హుఎల్వా (స్పెయిన్): రెండేళ్ల క్రితం విశ్వ విజేతగా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షట్లర్‌గా చరిత్ర సృష్టించిన పీవీ సింధు టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో మళ్లీ ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగనుంది. నేడు మొదలై ఈనెల 19న ముగిసే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా సింధు పోటీపడనుంది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సింధు మంగళవారం జరిగే రెండో రౌండ్‌లో స్లోవేకియా ప్లేయర్ మార్టినా రెపిస్కాతో ఆడుతుంది.
రెపిస్కా, రుసేలి హర్తావన్ (ఇండోనేసియా) మధ్య తొలి రౌండ్ జరగాల్సింది. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ నుంచి చివరి నిమిషంలో ఇండోనేసియా క్రీడాకారులందరూ వైదొలిగారు. ఇండోనేసియా తప్పుకునే సమయానికి ‘డ్రా’ పూర్తి కావడంతో వారి స్థానాలను ఇతర క్రీడాకారులతో భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. దాంతో రెపిస్కాకు తొలి రౌండ్‌లో ‘వాకోవర్’ లభించింది.
రెపిస్కాపై గెలిస్తే సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో ఆడాల్సి రావచ్చు. చోచువోంగ్‌ను ఓడిస్తే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) రూపంలో సింధుకు క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశాలున్నాయి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరు క్వార్టర్ ఫైనల్లో ఎదురుకాగా, సింధు పైచేయి సాధించింది. ఆ ఈవెంట్ తర్వాత తై జు యింగ్‌తో ఆడిన నాలుగుసార్లూ సింధుకు ఓటమి ఎదురైంది.
ఒకవేళ తై జు యింగ్ అడ్డంకిని దాటితే సెమీఫైనల్లో సింధుకు చైనా ప్లేయర్ హి బింగ్‌జియావో ఎదురయ్యే చాన్స్ ఉంది. మరో పార్శ్వం నుంచి కొరియా స్టార్ ఆన్ సెయంగ్, అకానె యామగుచి (జపాన్), ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)లలో ఒకరు ఫైనల్ చేరుకోవచ్చు.
మూడుసార్లు ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), 2017 విశ్వవిజేత నొజోమి ఒకుహారా (జపాన్) గాయాల కారణంగా ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడటం లేదు. ఈ ఏడాది సింధు మొత్తం 10 అంతర్జాతీయ టోర్నీలలో ఆడింది. అయితే ఒక్క టోర్నీలోనూ టైటిల్ సాధించలేకపోయింది. స్విస్ ఓపెన్‌లో, వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది.
రెండో రౌండ్‌లో సిక్కి–అశ్విని జంట
పురుషుల డబుల్స్‌లో భారత్ తరఫున సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమిత్ రెడ్డి–మనూ అత్రి; అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా; అర్జున్–ధ్రువ్ కపిల జోడీలు... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; దండు పూజ–సంజన జంటలు... మిక్స్‌డ్ డబుల్స్‌లో అనుష్క–సౌరభ్ శర్మ; జూహీ–వెంకట్ ప్రసాద్; కరిష్మా–ఉత్కర్‡్ష అరోరా జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. సిక్కి–అశ్విని తొలి రౌండ్ ప్రత్యర్థి జోడీ డెల్‌ఫిన్–లియా పలెర్మో (ఫ్రాన్స్) వైదొలగడంతో భారత జంట రెండో రౌండ్‌కు చేరుకుంది.
ఒకే పార్శ్వంలో ముగ్గురు...
పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి శ్రీకాంత్, సాయిప్రణీత్, లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ బరిలో ఉన్నారు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సాయిప్రణీత్, శ్రీకాంత్, లక్ష్య సేన్ ఒకే పార్శ్వంలో ఉండటంతో ఒక్కరు మాత్రమే సెమీఫైనల్ చేరుకునే అవకాశముంది. లక్ష్య సేన్ తొలి రౌండ్ ప్రత్యర్థి వీస్‌కెర్చిన్ (జర్మనీ) టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత షట్లర్ రెండో రౌండ్ చేరుకున్నాడు.
నేడు తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పాబ్లో అబియాన్ (స్పెయిన్)తో శ్రీకాంత్, మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)తో సాయిప్రణీత్ ఆడతారు. డిఫెండింగ్ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) గాయంతో వైదొలగడం, ఇండోనేసియా ఆటగాళ్లు కూడా దూరం కావడంతో భారత ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్టు ఆడితే పతకంతో తిరిగి రావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment