ప్రపంచ రెండో ర్యాంక్ జంటకు షాక్
మారిన్ చేతిలో మళ్లీ ఓడిన సింధు
సింగపూర్: భారత మహిళల డబుల్స్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే సింగిల్స్‌లో సీనియర్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జంట చక్కని పోరాటపటిమతో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ బేక్ హ న–లీ సో హీని కంగుతినిపించింది.
గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం 21–9, 14–21, 21–15తో కొరియన్ జంటకు ఊహించని షాక్ ఇచ్చింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ల ఆరో సీడ్ కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధుకు కొరకరాని కొయ్య, స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ చేతిలో మరోసారి పరాజయం ఎదురైంది.
సింధు 21–13, 11–21, 20–22తో మూడో సీడ్ మారిన్ ధాటికి చేతులెత్తేసింది. వీళ్లిద్దరు ముఖాముఖిగా ఇప్పటివరకు 17 సార్లు తలపడగా... 12 సార్లు స్పెయిన్ షట్లరే నెగ్గింది. సింధు కేవలం ఐదుసార్లే గెలిచింది. మారిన్‌పై సింధు చివరిసారి 2018 జూన్‌లో మలేసియా ఓపెన్ టోర్నీలో గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ ఆట కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ప్రణయ్ 13–21, 21–14, 15–21తో కెంటా నిషిమొటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment