
ప్రణయ్‌పై గెలుపుతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి
తొలి రౌండ్‌లోనే ఓడిన సింధు
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత అగ్రశ్రేణి ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 49వ ర్యాంకర్ శ్రీకాంత్ 23–21, 23–21తో భారత్‌కే చెందిన ప్రపంచ 28వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.
ఈ గెలుపుతో శ్రీకాంత్ ముఖాముఖి రికార్డులో 7–3తో ప్రణయ్‌పై ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రణయ్‌తో 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ గేమ్ పాయింట్లు కాపాడుకొని నెగ్గడం విశేషం. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ 21–5, 21–16తో మాగ్నుస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో భారత ప్లేయర్లు ఆయుశ్ శెట్టి 15–21, 19–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో, కిరణ్ జార్జి 21–18, 17–21, 10–21తో రస్‌ముస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు.
ఇషారాణి ముందంజ
మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు 17–21, 19–21తో 39 నిమిషాల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. భారత్‌కే చెందిన ఇషారాణి బారువా, అనుపమ తొలి రౌండ్‌లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వాలిఫయర్ ఇషారాణి 18–21, 21–17, 22–20తో భారత్‌కే చెందిన ఆకర్షి కశ్యప్‌పై, అనుపమ 21–14, 21–13తో అన్‌మోల్ ఖరబ్ (భారత్)పై గెలిచారు.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మాళవిక బన్సోద్ (భారత్) 22–20, 14–21, 19–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో, రక్షితశ్రీ (భారత్) 11–21, 17–21తో లినె క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–16, 21–17తో అలైన్ ముల్లర్–కెల్లీ బుటెన్ (నెదర్లాండ్స్) జంటపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
Comments
Please login to add a commentAdd a comment