Pullela Gayatri Gopichand
-
గాయత్రి–ట్రెసా జోడీ జోరు
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–12, 21–8తో అమెలీ లెహ్మన్–సెలీన్ హుబ్‡్ష (జర్మనీ) జంటపై విజయం సాధించింది. 38 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత ద్వయం ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. రెండో గేమ్‌లోనైతే ఒకదశలో గాయత్రి–ట్రెసా వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించారు. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 15–21, 11–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో... ప్రియాన్షు 15–21, 17–21తో టోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. ఇషారాణి బారువా 19–21, 21–18, 18–21తో జియాన్ జి హాన్ (చైనా) చేతిలో, అనుపమ 17–21, 19–21తో పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
వరుసగా 24వ ఏడాది టైటిల్ లేకుండానే...
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి వరుసగా 24వ ఏడాది భారత క్రీడాకారులు టైటిల్ లేకుండానే తిరిగి రానున్నారు. భారత్ నుంచి ఐదు విభాగాల్లో కలిపి మొత్తం 17 మంది క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగగా... ఒక్కరు కూడా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. సంచలన విజయాలతో ఆశలు రేకెత్తించిన లక్ష్య సేన్, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ 10–21, 16–21తో ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను ఓడించిన లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లో అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. మహిళల డబుల్స్‌లో 2022, 2023లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ ఈసారి క్వార్టర్ ఫైనల్లో 14–21, 10–21తో రెండో సీడ్ లియు షెంగ్షు–టాన్ నింగ్ (చైనా) జంట చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 15–21, 21–18, 21–18తో ఎనిమిదో సీడ్ కిమ్ హై జియోంగ్–కాంగ్ హీ యోంగ్ (కొరియా) జంటను ఓడించిది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన లక్ష్య సేన్‌కు 7,975 డాలర్లు (రూ. 6 లక్షల 93 వేలు)... గాయత్రి–ట్రెసాలకు 9,062 డాలర్లు (రూ. 7 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2 గతంలో భారత్ నుంచి ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) మాత్రమే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించారు. 2015లో సైనా నెహ్వాల్, 2022లో లక్ష్య సేన్ ఫైనల్ చేరుకున్నా రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. -
ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధనవంతులు మాత్రమే తమ పిల్లలను క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించాలన్నాడు. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. క్రీడాకారులకు తగినంత గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తాను ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపాడు.కాగా భారత్‌లో బ్యాడ్మింటన్(Badminton) సూపర్ పవర్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిన పుల్లెల గోపిచంద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రొఫెషన్‌గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతుండటం సంతోషాన్ని ఇస్తుందన్నాడు. అయితే, అదే సమయంలో క్రీడాకారులలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది కెరీర్ మాత్రమే సాఫీగా సాగిపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు.ధనవంతులకు మాత్రమే..‘‘ధనికులై ఉండి లేదంటే.. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలన్నది నా అభిప్రాయం. నేను మాత్రం సాధారణ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు మాత్రం వారి పిల్లలను క్రీడల్లోకి పంపవద్దనే సలహా ఇస్తాను.క్రికెట్లో రాణించిన వాళ్లు అన్నిరకాలుగా కొంతమేర సక్సెస్ అవుతారు. కానీ ఇతర క్రీడల్లో రాణించే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వారి త్యాగాలు, సేవలకు తగినంత మూల్యం అందుకోగలుగుతున్నారా?సర్, మేడమ్ అని సంబోధిస్తూ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వాళ్లలో చాలా మంది రైల్వేస్, ఆర్బీఐ , ఇన్కమ్ టాక్స్, పోలీస్ ఉద్యోగాలు.. లేదంటే అంతకంటే తక్కువ కేడర్ కలిగిన జాబ్స్ చేస్తున్నారు. అయితే, ఓ సివిల్ సర్వెంట్ మాత్రం అరవై ఏళ్ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కానీ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్లు మాత్రం వారిని సర్, మేడమ్ అని సంబోధిస్తూ జీవితం గడపాలి.వారి దయాదాక్షిణ్యాల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాత్రమే క్రీడాకారులకు గౌరవం ఇస్తారు. అయితే, ఆటగాళ్ల పట్ల ప్రతికూల భావనలు ఉన్నవారు మాత్రం సులువుగా ఉద్యోగానికి వచ్చేశారని చులకనగా చూసే అవకాశం ఉంది. గత ఇరవై ఏళ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూశారా?ఈరోజు వారి సంపాదన ఎంత?వివిధ క్రీడల్లో వారు పతకాలు సాధించారు. కానీ ఈరోజు వారి సంపాదన ఎంత? వారి భవిష్యత్తు ఏమిటి? దేశానికి పతకాలు సాధించిపెడుతున్న వారికి అంతే స్థాయిలో రివార్డులు దక్కుతున్నాయా? మరి అలాంటప్పుడు పిల్లలను స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఎలా చెప్పగలం?ఒకవేళ మీరు స్పోర్ట్స్‌పర్సన్ కావాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే... అప్పుడు ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం కూడా సంపాదించండి. అదే విధంగా రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్ చేసుకోండి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం మాత్రం మర్చిపోకూడదు’’ అని ఆటలతో పాటు చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల శ్రద్ధ చూపాలని వర్దమాన క్రీడాకారులకు గోపీచంద్ దిశానిర్దేశం చేశాడు. కాగా గోపీచంద్ అకాడమీ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఒలింపిక్ మెడలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా డబుల్స్ విభాగంలో ప్రతిభను నిరూపించుకుంటోంది.చదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ పోస్ట్ -
ముగిసిన గాయత్రి–ట్రెసా జోడీ పోరు
హాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్ నుంచి భారత జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. మొదటిసారి ఈ టోర్నీకి అర్హత సాధించిన గాయత్రి–ట్రెసా జంట సెమీఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 17–21, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ జంట నామి మసుయామ–చిహారు షిడా (జపాన్) చేతిలో ఓడిపోయింది. గ్రూప్ ‘ఎ’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా), నామి మసుయామ–చిహారు షిడా (జపాన్) జోడీలు సెమీఫైనల్ చేరుకున్నాయి. మూడో స్థానంలో నిలిచిన గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి 32,500 డాలర్ల (రూ. 27 లక్షల 56 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
గెలిచి నిలిచిన గాయత్రి–ట్రెసా జోడీ
హాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ తొలి విజయం నమోదు చేసుకుంది. మొదటిసారి ఈ టోర్నీకి అర్హత సాధించిన గాయత్రి–ట్రెసా జంట తొలి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ జోడీ చేతిలో ఓడినా... రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన పోరులో గాయత్రి –ట్రెసా ద్వయం 21–19, 21–19తో ప్రపంచ ఆరో ర్యాంక్ పియర్లీ టాన్–థీనా మరళీధరన్ (మలేసియా) జంటపై గెలుపొందింది. సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మన అమ్మాయిలు... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌ల్లో విజృంభించారు. 46 నిమిషాల పాటు సాగిన పోరులో మలేసియా జోడీ ఒక దశలో వరుసగా 6 పాయింట్లు సాధించి ఆధిక్యం కనబర్చే ప్రయత్నం చేయగా... భారత జంట కీలక సమయాల్లో విజృంభించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ ఆధిక్యం చేతులు మారుతూ సాగినా... చివరకు గాయత్రి–ట్రెసా జంటనే విజయం వరించింది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన చైనా జంట 2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత జట్టు ఒక పాయింట్‌తో రెండో స్థానంలో ఉంది. భారత షట్లర్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే నేడు జరిగే గ్రూప్ దశ చివరి లీగ్ మ్యాచ్‌లో నామీ మసుయమా–చిహారు షిడా (జపాన్)పై విజయం సాధించాల్సి ఉంటుంది. -
పోరాడి ఓడిన గాయత్రి–ట్రెసా జోడీ
హాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో తొలిసారి పోటీపడుతున్న భారత జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ తొలి మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ నంబర్‌వన్ జంట లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా)తో జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 22–20, 20–22, 14–21తో పోరాడి ఓడిపోయింది. 82 నిమిషాల సుదీర్ఘ పోరులో గాయత్రి–ట్రెసా వరల్డ్ నంబర్‌వన్ జోడీకి గట్టిపోటీనే ఇచ్చారు. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న భారత జంట రెండో గేమ్‌లో 14–18తో వెనుకబడింది. ఈ దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరును 18–18తో సమం చేసింది. ఆ తర్వాత చైనా జోడీ రెండు పాయింట్లు గెలవగా... ఆ వెంటనే భారత జంట కూడా రెండు పాయింట్లు సాధించింది. దాంతో స్కోరు మళ్లీ 20–20తో సమమైంది. ఈ దశలో చైనా జోడీ రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో చైనా జోడీ తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడి గట్టెక్కింది. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో పియర్లీ టాన్–థీనా మురళీధరన్ (మలేసియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే గాయత్రి–ట్రెసా జోడీకి సెమీఫైనల్ చేరుకునే అవకాశాలు సజీవంగా ఉంటాయి. -
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ నేటి నుంచే..
హాంగ్జౌ (చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు నేడు తెర లేవనుంది. ఐదు రోజులపాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మొత్తం ఐదు విభాగాల్లో (పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఈసారి భారత్ నుంచి కేవలం మహిళల డబుల్స్‌లో మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె పుల్లెల గాయత్రి, కేరళ అమ్మాయి ట్రెసా జాలీ మహిళల డబుల్స్‌లో జోడీగా బరిలోకి దిగనున్నారు. ఈ ఏడాది ఆయా టోర్నీలలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా టాప్–8లో నిలిచిన వారు వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులెవరూ టాప్–8లో నిలవకపోవడంతో ఈ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని పొందలేకపోయారు. ఈ టోర్నీ చరిత్ర లో భారత్ నుంచి పీవీ సింధు 2018లో మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. కఠిన ప్రత్యర్థులే... సీజన్ ముగింపు టోర్నీలో గాయత్రి–ట్రెసా జోడీకి క్లిష్టమైన ‘డ్రా’ పడింది. మహిళల డబుల్స్ గ్రూప్ ‘ఎ’లో ప్రపంచ నంబర్‌వన్ జంట లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా), ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ షిడా చిహారు–నామి మత్సుయామ (జపాన్), ప్రపంచ ఆరో ర్యాంకర్ ద్వయం పియర్లీ టాన్–థీనా మురళీధరన్ (మలేసియా)లతో 13వ స్థానంలో ఉన్న గాయత్రి–ట్రెసా తలపడాల్సి ఉంది. బుధవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ లియు షెంగ్ షు–టాన్ నింగ్లతో గాయత్రి–ట్రెసా ఆడతారు. ప్రైజ్‌మనీ ఎంతంటే... వరల్డ్ టూర్ ఫైనల్స్ మొత్తం ప్రైజ్‌మనీ 25 లక్షల డాలర్లు (రూ. 21 కోట్ల 21 లక్షలు). పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 2 లక్షల డాలర్ల (రూ. 1 కోటీ 69 లక్షలు) చొప్పున... మూడు డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ నెగ్గిన వారికి 2 లక్షల 10 వేల డాలర్ల (రూ. 1 కోటీ 78 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది. రన్నరప్, సెమీఫైనలిస్ట్‌లకు, గ్రూపుల్లో మూడో స్థానంలో, నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా ప్రైజ్‌మనీ అందజేస్తారు. -
బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌కు గాయత్రి–ట్రెసా జోడీ అర్హత
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్ కు పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ అర్హత సాధించింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా వరల్డ్ ర్యాంకింగ్ ప్రకారం అర్హత సాధించారు. మంగళవారం ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో టాప్–8 జోడీలు ప్రతిష్టాత్మక ఫైనల్స్ టోర్నీ ఆడతాయి. భారత్ నుంచి ఈ టోర్నీలో వీరిద్దరు మాత్రమే బరిలోకి దిగుతున్నారు. ఈ సీజన్లో గాయత్రి–ట్రెసా నిలకడగా రాణించారు. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్స్‌లోనే ఓడినా... ఇతర టోర్నీనల ప్రదర్శన వారికి ఈ అవకాశం కల్పింపంచింది. సింగపూర్ ఓపెన్, మకావు ఓపెన్లలో గాయత్రి–ట్రెసా సెమీఫైనల్‌కు చేరారు. ఇప్పటి వరకు బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు మాత్రమే 2018లో విజేతగా నిలిచింది. సీజన్ చివరి టోర్నీకి అర్హత సాధించడం పట్ల ట్రెసా జాలీ సంతోషం వ్యక్తం చేసింది. ‘తొలిసారి ఫైనల్స్‌కు క్వాలిఫై కావడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. నాకౌట్ టోర్నీ కాదు కాబట్టి గ్రూప్ దశలో ప్రతీ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయతి్నస్తాం’ అని ఆమె పేర్కొంది. చైనాలోని హాంగ్జూలో డిసెంబర్ 11–15 మధ్య బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ జరుగుతుంది -
గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం
మకావ్: మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో మూడో సీడ్ గాయత్రి–ట్రెసా ద్వయం 15–21, 21–16, 21–14తో అకారి సాటో–మాయా టగూచి (జపాన్) జోడీపై గెలిచింది. గద్దె రుత్విక శివాని–సిక్కి రెడ్డి ద్వయం మహిళల డబుల్స్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్ ఫైనల్ మ్యాచ్‌లో రుతి్వక–సిక్కి జంట 21–15, 21–10తో చెయుంగ్ యాన్ యు–చు వింగ్ చి (హాంకాంగ్) ద్వయంపై నెగ్గింది. పురుషుల సింగిల్స్ లో భారత ప్లేయర్ ఆలాప్ మిశ్రా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ ఫైనల్ మ్యాచ్‌లో ఆలాప్ 21–10, 24–22తో భారత్‌కే చెందిన ఆర్యమాన్ టాండన్‌ను ఓడించాడు. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి శ్రీకాంత్, మిథున్, సమీర్ వర్మ, ఆయూశ్, శంకర్ ముత్తుస్వామి, చిరాగ్ సేన్ పోటీపడనున్నారు. మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అనుపమ, తాన్యా హేమంత్, తస్నిమ్ మీర్, దేవిక సిహాగ్, ఇషారాణి బారువా బరిలో ఉన్నారు. -
క్వార్టర్ ఫైనల్లో గాయత్రి – ట్రెసా జోడి
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీ కెనడా ఓపెన్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ గాయత్రి – ట్రెసా 17–21, 21–7, 21–8 స్కోరుతో నటాషా ఆంథోనిసెన్ (డెన్మార్క్) – అలీసా టిర్‌టొసెన్‌టొనొ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్ కూడా క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ప్రపంచ 39వ ర్యాంకర్ ప్రియాన్షు 21–19, 21–11తో టకూమా ఒబయాషీ (జపాన్)పై గెలుపొందాడు. అయితే ఇతర భారత షట్లర్లకు రెండో రౌండ్లో నిరాశే ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో గారగ కృష్ణప్రసాద్ – కె.సాయిప్రతీక్ 21–19, 18–21, 17–21తో బింగ్ వీ – చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ) చేతిలో...మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్ – గద్దె రుత్విక శివాని 15–21, 21–19, 9–21తో చెంగ్ కువాన్ – యిన్ హుయి (చైనీస్ తైపీ)చేతిలో పరాజయంపాలయ్యారు. -
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి–ట్రెసా జోడీ
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–15, 21–11తో యు పె చెంగ్–యు సింగ్ సన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ ముందంజ వేయగా... భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. లక్ష్య సేన్ 21–12, 21–17తో కెంటా సునెయామ (జపాన్)పై గెలుపొందగా... ప్రియాన్షు 21–17, 21–12తో ప్రణయ్‌ను బోల్తా కొట్టించాడు. కిరణ్ జార్జి 21–11, 10–21, 20–22తో హాంగ్ యాంగ్ వెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 18–21, 21–16, 21–17తో విన్సన్ చియు–జెనీ గాయ్ (అమెరికా) జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
గాయత్రి–ట్రెసా జోరుకు సెమీస్‌లో బ్రేక్
సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన విజయాలతో దూసుకెళ్తున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి సెమీఫైనల్లో చుక్కెదురైంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో భారత ద్వయం 21–23, 11–21తో ప్రపంచ నాలుగో ర్యాంకు జోడీ నమి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ పోరాటంలో గాయత్రి–ట్రెసా జంట తొలి గేమ్‌లో నాలుగో సీడ్ ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడింది. ఒక దశలో 5–10తో వెనుకబడిన వీరు చక్కటి ఆటతో స్కోరును 16–16 వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత జపాన్ జోడి 20–18తో గేమ్ పాయింట్ వద్ద నిలిచినా...భారత ద్వయం సులువుగా తలవంచలేదు. చివరకు ఈ గేమ్‌లో పోరాడి ఓడింది. రెండో గేమ్‌లో మాత్రం జపాన్ జంట జోరుకు ఎదురు నిలువ లేకపోయింది. చెలరేగిన ఈ జోడి 20–6తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకుపోయింది. గాయత్రి–ట్రెసా పట్టుదలగాఆడి మరో 5 పాయింట్లు సాధించినా...ఆ తర్వాత పరాజయం తప్పలేదు. తాజా ఫలితంతో జపనీస్ ద్వయం ఫిబ్రవరిలో ఆసియా టీమ్ చాంపియన్íÙప్లో గాయత్రి–ట్రెసా జోడీ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. -
గాయత్రి–ట్రెసా జోడీ మరో సంచలనం
సింగపూర్: భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో మరో సంచలనం సృష్టించింది. గురువారం ప్రపంచ రెండో ర్యాంక్ జంటను బోల్తా కొట్టించిన గాయత్రి–ట్రెసా శుక్రవారం ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీని ఇంటిదారి పట్టించింది. 79 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంక్ ద్వయం గాయత్రి–ట్రెసా 18–21, 21–19, 24–22తో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) జోడీని ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో గత ఏడాది ఆసియా క్రీడల్లో ఈ కొరియా జోడీ చేతిలో ఎదురైన ఓటమికి భారత జోడీ బదులు తీర్చుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్ నమి మత్సుయామ–చిహారు షిదా (జపాన్)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. కొరియా ద్వయంతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ఓటమి అంచుల్లో నుంచి పుంజుకున్నారు. తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌లో 12–18తో వెనుకబడిన గాయత్రి–ట్రెసా వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 17–18కి తగ్గించారు. ఆ తర్వాత కొరియా ద్వయం ఒక పాయింట్ సాధించగా... ఆ వెంటనే గాయత్రి–ట్రెసా వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్‌లో పూర్తి సమన్వయంతో ఆడిన గాయత్రి–ట్రెసా కీలకదశలో పాయింట్లు నెగ్గి మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. -
గాయత్రి–ట్రెసా జోడీ సంచలనం
సింగపూర్: భారత మహిళల డబుల్స్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే సింగిల్స్‌లో సీనియర్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జంట చక్కని పోరాటపటిమతో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ బేక్ హ న–లీ సో హీని కంగుతినిపించింది.గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం 21–9, 14–21, 21–15తో కొరియన్ జంటకు ఊహించని షాక్ ఇచ్చింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ల ఆరో సీడ్ కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధుకు కొరకరాని కొయ్య, స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ చేతిలో మరోసారి పరాజయం ఎదురైంది. సింధు 21–13, 11–21, 20–22తో మూడో సీడ్ మారిన్ ధాటికి చేతులెత్తేసింది. వీళ్లిద్దరు ముఖాముఖిగా ఇప్పటివరకు 17 సార్లు తలపడగా... 12 సార్లు స్పెయిన్ షట్లరే నెగ్గింది. సింధు కేవలం ఐదుసార్లే గెలిచింది. మారిన్‌పై సింధు చివరిసారి 2018 జూన్‌లో మలేసియా ఓపెన్ టోర్నీలో గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ ఆట కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ప్రణయ్ 13–21, 21–14, 15–21తో కెంటా నిషిమొటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
German Open: గాయత్రి–ట్రెసా జోడీ ముందంజ
జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–10, 21–11తో సోనా హొరిన్కోవా–కాటరీనా జుజకోవా (చెక్ రిపబ్లిక్) జంటపై గెలిచింది. -
ముగిసిన భారత్ పోరు
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు ఓటమి చవిచూశాయి. గాయత్రి–ట్రెసా 8–21, 14–21తో అప్రియాని రహాయు–సితి ఫాదియా (ఇండోనేసియా)ల చేతిలో... అశి్వని–తనీషా 18–21, 7–21తో టాప్ సీడ్ మయు మత్సుమోటో–వకాన నగహారా (జపాన్)ల చేతిలో పరాజయం పాలయ్యారు. గాయత్రి, అశ్విని జోడీలకు 1,575 డాలర్ల (రూ. 1 లక్ష 30 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 3600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
All Eng Open: సంచలనాలకు సెమీస్‌లో ముగింపు..
బర్మింగ్హమ్: ప్రతిష్టాతక్మ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన యువ జంట గాయత్రి పుల్లెల, ట్రెసా జోలీల సంచలన ప్రదర్శన సెమీస్‌లో ముగిసింది. బర్మింగ్హమ్లో శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో కొరియాకు చెందిన బేక్ నా హా, లీ సో హీ జంట చేతిలో 10-21, 10-21తో ఓటమి పాలయ్యారు. 46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తొలి గేమ్‌లో 0-4తో వెనుకబడిన గాయత్రి జోడి ఆ తర్వాత కాస్త ప్రతిఘటించడంతో 9-13కు తగ్గింది. ఆ తర్వాత అదే టెంపోను కొనసాగించడంలో విఫలమైన ఈ జోడి చివరకు రెండు వరుస గేముల్లో ఓడి సెమీస్‌లోనే తమ పోరాటాన్ని ముగించారు. ఒకవేళ ఫైనల్ చేరి ఉంటే మాత్రం ఈ ఇద్దరు చరిత్ర సృష్టించేవారు. కానీ ఏం చేస్తాం మంచి చాన్స్ మిస్ అయింది. #AllEngland2023 #Badminton 🏸 ✅ Defeated world No 8 ✅ Defeated world No 9 ✅ Defeated a rising pair from 🇨🇳 ❌ Lost against one of the most in-form Korean pairs End of a fine week again at All England for Gayatri Gopichand and Treesa Jolly.https://t.co/QruEtFPI0N pic.twitter.com/lGWrccz45d — The Field (@thefield_in) March 18, 2023 చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. హర్మన్ కూడా ఊహించి ఉండదు -
సంచలనం.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి–ట్రెసా జోడీ
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ 2023 ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సంచలనం కొనసాగుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన మాజీ వరల్డ్ నెంబర్‌వన్ జోడి.. మాజీ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్స్ యుకీ ఫుకుషిమా, సయకా హిరోతా జంటపై 21-14, 24-22 తేడాతో స్టన్నింగ్ విక్టరీ అందుకొని క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. 50 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను తొందరగానే గెలుచుకున్న గాయత్రి-టెస్రా జోడి రెండో గేమ్‌ను గెలవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. భారత జోడి 9 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న సమయంలో జపాన్ జంట ఫుంజుకున్నారు. అయితే ఆరవ పాయింట్ దగ్గర గాయత్రి-టెస్రాలు సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. Women on a mission went past WR-9 pair in style 😎🔥 📸: @badmintonphoto #AllEngland2023#IndiaontheRise#Badminton pic.twitter.com/ce4NANZnWN — BAI Media (@BAI_Media) March 16, 2023 ✅ @BAI_Media https://t.co/Iau4RzgK0Y pic.twitter.com/2YlD6gKmKg — 🏆 Yonex All England Badminton Championships 🏆 (@YonexAllEngland) March 16, 2023 -
All England Open Championship: గాయత్రి–ట్రెసా జోడీ సంచలనం
బర్మింగ్‌హామ్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంక్ జోడీ గాయత్రి–ట్రెసా జాలీ 21–18, 21–14తో ఎనిమిదో ర్యాంక్ జోంగ్కోల్ఫోన్ కితితారాకుల్–రవీంద ప్రజోంగ్‌జై (థాయ్‌లాండ్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసా పూర్తి సమన్వయంతో ఆడి ఆద్యంతం తమ ఆధిపత్యం చాటుకున్నారు. గతంలో ఈ థాయ్‌లాండ్ జోడీతో ఆడిన నాలుగుసార్లూ ఓటమి పాలైన గాయత్రి–ట్రెసా ఐదో ప్రయత్నంలో మాత్రం విజయఢంకా మోగించారు. గత ఏడాది ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరి సంచలనం సృష్టించిన గాయత్రి–ట్రెసా ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ ఫకుషిమా–సయాకా హిరోటా (జపాన్)లతో తలపడతారు. మళ్లీ తొలి రౌండ్లోనే... ఈ ఏడాది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో టోర్నమెంట్లోనూ ఆమె తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 9వ ర్యాంకర్ సింధు 17–21, 11–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ జాంగ్ యి మాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్‌లో ఒకదశలో సింధు 16–13తో ఆధిక్యంలోకి నిలిచింది. ఈ దశలో జాంగ్ యి మాన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచింది. 13–16 నుంచి జాంగ్ యి మాన్ 20–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సింధు ఒక పాయింట్ గెలిచినా, ఆ వెంటనే జాంగ్ మరో పాయింట్ నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరు 5–5తో సమంగా ఉన్నారు. ఆ తర్వాత సింధు మళ్లీ తడబడి వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత సింధు తేరుకోలేకపోయింది. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన తన వ్యక్తిగత కోచ్ పార్క్ తే సాంగ్‌తో విడిపోయిన సింధు ఈ ఏడాది మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ప్రస్తుతం తనకు ఎవరూ వ్యక్తిగత కోచ్ లేరని, త్వరలోనే కొత్త కోచ్‌ను నియమించుకుంటానని మ్యాచ్ అనంతరం సింధు వ్యాఖ్యానించింది. శ్రమించిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోవడానికి కష్టపడ్డాడు. టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 19–21, 21–14, 21–5తో గెలుపొందాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–13, 21–13తో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి టైటిల్
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (కేరళ) జోడీ మహిళల డబుల్స్ విభాగంలో విజేతగా అవతరించింది. మంగళవారం పుణేలో జరిగిన ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–10, 21–9తో కావ్య గుప్తా–దీప్షిక సింగ్ (ఢిల్లీ) ద్వయంపై గెలిచింది. -
తొలిసారి టాప్–20లోకి పుల్లెల గాయత్రి జోడీ
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి తన భాగస్వామి ట్రెసా జాలీ (కేరళ)తో కలిసి కెరీర్ బెస్ట్ 19వ ర్యాంక్‌కు చేరుకుంది. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం రెండు స్థానాలు పురోగతి సాధించి భారత నంబర్‌వన్ జోడీగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి మరోసారి కెరీర్ బెస్ట్ ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడి
లక్నో: భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ సీజన్లో తొలి టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. సయ్యద్ మోదీ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సింధు శనివారం జరిగిన సెమీఫైనల్లో తొలి గేమ్‌ను 21–11తో అలవోకగా గెలిచింది. ఈ దశలో ఆమె ప్రత్యర్థి ఎవ్‌గెనియా కొసెత్సకయా (రష్యా) రిటైర్డ్ హర్ట్‌గా మ్యాచ్ మధ్యలో తప్పుకుంది. దీంతో 14 నిమిషాల్లోనే సింధు సెమీఫైనల్ గెలిచి తుది పోరుకు అర్హత సాధించినట్లయింది. సింధు నేడు జరిగే టైటిల్ పోరులో భారత్‌కే చెందిన మాల్విక బన్సోద్తో తలపడనుంది. సెమీఫైనల్లో మాల్విక 19–21, 21–19, 21–7తో అనుపమా ఉపాధ్యాయపై చెమటోడ్చి నెగ్గింది. పురుషుల సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ షట్లర్ అర్నాడ్ మెర్కెలె 21–19, 17–21, 21–9తో మిథున్ మంజునాథ్ పై గెలుపొందాడు. మరో సెమీస్‌లో లుకాస్ క్లేర్బొట్ (ఫ్రాన్స్) 15–21, 21–18, 21–15తో నాట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)ను ఓడించాడు. మహిళల డబుల్స్‌లో ఏడో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ తుది పోరుకు అర్హత సంపాదించింది. సెమీఫైనల్లో గాయత్రి జంట 17–21, 21–8, 21–16తో మలేసియాకు చెందిన లో యిన్ యువాన్–వాలెరీ స్లొవ్ ద్వయంపై చెమటోడ్చి నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 21–10, 21–9తో ప్రేమ్‌సింగ్ చౌహాన్–రాజేశ్ వర్మ జంటపై గెలిచి ఫైనల్ చేరింది. -
గాయత్రి డబుల్ ధమాకా
హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి సత్తా చాటింది. పీజీబీఏలో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి (తెలంగాణ) 21–19, 21–16తో తన్వి లాడ్‌పై కేవలం 37 నిమిషాల్లోనే గెలుపొంది కెరీర్లో తొలి సీనియర్ ర్యాంకింగ్ టైటిల్‌ను అందుకుంది. డబుల్స్ టైటిల్‌పోరులో గాయత్రి –రుతుపర్ణ (ఒడిశా) ద్వయం 19–21, 21–14, 21–10తో నాలుగో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జోడీకి షాకిచ్చి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ తుదిపోరులో చిట్టబోయిన రాహుల్ యాదవ్ (తెలంగాణ) 25–23, 14–21, 13–21తో లక్ష్యసేన్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్ కృష్ణ ప్రసాద్ గారగ (ఆంధ్రప్రదేశ్)–ద్రువ్ కపిల(ఎయిరిండియా) ద్వయం 23–21, 21–17తో ఏడో సీడ్ శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్) జంటపై, మిక్స్డ్ డబుల్స్‌లో గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మయూరి యాదవ్ (ఉత్తరప్రదేశ్) జంట 21–19, 13–21, 21–12తో కృష్ణ ప్రసాద్–అశ్విని భట్ (కర్ణాటక) జోడీపై నెగ్గి విజేతలుగా నిలిచాయి. -
టైటిల్‌పోరుకు రాహుల్, గాయత్రి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు చిట్టబోయిన రాహుల్ యాదవ్, పుల్లెల గాయత్రి టైటిల్‌కు విజయం దూరంలో నిలిచారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ రాహుల్ యాదవ్ (తెలంగాణ) 16–21, 21–14, 21–11తో కార్తికేయ గుల్షన్ కుమార్ (ఢిల్లీ)పై గెలుపొందగా... లక్ష్యసేన్ (ఉత్తరప్రదేశ్) 21–17, 22–20తో సిరిల్‌వర్మ (తెలంగాణ)ను ఓడించాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో రాహుల్ యాదవ్ 21–13, 21–13తో డేనియల్ ఫరీద్ (కర్ణాటక)పై, సిరిల్ వర్మ 18–21, 21–9, 21–14తో నిఖిల్శ్యామ్ శ్రీరామ్‌పై నెగ్గి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో పదమూడో సీడ్ గాయత్రి (తెలంగాణ) 21–17, 10–3తో ముందంజలో ఉన్న సమ యంలో ప్రత్యర్థి రుతుపర్ణ దాస్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో గాయత్రికి ఫైనల్ బెర్త్ ఖాయమైంది. మరో మ్యాచ్‌లో తన్విలాడ్ 22–20, 21–19తో శిఖా గౌతమ్ (ఎయిరిండియా)పై గెలిచి గాయత్రితో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు గౌస్ షేక్ జంట ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మయూరి (ఉత్తరప్రదేశ్) ద్వయం 24–22, 22–20తో ఎడ్విన్జాయ్ (కేరళ)–శ్రుతి మిశ్రా (ఉత్తరప్రదేశ్)జోడీపై పోరాడి గెలుపొందారు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో గౌస్ షేక్ జోడీ 21–18, 26–24తో రోహన్ (ఆంధ్రప్రదేశ్)–కుహూ గార్గ్ (ఉత్తరప్రదేశ్) జంటపై గెలుపొందగా... శ్రీకృష్ణ సాయి కుమార్ (తెలంగాణ)–కనిక అగర్వాల్ (రైల్వేస్) జంట 21–19, 12–21, 14–21తో ఇషాన్ (ఛత్తీస్‌గఢ్)–తనీషా (గోవా) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి జోడీ సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో గాయత్రి (తెలంగాణ)–రుతుపర్ణ (ఒడిశా) జంట 21–13, 21–9తో హారిక (ఆంధ్రప్రదేశ్)–అక్షయ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొంది ముందంజ వేసింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) ద్వయం 21–15, 21–16తో ప్రకాశ్ రాజ్–వైభవ్ (కర్ణాటక) జోడీపై, శ్రీకృష్ణ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్) జంట 14–21, 24–22, 21–16తో సంజయ్ (పాండిచ్చేరి)– సిద్ధార్థ్ (తెలంగాణ) జోడీపై నెగ్గి సెమీస్‌కి చేరాయి. -
రెండో రౌండ్లో గాయత్రి, శ్రీకృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు పుల్లెల గాయత్రి, మేఘన రెడ్డి, శ్రీకృష్ణప్రియ శుభారంభం చేశారు. పుల్లెల గోపీచంద్ అకాడమీలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గాయత్రి 21–16, 21–9తో శీతల్‌పై, మేఘన రెడ్డి 21–10, 21–15తో ప్రేరణపై, శ్రీకృష్ణప్రియ 21–9, 21–13తో యోషిత మాథూర్‌పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణకే చెందిన సామియా 21–8, 21–15తో రోహిణిపై, కెయూర 21–7, 21–10తో రూబీ సింగ్‌పై విజయం సాధించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–రుతుపర్ణ పాండా జంట 21–7, 21–11తో మేఘ–ప్రాంజల్ జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సిరిల్ వర్మ 21–13, 21–12తో హర్షల్ భోయర్‌పై, అనికేత్ రెడ్డి 21–19, 17–21, 21–12తో భార్గవ్‌పై నెగ్గారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో శ్రీ కృష్ణ పొదిలె–షేక్ గౌస్ జంట 21–19, 21–18తో ఇషాన్ భట్నాగర్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీ కృష్ణ పొదిలె–కనిక కన్వల్ ద్వయం 21–15, 21–19తో మహ్మద్ రెహాన్–అనీస్ కౌసర్ జోడీపై, నవనీత్ బొక్కా–సాహితి బండి జంట 21–18, 21–19తో ఉత్కర్ష–కరిష్మ వాడ్కర్ జంటపై గెలిచాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, డెన్మార్క్ దిగ్గజ క్రీడాకారుడు మార్టిన్ ఫ్రాస్ట్, సీనియర్ కోచ్ విమల్ కుమార్, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, పాణి రావు తదితరులు పాల్గొన్నారు. -
సెమీస్‌లో గాయత్రి ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి పోరాటం ముగిసింది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో గాయత్రి 15–21, 7–21తో ఆషి రావత్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో గాయత్రి 21–16, 21–11తో ఏడో సీడ్ స్మిత్ తోష్నివాల్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా... ఐదో సీడ్ సామియా ఇమాద్ ఫరూఖీ 21–14, 21–16తో పదో సీడ్ కవిప్రియ (పాండిచ్చేరి)ని ఓడించింది. బాలుర క్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ డి. శరత్ (ఆంధ్రప్రదేశ్) 21–10, 16–21, 12–21తో నాలుగోసీడ్ సతీశ్ కుమార్ (తమిళనాడు) చేతిలో ఓటమి పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాల్లో నవనీత్ జోడీకి చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ నవనీత్–సాహితి ద్వయం 23–25, 21–17, 13–21తో ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్)–తనీషా క్రాస్టో(గోవా) జంట చేతిలో ఓడిపోయింది. బాలుర డబుల్స్ క్వార్టర్స్‌లో మూడో సీడ్ నవనీత్ (తెలంగాణ)–ఎడ్విన్ జాయ్ (కేరళ) ద్వయం 14–21, 19–21తో ఐదోసీడ్ యశ్ రైక్వార్ (మధ్యప్రదేశ్)–ఇమాన్ సోనోవాల్ (అస్సాం) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్)–విష్ణువర్ధన్‌గౌడ్ (తెలంగాణ) ద్వయం 17–21, 21–8, 21–14తో హరిహరన్–రుబన్ కుమార్ (తమిళనాడు)పై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టగా... ఏడోసీడ్ అచ్యుతాదిత్య (తెలంగాణ)–వెంకట హర్షవర్ధన్ (ఆంధ్రప్రదేశ్) జంట 19–21, 12–21తో టాప్ సీడ్ మంజిత్ సింగ్– డింకూ సింగ్ (మణిపూర్) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. బాలికల డబుల్స్ క్వార్టర్స్‌లో ఏడో సీడ్ శ్రీవిద్య గురజాడ–సాయి శ్రీయ (తెలంగాణ) జంట 19–21, 12–21తో టాప్ సీడ్ త్రెసా జోలీ (కేరళ)–వర్షిణి (తమిళనాడు) జంట చేతిలో, సాహితి బండి (తెలంగాణ)–ద్రితి (కర్ణాటక) జోడీ 13–21, 16–21తో ఆరోసీడ్ సిమ్రన్–రితిక (మహారాష్ట్ర) జంట చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో గాయత్రి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్లు పుల్లెల గాయత్రి, సామియా ఇమాద్ ఫరూఖీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. చెన్నైలో శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ మూడోరౌండ్లో టాప్‌సీడ్ గాయత్రి 22–20, 21–16తో క్వాలిఫయర్ ఖుషీ గుప్తా (ఢిల్లీ)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ సామియా ఇమాద్ ఫరూఖీ (తెలంగాణ) 21–11, 21–18తో కేయూర మోపాటి (తెలంగాణ)ని ఓడించింది. బాలు ర సింగిల్స్ విభాగంలో డి. శరత్ (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్స్‌కు చేరుకోగా.... తరుణ్ (తెలంగాణ), ప్రణవ్ రావు (తెలంగాణ), సాయిచరణ్ (ఆంధ్రప్రదేశ్) మూడోరౌండ్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. తొమ్మిదో సీడ్ శరత్ 21–11, 21–13తో ఎం. తరుణ్‌పై గెలుపొందగా... మూడో సీడ్ సాయిచరణ్ కోయ 22–24, 17–21తో పదో సీడ్ సిద్ధాంత్ గుప్తా (తమిళనాడు) చేతిలో, ప్రణవ్ రావు 17–21, 15–21తో ఐదో సీడ్ ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ నవనీత్–సాహితి (తెలంగాణ) ద్వయం 21–9, 24–26, 21–16తో మంజిత్ సింగ్ (మణిపూర్)–మెహ్రీన్ రిజా (కేరళ) జంటపై గెలు పొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. బాలికల డబుల్స్ తొలిరౌండ్లో ఏడో సీడ్ శ్రీవిద్య గురజాడ–సాయి శ్రీయ జంట 21–12, 21–9తో రుద్రాణి (ఉత్తరప్రదేశ్)–ఆత్మజయిత రాయ్ బర్మన్ (త్రిపుర) జోడీపై, సాహితి (తెలంగాణ)–ద్రితి (కర్ణాటక) జంట 21–8, 21–23, 21–14తో దుర్వా గుప్తా (ఢిల్లీ)–భార్గవి (తెలంగాణ) జోడీపై, హాసిని–జాహ్నవి (ఆంధ్రప్రదేశ్) జంట 22–24, 21–18, 21–16తో సాక్షి–యషిక (హరియాణా) జోడీపై గెలుపొంది రెండో రౌండ్లో అడుగుపెట్టాయి. బాలుర డబుల్స్ తొలిరౌండ్లో అచ్యుతాదిత్య రావు (తెలంగాణ)–వెంకట హర్ష (ఆంధ్రప్రదేశ్) జంట 21–14, 21–17తో నమన్–అర్జున్ (ఢిల్లీ) జోడీపై, తరుణ్–ఖదీర్ (తెలంగాణ) జంట 21–14, 12–21, 21–13తో అవినాశ్–ఆయుశ్ (ఒడిశా) జోడీపై, నవనీత్ (తెలంగాణ)–ఎడ్విన్ జాయ్ (కేరళ) జంట 21–15,21–15తో సనీత్–పృథ్వీ (కర్ణాటక) జోడీపై గెలుపొందాయి. -
గాయత్రి శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పుల్లెల గాయత్రి శుభారంభం చేసింది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్‌సీడ్ గాయత్రి 21–15, 21–15తో ఖుషీ ఠక్కర్ (ఢిల్లీ)పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో కేయూర మోపాటి (తెలంగాణ) 21–13, 21–10తో ధ్రితి (కర్ణాటక)పై, సామియా ఇమాద్ ఫరూఖీ (తెలంగాణ) 21–17, 21–12తో స్నేహా రజ్వర్ (ఉత్తరాఖండ్)పై, శ్రీవిద్య గురజాడ (తెలంగాణ) 21–9, 12–21, 21–18తో కృతి (కర్ణాటక)పై గెలుపొందారు. బాలుర సింగిల్స్ తొలిరౌండ్లో ప్రణవ్ రావు (తెలంగాణ) 17–21, 22–20, 21–12తో చాయనిత్ జోషి (ఉత్తరాఖండ్)పై, సాయిచరణ్ (ఆంధ్రప్రదేశ్) 21–13, 21–9తో అనీశ్ చంద్ర (తెలంగాణ)పై, శరత్ (ఆంధ్రప్రదేశ్) 21–19, 21–14తో జాకబ్ థామస్ (కేరళ)పై, తరుణ్ (తెలంగాణ) 26–24, 19–21, 22–20తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై గెలిచి ముందంజ వేశారు. -
పుల్లెల గాయత్రికి టాప్ సీడింగ్
చెన్నై: యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రికి టాప్ సీడింగ్ దక్కింది. నేటి నుంచి ఇక్కడ జరుగనున్న ఈ టోర్నమెంట్లో దేశంలోని నలుమూలల నుంచి మొత్తం 1000 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. అండర్–19 కేటగిరీ బాలికల సింగిల్స్‌లో తలపడనున్న 16 ఏళ్ల గాయత్రికి ఈ టోర్నీలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆకర్షి కశ్యప్ నుంచి పోటీ ఎదురవనుంది. త్వరలో చైనా వేదికగా జరిగే జూనియర్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు క్వాలిఫయింగ్ టోర్నీగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో సత్తా చాటేందుకు వీరిద్దరితో పాటు మాళవిక బన్సోద్, ఉన్నతి బిష్త్ సిద్ధమయ్యారు. బాలుర విభాగంలో మధ్యప్రదేశ్ క్రీడాకారుడు ప్రియాన్షు రజావత్ టాప్‌సీడ్‌గా బరిలో దిగనున్నాడు. మణిపూర్‌కు చెందిన మైస్నమ్ మీరాబా, చెన్నై క్రీడాకారుడు శంకర్ ముత్తుస్వామితో పాటు సాయిచరణ్ కోయ, కె. సతీశ్ కుమార్, ఆకాశ్ యాదవ్ ఈ టోర్నీలో వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బాలుర డబుల్స్ విభాగంలో మంజిత్ సింగ్–డింకూ సింగ్ జంట... బాలికల డబుల్స్‌లో త్రిషా జోలీ–వర్షిణి జోడీ... మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో తెలంగాణకు చెందిన నవనీత్ బొక్కా–సాహితి బండి జంటలు టాప్ సీడ్లుగా బరిలో దిగనున్నాయి. మెరుగైన ర్యాంకుల్లో ఉన్న 32 మంది సింగిల్స్ క్రీడాకారులు మెయిన్‌డ్రాకు నేరుగా అర్హత పొందారు. క్వాలిఫయింగ్ పోటీల్లో 500కు పైగా బాలురు, 220 మంది బాలికలు తలపడనున్నారు. -
డచ్, జర్మన్ టోర్నీలకు సామియా, గాయత్రి
న్యూఢిల్లీ: జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్న హైదరాబాదీ అమ్మాయిలు సామియా ఇమాద్ ఫారుఖీ, పుల్లెల గాయత్రిలు విదేశీ టోర్నీలకు ఎంపికయ్యారు. డచ్, జర్మన్ అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే జూనియర్ జట్లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) బుధవారం ఎంపిక చేసింది. మొత్తం 20 మందితో కూడిన బాలబాలికల జట్లను ప్రకటించింది. ఇందులో 10 మంది చొప్పున బాలురు, బాలికలు ఉన్నారు. అయితే ఈ 20 మందిలో ఆరుగురు షట్లర్లు తెలంగాణ వారే కావడం గమనార్హం. మరొకరు ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాయిచరణ్ కావడంతో తెలుగువారే ఏడుగురున్నారు. డచ్ టోర్నమెంట్ ఈ నెల 27 నుంచి మార్చి 3 వరకు... అనంతరం జర్మన్ ఈవెంట్ మార్చి 7 నుంచి 10 వరకు జరుగనున్నాయి. బాలికల సింగిల్స్‌లో భారత కోచ్ గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి, సామియాలతో పాటు స్మిత్ తొష్నివాల్ (మహారాష్ట్ర), అమోలిక సింగ్ (ఉత్తరప్రదేశ్) ఎంపికవగా, బాలుర సింగిల్స్‌లో సాయిచరణ్ (ఏపీ), మైస్నమ్ మిరబా (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్), సతీశ్ కుమార్ (తమిళనాడు)లు ఉన్నారు. తెలంగాణ కుర్రాడు బొక్కా నవనీత్ బాలుర డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో ఆడనున్నాడు. వర్షిణి బాలికల డబుల్స్‌లో బండి సాహితి మిక్స్డ్ డబుల్స్ జట్టులో ఎంపికవగా... విష్ణువర్ధన్ గౌడ్‌కు బాలుర డబుల్స్ జట్టులో చోటు దక్కింది. విజయవాడ, బెంగళూరు, జైపూర్ నగరాల్లో గత నెలలో నిర్వహించిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా షట్లర్లను ఎంపిక చేసినట్లు ‘బాయ్’ వెల్లడించింది. విజేతగా నిలిచిన వారికి 500 పాయింట్లు, రన్నరప్‌కు 425 పాయింట్లు, సెమీఫైనలిస్ట్‌లకు 350 పాయింట్లు, క్వార్టర్, ప్రిక్వార్టర్ ఫైనలిస్ట్‌లకు వరుసగా 275, 192 పాయింట్లు కేటాయించారు. దీంతో హైదరాబాదీ సామియాకు 1125 పాయింట్లు దక్కాయి. -
సామియాతో గాయత్రి అమీతుమీ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ అండర్–19 ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బాలికల సింగిల్స్ విభాగంలో టైటిల్ తెలంగాణ ఖాతాలోనే చేరనుంది. జైపూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్లు పుల్లెల గాయత్రి, సామియా ఇమాద్ ఫరూఖీ ఫైనల్‌కు చేరుకున్నారు. నేడు జరిగే టైటిల్ పోరులో వీరిద్దరూ తలపడనున్నారు. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ గాయత్రి (తెలంగాణ) 21–13, 21–10తో నాలుగో సీడ్ కవిప్రియ (పాండిచ్చేరి)పై గెలుపొందగా... ఏడో సీడ్ సామియా (తెలంగాణ) 21–13, 18–21, 23–21తో ఆరో సీడ్ మాన్సి సింగ్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో గాయత్రి 21–15, 23–21తో స్మిత్ తోష్నివాల్ (మహారాష్ట్ర)పై, సామియా ఇమాద్ ఫరూఖీ 19–21, 21–10, 21–17తో రెండో సీడ్ ఉన్నతి బిష్త్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు. బాలుర సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుల పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. బాలుర సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో తొమ్మిదో సీడ్ తరుణ్ 16–21, 21–16, 13–21తో ఎనిమిదో సీడ్ సాయి చరణ్ (ఆంధ్రప్రదేశ్) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో సాయి చరణ్ 17–21, 21–10, 19–21తో నాలుగో సీడ్ ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ) చేతిలో పరాజ యం చవిచూశాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ జోడీ నవనీత్– సాహితి టైటిల్‌పోరుకు సిద్ధమైంది. సెమీస్‌లో నవనీత్–సాహితి ద్వయం 21–15, 21–15తో బల్కేశ్వరీ యాదవ్ (ఉత్తరప్రదేశ్)–శవీ భట్నాగర్ (మధ్యప్రదేశ్) జంటపై గెలుపొందింది. బాలికల డబుల్స్ విభాగంలో సాహితి జంట సెమీస్‌లోనే ఓటమి పాలైంది. రెండో సీడ్ కవిగుప్తా–ఖుషీ గుప్తా (ఢిల్లీ) జంట 21–12, 21–17తో నాలుగో సీడ్ సాహితి–నఫీసా సారా సిరాజ్ జోడీపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది. -
క్వార్టర్స్‌లో గాయత్రి, సామియా
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్లు పుల్లెల గాయత్రి, సామియా ఇమాద్ ఫరూఖీ, తరుణ్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. జైపూర్‌లో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ గాయత్రి 21–19, 21–12తో తనీషా సింగ్ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందగా... ఏడో సీడ్ సామియా ఇమాద్ ఫరూఖీ 21–16, 21–12తో ఆషి రావత్ (ఢిల్లీ)ని ఓడించింది. బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ తరుణ్ 21–19, 21–16తో రెండోసీడ్ మైస్నమ్ మేరాబ (మణిపూర్)కు షాకిచ్చి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ సాయిచరణ్ కోయ (ఆంధ్రప్రదేశ్) 17–21, 21–19, 21–19తో శంకర్ ముత్తుస్వామిపై గెలుపొందగా.... ప్రణవ్ రావు గంధం (తెలంగాణ) 21–17, 22–24, 10–21తో సతీశ్ కుమార్ (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ రెండోరౌండ్లో రెండోసీడ్ నవనీత్–సాహితి (తెలంగాణ) ద్వయం 27–25, 21–17తో రవికృష్ణ (కేరళ)– వర్షిణి (తమిళనాడు) జంటపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. బాలుర డబుల్స్ విభాగంలోనూ నవనీత్ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ నవనీత్– విష్ణువర్ధన్ (తెలంగాణ) జంట 21–10, 21–14తో మొహమ్మద్ అమన్– ఖవర్ జమాల్ ఖాన్ (రాజస్తాన్) జోడీపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో ఖదీర్ మొయినుద్దీన్ (తెలంగాణ)–అరవింద్ (కేరళ) జంట 21–19, 21–13తో సూరజ్–అన్షుమన్ గొగోయ్ (అస్సాం) జంటపై, నితిన్ (కర్ణాటక)– వరప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) జంట 21–11, 17–21, 21–14తో అరుణేశ్–గోకుల్ (తమిళనాడు) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. శరత్ (ఆంధ్రప్రదేశ్)–అచ్యుతాదిత్య రావు (తెలంగాణ) ద్వయం 14–21, 18–21తో ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్)–ఎడ్విన్ జాయ్ (కేరళ) జంట చేతిలో ఓడిపోయి రెండోరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బాలికల డబుల్స్ ప్రిక్వా ర్టర్స్‌లో సాహితి–నఫీసా జంటకు వాకోవర్ లభించింది. మరో మ్యాచ్‌లో శ్రీవిద్య గురజాడ–సాయి శ్రీయ (తెలంగాణ) ద్వయం 21–11, 21–13తో ఆర్య–లివియా ఫెర్నాండేజ్ (మహారాష్ట్ర) జంటపై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. -
పుల్లెల గాయత్రికి సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి విజేతగా నిలిచింది. కొచ్చిలో జరిగిన ఈ టోర్నీలో గాయత్రి అండర్–19 బాలికల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో గాయత్రి (తెలంగాణ) 11–21, 21–16, 21–14తో నాలుగో సీడ్ అశ్విని భట్ (కర్ణాటక)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో గాయత్రి 21–16, 21–11తో టాప్ సీడ్ మాల్విక బన్సోద్ (మహారాష్ట్ర)కు షాకిచ్చింది. బాలుర సింగిల్స్ విభాగంలో మణిపూర్‌కు చెందిన మైస్నమ్ మీరాబా విజేతగా నిలిచాడు. తుది పోరులో మైస్నమ్ 21–10, 21–7 సిద్ధాంత్ గుప్తా (తమిళనాడు)ను ఓడించాడు. బాలుర డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణ ప్రసాద్ జోడీ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్లో రెండో సీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)– ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జంట 21–15, 21–11తో టాప్ సీడ్ నవనీత్ (తెలంగాణ)–సాయి పవన్ (ఏపీ) జోడీపై గెలుపొందింది. బాలికల డబుల్స్‌లో తమిళనాడు జోడీ నీల–వర్షిణి విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఏపీకి చెందిన సాయి పవన్ జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో నాలుగో సీడ్ సాయి పవన్ (ఏపీ)–రియా అరోల్కర్ (మహారాష్ట్ర) జంట 14–21, 15–21తో అక్షన్ శెట్టి–రాశి లాంబే (మహారాష్ట్ర) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
ఆసియా క్రీడలకు గాయత్రి, ఉత్తేజిత
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ గాయత్రి ఇండోనేసియాకు పయనం కానుంది. ఆసియా క్రీడల కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) 20 మంది సభ్యులతో కూడిన మహిళల, పురుషుల జట్లను ప్రకటించింది. ఇరు జట్లలోనూ ఆరుగురు యువ షట్లర్లకు చోటు కల్పించారు. బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, సిక్కి రెడ్డిలు ఉన్న మహిళల జట్టులో 15 ఏళ్ల పుల్లెల గాయత్రి ఎంపికైంది. మరో తెలుగమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావుతో పాటు అష్మిత చాలిహ, ఆకర్షి కశ్యప్, రుతుపర్ణ, ఆర్తి సారాలు చోటు దక్కించుకున్నారు. వీరంతా బెంగళూరు, హైదరాబాద్‌లలో ‘బాయ్’ నిర్వహించిన సీనియర్ ర్యాంకింగ్ టోర్నీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా జకార్తా మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. గాయత్రి హైదరాబాద్‌లో జరిగిన టోర్నీలో సెమీఫైనల్ చేరింది. జకార్తా ఆతిథ్యమిచ్చే ఆసియా గేమ్స్ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరగనున్నాయి. పురుషుల జట్టు: కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, సుమీత్ రెడ్డి, మను అత్రి, ప్రణవ్ జెర్రీ చోప్రా, సౌరభ్ వర్మ. మహిళల జట్టు: సైనా నెహ్వాల్, పీవీ సింధు, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, సాయి ఉత్తేజిత రావు, అష్మిత చాలిహ, రుతుపర్ణ పండ, ఆర్తి సారా సునీల్, ఆకర్షి కశ్యప్, గాయత్రి. కోచ్‌లు: పుల్లెల గోపీచంద్, తన్ కిమ్ హర్, అరుణ్ విష్ణు, ఎడ్విన్ ఐరివాన్. -
చాంపియన్ గాయత్రి
సాక్షి, హైదరాబాద్: వర్ధమాన యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి పుల్లెల తన ఖాతాలో మరో టైటిల్‌ను జమ చేసుకుంది. చండీగఢ్‌లో ఆదివారం ముగిసిన కృష్ణ ఖైతాన్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో గాయత్రి అండర్–19 బాలికల సింగిల్స్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో 14 ఏళ్ల గాయత్రి 23–21, 21–18తో టాప్ సీడ్ పూర్వా బర్వే (మహారాష్ట్ర)పై నెగ్గింది. అండర్–19 బాలుర డబుల్స్ ఫైనల్లో తెలంగాణకు చెందిన పి. విష్ణువర్ధన్ –శ్రీకృష్ణ జోడీ 18–21, 21–15, 21–13తో సంజయ్ శ్రీవత్స (పాండిచ్చేరి)–సిద్ధార్థ్ (తెలంగాణ) జంటపై నెగ్గి స్వర్ణం సాధించింది. అండర్–19 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీకృష్ణ –సృష్టి జూపూడి (తెలంగాణ) ద్వయం 21–19, 21–15తో ఎడ్విన్ –నఫీసా (కేరళ) జంటపై గెలిచింది. అండర్–17 బాలుర డబుల్స్ ఫైనల్లో బొక్కా నవనీత్–విష్ణువర్ధన్ (తెలంగాణ) జంట 20–22, 17–21తో ఎడ్విన్ జాయ్–అరవింద్ (కేరళ) జోడీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. -
పుల్లెల గాయత్రి ‘ట్రిపుల్’
ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ సాక్షి, హైదరాబాద్ : ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి గోపీచంద్ సత్తా చాటింది. కర్ణాటకలోని గుల్బర్గాలో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో మూడు విభాగాల్లో ఆమె విజేతగా నిలవడం విశేషం. బాలికల అండర్-13, అండర్-15 సింగిల్స్ విభాగాలతో పాటు బాలికల అండర్-15 డబుల్స్‌లో గాయత్రి టైటిల్స్ గెలుచుకుంది. బాలికల అండర్-15 ఫైనల్లో గాయత్రి 15-21, 23-21, 21-8 స్కోరుతో ఏడో సీడ్ మాళవిక బన్సోద్‌పై విజయం సాధించింది. అండర్-13 ఫైనల్లో టాప్ సీడ్ గాయత్రి 21-10, 21-17తో హైదరాబాద్‌కే చెందిన రెండో సీడ్ సమియా ఫారుఖీని ఓడించింది. అండర్-15 డబుల్స్ ఫైనల్లో గాయత్రి-జక్కా వైష్ణవి రెడ్డి జోడి 16-21, 21-15, 21-19తో టాప్ సీడ్ సిమ్రాన్-రితిక జంటపై నెగ్గింది. అండర్-13 బాలికల డబుల్స్ ఫైనల్లో సమియా ఫారూఖీ-కవిప్రియ ద్వయం 21-11, 21-14తో శ్రీయ చితూర్-కె. భార్గవిపై విజయం సాధించింది.