సింధు, సైనాలకు ‘బై’
►శ్రీకాంత్ సత్తాకు పరీక్ష
►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘డ్రా’ విడుదల
►ఈనెల 21 నుంచి స్కాట్లాండ్‌లో టోర్నీ
న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లు జరిగితే... వరుసగా ఐదోసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం వచ్చే అవకాశముంది. ఈనెల 21 నుంచి 27 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. బుధవారం ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను విడుదల చేశారు. తొలిసారి భారత్ తరఫున సింగిల్స్ విభాగాల్లో ఏకంగా ఎనిమిది మంది బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, తన్వీ లాడ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ సింధు, 12వ సీడ్ సైనా నెహ్వాల్‌లకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. రెండో రౌండ్‌లో సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్) లేదా నటాల్యా వోట్‌సెక్ (ఉక్రెయిన్)లతో సైనా...కిమ్ హో మిన్ (కొరియా) లేదా హదియా హోస్నీ (ఈజిప్ట్)లతో సింధు ఆడే చాన్స్ ఉంది. అంతా సజావుగా సాగితే క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సున్ యు (చైనా)తో సింధు; ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సైనా ఆడొచ్చు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చోల్ బిర్చ్ (ఇంగ్లండ్)తో తన్వీ లాడ్; ఐరి మికెలా (ఫిన్‌లాండ్)తో రితూపర్ణ దాస్ తలపడతారు. సైనా, సింధు వేర్వేరు పార్శా్వల్లో ఉన్నందున కేవలం ఫైనల్లోనే ఎదురయ్యే అవకాశముంది.
పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌గా పోటీపడనున్న శ్రీకాంత్ తొలి రౌండ్‌లో సెర్గీ సిరాంట్ (రష్యా)తో ఆడతాడు. ఆ తర్వాత రెండో రౌండ్‌లో లిన్ యు సియెన్ (చైనీస్ తైపీ) లేదా లుకాస్ కోర్వీ (ఫ్రాన్స్)లతో... ప్రిక్వార్టర్ ఫైనల్లో టామీ సుగియార్తో (ఇండోనేసియా) లేదా హు యున్ (హాంకాంగ్)లతో శ్రీకాంత్ ఆడే చాన్స్ ఉంది. ఇక క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్‌కు టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) ఎదురయ్యే అవకాశముంది. తొలి రౌండ్ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ శ్రీకాంత్‌కు నైపుణ్యమున్న ఆటగాళ్లే ఎదురుకానున్నారు. అయితే వరుసగా ఇండోనేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచి జోరు మీదున్న శ్రీకాంత్ తన స్థాయికి తగ్గట్టు ఆడితే సెమీఫైనల్‌కు చేరుకోవడం కష్టమేమీ కాదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరుకుంటే కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు పతకం వచ్చి 34 ఏళ్లు గడిచాయి. ఈ విభాగంలో భారత్‌కు లభించిన ఏకైక కాంస్య పతకాన్ని ప్రకాశ్ పదుకొనే (1983లో) అందించారు.
పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వీ నాన్ (హాంకాంగ్)తో 15వ సీడ్ సాయిప్రణీత్; లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)తో 13వ సీడ్ అజయ్ జయరామ్; పాబ్లో అబియాన్ (స్పెయిన్)తో సమీర్ వర్మ తలపడతారు.
భారత్ తరఫున పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి; సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జోడీలు... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; సంజన సంతోష్–ఆరతి సారా; జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ జంటలు; మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సాత్విక్ సాయిరాజ్–మనీషా; సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీలు బరిలో ఉన్నాయి.
చివరి నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్‌కు నాలుగు పతకాలు వచ్చాయి. 2011లో మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప ద్వయం... 2013, 2014లలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు కాంస్య పత కాలు సాధించగా... 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ రజత పతకం సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ క్రీడలు జరిగిన ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ను నిర్వహించరు.
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు గ్లాస్గో నగరం 1997 తర్వాత మళ్లీ ఆతిథ్యమిస్తోంది. ఆ పోటీల్లో భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, విక్రాంత్ పట్వర్దన్... మహిళల సింగిల్స్‌లో మధుమిత బిస్త్ బరిలోకి దిగారు. అయితే గోపీచంద్ తొలి రౌండ్‌లో ఫెర్నాండో సిల్వా (పోర్చుగల్)కు వాకోవర్ ఇవ్వగా... విక్రాంత్ 8–15, 1–15తో అలెన్ బుడి కుసుమా (ఇండోనేసియా) చేతిలో... మధుమిత 5–11, 6–11తో జింగ్నా హాన్ (చైనా) చేతిలో ఓడారు.