నాన్‌జింగ్ (చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... ప్రణయ్, సమీర్ వర్మ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన పీవీ సింధు అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్‌కు రెండో రౌండ్‌లో పాబ్లో అబియాన్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ ఎదురైంది. 62 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–15, 12–21, 21–14తో గెలుపొందాడు. స్పెయిన్‌కే చెందిన ఎన్రిక్‌తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సాయిప్రణీత్ 33 నిమిషాల్లో 21–18, 21–11తో గెలుపొందాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ ప్రణయ్ 21–8, 16–21, 15–21తో 39వ ర్యాంకర్ యగోర్ కోఎల్హో (బ్రెజిల్) చేతిలో అనూహ్యంగా ఓడిపోగా... సమీర్ వర్మ 17–21, 14–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు 21–14, 21–9తో 41వ ర్యాంకర్ ఫిత్రియాని (ఇండోనేసియా)పై గెలిచింది. ఏ దశలోనూ ఫిత్రియానిని తక్కువ అంచనా వేయకుండా ఆడిన సింధు 35 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 18–21, 21–15, 16–21తో ఆస్ట్రప్–స్కారప్ (డెన్మార్క్) చేతిలో... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 24–22, 13–21, 16–21తో టకుటో–కనెకో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో సిక్కి–అశ్విని 14–21, 15–21తో ఫుకు షిమా–హిరోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు.
భారత ఆటగాళ్ల నేటి షెడ్యూల్
మహిళల సింగిల్స్
సైనా (vs) రచనోక్ (థాయ్‌లాండ్)
సింధు (vs) సుంగ్ జీ హున్ (కొరియా)
పురుషుల సింగిల్స్
సాయిప్రణీత్(vs) విటింగస్ (డెన్మార్క్)
శ్రీకాంత్ (vs) డారెన్ లియు (మలేసియా)
మిక్స్‌డ్ డబుల్స్
సాత్విక్ – అశ్విని (vs) గో సూన్
హువాట్ – జేమీ షెవోన్ (మలేసియా)
ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment