సాత్విక్, చిరాగ్
టోక్యో: కెరీర్‌లో నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న సాత్విక్–చిరాగ్ జోడీ కాంస్య పతకంతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 22–20, 18–21, 16–21తో ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) చేతిలో పోరాడి ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సాత్విక్–చిరాగ్ ప్రదర్శనతో వరుసగా తొమ్మిదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో పతకం చేరింది.
77 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో రెండు జోడీలు అద్భుతంగా ఆడినా కీలకదశలో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ పైచేయి సాధించి విజయాన్ని అందుకున్నారు. ఆరోన్ చియా–సో వుయ్ యిక్ జోడీ చేతిలో సాత్విక్–చిరాగ్ శెట్టిలకిది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. ‘ముఖ్యమైన మ్యాచ్‌లలో కీలకదశల్లో మాకు అదృష్టం కలిసి రావడంలేదు. కీలక సందర్భాల్లో అదృష్టం మావైపు ఉండాలంటే మేము మరిన్ని పూజలు చేసి దేవుడిని ప్రార్థించాలేమో.
ఓవరాల్‌గా మా ప్రదర్శనపట్ల సంతృప్తిగా ఉన్నా సెమీఫైనల్ మ్యాచ్ ఫలితం మాత్రం నిరాశ కలిగించింది. తొలి గేమ్ గెలిచాక రెండో గేమ్‌లో మేము మలేసియా జోడీపై మరింత ఒత్తిడి పెంచాల్సింది. పతకం సాధించాలనే లక్ష్యంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు వచ్చాం. పతకం గెలిచినందుకు సంతోషంగా ఉన్నా ఫైనల్ చేరితే మా ఆనందం రెట్టింపు అయ్యేది. భవిష్యత్‌లో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాం’ అని సాత్విక్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment