కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో ఈ మాజీ చాంపియన్ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్లో ఆమెకు ‘బై’ లభించడంతో నేరుగా రెండో రౌండ్లో పోటీపడింది. ప్రతీసారి కనీసం క్వార్టర్ ఫైనలిస్ట్‌గా నిలిచిన ఆమె బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 14–21, 14–21తో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయింది.
రెండు గేముల్లో కూడా ఆరంభంలో ప్రత్యర్థికంటే మెరుగ్గా, ప్రత్యర్థికి దీటుగా ఆడిన 16వ సీడ్ సింధు గేమ్ సాగే కొద్దీ డీలా పడటంతో వరుస గేముల్లోనే ఓడింది. రెండో గేమ్‌లో సింధు ఒకదశలో 9–0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ జపాన్ షట్లర్ వరుసగా పాయింట్లు నెగ్గుకుంటూ రావడంతో మళ్లీ సింధు ఆధిక్యాన్ని, ఆ తర్వాత మ్యాచ్‌నే కోల్పోయింది.
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్స్ ప్రణయ్, లక్ష్యసేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్‌లో లక్ష్యసేన్ 21–11, 21–12తో జియోన్ హ్యోక్ (కొరియా)పై, ప్రణయ్ 21–9, 21–14తో చికొ అర వర్డొయో (ఇండోనేసియా)పై గెలుపొందారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)తో ప్రణయ్; కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్)తో లక్ష్య సేన్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment