
హాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ తొలి విజయం నమోదు చేసుకుంది. మొదటిసారి ఈ టోర్నీకి అర్హత సాధించిన గాయత్రి–ట్రెసా జంట తొలి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ జోడీ చేతిలో ఓడినా... రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన పోరులో గాయత్రి –ట్రెసా ద్వయం 21–19, 21–19తో ప్రపంచ ఆరో ర్యాంక్ పియర్లీ టాన్–థీనా మరళీధరన్ (మలేసియా) జంటపై గెలుపొందింది.
సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మన అమ్మాయిలు... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌ల్లో విజృంభించారు. 46 నిమిషాల పాటు సాగిన పోరులో మలేసియా జోడీ ఒక దశలో వరుసగా 6 పాయింట్లు సాధించి ఆధిక్యం కనబర్చే ప్రయత్నం చేయగా... భారత జంట కీలక సమయాల్లో విజృంభించి గేమ్‌ను సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లోనూ ఆధిక్యం చేతులు మారుతూ సాగినా... చివరకు గాయత్రి–ట్రెసా జంటనే విజయం వరించింది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన చైనా జంట 2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత జట్టు ఒక పాయింట్‌తో రెండో స్థానంలో ఉంది. భారత షట్లర్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే నేడు జరిగే గ్రూప్ దశ చివరి లీగ్ మ్యాచ్‌లో నామీ మసుయమా–చిహారు షిడా (జపాన్)పై విజయం సాధించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment