
ప్రపంచ 2వ ర్యాంకర్ ఆంటోన్సెన్‌పై విజయం
సెమీస్‌లో గాయత్రి–ట్రెసా జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువతార శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ పెను సంచలనం సృష్టించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై శంకర్ అద్భుత విజయం సాధించాడు. తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల శంకర్ శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 18–21, 21–12, 21–5తో ఆంటోన్సెన్‌ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
2022 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన శంకర్ 66 నిమిషాల పోరులో ఆంటోన్సెన్ ఆట కట్టించాడు. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు రజతం, ఒకసారి కాంస్య పతకం నెగ్గిన ఆంటోన్సెన్ తొలి గేమ్ గెలిచినప్పటికీ... ఆ తర్వాత ప్రపంచ 68వ ర్యాంకర్ శంకర్ ధాటికి చేతులెత్తేశాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో శంకర్ తలపడతాడు.
మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–18, 21–14తో పుయ్ లామ్ యెంగ్–ఎన్గా టింగ్ యెయుంగ్ (హాంకాంగ్) జంటపై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment