హాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో తొలిసారి పోటీపడుతున్న భారత జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ తొలి మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ నంబర్‌వన్ జంట లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా)తో జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 22–20, 20–22, 14–21తో పోరాడి ఓడిపోయింది.
82 నిమిషాల సుదీర్ఘ పోరులో గాయత్రి–ట్రెసా వరల్డ్ నంబర్‌వన్ జోడీకి గట్టిపోటీనే ఇచ్చారు. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న భారత జంట రెండో గేమ్‌లో 14–18తో వెనుకబడింది. ఈ దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరును 18–18తో సమం చేసింది. ఆ తర్వాత చైనా జోడీ రెండు పాయింట్లు గెలవగా... ఆ వెంటనే భారత జంట కూడా రెండు పాయింట్లు సాధించింది. దాంతో స్కోరు మళ్లీ 20–20తో సమమైంది.
ఈ దశలో చైనా జోడీ రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో చైనా జోడీ తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడి గట్టెక్కింది. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో పియర్లీ టాన్–థీనా మురళీధరన్ (మలేసియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే గాయత్రి–ట్రెసా జోడీకి సెమీఫైనల్ చేరుకునే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment