
స్విస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం
పురుషుల సింగిల్స్‌లో ఓడిన శ్రీకాంత్, ప్రియాన్షు
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–12, 21–8తో అమెలీ లెహ్‌మన్–సెలీన్ హుబ్‡్ష (జర్మనీ) జంటపై విజయం సాధించింది. 38 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత ద్వయం ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. రెండో గేమ్‌లోనైతే ఒకదశలో గాయత్రి–ట్రెసా వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించారు.
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 15–21, 11–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో... ప్రియాన్షు 15–21, 17–21తో టోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు.
మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. ఇషారాణి బారువా 19–21, 21–18, 18–21తో జియాన్ జి హాన్ (చైనా) చేతిలో, అనుపమ 17–21, 19–21తో పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment