
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధనవంతులు మాత్రమే తమ పిల్లలను క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించాలన్నాడు. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. క్రీడాకారులకు తగినంత గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తాను ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపాడు.
కాగా భారత్‌లో బ్యాడ్మింటన్(Badminton) సూపర్ పవర్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిన పుల్లెల గోపిచంద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రొఫెషన్‌గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతుండటం సంతోషాన్ని ఇస్తుందన్నాడు. అయితే, అదే సమయంలో క్రీడాకారులలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది కెరీర్ మాత్రమే సాఫీగా సాగిపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు.
ధనవంతులకు మాత్రమే..
‘‘ధనికులై ఉండి లేదంటే.. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలన్నది నా అభిప్రాయం. నేను మాత్రం సాధారణ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు మాత్రం వారి పిల్లలను క్రీడల్లోకి పంపవద్దనే సలహా ఇస్తాను.
క్రికెట్‌లో రాణించిన వాళ్లు అన్నిరకాలుగా కొంతమేర సక్సెస్ అవుతారు. కానీ ఇతర క్రీడల్లో రాణించే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వారి త్యాగాలు, సేవలకు తగినంత మూల్యం అందుకోగలుగుతున్నారా?
సర్, మేడమ్ అని సంబోధిస్తూ
ఒలింపిక్ మెడల్స్ సాధించిన వాళ్లలో చాలా మంది రైల్వేస్, ఆర్బీఐ , ఇన్‌కమ్ టాక్స్, పోలీస్ ఉద్యోగాలు.. లేదంటే అంతకంటే తక్కువ కేడర్ కలిగిన జాబ్స్ చేస్తున్నారు. అయితే, ఓ సివిల్ సర్వెంట్ మాత్రం అరవై ఏళ్ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కానీ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్లు మాత్రం వారిని సర్, మేడమ్ అని సంబోధిస్తూ జీవితం గడపాలి.
వారి దయాదాక్షిణ్యాల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాత్రమే క్రీడాకారులకు గౌరవం ఇస్తారు. అయితే, ఆటగాళ్ల పట్ల ప్రతికూల భావనలు ఉన్నవారు మాత్రం సులువుగా ఉద్యోగానికి వచ్చేశారని చులకనగా చూసే అవకాశం ఉంది. గత ఇరవై ఏళ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూశారా?
ఈరోజు వారి సంపాదన ఎంత?
వివిధ క్రీడల్లో వారు పతకాలు సాధించారు. కానీ ఈరోజు వారి సంపాదన ఎంత? వారి భవిష్యత్తు ఏమిటి? దేశానికి పతకాలు సాధించిపెడుతున్న వారికి అంతే స్థాయిలో రివార్డులు దక్కుతున్నాయా? మరి అలాంటప్పుడు పిల్లలను స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఎలా చెప్పగలం?
ఒకవేళ మీరు స్పోర్ట్స్‌పర్సన్ కావాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే... అప్పుడు ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం కూడా సంపాదించండి. అదే విధంగా రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్ చేసుకోండి.
ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం మాత్రం మర్చిపోకూడదు’’ అని ఆటలతో పాటు చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల శ్రద్ధ చూపాలని వర్దమాన క్రీడాకారులకు గోపీచంద్ దిశానిర్దేశం చేశాడు.
కాగా గోపీచంద్ అకాడమీ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఒలింపిక్ మెడలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా డబుల్స్ విభాగంలో ప్రతిభను నిరూపించుకుంటోంది.
చదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment