కొపెన్ హాగెన్ (డెన్మార్క్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్‌లపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేటి నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో భారత ఆటగాళ్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. మహిళల విభాగంలో మాజీ చాంపియన్ పీవీ సింధుకు తొలి రౌండ్లో బై లభించింది.
మాజీ ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్), తుయ్ లిన్ గుయెన్ (వియత్నాం) మధ్య తొలి రౌండ్ విజేతతో 2019 ప్రపంచ చాంపియన్ సింధు రెండో రౌండ్లో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్‌కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. మొదటి రౌండ్లోనే అతను 14వ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)ను ఎదుర్కొంటాడు. 11వ సీడ్ లక్ష్య సేన్...జార్జెస్ జులియన్ పాల్ (మారిషస్)తో, 9వ సీడ్ ప్రణయ్... కెల్లే కొల్జనెన్ (ఫిన్లాండ్)తో పోటీపడతారు.
పురుషుల డబుల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకింగ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఈసారి స్వర్ణంపై కన్నేసింది. గత ఏడాది జరిగిన ఈ టోర్నీలో మేటి డబుల్స్ జోడీ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మహిళల డబుల్స్‌లో 15వ సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటకు తొలి రౌండ్లో బై లభించింది.
సిన్సినాటి ఓపెన్ ఫైనల్లో అల్‌కరాజ్‌తో జొకోవిచ్ ‘ఢీ’
కెరీర్‌లో 39వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించేందుకు సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్... కెరీర్‌లో ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గేందుకు స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్ అమీతుమీ తేల్చుకోనున్నారు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరుగుతున్న సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో వీరిద్దరూ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో అల్‌కరాజ్ 2–6, 7–6 (7/4), 6–3తో హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించగా... జొకోవిచ్ 7–6 (7/5), 7–5తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను ఓడించాడు. ఈ క్రమంలో 36 ఏళ్ల జొకోవిచ్ ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన పెద్ద వయసు్కడిగా గుర్తింపు పొందాడు. అల్‌కరాజ్‌తో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 1–2తో వెనుకంజలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment