీడావిభాగం -
చరిత్ర సృష్టించిన పీవీ సింధు
-
పీవీ సింధుకు గవర్నర్ అభినందనలు
సాక్షి, విజయవాడ : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ టైటిల్ కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలియజేశారు. అనితర సాధ్యమైన విజయాన్ని నమోదు చేసిన సింధు భారతీయుల క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. నేటి యువత ఈ విజయాన్ని స్పూర్తిగా తీసుకోవాలని అభిలషించారు. ప్రపంచ శ్రేణి క్రీడాకారిణిని దేశానికి అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. -
స్వర్ణ ‘సింధూ’రం
బాసిల్: కోట్లాది భారతీయుల గుండె గొంతుకను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ధ్వనింపజేసిన సింధూరనాదమిది... పదహారణాల అచ్చమైన మన తెలుగమ్మాయి సాధించిన అద్భుతమిది... దేశం మొత్తాన్ని గర్వించేలా చేసిన క్షణమిది. వయసు కేవలం 24 ఏళ్లు... కానీ పూసర్ల వెంకట సింధు చరిత్ర సృష్టించింది. వరల్డ్ చాంపియన్ షిప్ ఆరంభంనుంచి ఆఖరు దశకు చేరే వరకు ఎందరో స్టార్లు తలవంచి నిష్ర్కమించిన చోట... సింధు మాత్రం ఉవ్వెత్తున ఎగిసింది. వరుసగా మూడుసార్లు ఫైనల్‌కు చేరిన ఈ హైదరాబాదీ అమ్మాయి.. స్వర్ణం ముచ్చటను తీర్చుకుంది. ఫలితంగా నాలుగు దశాబ్దాలుగా ఊరించిన పసిడి కల నెరవేరింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకున్నారు సింధు. గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో నాలుగు పతకాలు గెల్చుకున్న తెలుగు తేజం.. ఈసారి మాత్రం పసిడి సాధించే వరకూ వదల్లేదు. ఆదివారం జరిగిన ఫైనల్లో వరల్డ్ ఐదో ర్యాంకర్ పీవీ సింధు.. ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై గెలిచి జగజ్గేతగా అవతరించారు. రెండు గేమ్స్‌లో అలవోకగా సాగిన పోరులో సింధు 21-7, 21-7 తేడాతో గెలిచి చాంపియన్ కలను నెరవేర్చుకున్నారు. తొలి నుంచి ఒకుహరా అంచనాలకు అందకుండా సింధు ఏకపక్షంగా ఆటను కొనసాగించారు. సుదీర్ఘమైన ర్యాలీలు, అద్భుతమైన స్మాష్‌లతో పాటు అంతకుమించి సొగసైన రిటర్న్ షాట్లతో సింధు అలరించారు. లెక్క సరిపోయింది.. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఒకుహారాతో జరిగిన ఫైనల్ పోరులో ఓటమి పాలైన సింధు అందుకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ గెలుపుతో ఒకుహారా లెక్కను సరిచేశారు. ఒకుహారా ఆటపై మంచి హోంవర్క్ చేసి వచ్చిన సింధు దానిని కోర్టులో అమలు చేశారు. ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించిన సింధు.. ప్రతీ పాయింట్ కోసం శ్రమించారు.ఎలాగైన స్వర్ణం సాధించాలనే కసితో సింధు ఆట తీరు సాగింది. మరొకవైపు ఫైనల్ ఫోబియాకు చెక్ పెట్టాలనే ఏకైక లక్ష్యమే ఆమెకు స్వర్ణాన్ని తెచ్చిపెట్టింది. -
సింధు... ఈసారి వదలొద్దు
ఇంకొక్క విజయమే... నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తోన్న పసిడి కల నెరవేరడానికి... భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకోవడానికి! ఇంకొక్క విజయమే... ముచ్చటగా మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం రంగు మార్చడానికి... విశ్వవేదికపై మువ్వన్నెలు రెపరెపలాడటానికి! ఇంకొక్కవిజయమే... సింధు పేరు భారత క్రీడాచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు... గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో నాలుగు పతకాలు గెల్చుకున్న తెలుగు తేజం సింధు పసిడి కాంతులు మాత్రం విరజిమ్మలేకపోయింది. రెండుసార్లు కాంస్యాలతో సరిపెట్టుకోగా... మరో రెండుసార్లు ‘రజత’ హారం మెడలో వేసుకుంది. రెండు ఫైనల్స్‌లో ఓడిన అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకొని... మూడోసారి పతక వర్ణాన్ని పసిడిగా మార్చాలని ఆశిస్తూ... విజయీభవ సింధు...! బాసెల్ (స్విట్జర్లాండ్): జగజ్జేతగా అవతరించడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. గత ప్రదర్శన ఆధారంగా... ఈసారీ భారీ అంచనాలతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అడుగు పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి... ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ వరుసగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆఖరి సమరానికి అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 40 నిమిషాల్లో 21–7, 21–14తో ప్రపంచ మూడో ర్యాంకర్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ చెన్ యుఫె (చైనా)పై అద్వితీయ విజయం సాధించింది. తద్వారా వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే ఫైనల్లో 2017 ప్రపంచ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో ఒకుహారా 83 నిమిషాల్లో 21–17, 18–21, 21–15తో 2013 ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. ఒకుహారాతో ముఖాముఖి రికార్డులో సింధు 8–7తో ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాది వీరిద్దరు రెండుసార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌లో గెలిచారు. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఒకుహారా చేతిలో ఎదురైన పరాజయానికి సింధు ఈసారి ప్రతీకారం తీర్చుకొని పసిడి పతకం మెడలో వేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఆరంభం నుంచే... రెండో ర్యాంకర్ తై జు యింగ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గొప్ప పోరాటపటిమ కనబరిచి అద్భుత విజయాన్ని అందుకున్న సింధు సెమీఫైనల్లో మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించింది. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన చెన్ యుఫెను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో ఆడింది. క్లిష్టమైన కోణాల్లో షటిల్స్‌ను పంపిస్తూ చెన్ యుఫె సత్తాకు పరీక్ష పెట్టింది. అవకాశం వచ్చినపుడల్లా చెన్ యుఫె బలహీన రిటర్న్ షాట్లను అంతేవేగంగా రిటర్న్ చేస్తూ పాయింట్లు గెల్చుకుంది. చెన్ యుఫె కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో తొలి గేమ్‌లో విరామానికి 11–3తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత కేవలం నాలుగు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో చైనా ప్లేయర్‌పై ఒత్తిడిని కొనసాగిస్తూ సింధు ఆరంభంలోనే 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. సుదీర్ఘంగా సాగిన పలు ర్యాలీల్లో సింధు పైచేయి సాధిస్తూ తన ఆధిక్యాన్ని 17–9కి పెంచుకుంది. క్రాస్‌కోర్ట్ స్మాష్‌తో 20–12తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచిన సింధు ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పోయింది. అయితే చెన్ యుఫె కొట్టిన షాట్ బయటకు వెళ్లిపోవడంతో ఈసారి సింధు ఖాతాలో పాయింట్‌తోపాటు గేమ్, విజయం చేరాయి. ఫైనల్ చేరారిలా...సింధు తొలి రౌండ్: బై రెండో రౌండ్: పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై 42 నిమిషాల్లో 21–14, 21–15తో గెలుపు మూడో రౌండ్: బీవెన్ జాంగ్ (అమెరికా)పై 34 నిమిషాల్లో 21–14, 21–6తో గెలుపు క్వార్టర్ ఫైనల్: తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై 71 నిమిషాల్లో 12–21, 23–21, 21–19తో గెలుపు సెమీఫైనల్: చెన్ యుఫె (చైనా)పై 40 నిమిషాల్లో 21–7, 21–14తో గెలుపు ఒకుహారా తొలి రౌండ్: బై రెండో రౌండ్: ఎవగెనియా కొసెత్‌స్కాయ (రష్యా)పై 34 నిమిషాల్లో 21–12, 21–14తో విజయం మూడో రౌండ్: సుంగ్ జీ హున్ (కొరియా)పై 47 నిమిషాల్లో 21–18, 21–13తో విజయం క్వార్టర్ ఫైనల్: హి బింగ్ జియావో (చైనా)పై 43 నిమిషాల్లో 21–7, 21–18తో విజయం సెమీఫైనల్: రచనోక్ (థాయ్‌లాండ్)పై 83 నిమిషాల్లో 21–17, 18–21, 21–15తో విజయం చెన్ యుఫెతో మ్యాచ్‌కు పక్కాగా సిద్ధమై వచ్చాను. తొలి క్షణం నుంచే అనుకున్న వ్యూహాలను ఆచరణలో పెట్టాను. ఆరంభం నుంచే ఆధిక్యంలోకి వెళ్లి అంతే వేగంతో తొలి గేమ్‌ను ముగించాను. రెండో గేమ్‌లో అనవసర తప్పిదాలు చేశాను. వరుస పాయింట్లు కోల్పోయాక మళ్లీ పుంజుకొని ఆధిక్యంలోకి వచ్చాను. దాంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడుతూ మ్యాచ్‌ను ముగించాను. నేడు జరిగే ఫైనల్లోనూ బాగా ఆడతానని ఆశిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో నా లక్ష్యం ఇంకా నెరవేరలేదు. సంతోషంగా ఉన్నా పూర్తి సంతృప్తిగా లేను. ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. ఒకుహారాతో తుది పోరు తేలికేం కాదు. ఒకరి ఆటతీరుపై ఒకరికి పూర్తి అవగాహన ఉంది. కీలకదశల్లో ఏకాగ్రతతో, నిగ్రహం కోల్పోకుండా సంయమనంతో ఆడాలి. నేనైతే నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. – పీవీ సింధు -
ముగిసిన ప్రణీత్ పోరాటం
బాసెల్ (స్విట్జర్లాండ్): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో 13-21,8-21 తేడాతో 19వ ర్యాంకర్, తెలంగాణ ప్లేయర్ సాయిప్రణీత్ ఓటమి చవిచూశాడు. ఆరంభంలో నువ్వా నేనా అన్నట్టు ఇద్దరూ తలపడ్డారు. దీంతో తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. ఓ దశలో తొలి గేమ్‌లో ఇద్దరూ 10-10 పాయింట్లతో సమానంగా నిలిచారు. అనంతరం మొమోటా తన అనుభవంతో పాటు అసలు సిసలైన చాంపియన్ ఆటను ప్రదర్శించాడు. దీంతో మొమోటా ముందు సాయి ప్రణీత్ తేలిపాయాడు. ఇక రెండో గేమ్‌లోనూ మొమోటా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. దీంతో ప్రణీత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టిస్తాడనుకున్న ప్రణీత్ కాంస్యంతోనే సరిపెట్టాడు. దీంతో భారత దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే సరసన చేరాడు. 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రకాశ్ పదుకొనే కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. 36ఏళ్ల అనంతరం పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మళ్లీ పతకం అందించనున్న ప్లేయర్‌గా సాయిప్రణీత్ చరిత్ర లిఖించాడు. మరోవైపు మహిళ సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో సింధు 21-7, 21-14 తేడాతో చెన్ యుఫె (చైనా)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. -
వారెవ్వా సింధు
బాసెల్ (స్విట్జర్లాండ్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైనల్‌కు చేరారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో సింధు 21-7, 21-14 తేడాతో చెన్ యుఫె (చైనా)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త శ్రమించి గేమ్‌తో పాటు ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నారు. 40 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు ఏకపక్ష విజయం సాధించి శభాష్ అనిపించుకున్నారు. సుదీర్ఘ ర్యాలీలతో ఆకట్టుకున్న సింధు.. కచ్చితమైన ఎటాక్‌తో చెన్ యుఫెను ఆటాడుకున్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో సింధు వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరినట్లయ్యింది. అంతకుముందు సెమీస్‌కు చేరడంతోనే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు.. ఈ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో అత్యధికంగా ఐదు పతకాలు నెగ్గిన రికార్డు చైనా ప్లేయర్ జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. తాజా ప్రదర్శనతో సింధు రజతాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం జరుగనున్న తుది పోరులో రచనాక్ ఇంతానాన్‌తో కానీ ఒకుహారాతో కానీ సింధు తలపడనున్నారు. -
సింధు, సాయి చరిత్ర
కల కాదు నిజమే. నమ్మశక్యంకానీ రీతిలో... కళ్లు చెదిరే ప్రదర్శనతో... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఒకేరోజు ఇద్దరు తెలుగు తేజాలు పూసర్ల వెంకట (పీవీ) సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ గర్జించారు. కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీల్లో తనకు కొరకరాని కొయ్యగా మారిన ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్‌ను సింధు మట్టికరిపించగా... ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించిన సాయిప్రణీత్ అందరి అంచనాలను తారుమారు చేసి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. సెమీఫైనల్ చేరడంతో సింధు, సాయిప్రణీత్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. దాంతో 42 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారి భారత్ ఖాతాలో మహిళల సింగిల్స్, పురుషుల సింగిల్స్‌లో పతకాలు చేరనున్నాయి. 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే కాంస్యం సాధించాక... పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మళ్లీ పతకం అందించనున్న ప్లేయర్‌గా సాయిప్రణీత్ చరిత్ర లిఖించాడు. బాసెల్ (స్విట్జర్లాండ్): కొడితే కుంభస్థలం కొట్టాలి. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాయిప్రణీత్ నిజం చేసి చూపించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులపై అద్వితీయ విజయాలు సాధించారు. ఈ ఏడాది అంతర్జాతీయ టోర్నీల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుల నిరాశాజనక ప్రదర్శనను అందరూ మర్చిపోయేలా చేశారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పీవీ సింధు 71 నిమిషాల్లో 12–21, 23–21, 21–19తో రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 19వ ర్యాంకర్, తెలంగాణ ప్లేయర్ సాయిప్రణీత్ 51 నిమిషాల్లో 24–22, 21–14తో నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను మట్టికరిపించాడు. వెనుకంజలో ఉన్నా... ఈ మ్యాచ్‌కంటే ముందు తై జు యింగ్‌తో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన సింధు... తొలి గేమ్ తర్వాత ఈసారి కూడా తన ఖాతాలో మరో ఓటమి వేసుకుంటుందనిపించింది. తొలి గేమ్‌ను సులువుగా సమర్పించుకున్న సింధు... రెండో గేమ్‌లో 5–8తో వెనుకంజ లో ఉంది. ఈ కీలక సమయంలో సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు వరుసగా ఐదు పా యింట్లు గెలిచి 10–8తో ఆధిక్యంలోకొచ్చింది. అయితే తై జు యింగ్ కూడా పట్టుదలతో ఆడటంతో ఐదుసార్లు స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 21–21 వద్ద సింధు చక్కటి రిటర్న్ షాట్, ఆ తర్వాత క్రాస్‌కోర్టు షాట్లతో వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలోనూ సింధు తడబడింది. 4–8తో వెనుకబడింది. అయితే ఈసారీ సింధు అద్భుతంగా పుంజుకుంది. స్కోరును 14–14 వద్ద సమం చేశాక ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 19–19 వద్ద ఉన్నపుడు సింధు స్మాష్ షాట్‌తో ఒక పాయింట్ సాధించగా... ఆ తర్వాత తై జు యింగ్ కొట్టిన రిటర్న్ షాట్ బయటకు వెళ్లడంతో సింధు విజయం ఖాయమైంది. సూపర్ సాయి... ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను ఓడించిన సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచాడు. సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించాడు. కీలకదశలో స్మాష్ షాట్లతో చెలరేగాడు. తొలి గేమ్ నెగ్గిన తర్వాత రెండో గేమ్‌లో సాయిప్రణీత్ మరింత దూకుడు పెంచాడు. జొనాథన్ క్రిస్టీకి తేరుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో అత్యధికంగా ఐదు పతకాలు నెగ్గిన రికార్డు చైనా ప్లేయర్ జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉంది. తాజా ప్రదర్శనతో సింధు ఈ రికార్డును సమం చేసింది. 1: ప్రపంచ సీనియర్, జూనియర్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్ సాయిప్రణీత్. 2010 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ కాంస్యం గెలిచాడు. 2: ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు రావడం ఇది రెండోసారి. 2017లో సింధు, సైనా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)తో సాయిప్రణీత్... ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)తో సింధు ఆడతారు. మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. -
మొదలైంది వేట
గత ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్‌కు పతకాలు అందించిన స్టార్ క్రీడాకారిణులు పూసర్ల వెంకట (పీవీ) సింధు, సైనా నెహ్వాల్ మరోసారి పతకాల వేట ప్రారంభించారు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సింధు, సైనా అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. మరోవైపు డబుల్స్ విభాగంలో భారత జోడీల పోరాటం ముగిసింది. బాసెల్ (స్విట్జర్లాండ్): అందని ద్రాక్షగా ఉన్న పసిడి పతకం అందుకోవాలనే లక్ష్యంతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన ఐదో సీడ్ పీవీ సింధు, ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సింధు 21–14, 21–15తో పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై... సైనా 21–10, 21–11తో సొరాయ డివిష్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించారు. పాయ్ యు పోతో జరిగిన మ్యాచ్‌లో సింధుకు అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి గేమ్ ఆరంభంలో 11–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత అదే జోరును కొనసాగించింది. రెండో గేమ్‌లో పాయ్ యు పో తేరుకునే ప్రయత్నం చేసినా సింధు దూకుడు పెంచి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో సింధు; 12వ సీడ్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) 16–21, 19–21తో హాన్ చెంగ్ కాయ్–హావో డాంగ్ జౌ (చైనా) చేతిలో... అర్జున్–శ్లోక్ 14–21, 13–21తో లియు చెంగ్–నాన్ జాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని 20–22, 16–21తో ఏడో సీడ్ డు యువె–లిన్ యిన్ హుయ్ (చైనా) చేతిలో... మేఘన–పూర్వీషా 8–21, 18–21తో షిహో తనాక–కొహారు (జపాన్) చేతిలో ఓడారు. శ్రీకాంత్ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ శ్రీకాంత్ (భారత్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)తో జరిగిన రెండో రౌండ్లో శ్రీకాంత్ 13–21, 21–13, 21–16తో నెగ్గాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెంటో మొమోటా (జపాన్)తో ప్రణయ్; ఆంథోని (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; కాంతాపోన్(థాయ్‌లాండ్)తో శ్రీకాంత్ పోటీపడతారు. -
లిన్ డాన్‌ను ఓడించిన ప్రణయ్
బసెల్(స్విట్జర్లాండ్): భారత బ్యాడ్మింటన్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ రెండో రౌండ్లో ఐదుసార్లు విశ్వవిజేత, రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్(చైనా)ను ఇంటిబాట పట్టించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్ ప్రణయ్ 21–11, 13–21, 21–7తో లిన్ డాన్‌ను చిత్తుచేశాడు. ఆద్యంతం దూకుడుగా ఆడిన ప్రణయ్ తొలి సెట్ ఆరంభం లోనే 6–2తో ఆధిక్యంలో దూసుకెళ్లాడు. ఇదే ఊపులో 21–11తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే, రెండో సెట్లో లిన్ తన అసలైన ఆటతీరు ప్రదర్శించాడు. 5–5 వద్ద ప్రణయ్‌ని నిలువరించాడు. ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లి 18–13 వద్ద వరుసగా మూడు పాయింట్లు సాధించి సెట్‌ను దక్కించు కున్నాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో ప్రణయ్ తిరుగులేని ఆట ప్రదర్శించాడు. 21–7తో సెట్‌తోపాటు మ్యాచ్‌నూ గెలుచుకు న్నాడు. తర్వాతి రౌండ్లో వరల్డ్ నెం.1 కెంటో మొమోటా(జపాన్)తో ప్రణయ్ తలపడతాడు. కాగా, మరో మ్యాచ్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ 21–16, 21–15తో లీ డాంగ్ క్యూన్(కొరియా)పై నెగ్గగా, 14వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 15–21, 10–21తో ప్రపంచ 34వ ర్యాంకర్ లొహ్ ఈ కియాన్ (సింగపూర్) చేతిలో పరాజయం చవిచూశాడు. -
శ్రమించి... శుభారంభం
పురుషుల సింగిల్స్‌లో మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణ తెరదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు తొలి రౌండ్ అడ్డంకిని శ్రమించి అధిగమించారు. శ్రీకాంత్, ప్రణయ్ ఒక్కో గేమ్ కోల్పోయి విజయాన్ని అందుకోగా... సాయిప్రణీత్ వరుస గేముల్లో గెలుపొంది రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బాసెల్ (స్విట్జర్లాండ్): తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్స్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఒకదశలో ఊహించని ఫలితం వస్తుందేమోననే అనుమానం కలిగినా... సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చిన భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌ను విజయవంతంగా దాటారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత పదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 19వ ర్యాంకర్ భమిడిపాటి సాయిప్రణీత్, ప్రపంచ 30వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ఈ మెగా ఈవెంట్లో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 66 నిమిషాల్లో 17–21, 21–16, 21–6తో ప్రపంచ 81వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై... సాయిప్రణీత్ 40 నిమిషాల్లో 21–17, 21–16తో 66వ ర్యాంకర్ జేసన్ ఆంథోని హో–షుయె (కెనడా)పై... ప్రణయ్ 59 నిమిషాల్లో 17–21, 21–10, 21–11తో 93వ ర్యాంకర్ ఈటూ హీనో (ఫిన్లాండ్)పై విజయం సాధించారు. గత ప్రపంచ చాంపియన్‌షిప్ తొలి రౌండ్లోనూ ఎన్‌హట్ ఎన్గుయెన్‌తోనే ఆడిన శ్రీకాంత్ నాడు రెండు గేముల్లో గెలుపొందగా... ఈసారి మాత్రం మూడు గేముల్లో గట్టెక్కాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్ రెండో గేమ్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. అయితే స్కోరు 17–16 వద్ద ఒక్కసారిగా విజృంభించిన ఈ ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కోచ్ పుల్లెల గోపీచంద్ తొలి పాయింట్ నుంచే దూకుడుగా ఆడాలని శ్రీకాంత్‌కు సూచించాడు. తొలి పాయింట్ కోల్పోయాక... శ్రీకాంత్ తన జోరు పెంచాడు. స్మాష్‌లతో చెలరేగిపోయాడు. ఫలితంగా వరుసగా 11 పాయింట్లు గెలిచి 11–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్), చైనా దిగ్గజం లిన్ డాన్, నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా), ఆరో సీడ్ ఆంథోని జిన్‌టింగ్ (ఇండోనేసియా), ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), మూడో సీడ్ చెన్ లాంగ్ (చైనా) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా (భారత్) జంట 21–10, 21–18తో డయానా–నిక్తె సోటోమేయర్ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది. -
నిరీక్షణ ఫలించేనా?
గత ఐదు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లలో మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు కనీసం కాంస్యం లేదంటే రజతం వచ్చింది. గత రెండు పర్యాయాల్లోనైతే త్రుటిలో స్వర్ణ పతకాలు చేజారాయి. అందని ద్రాక్షగా ఉన్న పసిడి పతకాన్ని ఈసారైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతుండగా... పురుషుల సింగిల్స్ విభాగంలో 36 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ ఏడాది మహిళల సింగిల్స్‌తోపాటు పురుషుల సింగిల్స్‌లోనూ భారత స్టార్స్ ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడంతో తుది ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. బాసెల్ (స్విట్జర్లాండ్): ఈ సీజన్లో నిరాశాజనక ఫలితాలు లభించినా... వాటన్నింటినీ మర్చిపోయేలా... తాజా ప్రదర్శనను అభిమానులందరూ గుర్తుపెట్టుకునేలా... తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేయాలనే పట్టుదలతో... నేటి నుంచి మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. తొలి రోజు పురుషుల సింగిల్స్‌లో భారత టాప్–4 క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ పోటీపడనున్నారు. ప్రపంచ 81వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో పదో ర్యాంకర్ శ్రీకాంత్... 34వ ర్యాంకర్ లోకీన్ యెవ్ (సింగపూర్)తో 14వ ర్యాంకర్ సమీర్ వర్మ... 66వ ర్యాంకర్ జేసన్ ఆంథోని హో షుయె (కెనడా)తో 19వ ర్యాంకర్ సాయిప్రణీత్; 93వ ర్యాంర్ ఈటు హీనో (ఫిన్లాండ్)తో 30వ ర్యాంకర్ ప్రణయ్ తలపడనున్నారు. అత్యున్నతస్థాయి టోర్నీ కావడంతో ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా భారత ఆటగాళ్లందరూ జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే తొలి రౌండ్లోనే ఎదురుదెబ్బ తగిలే ప్రమాదముంది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్, సాయిప్రణీత్‌లకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే రెండో రౌండ్లో చైనా దిగ్గజం లిన్ డాన్‌తో ప్రణయ్... లీ డాంగ్ కెయున్ (కొరియా)తో సాయిప్రణీత్ ఆడే అవకాశముంది. రెండో రౌండ్‌ను కూడా దాటితే మూడో రౌండ్లో ప్రణయ్‌కు డిఫెండింగ్ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్); సాయిప్రణీత్‌కు ఆరో సీడ్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) ఎదురుకావొచ్చు. మరోవైపు శ్రీకాంత్‌కు క్వార్టర్ ఫైనల్ వరకు కఠిన ప్రత్యర్థి దారిలో లేడు. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్‌కు రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) ఎదురయ్యే చాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ గెలిస్తే పతకం ఖాయమవుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో భారత అత్యుత్తమ ప్రదర్శన కాంస్య పతకం. 1983లో ప్రకాశ్ పదుకొనే సెమీస్‌లో ఓడి కాంస్య పతకాన్ని సాధించాడు. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో ఇప్పటివరకు భారత్ నుంచి ఎవ్వరూ సెమీఫైనల్ చేరుకోలేదు. 2018లో సాయిప్రణీత్... 2017లో శ్రీకాంత్... 2013లో పారుపల్లి కశ్యప్... 2007లో అనూప్ శ్రీధర్.. 2001లో పుల్లెల గోపీచంద్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి త్రుటిలో పతకాలకు దూరమయ్యారు. ఒకే పార్శ్వంలో సింధు, సైనా మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ సింధు, ఎనిమిదో సీడ్ సైనా ఒకే పార్శ్శంలో ఉండటంతో వీరిద్దరు సెమీఫైనల్లో ఎదురయ్యే అవకాశముంది. తొలి రౌండ్లో వీరిద్దరికీ ‘బై’ లభించడంతో నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడతారు. రెండో రౌండ్లో సబ్రీనా (స్విట్జర్లాండ్)తో సైనా... పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో సింధు ఆడే చాన్స్ ఉంది. క్వార్టర్ ఫైనల్లో సైనాకు నాలుగో సీడ్ చెన్ యుఫె (చైనా)... సింధుకు రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) ప్రత్యర్థులుగా ఉండే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్), మాజీ విశ్వవిజేత ఒకుహారా (జపాన్) సెమీస్ చేరుకోవచ్చు. మిక్స్డ్ డబుల్స్‌లో లేని ప్రాతినిధ్యం... డబుల్స్ విషయానికొస్తే భారత్‌కు ఈసారీ పతకావకాశాలు లేవనే చెప్పవచ్చు. ఇటీవల థాయ్‌లాండ్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట చివరి నిమిషంలో ఈ మెగా ఈవెంట్ నుంచి వైదొలిగింది. సుమీత్ రెడ్డి–మనూ అత్రి... శ్లోక్ రామచంద్రన్–అర్జున్ జోడీలు బరిలో ఉన్నా... రెండో రౌండ్లోనే వీరికి చైనా జంటలు ఎదురుకానున్నాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; మేఘన–పూర్వీషా; సంజన–పూజ జోడీలు రెండో రౌండ్ దాటిముందుకెళ్లడం కష్టమే. మిక్స్డ్ డబుల్స్‌లో ఈసారి భారత ప్రాతినిధ్యం లేదు. వాస్తవానికి అశ్విని–సాత్విక్; సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీలకు ఎంట్రీ లభించినా... సాత్విక్, ప్రణవ్‌లకు గాయాలు కావడంతో ఈ రెండు జోడీలు వైదొలిగాయి. -
'ఫైనల్ ఫోబియా'ను నేను నమ్మను
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో నాలుగో పతకంతో తెలుగమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు చరిత్ర సృష్టించింది. టోర్నీలో అద్భుతంగా రాణించిన ఆమె, దురదృష్టవశాత్తూ వరుసగా రెండో ఏడాది కూడా రజతంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇది ఆమెతో పాటు భారత అభిమానులను కూడా నిరాశ పర్చింది. అయితే కిందపడిన ప్రతీసారి అంతే వేగంగా పైకి లేవడం తనకు అలవాటేనని, సుదీర్ఘ కెరీర్లో ఇలాంటి ఓటములు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవన్న సింధు... మరోసారి స్వర్ణమే లక్ష్యంగా శ్రమిస్తానని పట్టుదలగా చెబుతోంది. సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక టోర్నీలలో గతంలో ఫైనల్లో పరాజయం ఎదురైనప్పుడల్లా తీవ్ర వేదనకు గురయ్యేదాన్నని, ఇప్పుడు స్థితప్రజ్ఞత అలవర్చుకున్నానని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వ్యాఖ్యానించింది. ఈసారి వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమి తర్వాత కూడా అలాంటి భావోద్వేగాలను అధిగమించగలిగానని ఆమె చెప్పింది. చైనాలోని నాన్జింగ్లో జరిగిన మెగా ఈవెంట్లో రజత పతకం సాధించిన అనంతరం సింధు మంగళవారం స్వస్థలం హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. టోర్నీ ఫలితం తదితర అంశాలపై ఆమె ‘సాక్షి’తో మాట్లాడింది. విశేషాలు సింధు మాటల్లోనే... మారిన్ మళ్లీ దెబ్బ తీయడంపై... దాదాపు నెల రోజుల క్రితమే మలేసియా ఓపెన్‌లో మారిన్‌ను ఓడించాను. దాంతో పోలిస్తే ఈసారి ఆమె ఆటలో ఒక్కసారిగా దూకుడు పెరిగింది. నేను ఆటలో దూకుడు గురించి సన్నద్ధమయ్యాను కానీ ఆమె కోర్టులో కూడా కొత్తగా ప్రవర్తించింది. ఆమె శైలి కూడా భిన్నంగా కనిపించింది. నిబంధనల పరిధిలో ఉంటూనే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రణాళికతోనే ఆమె సిద్ధమై వచ్చిందని కూడా అర్థమైంది. నేను చివరకు అంపైర్లకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది కూడా. అయినా ఫలితం దక్కలేదు. నా ఆటకంటే కూడా ఆమె తన ప్రవర్తనతోనే నాపై ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌లో ఓటమిపై... తొలి గేమ్‌ను చేతులారా కోల్పోవడమే నేను ఫైనల్లో చేసిన తప్పు. దాదాపు 15 పాయింట్ల వరకు కూడా ఇద్దరం సమ ఉజ్జీలుగా ఉన్నాం. కొద్దిసేపు నేను ఏకాగ్రత కోల్పోయి వెనుకబడిపోయాను. గేమ్ గెలిచి ఉంటే నాకు మరో అవకాశం ఉండేది. ఇక రెండో గేమ్‌లోనైతే పూర్తిగా షటిల్‌పై నియంత్రణ కోల్పోయాను. ఇతర విషయాలను పక్కన పెడితే మారిన్ నిజానికి చాలా బాగా ఆడింది. ఆమెకే గెలిచే అర్హత ఉంది. పైగా చాలా రోజులు గాయాల వల్ల ఆటకు దూరమై ఇటీవల పునరాగమనం చేయడం వల్ల ఒక రకమైన కసి ఆమె ఆటలో కనిపించింది. ఓడినా నా ఆటలో లోపాలేమీ లేవు. మళ్లీ ఫైనల్లో ఓడిపోవడంపై... చాలా రోజులుగా చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. తుది పోరులో భయపడుతూ ఆడే ‘ఫైనల్ ఫోబియా’ అనే పదమే నాకు నచ్చనిది. నేను దానిని నమ్మను. అదే ఉంటే కెరీర్లో ఇన్ని విజయాలు దక్కకపోయేవి. వరల్డ్ చాంపియన్‌షిప్ అనేది మెగా ఈవెంట్. నాకు కఠినమైన ‘డ్రా’ ఎదురైంది. టోర్నీలో ముందుకు వెళుతున్నకొద్దీ బలమైన ప్రత్యర్థులు ఎదురవుతారు. దాదాపు అందరూ సమాన స్థాయివారే. అలాంటప్పుడు కొద్ది తేడాలో మ్యాచ్ పోతుంది. బరిలోకి దిగినప్పుడు ఎవరైనా 100 శాతం శ్రమిస్తారు. స్వర్ణం గెలిచేందుకే ప్రయత్నిస్తారు. తుది ఫలితం కొంత నిరాశపర్చినా ఈసారి అంతగా బాధ పడిపోలేదు. గత ఏడాది దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఓడినప్పుడైతే తట్టుకోలేక బాగా ఏడ్చేశాను. ఈసారి అలాంటిదేమీ జరగలేదు. మున్ముందు కూడా కెరీర్లో ఇలాంటి క్షణాలు మళ్లీ మళ్లీ ఎదురు కావచ్చు. బాధ పడుతూ కూర్చుంటే ఆడలేం. ఓవరాల్‌గా టోర్నీలో ప్రదర్శనపై... వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం నేను ఎన్నో విధాలుగా సిద్ధమయ్యాను. ఇతర విషయాల వైపు దృష్టి మళ్లకుండా ఏకాగ్రతతో సాధన చేశాను. చాంపియన్ కాగలననే నమ్మకంతోనే వచ్చాను. కానీ అలా జరగలేదు. ఇంకా కష్టపడితే వచ్చేసారి స్వర్ణం గెలవగలనేమో. అయితే సానుకూల దృష్టితో చూస్తే రెండు గొప్ప విజయాలు నాకు అమిత సంతృప్తినిచ్చాయి. క్వార్టర్ ఫైనల్లో నొజోమి ఒకుహారా, సెమీస్‌లో అకానె యామగూచిలను సాధికారికంగా ఓడించడం ఆనందం కలిగించింది. వీరిద్దరు గత కొంత కాలంగా సర్క్యూట్లో నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పేరుకు రెండు గేమ్‌ల మ్యాచ్‌లే అయినా వరుస ర్యాలీలతో ఈ మ్యాచ్‌లు కూడా చాలా కఠినంగా, సుదీర్ఘంగా సాగాయి. చివరకు నేనే విజేతగా నిలవగలిగాను. ఫైనల్లో మారిన్‌తో ఓటమి గురించే అంతా మాట్లాడుతున్నారు గానీ ఈ రెండింటిలో నేను అద్భుత ప్రదర్శన కనబర్చగలిగాను. వేరేగా ప్రాక్టీస్ చేయడంపై... నాకు తప్పేమీ అనిపించలేదు. ఇది కూడా ఒకరకంగా నా వ్యూహాల్లో భాగమే. అంతర్జాతీయ టోర్నీల్లో సైనా నెహ్వాల్‌తో ఎన్ని సార్లు తలపడే అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు కానీ నేను కోచింగ్‌లో కాస్త భిన్నంగా ప్రయత్నిద్దామని భావించా. ఇదే విషయాన్ని గోపీ సర్‌తో చెబితే ఆయన అంగీకరించారు. కోచింగ్‌కు సంబంధించి అన్ని విధాలా సహకారం అందించారు. ఇతర ఇండోనేసియా కోచ్‌లు, ఫిజియోలు... ఇలా అందరూ నాకు సహకరిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ప్రాక్టీస్ చేసినా ఇబ్బంది లేదు. ఇక రాబోయే ఆసియా క్రీడలకు సిద్ధమయ్యేందుకు ఎక్కువ సమయం లేదు. అక్కడ కూడా చాలా పోటీ ఉంటుంది. మారిన్ తప్ప దాదాపు మిగిలిన టాప్ షట్లర్లంతా ఉంటారు. 2014లో మన టీమ్ కాంస్యం సాధించింది. ఈసారి వ్యక్తిగతంగా, జట్టుగా కూడా మెరుగైన ఫలితం సాధించాలని పట్టుదలగా ఉన్నాం. హండోయో నిష్క్రమణ ప్రభావం... ముల్యో హండోయో చాలా అద్భుతమైన కోచ్. ఆయన ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. అందుకు ఆయనకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆయన ఎంతో నేర్పించి వెళ్లారు. ముల్యో నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కారణాలేమైనా ఆయన వెళ్లిపోయారు. అయితే ముల్యో హండోయో లేకపోయినా... ఇప్పటికీ ఆయన నేర్పిన ఎన్నో అంశాలు చాలా సందర్భాల్లో మేం పాటిస్తూనే ఉంటాం. మిగతా విజయాలేవీ కనపడవా? ఎంతసేపు సింధు ఫైనల్ పరాజయాలపైనే స్పందిస్తారా. ఇక్కడ ఆమె సాధించిన సానుకూలాంశాలను చూడండి. ఓ క్రీడాకారిణి రెండు సార్లు ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఆషామాషీ కాదు. పరిస్థితులు, ఆ రోజు ఆమెకు కలిసిరాలేదంతే! ఫైనల్ పరాజయాలు చూసిన వారికి అంతకుముందు రౌండ్లలో ఆమె ప్రపంచ మేటి క్రీడాకారిణిలపై సాధించిన ఘన విజయాలు కనపడవా? క్వార్టర్స్‌లో ఒకుహారాను, సెమీస్‌లో యామగుచిని కంగుతినిపించింది. తుది పోరులో మారిన్... సింధు కంటే బాగా ఆడింది. పైగా ఆమె అసాధారణ ఫామ్‌లో ఉంది. ఇకపై మేం ప్రాక్టీస్‌లో మరింత కష్టపడతాం. కోచ్‌గా నాకు ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ సంతృప్తినే మిగిల్చింది. సైనా కూడా బాగా ఆడింది. ప్రత్యేకించి డబుల్స్‌లో మన షట్లర్లు ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చారు. – చీఫ్ కోచ్ గోపీచంద్ -
నాకు ఫైనల్ ఫోబియా లేదు: పీవీ సింధు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం సంతోషంగా ఉందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపారు. గత ఆదివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ స్టార్ కరోలిన్ మారిన్ చేతిలో సింధు ఓడిన విషయం తెలిసిందే. భారత్‌కు చేరుకున్న సింధు మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడారు. ప్రపంచ చాంపియన్‌షిప్ పెద్ద టోర్నీ అని అక్కడ అందరూ గట్టి ప్రత్యర్థులే ఉంటారని ఆమె తెలిపారు. ‘అందరూ నాకు ఫైనల్ ఫోబియా ఉందంటున్నారు. నాకు ఆ ఫోబియా లేదు. ఫైనల్ వరకు రావాలంటే ఎంతో కష్టపడాలి. ఫైనల్లో కూడా గెలవాలనే నా సాయశక్తుల ప్రయత్నించా. స్పెయిన్ స్టార్ మారిన్ చాలా తెలివిగా ఆడింది. తొలి రౌండ్ నుంచి కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కొన్నాను. ఫైనల్లో ఎవరో ఒకరు మాత్రమే విజయం సాధిస్తారు. చాలా బాగా ఆడి విజయం సాధించిన మారిన్‌కు అభినందనలు. నేను ఫస్ట్ గేమ్ గెలిచి ఉంటే ఆట వేరేలా ఉండేది. ఓడిపోవడం వల్ల నాపై మరింత ఒత్తిడి పెరిగింది. చాంపియన్‌షిప్‌లో నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా. ఈ ఏడాది రజతం సాధించాను.. కచ్చితంగా భవిష్యత్‌లో స్వర్ణం కైవసం చేసుకుంటాననే నమ్మకం ఉంది. ఫైనల్ వరకు వచ్చి ఓడిపోతున్నావని చాలా మంది అంటున్నారు. కానీ ఫైనల్ వరకు రావడమనేది చాలా కష్టం అని అందరూ అర్థం చేసుకోవాలి. చాలా మంది ఫైనల్‌కు రాకుండానే ఇంటిముఖం పడుతున్నారు. తుదిపోరులో ఎవరైనా బాగా ఆడాలనే అనుకుంటారు. కొన్ని సార్లు ఆడొచ్చు లేక ఆడకపోవచ్చు. ఓడిపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని రానున్న టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా. మారిన్ అందరూ ప్లేయర్స్‌తోనూ చాలా దూకుడుగా ఆడుతుంది. ఒలింపిక్స్ తరువాత తనతో చాలా మ్యాచ్‌ల్లో తలపడ్డాను. ఎప్పుడూ ఎటాకింగ్‌తో ఆడుతోంది. కోర్టుల్లో మేమిద్దరం ప్రత్యర్థులం అయినప్పటికీ కోర్టు బయట మంచి స్నేహితులమని’ సింధు పేర్కొన్నారు. చదవండి: సింధును చేరని స్వర్ణం -
సింధును వెంటాడుతున్న ఫైనల్ ఫోబియా
-
శ్రీకాంత్ చెమటోడ్చగా... సింధు అలవోకగా
నాన్జింగ్ (చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... ప్రణయ్, సమీర్ వర్మ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన పీవీ సింధు అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్‌కు రెండో రౌండ్లో పాబ్లో అబియాన్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ ఎదురైంది. 62 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–15, 12–21, 21–14తో గెలుపొందాడు. స్పెయిన్‌కే చెందిన ఎన్రిక్తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సాయిప్రణీత్ 33 నిమిషాల్లో 21–18, 21–11తో గెలుపొందాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ ప్రణయ్ 21–8, 16–21, 15–21తో 39వ ర్యాంకర్ యగోర్ కోఎల్హో (బ్రెజిల్) చేతిలో అనూహ్యంగా ఓడిపోగా... సమీర్ వర్మ 17–21, 14–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు 21–14, 21–9తో 41వ ర్యాంకర్ ఫిత్రియాని (ఇండోనేసియా)పై గెలిచింది. ఏ దశలోనూ ఫిత్రియానిని తక్కువ అంచనా వేయకుండా ఆడిన సింధు 35 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 18–21, 21–15, 16–21తో ఆస్ట్రప్–స్కారప్ (డెన్మార్క్) చేతిలో... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 24–22, 13–21, 16–21తో టకుటో–కనెకో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సిక్కి–అశ్విని 14–21, 15–21తో ఫుకు షిమా–హిరోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. భారత ఆటగాళ్ల నేటి షెడ్యూల్ మహిళల సింగిల్స్ సైనా (vs) రచనోక్ (థాయ్‌లాండ్) సింధు (vs) సుంగ్ జీ హున్ (కొరియా) పురుషుల సింగిల్స్ సాయిప్రణీత్(vs) విటింగస్ (డెన్మార్క్) శ్రీకాంత్ (vs) డారెన్ లియు (మలేసియా) మిక్స్డ్ డబుల్స్ సాత్విక్ – అశ్విని (vs) గో సూన్ హువాట్ – జేమీ షెవోన్ (మలేసియా) ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
వచ్చేసారి స్వర్ణం సాధిస్తా!
-
వచ్చేసారి స్వర్ణం సాధిస్తా!
♦ ప్రపంచ చాంపియన్ అవుతాననే నమ్మకముంది ♦ బ్యాడ్మింటన్‌కు ఆదరణ బాగా పెరిగింది ♦ మీడియాతో పీవీ సింధు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో పరాజయం పాలైనా... తర్వాతి ప్రయత్నంలో తాను స్వర్ణం సాధిస్తానని భారత స్టార్ క్రీడాకారిణి పూసర్ల వెంకట (పీవీ) సింధు విశ్వాసం వ్యక్తం చేసింది. గ్లాస్గోలో ముగిసిన ఈ మెగా ఈవెంట్లో సింధు రజతం సాధించిన సంగతి తెలిసిందే. గతంలో కాంస్యానికే పరిమితమైన తాను ముందుగా అనుకున్నట్లుగా మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడం సంతృప్తి కలిగించిందని ఆమె చెప్పింది. స్కాట్లాండ్ నుంచి మంగళవారం నగరానికి తిరిగి వచ్చిన అనంతరం సింధు మీడియాతో మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే... రజత పతకం సాధించడంపై... రియో ఒలింపిక్స్ తర్వాత ఏడాది వ్యవధిలోనే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. టోర్నీకి వెళ్లే ముందు నాపై నేను పెట్టుకున్న నమ్మకం నిజమైంది. ఫైనల్ మ్యాచ్ నా కెరీర్లోనే అత్యుత్తమమైంది. ఓవరాల్‌గా నా కెరీర్ చాలా అద్భుతంగా సాగుతోంది. వచ్చేసారి బంగారు పతకం సాధించగలనని గట్టిగా చెప్పగలను. టోర్నీలో నా సహజ శైలిలోనే ఆడే ప్రయత్నం చేశాను తప్ప చైనా ప్రత్యర్థులతో పోల్చుకుంటూ వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. అయితే వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం సన్నద్ధమయ్యేందుకు మాకు తగిన సమయం లభించింది. దాదాపు రెండు నెలల పాటు తీవ్రంగా సాధన చేశాం. అదే ఇప్పుడు ఫలితాన్ని చూపించింది. ఫైనల్ మ్యాచ్‌పై... చివరి గేమ్‌లో 20–20తో ఉన్నప్పటికీ మ్యాచ్ కోల్పోవడం మాత్రం నన్ను చాలా కాలం వెంటాడవచ్చు. ఇది మాత్రం చాలా నిరాశ కలిగించింది. అయితే ఇద్దరం హోరాహోరీగా తలపడ్డాం. శారీరకంగా, మానసికంగా అలసిపోయాం. అయితే శక్తిని దాచుకొని చివర్లో చెలరేగిపోదామనే పరిస్థితి అక్కడ లేదు. అది ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ కాబట్టి ఎవరూ వెనక్కి తగ్గలేదు. చివరకు అది నా రోజు కాకుండా పోయింది. ఇంత గొప్ప మ్యాచ్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది. స్టేడియంలో పెద్ద సంఖ్యలో భారత అభిమానులు మమ్మల్ని ప్రోత్సహించడం మరచిపోలేను. సుదీర్ఘ ర్యాలీలపై... 73 షాట్ల ర్యాలీ నా జీవితంలో ఎప్పుడూ ఆడలేదు. ఇటీవల బ్యాడ్మింటన్‌లో ర్యాలీల ప్రాధాన్యత పెరిగింది. సుదీర్ఘ ర్యాలీలు తరచుగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వాటి ద్వారా పాయింట్లు సాధించేందుకు ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఆ రకంగా చూస్తే మేం ఆడిన మ్యాచ్ ఈ ఆటలో ఫిట్నెస్ ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేసింది. ఎవరూ సునాయాసంగా పాయింట్లు ఇవ్వడం లేదు. దాని కోసం ప్రతి ఆటగాడు అదనంగా శ్రమించాల్సి వస్తోంది. ఆటకు లభిస్తున్న ప్రాధాన్యతపై... సచిన్‌తో నన్ను పోలుస్తూ కొంత మంది వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. క్రికెట్ వేరు, సచిన్ స్థాయి వేరు. అయితే బ్యాడ్మింటన్ విలువ చాలా పెరిగిందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ముఖ్యంగా గత ఏడాది నేను రియోలో ఒలింపిక్స్ పతకం సాధించిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఈ ఆటలో మరింత మెరుగైన ఫలితాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. భారత్‌లో కూడా పెరిగిన క్రేజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అసలు ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నేను, సైనా నెహ్వాల్ తలపడతామని కూడా చాలా మంది అనుకున్నారు. ఈ సారి జరగకపోయినా అది ఎప్పుడైనా సాధ్యమే. ఫైనల్ తర్వాత వేడుకలపై... ఓటమి తర్వాత బాగా నిరాశ చెందాను. బహుమతి ప్రదానోత్సవానికి అందరితో కలిసి వెళ్లే సమయానికి కాస్త కోలుకోగలిగాను. తర్వాతి రోజు మాత్రం అంతా సాధారణంగా మారిపోయింది. ఆటలో ఏదీ అసాధ్యం కాదని అప్పుడు నాకు నేను గట్టిగా చెప్పుకున్నాను. అయితే ఫైనల్లో తీవ్రంగా అలసిపోవడంతో పాటు సమయాభావం కారణంగా ప్రత్యేకంగా సంబరాలు చేసుకునే అవకాశం కలగలేదు. ఇప్పుడు ఆ లోటును పూర్తి చేసుకుంటానేమో! -
'వరల్డ్ నంబర్ వన్ ర్యాంకే లక్ష్యం'
హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో రజత పతకం గెలవడం పట్ల తెలుగమ్మాయి పీవీ సింధు సంతోషం వ్యక్తం చేశారు.తన ప్రదర్శన ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని పేర్కొన్న సింధు.. ఇదంతా కోచ్, తల్లి దండ్రుల సహకారంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో జరిగిన ఫైనల్ పోరు చాలా కఠినంగా సాగిందని సింధు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ముగిసిన తరువాత కోచ్ గోపీ చంద్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్న సింధు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. 'రజతం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనత సాధించడం వెనుక కోచ్, తల్లి దండ్రుల కృషి ఎంతో ఉంది. ఫైనల్ మ్యాచ్ చాలా కఠినంగా సాగింది. హోరాహోరీగా జరిగిన పోరులో తృటిలో స్వర్ణాన్ని కోల్పోయా. అయినా నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. ప్రేక్షకుల నుంచి లభించిన మద్దతు మరువలేనిది. వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడమే లక్ష్యం' అని సింధు తెలిపారు.ప్రస్తుతం వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో సింధు నాల్గో ర్యాంకులో కొనసాగుతున్నారు. -
'వరల్డ్ నంబర్ వన్ ర్యాంకే లక్ష్యం'
-
సైనా, సింధుకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో వారిరువురు కాంస్య, రజిత పతకాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సైనా, సింధు మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్ చేశారు. Well played #Sindhu. Congratulations @NSaina & @Pvsindhu1 for bringing home bronze & silver. — YS Jagan Mohan Reddy (@ysjagan) 28 August 2017 -
‘సింధు’ వదనం చిన్నబోవద్దు
అద్భుతం ఆ పోరాటం...అసాధారణం ఆ ప్రదర్శన... అయితే ఆటలో క్రూరత్వం కూడా దాగి ఉంటుంది... అది మీ శ్రమను, చిందించిన చెమటను లెక్కలోకి తీసుకోదు. ప్రపంచాన్ని జయించాలంటే పడ్డ కష్టం పాయింట్ల రూపంలోనే కనిపించాలి. తుది ఫలితంలో చాంపియన్ ఒక్కరే కనిపిస్తారు. అలా చూస్తే సింధుకు ఇది పరాజయం కావచ్చు! కానీ 110 నిమిషాల పాటు కోట్లాది మంది అభిమానులను మునివేళ్లపై నిలబెట్టించగలిగిన ఆట అది. కోర్టులో ఆమె కదలికలకు ఫిదా అయిపోయిన క్షణాలు అవి. స్మాష్, డ్రాప్, ర్యాలీ... ఏదైతేనేం ఆమె చూపించిన ఆటకు జయహో అనకుండా ఉండగలమా? ‘రియో’ ఒలింపిక్ వేదికపై రజతంతో మురిపించిన మన సింధూరం ఈసారి మరో ప్రపంచ వేదికపై బంగారాన్ని అందుకునేందుకు చూపించిన పట్టుదలకు సలామ్ చేయకుండా ఆగిపోగలమా? ఆమె ఓటమి మనల్ని బాధించడం లేదు. ఎందుకంటే ఆమె ఒక్కో పాయింట్ సాధించిన తీరు గెలుపుతో సమానమైన సంతృప్తిని ఇచ్చింది. సింధు ఓడిపోయిందనే మాటను చెప్పేందుకు కూడా మనకు మనస్కరించడం లేదు. ఈ మ్యాచ్‌లో స్వర్ణాన్ని కోల్పోయినా... షటిల్ ప్రపంచంలో ఆమె ఎప్పటికీ మన బంగారు బాలికనే. సరిగ్గా ఏడాది క్రితం రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకాన్ని గెలుచుకొని భారతీయులందరి మనసు దోచుకుంది. ఆ వెంటనే సన్మానాలు, సత్కారాలు, కోట్ల రూపాయల కనకాభిషేకం, బ్రాండింగ్ బంధాలు... ఒక్కటేమిటి, సంవత్సరం వ్యవధిలో ఇలాంటివన్నీ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. సాధారణంగా అయితే ఒక 22 ఏళ్ల ప్లేయర్ ఇలాంటి వాటి మాయలో ఆదమరిచి ఆటను కూడా వెనక్కి పంపే ప్రమాదం చాలా ఉంటుంది. ఉవ్వెత్తున ఎగసి ఉస్సురని కూలిన క్రీడాకారులు ఎందరికో చరిత్ర సాక్షిగా నిలిచింది. ఒక ఒలింపిక్ పతకంతో జీవిత కాలపు ఆనందాన్ని అనుభవించి అంతటితో సంతృప్తి చెందే అల్ప సంతోషులు కూడా ఎందరో ఉంటారు. కానీ సింధులో గొప్పతనమంతా ఇక్కడే కనిపించింది.ఆమెపై ఎన్ని ప్రశంసలు ముంచేసినా... తను ఆటను మాత్రం అంతే అపురూపంగా చూసుకుంది. అందుకే ఎక్కడా తను ఆగిపోలేదు. ఒలింపిక్స్‌లో విజయం తర్వాత కూడా మూడు ప్రతిష్టాత్మక టోర్నీలలో విజేతగా నిలిచి తన ప్రాధాన్యాలేమిటో ఆమె చూపించింది. ముందుగా చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ గెలిచిన సింధు... ఈ ఏడాది ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో, సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లలో విజేతగా నిలిచింది. ‘రియో’ నుంచి మొదలైన జోరును గ్లాస్గోలో ప్రపంచ విజేతగా ముగించాలని ఆమె కలగంది. దురదృష్టవశాత్తూ అది స్వర్ణ తీరం చేరలేకపోయినా... ఆమె స్థాయిని మరింత పెంచింది. ప్రిక్వార్టర్స్‌లో మినహా... ఒలింపిక్ పతకం సాధించిన తర్వాత కూడా కోచ్ పుల్లెల గోపీచంద్ సంతృప్తి చెందలేదు. మనమేంటో ప్రపంచం గుర్తించాలంటే ప్రపంచ చాంపియన్ కూడా కావాలి అంటూ ఆయన తన ఉద్దేశాలు ఏంటో స్పష్టంగా చెప్పారు. అదే లక్ష్యంగా సింధును సిద్ధం చేశారు కూడా. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో అలవోకగా నెగ్గిన సింధు, రెండో మ్యాచ్‌లో తడబడింది. తొలి గేమ్‌ను కోల్పోయి, చివరకు చచ్చీ చెడి మ్యాచ్ గెలుచుకుంది. బహుశా ఇదే ఆమెలో పట్టుదల పెంచింది. తన అసలు సత్తా ఏమిటో ఆమెకు మరోసారి గుర్తు చేసింది. ఫలితం... తర్వాతి రెండు మ్యాచ్‌లలో సింధు ప్రత్యర్థులకు ఏడుపొక్కటే తక్కువ! క్వార్టర్ ఫైనల్లో 21–14, 21–9 సున్ యు (చైనా)పై... సెమీస్‌లో 21–13, 21–10తో చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. సరిగ్గా చెప్పాలంటే తన ఆటతో ఆమె వారందరినీ తొక్కేసింది! ఇదే ఊపులో ఫైనల్‌కు కూడా సన్నద్ధమైంది. ఇప్పటి వరకు ఆమె ప్రదర్శన చూస్తే తుది పోరులో కూడా అందరూ అదే అద్భుతాన్ని ఆశించారు. అయితే ప్రాణం ఒడ్డి పోరాడిన తర్వాత చివరకు రెండో స్థానం తప్పలేదు. ఆగిపోవద్దు... 2013లో తొలిసారి సింధు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్నప్పుడు అభిమానులకు ఆనందాశ్చర్యాలు కలిగాయి. సైనా నెహ్వాల్ హవా సాగుతున్న ఆ సమయంలో సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచిన 18 ఏళ్ల అమ్మాయి గురించి కొత్తగా చర్చ మొదలైంది. తర్వాతి ఏడాది మరోసారి అదే పతకం గెలుచున్నప్పుడు సింధును సత్తా ఉన్న షట్లర్‌గా ప్రపంచం గుర్తించింది. రాకెట్ వేగంతో దూసుకొచ్చిన ఈ తెలుగమ్మాయి రెండేళ్లలోనే ఒలింపిక్స్‌లో వెండి పతకం గెలుచుకొని తన విలువను ప్రదర్శించింది. ఈ మధ్యలో సూపర్ సిరీస్‌లు, గ్రాండ్‌ప్రి గోల్డ్‌లలో సంచలన విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫైనల్లో సింధు ఓటమిలో అలసట కూడా ఒక కారణంలా కనిపించింది. అద్భుతమైన ఫిట్నెస్ ఉన్నా మ్యాచ్ ఆఖరి క్షణాల్లో ఆమె కాస్త బలహీనంగా మారిపోయింది. ఇవాళ విజయం దక్కకపోవచ్చు... కానీ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రతీ ఏటా ఆమె ముందుకు వచ్చే అవకాశం. ఈ తరహా ఆట ఆమెకు చాంపియన్ అయ్యే అన్ని అర్హతలూ ఉన్నాయని చూపించింది. కాబట్టి సింధుకు స్వర్ణం సుదూర స్వప్నం మాత్రం కాబోదు! – సాక్షి క్రీడా విభాగం -
110 నిమిషాల విషాదం
► చిరస్మరణీయ ఫైనల్లో పోరాడి ఓడిన సింధు ► ఓడినా హృదయాలు గెల్చుకున్న తెలుగు తేజం ► రజత పతకంతో సంతృప్తి ► మహిళల సింగిల్స్ విజేత ఒకుహారా ►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి... ప్రత్యర్థులు కసితీరా కొదమ సింహాల్లా తలపడాలి. ఒక్కో పాయింట్ సాధించాలంటే శక్తియుక్తులు మొత్తం పణంగా పెట్టాలి... ప్రాణాలొడ్డినట్లు పోరాడాలి... కోర్టు అంటే కదనరంగంగా మారిపోవాలి... ఒంట్లో సత్తువ మొత్తం క్షీణిస్తున్నా...సమరంలో ఆఖరి క్షణం వరకు పట్టుదల ప్రదర్శించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పీవీ సింధు, నొజోమి ఒకుహరా మధ్య జరిగిన మ్యాచ్‌లా ఉండాలి. గంటా 50 నిమిషాలు... మొత్తం 124 పాయింట్లు... 73 షాట్ల ర్యాలీ... కాళ్లు నొప్పి పెడుతున్నాయి, కండరాలు పట్టేస్తున్నాయి... అలసట ఆటపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది... స్మాష్ కొట్టడంకంటే తాము స్మాష్ కాకుండా ఉండిపోవడమే ముఖ్యంగా మారిపోతోంది. ఎనర్జీ డ్రింక్‌లు పని చేయడం లేదు. మధ్యలో స్కూల్ హెడ్మాస్టర్లా రిఫరీ మందలింపులు... ఇక చాలు నా వల్ల కాదంటూ అనిపిస్తున్న క్షణాన్నే ఎదురుగా ప్రపంచ చాంపియన్ హోదా ఆగిపోవద్దంటూ హెచ్చరిక. ఎప్పటికీ మరచిపోలేని, బ్యాడ్మింటన్ చరిత్రలో అరుదైన మ్యాచ్ చివరకు జపాన్ అమ్మాయి వశమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత బిడ్డ, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధుకు పరాజయం ఎదురైంది. పాయింట్లు చూస్తే పోరు హోరాహోరీగా సాగినట్లు అనిపిస్తున్నా... ఈ మ్యాచ్ గొప్పతనం గురించి స్కోరు బోర్డు చెప్పలేదనేది మాత్రం సత్యం. ఏ మ్యాచ్‌లోనైనా చివరకు విజేత ఒకరే. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం గెలుపు ఇద్దరిదీ. నిజంగా అవకాశం ఉంటే స్వర్ణం, వెండి మిశమ్రమైన ‘పచ్చ బంగారపు’ పతకాన్ని వీరిద్దరికి పంచేయడమే న్యాయంగా ఉండేదేమో! గ్లాస్గో (స్కాట్లాండ్): భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు కల చెదిరింది. ప్రపంచ చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా శ్రమించిన ఆమెను తుది మెట్టుపై దురదృష్టం వెంటాడింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ సింధు 19–21, 22–20, 20–22 తేడాతో జపాన్‌కు చెందిన ఏడో సీడ్ నొజోమి ఒకుహారా చేతిలో పరాజయంపాలైంది. ఫలితంగా ఈ మెగా ఈవెంట్లో ఆమె రజత పతకానికే పరిమితమైంది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ అసాధారణంగా సాగిన ఈ పోరులో ఆఖరి క్షణాల్లో జపాన్ అమ్మాయి ఒత్తిడిని అధిగమించడంలో సఫలమైంది. మూడు గేమ్‌లలోనూ అర్ధ భాగం ముగిసే సరికి ఆధిక్యంలో నిలిచిన సింధు... చివరి వరకు దానిని నిలబెట్టుకోలేకపోయింది. తొలి గేమ్‌ను కోల్పోయినా... ఈ మ్యాచ్‌కు ముందు ఇద్దరి మధ్య 3–3తో రికార్డు సమంగా ఉంది. అయితే టాప్ ఫామ్‌లో ఉన్న సింధుకు మెరుగైన అవకాశాలు కనిపించాయి. పైగా ప్రత్యర్థితో పోలిస్తే గత మ్యాచ్‌లు సునాయాసంగా గెలవడం వల్ల పెద్దగా అలసిపోకపోవడం కూడా ఆమెకు అనుకూలాంశంగా కనిపించింది. తొలి గేమ్‌ను తడబడుతూ ప్రారంభించిన సింధు ఆరంభంలో 3–5తో వెనుకబడింది. అయితే కోలుకొని చక్కటి రిటర్న్ షాట్లతో 11–5తో దూసుకుపోయింది. ఈ ఆధిక్యం 13–8కి పెరిగింది. అయితే ఒకుహారా పోరాడి స్కోరును 14–14తో సమం చేసింది. ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన ఆమె 18–14తో ముందంజ వేసింది. అయితే జపాన్ అమ్మాయి తప్పులతో స్కోరు 19–19 వద్ద సమమైంది. ఈ దశలో తడబడి షటిల్‌ను నెట్లోకి కొట్టిన సింధు, తొలి గేమ్‌ను ప్రత్యర్థికి సమర్పించుకుంది. అయితే రెండో గేమ్‌లో మాత్రం సింధు అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. ఒక్కసారిగా ఆమె 5–1తో ఆధిక్యంలో నిలిచి, ఆ తర్వాత 9–3కు చేరింది. మరోసారి సింధు 11–8 గేమ్‌లో ముందుకు వెళ్లింది. ఈ సమయంలో వరుస ర్యాలీలతో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే సింధు నియంత్రణ కోల్పోకుండా ఆడి ఆధిక్యం కోల్పోకుండా జాగ్రత్త పడింది. 18–16తో దానిని ఆమె కొనసాగించింది. స్కోరు 21–20 వద్ద ఉన్నప్పుడు గెలుపు పాయింట్ కోసం సాగిన ర్యాలీ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఏకంగా 73 షాట్ల ర్యాలీ తర్వాత సింధు పైచేయి చూపించి గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక గేమ్‌లో... అయితే అప్పటికే తీవ్రంగా పోరాడిన వీరిద్దరు బాగా అలసిపోయారు. మూడో గేమ్‌లో స్మాష్‌లలో వేగం తగ్గింది. ఇద్దరూ డ్రాప్ షాట్లు, ప్లేసింగ్ ద్వారానే పాయింట్లు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో పాయింట్ సాధించారు. విరామం సమయంలో 11–9తో సింధు ముందంజ వేయడం మినహా...మిగతా గేమ్ మొత్తం దాదాపు సమంగా సాగింది. 17–17 వద్ద సింధు రెండు పాయింట్లు సాధించి 19–17తో నిలిచింది. అయితే ఒకుహారా వరుసగా మూడు పాయింట్లు రాబట్టి 20–19తో ముందంజ వేసింది. మరో రెండు సార్లు సింధు మ్యాచ్ పాయింట్లు కాపాడుకోవడంలో సఫలమైనా...చివరకు జపాన్ అమ్మాయి స్మాష్‌ను అందుకోలేక భారత క్రీడాకారిణి కూలిపోయింది. 3 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు గెలిచిన పతకాల సంఖ్య. 2013, 2014లలో సింధు సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. భారత్ తరఫున అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన క్రీడాకారిణి కూడా సింధునే కావడం విశేషం. 1 ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏకకాలంలో భారత్‌కు రజతం, కాంస్యం లభించడం ఇదే తొలిసారి. 7 నాలుగు దశాబ్దాల ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ ఖాతాలో చేరిన పతకాలు. 1983లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గగా... 2011లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట కాంస్యం దక్కించుకుంది. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా రజతం, ఈ ఏడాది కాంస్యం సాధించింది. ఫలితంతో నేను తీవ్ర నిరాశ చెందాను. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 20–20 వద్ద ఇద్దరికీ విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. ఫైనల్ బరిలో ఉన్న వారెవరైనా స్వర్ణం కోసమే పోరాడతారు. నేను విజయానికి చేరువైనట్టే చేరువై దూరమైపోయాను. చివరి క్షణాల్లోనే అంతా తారుమారు అయింది. ఒకుహారా అసాధారణ క్రీడాకారిణి. గతంలో ఆమెతో ఆడినపుడల్లా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ఆమెను నేను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేదు. సుదీర్ఘ మ్యాచ్‌కు సిద్ధమయ్యే వచ్చాను. ఈ రోజు నాది కాదంతే. దేశం కోసం రజతం గెలిచినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ పతకం నాలో మరింత విశ్వాసాన్ని పెంచింది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తాను. –పీవీ సింధు -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్ ఓటమి
గ్లాస్కో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత్ అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలైయ్యాడు. స్కాట్లాండ్ లో శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 14-21, 18-21 తో వరల్డ్ నంబర్ వన్ షట్లర్ సన్ వాన్ చేతిలో ఓడిపోయాడు. 49 నిమిషాల పాటు జరిగిన పోరులో సన్ వాన్ అనుభవం ముందు శ్రీకాంత్ తేలిపోయాడు. తొలి గేమ్ ను పెద్దగా ప్రతిఘటించకుండానే కోల్పోయిన శ్రీకాంత్.. రెండో గేమ్ లో మాత్రం కడవరకూ పోరాడి ఓటమి చెందాడు. దాంతో టోర్నీ నుంచి శ్రీకాంత్ భారంగా నిష్ర్కమించాడు. ఈ ఓటమితో వరల్డ్ చాంపియన్ షిప్ లో పతకం సాధించాలనుకున్న శ్రీకాంత్ ఆశలు తీరలేదు. మరొకవైపు మహిళల సింగిల్స్ లో పివీ సింధు, సైనా నెహ్వాల్ లు క్వార్టర్ ఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. -
సింధు శ్రమించి...
►క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ ►శ్రీకాంత్, సైనా ముందుకు.. సాయి ప్రణీత్ అవుట్ ►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింధు ప్రిక్వార్టర్స్ ప్రత్యర్థి ఎన్గాన్ యి చెయుంగ్. ఈ హాంకాంగ్ అమ్మాయిపై గతంలో మూడు సార్లు అలవోక విజయం సాధించిన రికార్డు సింధుది. ఆమె ఫామ్ దృష్ట్యా ఈసారి కూడా అదే ఫలితమని భావించినా... మ్యాచ్ మాత్రం మరోలా సాగింది. ఎన్గాన్ పట్టుదలగా ఆడటంతో మ్యాచ్ తుదికంటా హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు ఒక దశలో రెండో గేమ్‌లోనూ వెనుకబడింది. చివరకు తన అనుభవాన్నంతా రంగరించి మ్యాచ్‌లో నిలిచిన తెలుగమ్మాయి, మూడో గేమ్ విజయంతో గట్టెక్కింది. గ్లాస్గో: అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో పీవీ సింధు ఆపసోపాలు పడింది. సులువైన ప్రత్యర్థితో తలపడుతూ కూడా ఓటమి దిశగా వెళ్లినట్లు కనిపించింది. అయితే చివరకు తన అసలు సత్తాను ప్రదర్శించి కీలక సమరంలో విజయాన్ని అందుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ ఫైనల్లో సింధు 19–21, 23–21, 21–17తో ఎన్గాన్ యి చెయుంగ్ (హాంకాంగ్)పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. మరో వైపు సైనా నెహ్వాల్ అలవోక విజయంతో క్వార్టర్స్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 13వ సీడ్ అజయ్ జయరామ్, 15వ సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. అజయ్ 11–21, 10–21తో ఐదో సీడ్ చెన్ లాంగ్ చేతిలో పరాజయం చవిచూడగా, సాయిప్రణీత్ 21–19, 10–21, 12–21తో ఆరో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో కంగుతిన్నాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు ప్రతీ పాయింట్ కోసం శ్రమించాల్సివచ్చింది. 13వ సీడ్ ఎన్గాన్ ఆరంభం నుంచి పట్టుబిగించడంతో పోటాపోటీగా సాగిన తొలి గేమ్‌ను హాంకాంగ్ ప్లేయర్ వశం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ తన దూకుడు పెంచడంతో సింధు 13–16తో వెనుకంజలో నిలిచింది. ఈ దశలో సర్వశక్తులు ఒడ్డి నాలుగు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వచ్చింది. ఐతే చెయుంగ్ కూడా దీటుగా పాయింట్లు సాధిస్తుండటంతో ఉత్కంఠ పెరిగింది చివరకు 21–21 వద్ద వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు గేమ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ స్వరూపాన్ని అర్థం చేసుకున్న హైదరాబాదీ స్టార్ నిర్ణాయక మూడో గేమ్‌లో మొదటి నుంచి జాగ్రత్తగా ఆడింది. నెట్ వద్ద చురుగ్గా స్పందించిన ఆమె స్మాష్‌లతో రాణించింది. 5–1తో టచ్‌లోకి వచ్చిన ఆమె 12–8 స్కోరు వరకు ఆధిక్యంలోనే ఉంది. ఈ దశలో ఎన్గాన్ వరుసగా 4 పాయింట్లు చేసి 12–12తో స్కోరును సమం చేసింది. దీనికి దీటుగా బదులిచ్చిన సింధు వరుసగా మూడు పాయింట్లు చేసి జోరు పెంచింది. 21–17తో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలిచింది. మరో ప్రి క్వార్టర్స్‌లో 12వ సీడ్ సైనా 21–19, 21–15తో రెండో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–14, 21–18తో 14వ సీడ్ ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. వరుస గేముల్లో 42 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. తొలి గేమ్ ఆరంభంలో కాసేపు మాత్రమే పోటీనిచ్చిన డెన్మార్క్ ఆటగాడు ఆ తర్వాత తేలిగ్గానే చేతులెత్తేశాడు. 5–6తో ఉన్న శ్రీకాంత్ వరుసగా 6 పాయింట్లు సాధించి 11–6తో ఆధిక్యంలోకి వచ్చాడు ఆ తర్వాత వెనుదిరిగి చూసే అవకాశం రాని హైదరాబాద్ ఆటగాడు నిమిషాల వ్యవధిలో గేమ్‌ను ముగించాడు. తర్వాత రెండో గేమ్‌లో రెట్టించిన ఉత్సాహాన్ని కనబరిచిన అతను 11–3తో ఆధిపత్యాన్ని చాటాడు. అయితే ఆంటోన్సెన్ వరుసగా ఆరు పాయింట్లు సాధించి నిలువరించే ప్రయత్నం చేసినా... శ్రీకాంత్ నెట్‌వద్ద తెలివిగా ఆడి పైచేయి కొనసాగించాడు. చివరి దాకా ఆధిక్యంలోనే నిలిచిన ఈ ప్రపంచ పదో ర్యాంకర్ 21–18తో గేమ్‌ను మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్‌లో 15వ సీడ్ సిక్కిరెడ్డి– ప్రణవ్ చోప్రా ద్వయం 22–20, 18–21, 18–21తో ఆరో సీడ్ డెబ్బి సుశాంటో–ప్రవీణ్ జోర్డాన్ జంట చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్... టాప్‌సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో, మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు... ఐదో సీడ్ సన్ యూ (చైనా)తో, గిల్మోర్ (స్కాట్లాండ్), బింగ్ జియావో (చైనా) మ్యాచ్ విజేతతో సైనా తలపడుతుంది. -
సింధు, సాయిప్రణీత్ శభారంభం
∙ ప్రిక్వార్టర్స్‌లోకి సిక్కి రెడ్డి–ప్రణవ్ జంట ∙ జయరామ్ కూడా ముందంజ ∙ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పూసర్ల వెంకట (పీవీ) సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బోణీ చేశారు. అంచనాలకు అనుగుణంగా రాణించి తమ ప్రత్యర్థులపై విజయాలు నమోదు చేశారు. భారత్‌కే చెందిన అజయ్ జయరామ్ కూడా తొలి అడ్డంకిని దాటి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. గ్లాస్గో (స్కాట్లాండ్): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సాయిప్రణీత్, అజయ్ జయరామ్ సింగిల్స్ విభాగంలో శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లో ‘బై’ పొందిన సింధు మంగళవారం జరిగిన రెండో రౌండ్లో 21–16, 21–14తో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ గెలుపుతో గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కిమ్ హ్యో మిన్ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. గతంలో కిమ్‌పై మూడుసార్లు గెలిచిన సింధుకు ఈసారి అంతగా పోటీ ఎదురుకాలేదు. 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధు వరుసగా ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి 8–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కిమ్ తేరుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు. రెండో గేమ్‌లోనూ సింధు తన జోరు కొనసాగించింది. ఆరంభంలోనే 8–3తో ఆధిక్యంలోకి వెళ్లి పట్టు బిగించింది. ఆ తర్వాత అదే దూకుడులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఎవెగెనియా కొసెత్‌స్కాయా (రష్యా)–చెయింగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)ల మధ్య మ్యాచ్ విజేతతో సింధు మూడో రౌండ్లో తలపడుతుంది. సోమవారం ఆలస్యంగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రితూపర్ణ దాస్ 2–0తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి అనా మికెలా (ఫిన్లాండ్) గాయం కారణంగా వైదొలిగింది. పురుషుల సింగిల్స్‌లో 15వ సీడ్ సాయిప్రణీత్ 21–18, 21–17తో వీ నాన్ (హాంకాంగ్)పై, 13వ సీడ్ అజయ్ జయరామ్ 21–14, 21–12తో లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)పై విజయం సాధించారు. వీ నాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఈ ఏడాది సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సాయిప్రణీత్ రెండో రౌండ్లో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ఆడతాడు. ‘మ్యాచ్ కఠినంగా ఉంటుందని ముందే అంచనా వేశాను. వెనుకబడిన దశలో నా వ్యూహాన్ని మార్చాను. వీ నాన్ కొన్ని పొరపాట్లు చేయడంతో నేను వాటిని సద్వినియోగం చేసుకున్నాను’ అని సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు. డబుల్స్ విభాగాల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 21–12, 21–19తో ప్రాజక్తా సావంత్ (భారత్)–యోగేంద్రన్ కృష్ణన్ (మలేసియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మరోవైపు సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 17–21, 21–18, 5–21తో వాంగ్ యిలు–హువాంగ్ డింగ్పింగ్ (చైనా) ద్వయం చేతిలో... సాత్విక్ సాయిరాజ్–మనీషా (భారత్) జంట 20–22, 18–21తో క్రిస్టియాన్సన్–సారా థిగెసన్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓడిపోయాయి.మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్వని ద్వయం 21–15, 21–13తో రిరిన్ అమెలియా (ఇండోనేసియా)–చింగ్ చెయోంగ్ (మలేసియా) జోడీపై నెగ్గగా... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి జోడీ 8–21, 12–21తో హిరోయుకి ఎండో–వతనాబె (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
తొలి అడుగు అదిరె...
• శ్రీకాంత్ శుభారంభం • తొలి రౌండ్లో అలవోక విజయం • సమీర్ వర్మ కూడా ముందంజ • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పతకమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగిన భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ తొలి అడ్డంకిని విజయవంతంగా అధిగమించాడు. కేవలం అరగంటలోపే తన ప్రత్యర్థి ఆట కట్టించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన సమీర్ వర్మ కూడా బోణీ చేయగా... మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–మనీషా జంట కూడా గెలిచింది. గ్లాస్గో (స్కాట్లాండ్): వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ అదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ కొనసాగిస్తున్నాడు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–13, 21–12తో కేవలం 29 నిమిషాల్లో సెర్గీ సిరాంట్ (రష్యా)ను ఓడించాడు. ఆరంభంలో కాస్త తడబడ్డ శ్రీకాంత్ వెంటనే తేరుకొని తన సహజశైలిలో విజృంభించాడు. నెట్ వద్ద పైచేయి సాధిస్తూనే, పదునైన స్మాష్‌లతో అదరగొట్టాడు. తొలి గేమ్‌లో 11–6తో ముందంజ వేసిన శ్రీకాంత్ ఆ తర్వాత అదే దూకుడుతో తన ఆధిక్యాన్ని 15–7కు పెంచుకున్నాడు. తొలి గేమ్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతం చేసుకున్న శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లోనూ పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. అయినప్పటికీ ఏ దశలోనూ శ్రీకాంత్ నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఆడుతూ నిలకడగా పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు పాబ్లీ అబియాన్ (స్పెయిన్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సమీర్ వర్మ 21–8, 17–4తో ఆధిక్యంలో ఉన్న దశలో అబియాన్ గాయంతో వైదొలిగాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–మనీషా (భారత్) ద్వయం 24–22, 21–17తో టామ్ చున్ హీ–ఎన్జీ సాజ్ యావు (హాంకాంగ్) జోడీపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) జోడీ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. సుమీత్–మనూ అత్రి 20–22, 11–21తో చుంగ్ ఇయు సియోక్–కిమ్ డ్యూక్యంగ్ (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తన్వీ లాడ్ (భారత్) 17–21, 21–10, 21–19తో చోల్ బిర్చ్ (ఇంగ్లండ్)ను ఓడించింది. మరో మ్యాచ్‌లో ప్రాజక్తా సావంత్ (భారత్)–యోగేంద్రన్ కృష్ణన్ (మలేసియా) జంట 21–15, 13–21, 21–18తో లియు చింగ్ యావో–చియాంగ్ కయ్ సిన్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఆరతి సారా సునీల్–సంజన సంతోష్ (భారత్) జంట 21–15, 21–18తో నటాల్యా వ్యోట్సెక్–యెలజెవెటా జర్కా (ఉక్రెయిన్) ద్వయంపై నెగ్గింది. మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో కిమ్ హ్యో మిన్ (కొరియా)తో పీవీ సింధు; పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో వీ నాన్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; వ్రాబెర్ (ఆస్ట్రియా)తో అజయ్ జయరామ్ తలపడతారు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో ప్రాజక్తా–యోగేంద్రన్లతో ప్రణవ్ చోప్రా–సిక్కి రెడ్డి; క్రిస్టియాన్సన్–సారా తిగెసన్ (డెన్మార్క్)లతో సాత్విక్–మనీషా; వాంగ్ యిలు–డాంగ్పింగ్ (చైనా)లతో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రిరిన్ అమెలియా (ఇండోనేసియా)–చింగ్ చెయోంగ్ (మలేసియా)లతో సిక్కి రెడ్డి–అశ్విని; పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో హిరోయుకి–యుటా వటనాబె (జపాన్)లతో సాత్విక్–చిరాగ్ శెట్టి తలపడతారు. -
మిషన్ ‘గ్లాస్గో’
∙ ఆశల పల్లకిలో శ్రీకాంత్, సింధు ∙ నేటినుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గ్లాస్గో (స్కాట్లాండ్): ఈ సంవత్సరంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై మెరుపులు మెరిపిస్తున్నారు. కిడాంబి శ్రీకాంత్ వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించగా... సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్, థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్స్‌ను... సమీర్ వర్మ సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. మరోవైపు పీవీ సింధు సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలిచింది. సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో చాంపియన్ అయింది. వేదిక ఏదైనా, టోర్నీ స్థాయి ఏదైనా భారత క్రీడాకారులు బరిలోకి దిగితే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అందరి దృష్టి భారత క్రీడాకారులపైనే కేంద్రీకృతమై ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి ఏకంగా 22 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) 21 మందిని ఎంపిక చేసినా... మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కే చెందిన ప్రజక్తా సావంత్ మలేసియా ప్లేయర్ యోగేంద్రన్ కృష్ణన్‌తో కలిసి విడిగా పోటీపడనుంది. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్ సోమవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రష్యాకు చెందిన సెర్గీ సిరాంత్తో; పాబ్లో అబియాన్ (స్పెయిన్)తో సమీర్ వర్మ తలపడతారు. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో వీ నాన్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)తో అజయ్ జయరామ్ ఆడతారు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ఇప్పటివరకు ఒకే పతకం వచ్చింది. 1983లో ప్రకాశ్ పదుకొనే సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని సాధించారు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు తొలి రౌండ్లో ‘బై’ లభించడంతో వీరిద్దరూ నేరుగా రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతారు. భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్ తొలి రౌండ్లో ఐరీ మికెలా (ఫిన్లాండ్)తో; చోల్ బిర్చ్ (ఇంగ్లండ్)తో తన్వీ లాడ్ పోటీపడనున్నారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను లెక్కలోకి తీసుకుంటే ఈసారీ భారత్‌కు సింగిల్స్ విభాగంలో పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబుల్స్ విభాగంలో మాత్రం అంతగా అంచనాలు లేవు. ఒకవేళ డబుల్స్‌లో ఏదైనా పతకం వస్తే అది బోనస్ అవుతుంది. పతకాలే... ప్రైజ్‌మనీ లేదు... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే అన్ని స్థాయి టోర్నమెంట్లలో ప్రైజ్‌మనీ ఉంటున్నా... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం పతక విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ ఇవ్వరు. సెమీఫైనల్‌కు చేరిన వారికి కాంస్య పతకాలు, ఫైనల్లో ఓడిన వారికి రజత పతకాలు, చాంపియన్స్‌కు స్వర్ణ పతకాలు అందజేస్తారు. 1977లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ జరిగింది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరం ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. 1997లో గ్లాస్గోలో జరిగిన ఈ పోటీల్లో భారత్ తరఫున సింగిల్స్‌లో పుల్లెల గోపీచంద్ పోటీపడగా... 20 ఏళ్ల తర్వాత అదే వేదికపై ఆయన భారత జట్టుకు చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. భారత జట్టు వివరాలు ∙ పురుషుల సింగిల్స్: కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ. ∙ మహిళల సింగిల్స్: పీవీ సింధు, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, తన్వీ లాడ్. ∙ పురుషుల డబుల్స్: సుమీత్ రెడ్డి–మనూ అత్రి; అర్జున్–శ్లోక్ రామచంద్రన్; సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి. ∙ మహిళల డబుల్స్: సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; ఆరతి సారా సునీల్–సంజన సంతోష్; మేఘన–పూర్వీషా రామ్. ∙ మిక్స్డ్ డబుల్స్: సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప; సాత్విక్ సాయిరాజ్–మనీషా. ►మధ్యాహ్నం గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
సింధు, సైనాలకు ‘బై’
►శ్రీకాంత్ సత్తాకు పరీక్ష ►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘డ్రా’ విడుదల ►ఈనెల 21 నుంచి స్కాట్లాండ్లో టోర్నీ న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లు జరిగితే... వరుసగా ఐదోసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం వచ్చే అవకాశముంది. ఈనెల 21 నుంచి 27 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. బుధవారం ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను విడుదల చేశారు. తొలిసారి భారత్ తరఫున సింగిల్స్ విభాగాల్లో ఏకంగా ఎనిమిది మంది బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, తన్వీ లాడ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ సింధు, 12వ సీడ్ సైనా నెహ్వాల్‌లకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్) లేదా నటాల్యా వోట్‌సెక్ (ఉక్రెయిన్)లతో సైనా...కిమ్ హో మిన్ (కొరియా) లేదా హదియా హోస్నీ (ఈజిప్ట్)లతో సింధు ఆడే చాన్స్ ఉంది. అంతా సజావుగా సాగితే క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సున్ యు (చైనా)తో సింధు; ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సైనా ఆడొచ్చు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చోల్ బిర్చ్ (ఇంగ్లండ్)తో తన్వీ లాడ్; ఐరి మికెలా (ఫిన్లాండ్)తో రితూపర్ణ దాస్ తలపడతారు. సైనా, సింధు వేర్వేరు పార్శా్వల్లో ఉన్నందున కేవలం ఫైనల్లోనే ఎదురయ్యే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌గా పోటీపడనున్న శ్రీకాంత్ తొలి రౌండ్లో సెర్గీ సిరాంట్ (రష్యా)తో ఆడతాడు. ఆ తర్వాత రెండో రౌండ్లో లిన్ యు సియెన్ (చైనీస్ తైపీ) లేదా లుకాస్ కోర్వీ (ఫ్రాన్స్)లతో... ప్రిక్వార్టర్ ఫైనల్లో టామీ సుగియార్తో (ఇండోనేసియా) లేదా హు యున్ (హాంకాంగ్)లతో శ్రీకాంత్ ఆడే చాన్స్ ఉంది. ఇక క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్‌కు టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) ఎదురయ్యే అవకాశముంది. తొలి రౌండ్ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ శ్రీకాంత్‌కు నైపుణ్యమున్న ఆటగాళ్లే ఎదురుకానున్నారు. అయితే వరుసగా ఇండోనేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచి జోరు మీదున్న శ్రీకాంత్ తన స్థాయికి తగ్గట్టు ఆడితే సెమీఫైనల్‌కు చేరుకోవడం కష్టమేమీ కాదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరుకుంటే కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు పతకం వచ్చి 34 ఏళ్లు గడిచాయి. ఈ విభాగంలో భారత్‌కు లభించిన ఏకైక కాంస్య పతకాన్ని ప్రకాశ్ పదుకొనే (1983లో) అందించారు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వీ నాన్ (హాంకాంగ్)తో 15వ సీడ్ సాయిప్రణీత్; లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)తో 13వ సీడ్ అజయ్ జయరామ్; పాబ్లో అబియాన్ (స్పెయిన్)తో సమీర్ వర్మ తలపడతారు. భారత్ తరఫున పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి; సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జోడీలు... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; సంజన సంతోష్–ఆరతి సారా; జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ జంటలు; మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సాత్విక్ సాయిరాజ్–మనీషా; సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీలు బరిలో ఉన్నాయి. చివరి నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్‌కు నాలుగు పతకాలు వచ్చాయి. 2011లో మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప ద్వయం... 2013, 2014లలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు కాంస్య పత కాలు సాధించగా... 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ రజత పతకం సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ క్రీడలు జరిగిన ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ను నిర్వహించరు. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు గ్లాస్గో నగరం 1997 తర్వాత మళ్లీ ఆతిథ్యమిస్తోంది. ఆ పోటీల్లో భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, విక్రాంత్ పట్వర్దన్... మహిళల సింగిల్స్‌లో మధుమిత బిస్త్ బరిలోకి దిగారు. అయితే గోపీచంద్ తొలి రౌండ్లో ఫెర్నాండో సిల్వా (పోర్చుగల్)కు వాకోవర్ ఇవ్వగా... విక్రాంత్ 8–15, 1–15తో అలెన్ బుడి కుసుమా (ఇండోనేసియా) చేతిలో... మధుమిత 5–11, 6–11తో జింగ్నా హాన్ (చైనా) చేతిలో ఓడారు. -
సింగిల్స్‌లో భారత్ నుంచి 8 మంది
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: వచ్చే నెలలో స్కాట్లాండ్లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఎనిమిది మంది బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, తన్వీ లాడ్ ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్‌లో భారత్‌తోపాటు చైనా, జపాన్ దేశాలకు నాలుగేసి బెర్త్‌లు లభించాయి. పురుషుల సింగిల్స్‌లో చైనా, డెన్మార్క్, హాంకాంగ్ దేశాల నుంచి కూడా నలుగురేసి అర్హత సాధించారు. -
కల చెదిరె...
-
కల చెదిరె...
♦ సైనా నెహ్వాల్‌కు రజతం ♦ స్వర్ణ పతక పోరులో పరాజయం ♦ టైటిల్ నిలబెట్టుకున్న మారిన్ ♦ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జగజ్జేతగా అవతరించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆఖరి మెట్టుపై తడబడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సైనా ‘సువర్ణాధ్యాయం’ లిఖించలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్‌తో జరిగిన అంతిమ సమరంలో సైనా వరుస గేముల్లో ఓడిపోవడంతో ‘పసిడి కల’ చెదిరింది. మరోవైపు మారిన్ వరుసగా రెండో ఏడాది విశ్వవిజేతగా నిలిచి తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. జకార్తా : ‘పసిడి’ పతకమే లక్ష్యంగా అంతిమ సమరంలో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఘనమైన ముగింపు ఇవ్వలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సైనా పరాజయం పాలైంది. 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సైనా 16-21, 19-21తో ఓటమి చవిచూసి రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ విజయంతో మారిన్... జీ జింగ్ఫాంగ్ (చైనా-2005, 2006) తర్వాత వరుసగా రెండేళ్లు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా నిలిచింది. మారిన్ చేతిలో ఫైనల్లో ఓడిపోవడం సైనాకిది రెండోసారి. గత మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఫైనల్లోనూ మారిన్ చేతిలోనే సైనా ఓడింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖి రికార్డులో సైనా 3-1తో మారిన్‌పై ఆధిక్యంలో ఉన్నా ఈ గణాంకాలు ఫైనల్లో అంతగా ప్రభావం చూపలేకపోయాయి. సైనాతో గతంలో ఇతర టోర్నీల్లో మూడుసార్లు ఫైనల్లో ఆడిన అనుభవం ఉన్న మారిన్ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. ఇప్పటికే ప్రపంచ టైటిల్‌ను ఒకసారి సాధించిన మారిన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ సైనాను ఇబ్బంది పెట్టింది. చురుగ్గా కదులుతూ, అడపాదడపా స్మాష్‌లు సంధిస్తూ, డ్రాప్ షాట్లు ఆడుతూ మారిన్ తొలి గేమ్‌లో పూర్తిగా ఆధిపత్యం చలాయించింది. మారిన్ మెరుగ్గా ఆడుతుండటంతో... మరోవైపు తొలి ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్న సైనాపై మరింత ఒత్తిడి పెరిగింది. తొలి గేమ్‌ను కోల్పోయిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో గేమ్‌లో పుంజుకుంది. మారిన్ ఆటతీరుకు దీటుగా బదులిస్తూ నిలకడగా పాయింట్లు స్కోరు చేసి 12-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో మారిన్ మళ్లీ దూకుడు పెంచింది. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి స్కోరును 12-12తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. ఒకదశలో మారిన్ 17-18తో పాయింట్ వెనుకజంలో ఉన్నా వెంటనే తేరుకొని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 20-18తో ఆధిక్యంలోకి వెళ్లింది. సైనా మరో పాయింట్ సాధించినా... ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన ర్యాలీలో మారిన్ సంధించిన స్మాష్ షాట్‌ను సైనా బయటకు పంపడంతో స్పెయిన్ అమ్మాయి విజయం ఖాయమైంది. సెమీఫైనల్స్‌లో ఓడిన లిందావెని ఫనెత్రి (ఇం డోనేసియా), సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) లకు కాంస్య పతకాలు లభించాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన సైనాకు అభినందనలు. టోర్నీ ఆసాంతం ఆమె బాగా ఆడింది. ఫైనల్లో కూడా ఎంతో పోరాట పటిమ ప్రదర్శించింది. ఇలాంటి ఆటగాళ్లు ఉండటం పట్ల గర్వపడుతున్న తెలంగాణ రాష్ట్రం మున్ముందు క్రీడల్లో కూడా అగ్రస్థానానికి చేరుతుంది. -తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడటం సైనాపై ఒత్తిడి పెంచింది. దాంతో ఏకాగ్రత కోల్పోయినట్లుంది. నాకు తెలిసి ఆమె ఈ పోరులో మానసికంగా వెనుకబడింది. అయినా రజతం రావడం ఆనందకరం. విజయం కోసం సైనా శాయశక్తులా ప్రయత్నించింది. మా అమ్మాయిలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. కొన్ని లోపాలు అధిగమించడంతో పాటు ఫిట్‌గా ఉంటే వచ్చేసారి చాంపియన్ అవుతుంది. -హర్వీర్ సింగ్, సైనా తండ్రి ► ఎంతో శ్రమిస్తే గానీ వరల్డ్ చాంపియన్ కాలేరు. ఫర్వాలేదు... విజయంకంటే ఓటమి ఎక్కువ నేర్పిస్తుంది. -విశ్వనాథన్ ఆనంద్ ► బ్యాడ్‌లక్ సైనా. అయినా భారత బ్యాడ్మింటన్‌లో తొలి రజతం. అందరికీ గర్వకారణం. -గుత్తా జ్వాల ► చాలా బాగా ఆడావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. పోరాడినా ఈ రోజు కలిసి రాలేదు. మెరుగైన ప్లేయర్ చేతిలో ఓడావు. - అనిల్ కుంబ్లే ఫైనల్లో నేను నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేదు. నేనింకా బాగా ఆడాల్సింది. తొలి గేమ్‌లో చాలా తప్పిదాలు చేశాను. రెండో గేమ్‌లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కొన్ని పాయింట్లు వేగంగా చేజార్చుకున్నాను. ఏం జరుగుతుందో ఆలోచించేలోపే స్కోరు సమమైపోయింది. ఫిట్నెస్పరంగా నాకెలాంటి ఇబ్బంది లేదు. ఫైనల్‌లాంటి మ్యాచ్‌లో ఆటకంటే మానసికంగా దృఢంగా ఉండటం ముఖ్యం. రెండో గేమ్‌లోని కీలకదశలో నేను అనవసర తప్పిదాలు చేశాను. రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతుండటం మారిన్‌కు అనుకూలాంశమైంది. ఆమె ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడింది. -సైనా నెహ్వాల్ గత ఏడాది విజయంతో పోలిస్తే ఈసారి మరింత సంతోషంగా ఉన్నాను. గతనెలలో కాలికి గాయమైంది. అసలు ఈ టోర్నీలో నేను ఆడతానో లేదో అనే అనుమానం కలిగింది. రెండు వారాల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ఈ మెగా ఈవెంట్‌ను ఆస్వాదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. రెండో గేమ్‌లో వెనుకబడిన దశలో పొరపాట్లు చేయకూడదనే వ్యూహంతో ఆడాను. ఫలితం గురించి కాకుండా ఒక్కో పాయింట్ గురించి ఆలోచించి ఆడాను. జకార్తా ప్రేక్షకులు నాకు మద్దతు ఇవ్వడం చూశాక నేను సొంతగడ్డపై ఆడుతున్నాననే భావన కలిగింది. -కరోలినా మారిన్ చెన్ లాంగ్దే పురుషుల టైటిల్ పురుషుల సింగిల్స్ విభాగంలోనూ డిఫెండింగ్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో చెన్ లాంగ్ 21-14, 21-17తో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)పై విజయం సాధించాడు. ఆతిథ్య ఇండోనేసియాకు పురుషుల డబుల్స్ టైటిల్ దక్కింది. ఫైనల్లో మొహమ్మద్ ఎహసాన్-హెంద్రా సెతియవాన్ ద్వయం 21-17, 21-14తో లియు జియోలాంగ్-కియు జిహాన్ (చైనా) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ విభాగంలో తియాన్ కింగ్-యున్లి జావో (చైనా); మిక్స్డ్ డబుల్స్‌లో నాన్ జింగ్-యున్లి జావో (చైనా) విజేతలుగా నిలిచారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎలాంటి ప్రైజ్‌మనీ ఉండదు. విజేత, రన్నరప్‌లకు స్వర్ణ, రజతాలు... సెమీస్‌లో ఓడినవారికి కాంస్య పతకాలు అందజేస్తారు. -
సైనాకు తప్పని స్పెయిన్ పెయిన్
-
సైనాకు తప్పని 'స్పెయిన్ పెయిన్'
జకార్తా: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు స్పెయిన్ పెయిన్ తప్పలేదు. గత మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ ఫైనల్లో మారిన్ కరోలినా చేతిలో ఓటమి చవిచూసిన సైనా.. మరోసారి వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఓటమి చెందింది. ప్రపంచ చాంపియన్ షిప్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ కు చెందిన ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా చేతిలో 21-16, 21-19 తేడాతో సైనా ఓటమి పాలైంది. తొలి సెట్ ఆరో గేమ్ వరకూ సైనా ఆధిక్యం కనబరిచినా .. తరువాత వరుస పాయింట్లను చేజార్చుకుని ఆ సెట్ ను నష్టపోయింది. దీంతో వెనుకబడిన సైనా.. రెండో సెట్ లో ఆధిక్యం దిశగా కొనసాగింది. కాగా, సైనా ఆ సెట్ చివర్లో ఒత్తిడికి గురై మ్యాచ్ ను చేజార్చుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ లో తొలిసారి ఫైనల్ కు చేరిన సైనా.. చివరి అడ్డంకిని మాత్రం దాటలేకపోయింది. గతంలో మారిన్ కరోలినాపై సైనా స్పష్టమైన ఆధిక్యం కనబరిచినా.. వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మాత్రం కరోలినాదే పైచేయి అయ్యింది. ప్రత్యర్థి వేగం, దూకుడు ముందు సైనా నిలువలేకపోయింది. సైనా కొత్త చరిత్రను లిఖిస్తుందని భావించినా ఆ ఆశ తీరలేదు. అయితే ఈ టోర్నీలో సైనా నెహ్వాల్ చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చింది. సైనా నెహ్వాల్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తొలిసారి ఫైనల్ కు చేరడంతో రజత పతకంతో సరిపెట్టుకుంది. -
సైనా నెహ్వాల్ మరో సంచలనం
-
సైనా నెహ్వాల్ మరో సంచలనం
జకార్తా: తెలుగుతేజం సైనా నెహ్వాల్ మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సైనా 21-17, 21-17 స్కోరుతో అన్‌సీడెడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)పై విజయం సాధించింది. 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సైనా వరుస గేమ్ ల్లో నెగ్గింది. లిందావెనిపై ముఖాముఖి రికార్డును 3-1కు పెంచుకుంది. ఫైనల్ సమరంలో సైనా.. డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడనుంది. మరో సెమీస్‌లో కరోలినా 21-17, 15-21, 21-16తో సంగ్ జి హ్యున్ (కొరియా)ను ఓడించింది. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించినా ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్నిఅందుకోని సైనా.. ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతూ పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో సైనా ఓడినా రజత పతకం దక్కుతుంది. గెలిస్తే స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించనుంది. -
'క్వార్టర్' గండం దాటిన సైనా
జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పతకం ఖాయం చేసుకుంది. సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలిసారిగా క్వార్టర్ ఫైనల్ దాటింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో యియాన్ వాంగ్ పై 21-15, 19-21, 21-19 తేడాతో గెలిచింది. మొదటి సెట్ గెలిచిన సైనా తర్వాత సెట్ లో తడబడింది. కీలకమైన మూడో సెట్ లో పైచేయి సాధించి విజేతగా నిలిచింది. సైనా నెహ్వాల్ సెమీస్ చేరడంతో కనీసం ఆమెకు కాంస్య పతకం రావడం ఖాయం. కాగా, పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ఓడి టోర్ని నుంచి నిష్ర్కమించింది. -
పీవీ సింధు పరాజయం
జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తెలుగు అమ్మాయి పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆమె ఓటమి పాలైంది. 8వ సీడ్ కొరియన్ షట్లర్ సుంగ్ చేతిలో 17-21, 21-19, 16-21 తేడాతో ఓడిపోయింది. తొలి సెట్ కోల్పోయిన సింధు తర్వాత పుంజుకుని రెండో సెట్ గెలిచింది. నిర్ణయాత్మక మూడో సెట్ లో వెనుకబడడంతో సింధు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సివచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 21-17, 14-21, 21-17తో ప్రపంచ మూడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)పై అద్భుత విజయం సాధించింది. -
బ్యాడ్మింటన్‌లో భారతీయుల జయభేరి
-
సింధు సూపర్
మాజీ నంబర్‌వన్ లీ జురుయ్‌పై గెలుపు క్వార్టర్స్‌కు చేరిన భారత స్టార్ సైనా, జ్వాల జోడీ కూడా ముందుకు పోరాడి ఓడిన శ్రీకాంత్, ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధు సంచలనం సృష్టించింది.లీజురుయ్ రూపంలో అడ్డొచ్చిన చైనా గోడను సింధు బద్దలు కొడితే... సైనాతో పాటు జ్వాల ద్వయం అలవోకగా నెగ్గి క్వార్టర్స్‌కు చేరారు. జకార్తా: గాయాల కారణంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 21-17, 14-21, 21-17తో ప్రపంచ మూడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)పై అద్భుత విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో రెండోసీడ్ సైనా నెహ్వాల్ 21-18, 21-14తో 14వ సీడ్ సయాకి తకహషీ (జపాన్)పై అలవోకగా నెగ్గింది. తద్వారా ఈ ఇద్దరూ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఇందులో గెలిస్తే కనీసం కాంస్య పతకాలైనా లభిస్తాయి. ఆరంభంలో కాస్త తడబడటంతో తొలిగేమ్‌లో 0-7తో వెనుకబడిన సైనా తర్వాత నెమ్మదిగా పుంజుకుంది. రెండో గేమ్‌లో ఓ దశలో స్కోరు 16-16, 18-18తో సమమైనా... మూడు వరుస పాయింట్లతో సైనా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు జురుయ్‌తో 50 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు అమోఘమైన ఆటతీరును ప్రదర్శించింది. ప్రత్యర్థి నుంచి ఎదురుదాడి ఎదురైనా.. కీలక సమయంలో చెలరేగింది. తొలి గేమ్‌లో అద్భుతంగా ఆడిన సింధు, జురుయ్‌కు అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. కానీ రెండో గేమ్‌లో జురుయ్ తన అనుభవాన్ని ఉపయోగించి ఆకట్టుకుంది. కీలక మూడో గేమ్‌లో ఇరువురు హోరాహోరీగా తలపడటంతో స్కోరు 13-13, 14-14తో సమంగా సాగింది. ఈ దశలో సింధు నాలుగు వరుస పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 18-14కు పెంచుకుంది. తర్వాత ప్రత్యర్థిని కట్టడి చేస్తూ గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో 13వ సీడ్ జ్వాల-అశ్విని 21-15, 18-21, 21-19తో 8వ సీడ్ రెకా కకివా-మియుకీ మేధ (జపాన్)లపై నెగ్గి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 17-21, 21-23తో 13వ సీడ్ హు యున్ (హాంకాంగ్) చేతిలో; 11వ సీడ్ హెచ్.ఎస్. ప్రణయ్ 16-21, 21-19, 18-21తో ఏడోసీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. -
క్వార్టర్ ఫైనల్లో జ్వాల-అశ్విని
జకర్తా: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత మహిళా క్రీడాకారుల హవా కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్, పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించగా, డబ్సుల్స్ లోనూ గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణులను 21-15 18-21, 21-19 తేడాతో జ్వాల-అశ్విని ఓడించారు. -
చాంపియన్ షిప్లో సైనా జోరు
జకర్తా: భారత్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి సయాక తకహషిపై 21-18, 21-14 తేడాతో విజయం సాధించింది. 14వ సీడ్ ప్లేయర్‌పై జరిగిన ఈ మ్యాచ్ లో రెండో సీడ్ సైనా వరుసగా రెండు సెట్లు కైవసం చేసుకుని 42 నిమిషాల్లోనే ఆటముగించింది. తొలి గేమ్ లో 7-0 తో వెనుకంజలో ఉన్న సైనా ఆ తర్వాత అత్భుత పోరాట పటిమను ప్రదర్శించి సెట్ ను గెలిచింది. ఇప్పటి వరకూ ఒక్క పతకాన్ని గెలవని సైనా ఈ సారి మాత్రం పతకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరోవైపు సింధూ కూడా క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. -
క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధూ
జకర్తా: భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధూ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి లీ ఝురయ్పై 21-17, 14-21, 21-17 తేడాతో విజయం సాధించింది. సింధూ కెరీర్ లో ఇది ఆమెకు అతిపెద్ద విజయం. 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 11వ సీడ్ ప్లేయర్ సింధూ తొలి, మూడో సెట్లను అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత రెండు చాంపియన్‌షిప్ లలో కాంస్య పతకాలు సాధించిన సింధూ ఈ ఏడాది కూడా పతకం నెగ్గాలనే ధీమాతో ప్రత్యర్ధులను ఎదుర్కొంటుంది. క్వార్టర్స్ మ్యాచ్ గెలిస్తే ఆ తర్వాత సింధూకు కష్టమైన డ్రా ఎదురయ్యే అవకాశముంది. స్పెయిన్ కు చెందిన క్రీడాకారిణి టాప్ సీడ్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ కరోలినా మరిన్ లేదా చైనాకు చెందిన ప్లేయర్ వాంగ్ షిగ్జేయిన్ తో తలపడాల్సి వస్తుంది. -
శ్రమించిన సింధు
♦ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం ♦ శ్రీకాంత్ శుభారంభం ♦ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జకార్తా : వరుసగా మూడోసారి పతకం నెగ్గి ‘హ్యాట్రిక్’ సాధించాలనే లక్ష్యంతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత స్టార్ పీవీ సింధు తొలి అడ్డంకిని చెమటోడ్చి అధిగమించింది. 11వ సీడింగ్ పొందిన ఈ హైదరాబాద్ అమ్మాయికి తొలి రౌండ్లో ‘బై’ లభించడంతో నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 11-21, 21-17, 21-16తో లినీ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో లీ జురుయ్ (చైనా)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. కెరీర్లో తొలిసారి లినీతో ఆడిన సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. ఆరంభంలో 1-6తో వెనుకబడిన సింధు తేరుకునేలోపు గేమ్‌ను కోల్పోయింది. అయితే రెండో గేమ్‌లో కుదురుకున్న సింధు 5-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న ఆమె రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. మూడో గేమ్‌లో సింధు 8-9తో వెనుకబడిన దశలో వరుసగా ఐదు పాయింట్లు సాధించి 13-9తో ముందంజ వేసింది. అదే జోరులో గేమ్‌ను దక్కించుకొని 50 నిమిషాల్లో నెగ్గింది. పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. మైకేల్ ఫారిమన్ (ఆస్ట్రేలియా)తో జరిగిన తొలి రౌండ్లో శ్రీకాంత్ కేవలం 24 నిమిషాల్లో 21-10, 21-13తో గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తదుపరి రౌండ్లో సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ ఆడతాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో ప్రపంచ 17వ ర్యాంక్ జంట సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. నేటి మ్యాచ్‌లు ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
వెళ్లాలి... ‘మన రాకెట్’ పైపైకి...
- నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ - బరిలో సైనా, సింధు, శ్రీకాంత్, కశ్యప్ - తొలిసారి 18 మందితో భారీ బృందం అందని ద్రాక్షగా ఉన్న ‘ప్రపంచ’ పతకాన్ని సాధించాలనే పట్టుదలతో సైనా నెహ్వాల్... వరుసగా మూడోసారి అద్బుతం చేయాలనే లక్ష్యంతో పీవీ సింధు... 32 ఏళ్ల పురుషుల సింగిల్స్ విభాగంలో పతక నిరీక్షణకు తెరదించాలనే ఆశయంతో శ్రీకాంత్, కశ్యప్... మళ్లీ విజయాలబాట పట్టాలనే సంకల్పంతో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప... ఇలా ప్రతి ఒక్కరూ తమదైన ముద్ర చూపించాలనే తాపత్రయంతో అసలు సమరానికి సమాయత్తమయ్యారు. సోమవారం నుంచి మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ అంచనాలతో భారత బృందం బరిలోకి దిగనుంది. జకార్తా (ఇండోనేసియా): బ్యాడ్మింటన్‌లో చైనాకు దీటుగా తాము ఎదుగుతున్నామని ఇటీవల కాలంలో తమ ప్రదర్శనతో నిరూపించిన భారత క్రీడాకారులు ప్రపంచ పరీక్షకు సిద్ధమయ్యారు. నేటి నుంచి జకార్తాలో మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో 18 మంది సభ్యులతో కూడిన భారత బృందం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలిసారి అత్యధిక ఆటగాళ్లతో భారత్ వెళ్లినప్పటికీ... ఆరుగురిపైనే అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు.. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్... మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం నుంచి పతకాలు ఆశించవచ్చు. సైనా.. ఈసారైనా ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్లో ఐదుసార్లు పాల్గొన్న సైనా ఐదు పర్యాయాల్లోనూ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఈ అవరోధాన్ని దాటితే ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. తన కెరీర్లో ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ గేమ్స్, సూపర్ సిరీస్, ఉబెర్ కప్, ఆసియా చాంపియన్‌షిప్‌లాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో పతకాలు నెగ్గిన సైనాకు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం అందని ద్రాక్షగా ఊరిస్తోంది. ఆరో సారైనా సైనాకు అదృష్టం కలిసొస్తుందో లేదో వేచి చూడాలి. ఈసారి రెండో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనాకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో సులువైన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం ఉన్నా... ప్రిక్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ తకహాషి (జపాన్), క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) సైనా దారిలో ఉన్నారు. ఈ రెండు అడ్డంకులను దాటితేనే సైనాకు పతకం దక్కుతుంది. సింధు... హ్యాట్రిక్ సాధించేనా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ గత రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ (2013, 2014)లలో కాంస్య పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించిన పీవీ సింధు వరుసగా మూడోసారీ పతకం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. గాయాల కారణంగా ఈ సీజన్లో పెద్దగా విజయాలు సాధించని సింధు ఈ మెగా ఈవెంట్‌కు పక్కాగా సన్నద్ధమైంది. 11వ సీడింగ్ పొందిన సింధుకు తొలి రౌండ్లో ‘బై’ దక్కింది. రెండో రౌండ్‌ను దాటితే ఈ హైదరాబాద్ అమ్మాయికి మూడో రౌండ్లో ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా) రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. గతంలో లీ జురుయ్‌ను ఓడించిన సింధు ఈసారీ అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయడంపైనే ఆమె ‘హ్యాట్రిక్’ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ‘ప్రస్తుతం నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. సన్నాహాలు కూడా బాగున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా, సహజశైలిలో ఆడతాను. వరుసగా మూడోసారి పతకాన్ని సాధిస్తాను’ అని సింధు వ్యాఖ్యానించింది. మళ్లీ గాడిలో పడేందుకు... ఇటీవలే కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరిపించాలనే లక్ష్యంతో ఉన్నారు. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించిన జ్వాల-అశ్విని మరోసారి పతకంతో తిరిగి వస్తారో లేదో వేచి చూడాలి. తొలి రౌండ్లో బై పొందిన జ్వాల-అశ్వినిలకు మూడో రౌండ్లో ఎనిమిదో సీడ్ కాకివా-మియుకి మయెదా (జపాన్) జోడీ ఎదురయ్యే అవకాశముంది. మహిళల డబుల్స్‌లోనే సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె; మొహితా -ధాన్యా; పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్; మిక్స్డ్ డబుల్స్‌లో అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్; సిక్కి రెడ్డి-కోనా తరుణ్ బరిలో ఉన్నారు. నిరీక్షణకు తెర దించుతారా! పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ఈ మెగా ఈవెంట్లో చివరిసారి 1983లో ప్రకాశ్ పదుకొనే కాంస్య పతకాన్ని అందించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు భారత్‌కు పురుషుల సింగిల్స్‌లో మరో పతకం రాలేదు. అయితే కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్‌లలో ఒకరైనా 32 ఏళ్ల నిరీక్షణకు ఈసారి తెరదించుతారనే ఆశ కనిపిస్తోంది. బ్యాడ్మింటన్ సర్క్యూట్లో అత్యంత దూకుడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ గతేడాది చైనా సూపర్ సిరీస్‌లో లిన్ డాన్‌ను మట్టికరిపించి పెను సంచలనమే సృష్టించాడు. ఈ ఏడాది ఇండోనేసియా ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించిన కశ్యప్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరే కాకుండా కేరళ ప్లేయర్ ప్రణయ్ కూడా సంచలనం సృష్టించే అవకాశముంది. సోమవారం జరిగే తొలి రౌండ్లో ఎరిక్ మెజెస్ (నెదర్లాండ్స్)తో కశ్యప్; అలెక్స్ యువాన్ (బ్రెజిల్)తో ప్రణయ్ తలపడతారు. ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
అర్జున అవార్డు పొందిన క్రికెటర్?
జీకే - కరెంట్ అఫైర్స్ 1.ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణి? 1) సైనా నెహ్వాల్ 2) అశ్విని పొన్నప్ప 3) గుత్తా జ్వాల 4) పి.వి. సింధు 2. ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల్లో అర్జున అవార్డును ఏ క్రికెటర్‌కు ప్రకటించారు? 1) విరాట్ కోహ్లి 2) ఆర్. అశ్విన్ 3) చతేశ్వర్ పుజారా 4) రవీంద్ర జడేజా 3. ఏ నగరాన్ని క్యోటో తరహాలో స్మార్ట సిటీగా తీర్చిదిద్దేలా జపాన్ దేశంతో అవగాహనా ఒప్పందాన్ని (2014 ఆగస్టు 30న) కుదుర్చుకున్నారు? 1) గాంధీనగర్ 2) వడోదరా 3) వారణాసి 4) అయోధ్య 4. {పధాన మంత్రి జన ధన యోజన పథకాన్ని ఏ రోజున ప్రారంభించారు? 1) ఆగస్టు 15 2) ఆగస్టు 25 3) ఆగస్టు 30 4) ఆగస్టు 28 5. 2014 ఆగస్టులో రాజస్థాన్ గవర్నర్‌గా ఎవరిని నియమించారు? 1) పద్మనాభ ఆచార్య 2) సీహెచ్. విద్యాసాగర్‌రావు 3) వి.కె. మల్హోత్రా 4) కల్యాణ్ సింగ్ 6. భారతదేశంలో ఫిబ్రవరి 28వ తేదీని ఏ విధంగా జరుపుకుంటారు? 1) జాతీయ గణాంక దినం 2) జాతీయ విద్యాదినం 3) జాతీయ గణిత దినం 4) జాతీయ సైన్స దినం 7. 2014 జనవరి 1న లాత్వియా దేనిలో సభ్యదేశంగా చేరింది? 1) నాటో 2) యూరోపియన్ యూనియన్ 3) యూరో జోన్ 4) ఐక్యరాజ్య సమితి 8. 1971లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంను ఎవరు స్థాపించారు? 1) రాబర్ట జోలిక్ 2) రాబర్ట మెక్‌నమారా 3) క్లాస్ ష్వాబ్ 4) జోసెఫ్ స్టిగ్లిట్జ్ 9. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్ని-4 క్షిపణి ఎన్నివేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది? 1) 3 2) 4 3) 5 4) ఏదీకాదు 10. ‘క్రానికల్స్ ఆఫ్ ఏ కార్ప్స బేరర్’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 1) జీత్ థాయిల్ 2) హెచ్.ఎం. నక్వీ 3) సైరస్ మిస్త్రీ 4) షెహాన్ కరుణ తిలక 11. డొమినికా సిబుల్కోవా ఏ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి? 1) చెక్ రిపబ్లిక్ 2) స్పెయిన్ 3) స్లొవేకియా 4) బల్గేరియా 12. 2014 జనవరి 1న న్యూయార్క నగరానికి మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించింది? 1) మైకేల్ బ్లూమ్బర్గ 2) బిల్ డి. బ్లేసియో 3) బ్రాడ్ లాండర్ 4) జో లోటా 13. 2014 ఫిబ్రవరిలో 101వ భారత సైన్స కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? 1) జమ్మూ 2) న్యూఢిల్లీ 3) చెన్నై 4) కోల్‌కతా 14. 2014 జనవరి 25న హెరీ రాజొనారిమమ్ పియానినా ఏ దేశానికి అధ్యక్షుడయ్యారు? 1) సోమాలియా 2) దక్షిణ సుడాన్ 3) గాంబియా 4) మడగాస్కర్ 15. అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) అంపైర్ ప్యానల్లో స్థానం పొందిన మొదటి మహిళ క్యాతీ క్రాస్. ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి? 1) దక్షిణాఫ్రికా 2) ఇంగ్లండ్ 3) న్యూజిలాండ్ 4) వెస్టిండీస్ 16. ఇటీవల విస్ఫోటనం చెందిన మౌంట్ కెలుద్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? 1) ఇటలీ 2) ఇండోనేషియా 3) ఫిలిప్పీన్‌స 4) జపాన్ 17. ఫార్చ్యూన్ జాబితాలో అత్యంత శక్తి వంత మైన మహిళా వ్యాపారవేత్తగా అగ్రస్థా నంలో నిలిచిన మేరీ బర్రా ఏ కంపెనీకి సీఈవో? 1) ఐబీఎం 2) పెట్రోబ్రాస్ 3) యాహు 4) జనరల్ మోటార్స 18. 2014లో కర్ణాటక క్రికెట్ జట్టు కిందివాటిలో ఏ ట్రోఫీని గెలుచుకుంది? 1) రంజీ ట్రోఫీ 2) ఇరానీ ట్రోఫీ 3) 1, 2 4) ఏదీకాదు 19. విజ్డెన్ క్రికెటర్స అల్మనాక్ కవర్ పేజీకెక్కిన తొలి భారతీయుడు? 1) సునీల్ గవాస్కర్ 2) కపిల్‌దేవ్ 3) రాహుల్ ద్రవిడ్ 4) సచిన్ టెండూల్కర్ 20. 2014 ఫిబ్రవరిలో స్వర్ణోత్సవాలను జరుపుకున్న సంస్థ? 1) ఇంటెలిజెన్స బ్యూరో 2) కేంద్ర దర్యాప్తు సంస్థ 3) కేంద్ర విజిలెన్స కమిషన్ 4) రీసెర్చ అండ్ అనాలిసిస్ వింగ్ 21. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 7వ వేతన సంఘం చైర్మన్‌గా ఎవరు నియమితు లయ్యారు? 1) వివేక్ రే 2) రతన్ రాయ్ 3) అశోక్ కుమార్ మాథుర్ 4) రాజేష్ కుమార్ అగర్వాల్ 22. ఇటీవల ఏ వయసు బాలలకైనా కారుణ్య మరణాలను చట్టబద్ధం చేసిన ఐరోపా దేశం? 1) నార్వే 2) బెల్జియం 3) లక్సెమ్బర్గ 4) ఫిన్లాండ్ 23. 2014 ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన జొయాచిమ్ గౌక్ ఏ దేశాధ్యక్షుడు? 1) ఇటలీ 2) ఎస్టోనియా 3) డెన్మార్క 4) జర్మనీ 24. 103 ఏళ్ల సిల్వరీన్ స్వేర్ 2014 ఫిబ్రవరి 1న మరణించారు. ఆమె ఏ రాష్ట్రానికి చెందిన తొలి పద్మశ్రీ అవార్డు గ్రహీత? 1) మేఘాలయ 2) మణిపూర్ 3) మిజోరం 4) అరుణాచల్ ప్రదేశ్ 25. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? 1) ఆగస్టు 14 2) ఆగస్టు 2 3) ఆగస్టు 29 4) ఆగస్టు 22 26. భారతరత్న లభించని శాస్త్రవేత్త? 1) సి.వి.రామన్ 2) ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ 3) సి.ఎన్.ఆర్. రావు 4) ఎస్. చంద్రశేఖర్ 27. సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న అవార్డును రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ప్రదానం చేశారు? 1) 2013 నవంబర్ 16 2) 2013 డిసెంబర్ 16 3) 2014 ఫిబ్రవరి 4 4) 2014 జనవరి 4 28. 2014 జనవరిలో లూసోఫోనియా క్రీడలు ఎక్కడ జరిగాయి? 1) కేరళ 2) గోవా 3) పంజాబ్ 4) మణిపూర్ 29. ఏ భాష వాడుకలో ఉన్న దేశాల మధ్య జరిగే క్రీడలను లూసోఫోనియా క్రీడలు అంటారు? 1) ఫ్రెంచ్ 2) జర్మన్ 3) స్పానిష్ 4) పోర్చుగీస్ 30. 2014 జనవరిలో జరిగిన లూసోఫోనియా క్రీడల్లో 37 స్వర్ణాలతో మొత్తం 92 పతకా లతో అగ్రస్థానంలో నిలిచిన దేశం? 1) భారత్ 2) శ్రీలంక 3) అంగోలా 4) బ్రెజిల్ 31. నాలుగో లూసోఫోనియా క్రీడలు 2017లో ఏ దేశంలో నిర్వహిస్తారు? 1) కేప్ వెర్డె 2) తూర్పు తైమూర్ 3) గినియా బిస్సావు 4) మొజాంబిక్ 32. కిందివాటిలో సరికాని జత ఏది? 1) నేపాల్ ప్రధాన మంత్రి - సుశీల్ కొయిరాలా 2) దక్షిణ కొరియా అధ్యక్షుడు - పార్క గెయిన్ హే 3) మాల్దీవుల అధ్యక్షుడు - అబ్దుల్లా యమీన్ 4) బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి - ఖలీదా జియా 33. వార్సా ఏ దేశానికి రాజధాని? 1) స్పెయిన్ 2) పోలండ్ 3) పోర్చుగల్ 4) మాసిడోనియా 34. జ్ఞానపీఠ్ అవార్డును ఎంతమంది తెలుగు రచయితలకు ప్రదానం చేశారు? 1) 1 2) 2 3) 3 4) 4 35. శ్వేత విప్లవం వేటి ఉత్పత్తికి సంబంధించింది? 1) చేపలు 2) నూనె గింజలు 3) కూరగాయలు 4) ఏవీకావు 36. 1991లో కె.కె. బిర్లా ఫౌండేషన్ స్థాపించిన వ్యాస్ సమ్మాన్ పురస్కారాన్ని ఏ భాషా రచయితలకు ప్రదానం చేస్తారు? 1) సంస్కృతం 2) రాజస్థానీ 3) హిందీ 4) బెంగాలీ 37. 2013 వ్యాస్ సమ్మాన్ పురస్కార గ్రహీత? 1) విశ్వనాథ త్రిపాఠి 2) సుగతా కుమారి 3) శ్రీలాల్ శుక్లా 4) సత్యవ్రత్ శాస్త్రి 38. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్? 1) మహేల జయవర్ధనే 2) వీరేంద్ర సెహ్వాగ్ 3) బ్రియాన్ లారా 4) కుమార సంగక్కర 39. దేశంలోనే మొదటి మోనోరైలు ఎక్కడ ప్రారంభమైంది? 1) న్యూఢిల్లీ 2) బెంగళూరు 3) ముంబై 4) కోల్‌కతా 40. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎంపికైనవారు? 1) ఎన్. శ్రీనివాసన్ 2) అఖిలేష్ దాస్ గుప్తా 3) ఎన్. రామచంద్రన్ 4) సురేశ్ కల్మాడీ సమాధానాలు 1) 4; 2) 2; 3) 3; 4) 4; 5) 4; 6) 4; 7) 3; 8) 3; 9) 2; 10) 3; 11) 3; 12) 2; 13) 1; 14) 4; 15) 3; 16) 2; 17) 4; 18) 3; 19) 4; 20) 3; 21) 3; 22) 2; 23) 4; 24) 1; 25) 3; 26) 4; 27) 3; 28) 2; 29) 4; 30) 1; 31) 4; 32) 4; 33) 2; 34) 3; 35) 4; 36) 3; 37) 1; 38) 4; 39) 3; 40) 3. జన్‌ధన్ యోజన కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టు 15న ‘ప్రధానమంత్రి జనధన్ యోజన’ పథకాన్ని ప్రకటించింది. పేద ప్రజలందరికీ బ్యాంక్ ఖాతాలను కల్పించడం ద్వారా ఆర్థిక అస్పృశ్యతను.. తద్వారా పేదరికాన్ని నిర్మూ లించడమే ఈ పథకం లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 28న ఢిల్లీలో ప్రారంభించారు. దేశం మొత్తంమీద 600 కార్యక్రమాలు 77 వేల శిబిరాల ద్వారా ఈ పథకం ప్రారంభమైంది. ముఖ్యాంశాలు: - జన్‌ధన్ యోజన కింద ఆగస్టు 28న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 1.5 కోట్ల బ్యాంకు ఖాతాలను పేద ప్రజల పేరిట తెరిచారు. వచ్చే ఏడాది జనవరి 26 లోపు ఈ పథకం కింద బ్యాంకు ఖాతా తెరిచినవారికి లక్ష రూపాయల ప్రమాద బీమా కల్పిస్తారు. రూ. 30 వేల జీవిత బీమాను కూడా కల్పిస్తారు. - ఖాతా తెరిచిన ఆరు నెలల తర్వాత ప్రతి ఖాతాదారునికి 5 వేల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తారు. కనీస మొత్తమేమీ లేకుండానే ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డు అందజేస్తారు. - జన్‌ధన్ యోజన ద్వారా 2015 జనవరి 26 నాటికి దేశంలోని ఏడున్నర కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లభిస్తాయి. - హైదరాబాద్‌లో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. రాజమండ్రిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. - ఈ పథకం ట్యాగ్‌లైన్ ‘మేరా ఖాతా భాగ్య విధాతా’. - దీని లోగోను రూపకల్పన చేసినవారు - ప్రియాశర్మ. పథక ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ఈ మహిళకు 25 వేల రూపాయల బహుమతిని అందజేశారు. - ఈ పథకం ద్వారా ప్రజలకు కొంత రుణలభ్యత ఉండటం వల్ల వడ్డీ వ్యాపారుల నుండి రుణాలు తీసుకునే పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్న వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదలాయించడం సాధ్యమవుతుంది. దీనివల్ల అట్టడుగు స్థాయిలో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు. పేదరికం, అప్పులతో కూడిన విష వలయం నుంచి ప్రజలు విముక్తి పొందుతారు. - రూపే డెబిట్ కార్డును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) రూపొందించింది. రూపే కార్డు ఉన్నవారికి ఎల్ఐసీ 30 వేల రూపాయల జీవిత బీమా అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో లక్ష రూపాయల ప్రమాద బీమాను అందిస్తుంది. -
వరల్డ్ బ్యాడ్మింటన్: సెమీఫైనల్లోకి ప్రవేశించిన సింధు
కోపెన్‌హాగెన్‌లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం వెల్లి విరిసింది. పుసర్ల వెంకట సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. చైనాకు చెందిన సెకండ్ సీడ్ వాంగ్ షిజియాన్‌పై 19-21, 21-19, 21-15 స్కోరుతో సింధు జయభేరి మోగించింది. పదకొండో సీడ్ సింధు ఫస్ట్ గేమ్‌లో పోరాడి స్వల్ప తేడాతో ఓడినప్పటికీ, మిగతా రెండు గేముల్లో దుమ్ము రేపింది. నిరుడు గ్వాంగ్జావులో జరిగిన వరల్డ్ కప్‌లో కాంస్య పతకాన్ని గెలిచిన సింధు, ఇప్పుడు మరో మెడల్‌ను గ్యారంటీ చేసుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ రెండు వరుస గేముల్లో 21-15, 21-15 స్కోరుతో టాప్ సీడ్ లీ షురాయ్ చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో సైనా, సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కోపెన్‌హాగెన్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు అద్భుతంగా ఆడి క్వార్టర్స్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సైనా 14-21, 21-18, 21-12 తేడాతో జపాన్‌కు చెందిన సయాకా టకాహషిపై నెగ్గింది. తొలి గేమ్‌లో తడబడ్డ సైనా... తర్వాత పుంజుకుని ప్రత్యర్థిని చిత్తుచేసింది. మరో ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు ఓటమి అంచుల నుంచి తేరుకుని అద్భుతమైన పోరాటపటిమతో ఆడి గెలిచింది. తనకన్నా మెరుగైన ఆరో సీడ్ ఇయాన్ జు బే (కొరియా)పై సింధు 19-21, 22-20, 25-23 తేడాతో గెలిచింది. రెండో గేమ్‌లో ఓడిపోయే దశ నుంచి తేరుకున్న సింధు... హోరాహోరీగా సాగిన ఆఖరి గేమ్‌లో ఒత్తిడిని జయించింది. క్వార్టర్స్‌లో సైనా... ప్రపంచ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా)తో, సింధు... ప్రపంచ నంబర్ టూ షిజియాన్ వాంగ్ (చైనా)తో తలపడతారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కె.శ్రీకాంత్ 12-21, 10-21 తేడాతో రెండో సీడ్ లాంగ్ చెన్ (చైనా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి, సుమీత్ రెడ్డి 12-21, 17-21 తేడాతో యోంగ్ డే లీ, యియాన్ సియాంగ్ యూ (కొరియా) చేతిలో ఓడారు. -
సింధు ముందుకు...
ప్రి క్వార్టర్స్‌లో హైదరాబాదీ - శ్రీకాంత్ కూడా... - ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కోపెన్‌హాగెన్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో ‘బై’ లభించిన ఆమె బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. గత ఏడాది ఈ టోర్నీలో కాంస్యం గెలుచుకున్న సింధు 21-12, 21-17 స్కోరుతో ఓల్గా గొలోవనోవా (రష్యా)ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 21-18, 21-13తో రాజీవ్ ఓసెఫ్ (ఇంగ్లండ్)పై గెలిచి ప్రి క్వార్టర్స్‌కు చేరాడు. మరో ఆటగాడు. అజయ్ జైరాం రెండో రౌండ్లో థాయిలాండ్‌కు చెందిన టనోంగ్‌సక్ చేతిలో 17-21, 14-21తో ఓడిపోయాడు. జ్వాల-అశ్విని జోడి నిష్ర్కమణ: మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. భారత ద్వయంపై ఐదో సీడ్ కింగ్ టియాన్-యున్లీ జావో (చైనా) జోడి 21-16, 21-8తో ఘన విజయం సాధించింది. మరో వైపు పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి (భారత్) జోడి మూడో రౌండ్లోకి ప్రవేశించగా...ప్రణవ్ చోప్రా- అక్షయ్ దివాల్కర్ జంట నిష్ర్కమించింది. మను-సుమీత్ 21-19, 21-19తో 15వ సీడ్ హషిమొటో-హిరాటా (జపాన్)పై విజయం సాధించారు. అయితే ప్రణవ్-అక్షయ్ ద్వయం ఐదో సీడ్ జుంగ్ కిమ్-రంగ్ కిమ్ (కొరియా) చేతిలో 15-21, 17-21తో ఓటమిపాలైంది. -
హోరాహోరీ ఆరంభం
న్యూఢిల్లీ: ఆరంభ విఘ్నాలను అధిగమించి కార్యరూపం దాల్చిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఆరంభం హోరాహోరీగా జరిగింది. చివరిదైన నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఫలితం తేలింది. ఆఖరి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప-జోచిమ్ ఫిషర్ నీల్సన్ (పుణే పిస్టన్స్) జోడి 21-19, 16-21, 11-3తో గుత్తా జ్వాల-కియెన్ కీట్ కూ (ఢిల్లీ) జంటపై గెలిచి పుణే పిస్టన్స్‌కు 3-2తో విజయాన్ని అందించింది. అంతకుముందు పురుషుల తొలి సింగిల్స్ మ్యాచ్‌లో... ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ సంచలనం సృష్టించాడు. పుణే పిస్టన్స్‌కు ఆడుతోన్న ప్రపంచ ఏడో ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)ను వరుస గేముల్లో బోల్తా కొట్టించి ఢిల్లీకి శుభారంభం ఇచ్చాడు. 37 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21-16, 21-20తో తియెన్ మిన్ ఎన్గుయెన్‌ను ఓడించాడు. గత ఆదివారం ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తియెన్ కాంస్యం నెగ్గడం గమనార్హం. మొత్తానికి సాయిప్రణీత్ తన కెరీర్లో మరో గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. గత జూన్‌లో ఇండోనేసియా ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ తౌఫిక్ హిదాయత్‌ను... సింగపూర్ సూపర్ సిరీస్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ యున్ హూ (హాంకాంగ్)ను... ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ మహ్మద్ హఫీజ్ హషీమ్ (మలేసియా)ను సాయిప్రణీత్ ఓడించాడు. సాయిప్రణీత్ విజయంతో స్మాషర్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లినా... రెండో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ జూలియన్ షెంక్ (పుణే-జర్మనీ) 21-15, 21-6తో జిందాపొన్ నిచావోన్ (ఢిల్లీ-థాయ్‌లాండ్)పై నెగ్గి స్కోరును సమం చేసింది. తర్వాత పురుషుల డబుల్స్‌లో బూన్ హోయెంగ్ తాన్-కియెన్ కీట్ కూ (ఢిల్లీ-మలేసియా) జోడి 21-13, 21-16తో రూపేశ్ కుమార్-సనావే థామస్ (పుణే-భారత్) జటను ఓడించి ఢిల్లీకి 2-1 ఆధిక్యాన్ని ఇచ్చింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్‌లో సౌరభ్ వర్మ (పుణే-భారత్) 21-16, 19-21, 11-5తో హెచ్.ఎస్.ప్రణయ్ (ఢిల్లీ-భారత్)పై నెగ్గి స్కోరును 2-2వద్ద సమం చేశాడు. -
ఆటను మరింత మెరుగుపర్చుకోవాలి : సింధు
రాబోయే రోజుల్లో తన ఆటను మరింత మెరుగు పర్చుకోవాల్సి ఉందని, అప్పుడే పెద్ద విజయాలు తన ఖాతాలో చేరతాయని భారత బ్యాడ్మింటన్ యువ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గడం గర్వంగా అనిపిస్తోందని ఆమె చెప్పింది. వరల్డ్ చాంపియన్‌షిప్ అనంతరం నగరానికి చేరుకున్న సింధు... మంగళవారం గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడింది. ‘వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడం చాలా సంతోషంగా ఉంది. సెమీస్‌లో ఓడినా ఎలాంటి బాధా లేదు. ఇకపై నా ఆటలో లోపాలను సరిదిద్దుకొని మరింత మెరుగవ్వాలి. ప్రతీ మ్యాచ్ నాకు కఠినం కానుంది. నేను బాగా ఆడతాననే విశ్వాసంతో ఉన్నాను’ అని సింధు పేర్కొంది. రత్చనోక్ జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తాను ఎలాంటి ఒత్తిడినీ ఎదుర్కోలేదని, ప్రత్యర్థి బాగా ఆడటం వల్లే ఓడానని చెప్పింది. ‘నేను ఆరంభంలోనే కొన్ని తప్పులు చేయడంతో ఆమె భారీ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. నేను కొంత నెగెటివ్ గేమ్ ఆడాను. అయితే రత్చనోక్ చాలా బాగా ఆడటంతో నేను కోలుకోలేకపోయాను’ అని సింధు విశ్లేషించింది. సైనా అద్భుతమైన క్రీడాకారిణి అని, కోర్టులో ఆమె దూకుడు తనకిష్టమని ఈ యువ షట్లర్ అభిప్రాయ పడింది. తన విజయం పట్ల కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారని, ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించడం నాన్న రమణ నుంచే అలవాటైందని ఆమె చెప్పడం విశేషం. కోర్టులో సుదీర్ఘంగా సాధన చేయడాన్ని తాను ఇబ్బందిగా భావించడం లేదని, అది కోచ్ గోపీచంద్‌పైనే ఆధారపడి ఉంటుందని సింధు చెప్పింది. ‘నాకు ఎన్ని గంటల శిక్షణ ఇచ్చినా అది నా కోసమే. కాబట్టి ఇష్టంతోనే కష్ట పడుతున్నాను. అలా చేస్తేనే నా తప్పులను సరిదిద్దుకోగలను. భవిష్యత్తులో రత్చనోక్‌ను ఓడించాలంటే ఇది అవసరం. ఆట వల్ల నేనేమీ కోల్పోవడం లేదు. ప్రస్తుతం ఒక్కో టోర్నీలో ప్రదర్శనపై దృష్టి పెట్టాను. గోపీ సర్ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళతాను’ అని సింధు స్పష్టం చేసింది. ‘సైనా ఒలింపిక్ మెడల్ నెగ్గి సరిగ్గా ఏడాది అయింది. ఇప్పుడు సింధు రూపంలో మళ్లీ మేం సంబరాలు జరుపుకుంటున్నాం. అయితే సైనా విజయాన్ని దీంతో పోల్చడం నాకిష్టం లేదు. సింధు అద్భుతంగా ఆడింది. భవిష్యత్తులో ఈ ప్రదర్శన ఇంకా మెరుగవుతుంది. అద్భుతమైన ఫిట్నెస్ కూడా సింధు విజయంలో కీలక పాత్ర పోషించింది. చైనాను అడ్డుకునేందుకు ఇప్పుడు ప్రతీ దేశం వ్యూహాలు పన్నుతోంది. అప్పుడు మరో వైపునుంచి పోటీ ఎదురువుతుంది. థాయిలాండ్‌నుంచి ఇప్పుడు టాప్-20లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో ఎక్కువగా దేశవాళీ టోర్నీలు లేకపోవడం వల్ల సైనా, సింధు ప్రత్యర్థులుగా తలపడే అవకాశం పెద్దగారాలేదు. ఇకపై అంతర్జాతీయ స్థాయిలో అది జరుగుతుంది. అయితే చివరకు భారత్‌కు పతకం రావడమే ముఖ్యం. ఆ దిశగా శ్రమిస్తున్నాం’ - పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ -
లిన్ డాన్, రత్చనోక్ కొత్త చరిత్ర
గ్వాంగ్జూ (చైనా): ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగినప్పటికీ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని చైనా స్టార్ లిన్ డాన్ నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో లిన్ డాన్ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను ఐదోసారి నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)తో జరిగిన ఫైనల్లో లిన్ డాన్ 16-21, 21-13, 20-17తో ఆధిక్యంలో ఉన్నదశలో మోకాలి గాయంతో లీ చోంగ్ వీ వైదొలిగాడు. గత ఏడాది ఆగస్టులో లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచాక లిన్ డాన్ ఇప్పటిదాకా ఈ టోర్నీలోనూ పాల్గొనలేదు. దాంతో అతని ర్యాంక్ 286కు చేరుకుంది. ఫలితంగా సొంతగడ్డపై జరిగిన మెగా ఈవెంట్లో నిర్వాహకులు అతనికి ‘వైల్డ్ కార్డు’ను కేటాయించారు. గతంలో లిన్ డాన్ 2006, 2007, 2009, 2011లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 13 ఏళ్ల తర్వాత... మహిళల సింగిల్స్ విభాగంలో 18 ఏళ్ల థాయ్‌లాండ్ సంచలనం ఇంతనోన్ రత్చనోక్ తన జోరును కొనసాగిస్తూ పిన్న వయస్సులో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర లిఖించింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా)తో జరిగిన ఫైనల్లో రత్చనోక్ 22-20, 21-18తో విజయం సాధించింది. 1999లో కామిల్లా మార్టిన్ (డెన్మార్క్) తర్వాత చైనాయేతర క్రీడాకారిణి వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. థాయ్‌లాండ్ నుంచి విశ్వవిజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా కూడా రత్చనోక్ గుర్తింపు పొందింది. పురుషుల డబుల్స్‌లో మహ్మద్ అహసాన్-హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా); మహిళల డబుల్స్‌లో జియోలి వాంగ్-యాంగ్ యూ (చైనా); మిక్స్డ్ డబుల్స్‌లో తొంతోవి అహ్మద్-నాత్సిర్ (ఇండోనేసియా) జోడిలు టైటిల్స్ నెగ్గాయి. -
షట్లర్ సింధుకు మంత్రి జితేందర్ అభినందనలు
న్యూఢిల్లీ: భారత షట్లర్ పి.వి.సింధుకు క్రీడల మంత్రి జితేందర్ సింగ్ అభినందలు తెలిపారు. చైనాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళలు సింగిల్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. జితేందర్ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సింధు కాంస్యం సాధించడం యావత్తు దేశానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ప్రపంచ ర్యాకింగ్‌లో 12వ స్థానంలో ఉన్న సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఇద్దరు చైనా మహిళలను కంగుతినిపించి కాంస్యం ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో సింధు 10-21, 13-21 తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే.