టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు అదరగొట్టే ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)పై... ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాలు సాధించారు. లీ షి ఫెంగ్‌పై ప్రణయ్‌కిది వరుసగా మూడో విజయంకాగా... చౌ తియెన్ చెన్‌పై శ్రీకాంత్‌కిది రెండో గెలుపు.
2014లో హాంకాంగ్ ఓపెన్‌లో చౌ తియెన్ చెన్‌ను తొలిసారి ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో ఆడిన ఆరుసార్లు ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ ఆకర్షి కశ్యప్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ఆకర్షి 17–21, 17–21తో ఓడిపోయింది.
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 11–21, 21–15, 21–14తో సయాకా హొబారా–యు సుజు (జపాన్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–18, 9–21, 18–21తో యె హోంగ్ వె–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment