శ్రీకాంత్‌కు షాక్
► సైనా, సింధు శుభారంభం
► ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత నంబర్‌వన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో గతేడాది విజేత శ్రీకాంత్ ఈసారి తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. గంటా 23 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ శ్రీకాంత్ 13-21, 21-17, 22-24తో ప్రపంచ ఏడో ర్యాంకర్ తియాన్ హువీ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. తియాన్ హువీ చేతిలో శ్రీకాంత్‌కిది ఆరో పరాజయం కావడం గమనార్హం. సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఉన్న మిగతా భారత ఆటగాళ్లు ప్రణయ్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ కూడా తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు. సోనీ ద్వి కుంకోరో (ఇండోనేసియా) 22-20, 21-13తో సాయిప్రణీత్‌పై, లిన్ డాన్ (చైనా) 21-18, 21-9తో సౌరభ్ వర్మపై, సెన్‌సోమ్‌బున్‌సుక్ (థాయ్‌లాండ్) 23-21, 18-21, 21-13తో ప్రణయ్‌పై, జ్విబ్లెర్ (జర్మనీ) 21-12, 13-21, 21-19తో జయరామ్‌పై గెలిచారు.
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, సైనా నెహ్వాల్, పీవీ సింధు శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో సైనా 21-7, 21-13తో తాన్వీ లాడ్ (భారత్)పై, సింధు 21-8, 21-8తో కికాగ్నిని (ఇటలీ)పై విజయం సాధించారు. గద్దె రుత్విక శివాని 10-21, 14-21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో ప్రణవ్-సిక్కిరెడ్డి జంట 21-17, 17-21, 21-14తో ప్రపంచ 12వ ర్యాంక్ జోడీ హై వన్- చోయ్ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించింది.