శ్రమించిన సింధు
♦ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం
♦ శ్రీకాంత్ శుభారంభం
♦ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
జకార్తా : వరుసగా మూడోసారి పతకం నెగ్గి ‘హ్యాట్రిక్’ సాధించాలనే లక్ష్యంతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత స్టార్ పీవీ సింధు తొలి అడ్డంకిని చెమటోడ్చి అధిగమించింది. 11వ సీడింగ్ పొందిన ఈ హైదరాబాద్ అమ్మాయికి తొలి రౌండ్‌లో ‘బై’ లభించడంతో నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సింధు 11-21, 21-17, 21-16తో లినీ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో లీ జురుయ్ (చైనా)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది.
కెరీర్‌లో తొలిసారి లినీతో ఆడిన సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. ఆరంభంలో 1-6తో వెనుకబడిన సింధు తేరుకునేలోపు గేమ్‌ను కోల్పోయింది. అయితే రెండో గేమ్‌లో కుదురుకున్న సింధు 5-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న ఆమె రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. మూడో గేమ్‌లో సింధు 8-9తో వెనుకబడిన దశలో వరుసగా ఐదు పాయింట్లు సాధించి 13-9తో ముందంజ వేసింది. అదే జోరులో గేమ్‌ను దక్కించుకొని 50 నిమిషాల్లో నెగ్గింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. మైకేల్ ఫారిమన్ (ఆస్ట్రేలియా)తో జరిగిన తొలి రౌండ్‌లో శ్రీకాంత్ కేవలం 24 నిమిషాల్లో 21-10, 21-13తో గెలుపొంది రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. తదుపరి రౌండ్‌లో సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ ఆడతాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో ప్రపంచ 17వ ర్యాంక్ జంట సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.
నేటి మ్యాచ్‌లు ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం