swiss open
-
పోరాడి ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీ
బాసెల్: స్విస్ ఇండోర్స్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ కథ ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ–ఒలివెట్టి ద్వయం 6–4, 5–7, 6–10తో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. యూకీ–ఒలివెట్టి జోడీకి 19,765 యూరోల (రూ. 18 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తొలి రౌండ్లో మొత్తం ఏడు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జంటను బోల్తా కొట్టించిన యూకీ–ఒలివెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లో మరో సంచలనం సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది. 93 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి 14 ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్‌లను ఒక్కోసారి కోల్పోయాయి. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో మాత్రం అపార అనుభవజు్ఞలైన జేమీ ముర్రే–జాన్ పీర్స్ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. డబుల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయిన 38 ఏళ్ల జేమీ ముర్రే మొత్తం 32 టైటిల్స్ సాధించాడు. ఇందులో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్) కూడా ఉన్నాయి. 36 ఏళ్ల జాన్ పీర్స్ ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో సహచరుడు మాథ్యూ ఎబ్డెన్తో కలిసి డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. కెరీర్ మొత్తంలో 28 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన జాన్ పీర్స్ 2017లో ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో డబుల్స్ చాంపియన్‌గా నిలిచాడు. -
ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
స్టాడ్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో ఐదో సీడ్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. మరోవైపు జర్మనీలో జరుగుతున్న హాంబర్గ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ తొలి రౌండ్లో 1–6, 4–6తో జేకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ) జంట చేతిలో ఓటమి పాలైంది. -
క్వార్టర్స్‌లో యూకీ ద్వయం
స్టాడ్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో మూడో సీడ్ యూకీ–ఒలివెట్టి ద్వయం 6–4, 6–4తో ఫెడరికో జెబలాస్–బోరిస్ అరియాస్ (బొలీవియా) జంటను ఓడించింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ జోడీ పది ఏస్‌లు సంధించడంతోపాటు తమ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
సింధు శుభారంభం
బాసెల్ (స్విట్జర్లాండ్): మాజీ చాంపియన్ పీవీ సింధు స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–12, 21–13తో పోర్న్‌పిచా చొయ్కీవోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ తొమోకా మియజకీతో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు. 2015లో స్విస్ ఓపెన్ విజేతగా నిలిచిన శ్రీకాంత్ 21–17, 21–18తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై నెగ్గగా... లక్ష్య సేన్ 21–19, 15–21, 21–11తో లియోంగ్ జున్ హావో (మలేసియా)ను ఓడించాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీలు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. తొలి రౌండ్లో అశి్వని–తనీషా ద్వయం 21–18, 12–21, 21–19తో మెలీసా పుస్పితాసారి–రేచల్ రోజ్ (ఇండోనేసియా) జంటపై... గాయత్రి–ట్రెసా జోడీ 21–15, 21–12తో అనీ జు–కెరీ జు (అమెరికా) ద్వయంపై గెలుపొందాయి. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్
బాసెల్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి మరోసారి మేజర్ టోర్నీలో సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్–300 టోర్నీ స్విస్ ఓపెన్‌లో సాత్విక్ – చిరాగ్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ టోర్నీలో ఈ జంట మినహా ఇతర భారత షట్లర్లంతా ముందే నిష్క్రమించగా...వీరిద్దరు మాత్రం తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగారు. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ ద్వయం 19–21, 21–17, 17–21తో మూడో సీడ్ మలేసియా జోడి ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీపై విజయం సాధించింది. 69 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను కోల్పోయినా...తర్వాతి రెండు గేమ్‌లలో సత్తా చాటి భారత జంట విజయాన్ని అందుకుంది. నేడు జరిగే ఫైనల్లో చైనాకు చెందిన అన్‌సీడెడ్ జంట రెన్ జియాంగ్ యు – టాన్ ఖియాంగ్‌తో సాత్విక్ – చిరాగ్ తలపడతారు. -
పీవీ సింధుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ 2022 ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింధును అభినందించారు. ''స్విస్ ఓపెన్ గెలిచిన పీవీ సింధుకు కంగ్రాట్స్. మన జాతి గర్వించేలా చేశావు. ఈ సందర్భంగా ఆమెను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని కోరుకుంటున్నా'' అంటూ ట్వీట్ చేశారు. కాగా వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు చేరిన తెలుగు తేజం.. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో థాయ్‌లాండ్ షట్లర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌పై 21–16, 21–8 వరుస సెట్లలో విజయం సాధించి, ఈ సీజన్లో రెండో సింగల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. Hearty congratulations to Telugu shuttler and pride of the nation, @Pvsindhu1 , on clinching the #SwissOpen2022 women's singles title. May God’s blessings always be with her in every endeavour! — YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2022 -
Swiss Open 2022: మెయిన్ ‘డ్రా’కు సుమీత్ రెడ్డి–అశ్విని జంట
Swiss Open 2022: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సుమీత్–అశ్విని ద్వయం 18–21, 21–16, 21–17తో మ్యాడ్స్ వెస్టర్‌గార్డ్–నటాషా (డెన్మార్క్) జోడీపై నెగ్గింది. ఇదిలా ఉండగా.. సిక్కి రెడ్డి–సాయిప్రతీక్; పుల్లెల గాయత్రి–ధ్రువ్; అర్జున్–ట్రెసా జాలీ జోడీలకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు దక్కింది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
రన్నరప్ సింధు
బాసెల్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 12–21, 5–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో మారిన్‌కు కాస్త పోటీనిచ్చిన సింధు రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. రన్నరప్‌గా నిలిచిన సింధుకు 5,320 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
టైటిల్‌కు విజయం దూరంలో...
బాసెల్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకోవడానికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 22–20, 21–10తో ప్రపంచ 11వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్డ్ (డెన్మార్క్)పై గెలిచింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదుర్కొన్న సింధు రెండో గేమ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఈ గెలుపుతో గత జనవరిలో థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో మియా చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకున్నట్లయింది. నేడు జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు ఆడుతుంది. మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 5–8తో వెనుకబడి ఉంది. భారత కాలమానం ప్రకారం సింధు–మారిన్ ఫైనల్ మ్యాచ్ రాత్రి 7 గంటల తర్వాత మొదలయ్యే అవకాశముంది. శ్రీకాంత్ పరాజయం పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 13–21, 19–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 10–21, 17–21తో కిమ్ అస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
సింధు, శ్రీకాంత్ జోరు
బాసెల్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించే దిశగా భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ మరో అడుగు వేశారు. స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ సింధు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. 13వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్పన్ (థాయ్‌లాండ్)తో 59 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–16, 23–21తో గెలిచింది. బుసానన్‌పై సింధుకిది 12వ విజయం కావడం విశేషం. కాంతాపోన్ వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–19, 21–15తో నెగ్గాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆటగాళ్లు సాయిప్రణీత్ 14–21, 17–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో... అజయ్ జయరామ్ 9–21, 6–21తో కున్లావుత్ విదిత్సరన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో సింధు; విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్ ఆడతారు. డబుల్స్ సెమీస్‌లో సాత్విక్ జంట పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 12–21, 21–19, 21–12తో ఒంగ్ యెవ్ సిన్–తియో ఈ యి (మలేసియా) జోడీపై గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 17–21, 21–16, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశం -
సింధు ముందంజ
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–16, 21–19తో నెస్లిహాన్ యిజిట్ (టర్కీ)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 21–18, 21–11తో సమీర్ వర్మ (భారత్)పై, సౌరభ్ వర్మ 21–19, 21–18తో కిర్చ్మెర్ (స్విట్జర్లాండ్)పై, అజయ్ జయరామ్ 21–12, 21–13తో థమాసిన్ (థాయ్‌లాండ్)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–18, 19–21, 21–16తో క్రిస్టోఫర్–మాథ్యూ గ్రిమ్లె (స్కాట్లాండ్)లపై... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 21–5, 21–19తో అనాబెల్లా –స్టిన్ కుస్పెర్ట్ (జర్మనీ)లపై గెలిచారు. -
సైనాకు అనారోగ్యం.. స్విస్ ఓపెన్ నుంచి ఔట్
బాసెల్(స్విట్జర్లాండ్): అనారోగ్యం కారణంగా భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్విస్ ఓపెన్ నుంచి వైదొలిగారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సైనా అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. స్విస్ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లిన సైనాకు కడుపు నొప్పి తీవ్రంగా కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. దాంతో ఆమెను పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో సైనా పోస్ట్ చేశారు. ‘ఇది నిజంగానే నాకు చేదు వార్త. గత సోమవారం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నా. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో నొప్పితోనే కొన్ని మ్యాచ్‌లాడా. నొప్పి ఎక్కువవడంతో స్విస్ ఓపెన్‌లో పాల్గొనకుండా స్వదేశం వచ్చేశా. వైద్యులు ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అన్నాశయ సంబంధిత సమస్యగా చెప్పారు. త్వరలోనే కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నా’ అని సైనా అని తెలిపారు. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, శుభాంకర్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో కశ్యప్ 21-19, 21-17తో ఫెలిక్స్ బ్యూరెస్‌డెట్ (స్వీడన్)పై, శుభాంకర్ 21-19, 21-17తో లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరారు. -
రెండో రౌండ్లో కశ్యప్
బాసెల్,(స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, శుభాంకర్ డే రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 21–19, 21–17తో ఫెలిక్స్ బ్యూరెస్‌డెట్ (స్వీడన్)పై, శుభాంకర్ 21–19, 21–17తో లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో జక్కా వైష్ణవి రెడ్డి 12–21, 23–21, 17–21తో క్రిస్టిన్ కుబా (ఎస్తొనియా) చేతిలో, గుమ్మడి వృశాలి 14–21, 11–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్) 21–23, 21–15, 21–8తో లిండా జెట్చిరి (బల్గేరియా)పై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–15, 21–17తో రాల్ఫీ జాన్సెన్–కిలాసు (జర్మనీ) జోడీపై నెగ్గింది. -
రోజర్ ఫెడరర్... టైటిల్ నంబర్ 99
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన కెరీర్లో 99వ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ టోర్నీలో అతను తొమ్మిదోసారి విజేతగా నిలిచాడు. ఫైనల్లో 37 ఏళ్ల ఫెడరర్ 7–6 (7/5), 6–4తో కోపిల్ (రొమేనియా) పై నెగ్గాడు. గతంలో ఫెడరర్ 2006, 07, 08, 10, 11, 14, 15, 2017లలో ఈ టోర్నీని గెలిచాడు. చాంపియన్ ఫెడరర్‌కు 4,27,765 యూరోలు (రూ. 3 కోట్ల 56 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెడరర్ మరో టైటిల్ గెలిస్తే... జిమ్మీ కానర్స్ (109 టైటిల్స్–అమెరికా) తర్వాత 100 టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. -
శ్రీకాంత్‌కు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆదివారం టోర్నమెంట్ గెలిచిన శ్రీకాంత్, విజయానంతరం మంగళవారం నగరానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో అతనికి తల్లిదండ్రులు, సోదరుడు నందగోపాల్ స్వాగతం పలికారు. పుల్లెల గోపీచంద్ అకాడమీ తరఫున గోపీచంద్ తల్లి సుబ్బారావమ్మతో పాటు అకాడమీలో శిక్షణ పొందుతున్న పలువురు చిన్నారి షట్లర్లు కూడా శ్రీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన స్విస్ ఓపెన్‌ను గెలుచుకున్న శ్రీకాంత్ ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. శ్రీకాంత్ 24 నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో తలపడతాడు. రాష్ట్రపతి ప్రణబ్ అభినందన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపారు. ‘స్విస్ ఓపెన్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలి చాడు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిం చాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాష్ట్రపతి ఒక ప్రకటనలో తెలిపారు. -
‘స్విస్' ఫైనల్లో శ్రీకాంత్
బాసెల్ (స్విట్జర్లాండ్): టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ... భారత బ్యాడ్మింటన్ యువతార కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 17-21, 21-15, 21-18తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌ను ఓడించాడు. జుయ్ సాంగ్ (చైనా), విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే టైటిల్ పోరులో శ్రీకాంత్ తలపడతాడు. జయరామ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను కోల్పోయాడు. రెండో గేమ్‌లోనూ ఒక దశలో శ్రీకాంత్ 8-12తో వెనుకబడ్డాడు. అయితే నిగ్రహం కోల్పోకండా సంయమనంతో ఆడుతూ 12-12తో స్కోరును సమం చేసిన అతను అదే జోరులో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ కీలక దశలో పైచేయి సాధించి తన కెరీర్లో ఐదోసారి అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్లోకి అడుగుపెట్టాడు.