ఆటను మరింత మెరుగుపర్చుకోవాలి : సింధు | Improve a lot to win the games : PV Sindhu | Sakshi
Sakshi News home page

ఆటను మరింత మెరుగుపర్చుకోవాలి : సింధు

Published Wed, Aug 14 2013 4:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

కోచ్ గోపీచంద్‌తో సింధు

కోచ్ గోపీచంద్‌తో సింధు

రాబోయే రోజుల్లో తన ఆటను మరింత మెరుగు పర్చుకోవాల్సి ఉందని, అప్పుడే పెద్ద విజయాలు తన ఖాతాలో చేరతాయని భారత బ్యాడ్మింటన్ యువ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గడం గర్వంగా అనిపిస్తోందని ఆమె చెప్పింది. వరల్డ్ చాంపియన్‌షిప్ అనంతరం నగరానికి చేరుకున్న సింధు... మంగళవారం గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడింది. ‘వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడం చాలా సంతోషంగా ఉంది. సెమీస్‌లో ఓడినా ఎలాంటి బాధా లేదు. ఇకపై నా ఆటలో లోపాలను సరిదిద్దుకొని మరింత మెరుగవ్వాలి. ప్రతీ మ్యాచ్ నాకు కఠినం కానుంది. నేను బాగా ఆడతాననే విశ్వాసంతో ఉన్నాను’ అని సింధు పేర్కొంది. రత్చనోక్ జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తాను ఎలాంటి ఒత్తిడినీ ఎదుర్కోలేదని, ప్రత్యర్థి బాగా ఆడటం వల్లే ఓడానని చెప్పింది. ‘నేను ఆరంభంలోనే కొన్ని తప్పులు చేయడంతో ఆమె భారీ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. నేను కొంత నెగెటివ్ గేమ్ ఆడాను. అయితే రత్చనోక్ చాలా బాగా ఆడటంతో నేను కోలుకోలేకపోయాను’ అని సింధు విశ్లేషించింది.

సైనా అద్భుతమైన క్రీడాకారిణి అని, కోర్టులో ఆమె దూకుడు తనకిష్టమని ఈ యువ షట్లర్ అభిప్రాయ పడింది. తన విజయం పట్ల కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారని, ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించడం నాన్న రమణ నుంచే అలవాటైందని ఆమె చెప్పడం విశేషం. కోర్టులో సుదీర్ఘంగా సాధన చేయడాన్ని తాను ఇబ్బందిగా భావించడం లేదని, అది కోచ్ గోపీచంద్‌పైనే ఆధారపడి ఉంటుందని సింధు చెప్పింది. ‘నాకు ఎన్ని గంటల శిక్షణ ఇచ్చినా అది నా కోసమే. కాబట్టి ఇష్టంతోనే కష్ట పడుతున్నాను. అలా చేస్తేనే నా తప్పులను సరిదిద్దుకోగలను. భవిష్యత్తులో రత్చనోక్‌ను ఓడించాలంటే ఇది అవసరం. ఆట వల్ల నేనేమీ కోల్పోవడం లేదు. ప్రస్తుతం ఒక్కో టోర్నీలో ప్రదర్శనపై దృష్టి పెట్టాను. గోపీ సర్ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళతాను’ అని సింధు స్పష్టం చేసింది.
 
‘సైనా ఒలింపిక్ మెడల్ నెగ్గి సరిగ్గా ఏడాది అయింది. ఇప్పుడు సింధు రూపంలో మళ్లీ మేం సంబరాలు జరుపుకుంటున్నాం. అయితే సైనా విజయాన్ని దీంతో పోల్చడం నాకిష్టం లేదు. సింధు అద్భుతంగా ఆడింది. భవిష్యత్తులో ఈ ప్రదర్శన ఇంకా మెరుగవుతుంది. అద్భుతమైన ఫిట్‌నెస్ కూడా సింధు విజయంలో కీలక పాత్ర పోషించింది.  చైనాను అడ్డుకునేందుకు ఇప్పుడు ప్రతీ దేశం వ్యూహాలు పన్నుతోంది. అప్పుడు మరో వైపునుంచి పోటీ ఎదురువుతుంది. థాయిలాండ్‌నుంచి ఇప్పుడు టాప్-20లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో ఎక్కువగా దేశవాళీ టోర్నీలు లేకపోవడం వల్ల సైనా, సింధు ప్రత్యర్థులుగా తలపడే అవకాశం పెద్దగారాలేదు. ఇకపై అంతర్జాతీయ స్థాయిలో అది జరుగుతుంది. అయితే చివరకు భారత్‌కు పతకం రావడమే ముఖ్యం. ఆ దిశగా శ్రమిస్తున్నాం’     

 - పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement