Japan open
-
పోరాడి ఓడిన సతీశ్
జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ సతీశ్ కుమార్ కరుణాకరన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. యోకోహామాలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 47వ ర్యాంకర్ సతీశ్ 21–18, 18–21, 8–21తో ప్రపంచ 40వ ర్యాంకర్ కాంతాపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సతీశ్ తొలి గేమ్‌ను దక్కించుకొని రెండో గేమ్‌లో 18–15తో ఆధిక్యంలోకి వెళ్లి విజయం దిశగా సాగాడు. అయితే థాయ్‌లాండ్ ప్లేయర్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను 21–18తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో సతీశ్ తడబడ్డాడు. సతీశ్‌కు 2,550 డాలర్ల (రూ. 2 లక్షల 14 వేలు) ప్రైజ్‌మనీ, 4,320 పాయింట్లు లభించాయి. -
ప్రిక్వార్టర్స్‌లో సతీశ్
యోకోహామా: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ నుంచి సతీశ్ కుమార్ కరుణాకరన్ ఒక్కడే మిగిలాడు. టోర్నీ రెండో రోజు బుధవారం బరిలోకి దిగిన భారత క్రీడాకారుల్లో సతీశ్ మినహా మిగతా వారందరూ ఓడిపోయారు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 47వ ర్యాంకర్ సతీశ్ 6–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో ఆంటోన్సెన్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలగడంతో సతీశ్‌ను విజేతగా ప్రకటించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కాంతాపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)తో సతీశ్ తలపడతాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో కిరణ్ జార్జి 19–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. జెస్పెర్ టాఫ్ట్–అమెలీ మాగెలుండ్ (డెన్మార్క్)తో జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 1–3తో వెనుకబడిన దశలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ గాయం కారణంగా వైదొలిగింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రుతుపర్ణా పాండా–శ్వేతాపర్ణా (భారత్) ద్వయం 8–21, 14–21తో జూలీ ఫిన్–మాయ్ సురో (డెన్మార్క్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
తొలి రౌండ్ దాటలేకపోయారు
యోకోహామా: భవిష్యత్ ఆశాకిరణాలుగా భావిస్తున్న ముగ్గురు భారత యువ క్రీడాకారిణులకు జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నిరాశను మిగిల్చింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత షట్లర్లు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, అషి్మత చాలిహా తొలి రౌండ్‌ను దాటలేకపోయారు.అషి్మత 16–21, 12–21తో టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... మాళవిక 21–23, 19–21తో పొలీనా బురోవా (ఉక్రెయిన్) చేతిలో... ఆకర్షి 13–21, 12–21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్యా వరియత్ (భారత్) జోడీ 10–21, 18–21తో రెహాన్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ భారత స్టార్స్ పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. -
అంకిత రైనా పరాజయం
జపాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ అంకిత రైనా పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఒసాకాలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 181వ ర్యాంకర్ అంకిత 4–6, 2–6తో ప్రపంచ 174వ ర్యాంకర్ మొయుక ఉచిజుమా (జపాన్) చేతిలో ఓడిపోయింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత తన సరీ్వస్‌ను మూడుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో ఓడిన అంకితకు 2,804 డాలర్ల (రూ. 2 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సంచలనాలతో బోణీ...
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు అదరగొట్టే ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)పై... ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాలు సాధించారు. లీ షి ఫెంగ్‌పై ప్రణయ్‌కిది వరుసగా మూడో విజయంకాగా... చౌ తియెన్ చెన్పై శ్రీకాంత్‌కిది రెండో గెలుపు. 2014లో హాంకాంగ్ ఓపెన్‌లో చౌ తియెన్ చెన్ను తొలిసారి ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో ఆడిన ఆరుసార్లు ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ ఆకర్షి కశ్యప్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ఆకర్షి 17–21, 17–21తో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 11–21, 21–15, 21–14తో సయాకా హొబారా–యు సుజు (జపాన్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–18, 9–21, 18–21తో యె హోంగ్ వె–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
Japan Open: పోరాడి ఓడిన ప్రణయ్
జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. టోక్యోలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–15, 20–22తో ఆరో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో ప్రణయ్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ముఖాముఖిగా ఇప్పటివరకు చౌ తియెన్ చెన్, ప్రణయ్ ఎనిమిదిసార్లు తలపడగా... ఐదుసార్లు చౌ తియెన్ చెన్, మూడుసార్లు ప్రణయ్ గెలిచారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 4,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 28 వేలు)తోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మరో నాలుగు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు
టోక్యో: కరోనా ఖాతాలో మరో నాలుగు టోర్నీలు చేరాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం తాజాగా ప్రకటించింది. కరోనా నేపథ్యంలో తైపీ ఓపెన్ (సెప్టెంబర్ 1–6), కొరియా ఓపెన్ (8–13), చైనా ఓపెన్ (15–20), జపాన్ ఓపెన్ (22–27)లను నిర్వహించబోమని సమాఖ్య వెల్లడించింది. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ అందరి ఆరోగ్యభద్రత దృష్ట్యా టోర్నీల రద్దుకే మొగ్గుచూపామని బీడబ్ల్యూఎఫ్ కార్యదర్శి థామస్ లుండ్ పేర్కొన్నారు. ఈ మహమ్మారి కారణంగానే ఇటీవల చైనాలో జరగాల్సిన 11 టెన్నిస్ టోర్నీలు రద్దు కాగా... మంగళవారం ప్రారంభం కావాల్సిన డబ్ల్యూటీఏ పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ తొలిసారిగా రద్దయింది. -
మొమోటా సిక్సర్...
టోక్యో: ఏడాది కాలంగా అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న జపాన్ బ్యాడ్మింటన్ స్టార్ కెంటో మొమోటా ఈ సీజన్లో ఆరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపై ఆదివారం ముగిసిన జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ మొమోటా టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ అయిన కెంటో మొమోటా 21–16, 21–13తో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై అలవోకగా గెలుపొందాడు. 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో మొమోటాకు ఏ దశలోనూ క్రిస్టీ పోటీనివ్వలేకపోయాడు. విజేత మొమోటాకు 52,500 డాలర్ల (రూ. 36 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది తొమ్మిది టోర్నీల్లో పాల్గొన్న మొమోటా ఆరు టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచాడు. జపాన్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్, సింగపూర్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, జర్మన్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీల్లో మొమోటా టైటిల్స్ సాధించాడు. -
భారత్ పోరాటం ముగిసింది..
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్‌టూర్-750 టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భాగంగా సెమీ ఫైనల్లో భారత షట్లర్ సాయి ప్రణీత్ ఓటమి పాలయ్యాడు. సాయి ప్రణీత్ 18-21, 12-21 తేడాతో జపాన్ క్రీడాకారుడు కెంటో మొమోటో చేతిలో పరాజయం చెందడంతో భారత ఆశలు ఆవిరయ్యాయి. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సాయి ప్రణీత్.. రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశాడు. కేవలం 45 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో సాయి ప్రణీత్ ఓటమి చెందాడు. తొలి గేమ్ ఆరంభంలో సాయి ప్రణీత్ 3-1 ఆధిక్యంలో నిలిచినప్పటికీ, ఆ తర్వాత మొమోటో పుంజుకున్నాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ సాయి ప్రణీత్‌ను వెనక్కునెట్టాడు. అదే ఊపును కడవరకూ కొనసాగించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు మొమోటో. ఇక రెండో గేమ్‌లో ప్రణీత్‌కు మొమోటో ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వరుస ఆరు పాయింట్లు సాధించి సాయి ప్రణీత్‌పై తిరుగులేని ఆధిక్యం సాధించాడు. దాంతో పుంజుకోలేక పోయిన సాయి ప్రణీత్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా చేజార్చుకున్నాడు. -
మళ్లీ యామగుచి చేతిలోనే..
టోక్యో: జపార్ ఓపెన్ వరల్డ్ టూర్-750 టోర్నమెంట్ నుంచి భారత షట్లర్ పీవీ సింధు నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 18-21, 15-21 తేడాతో యామగూచి(జపాన్) చేతిలో పరాజయం చెందారు. దాంతో జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు కథ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఇటీవల ఇండోనేసియా ఓపెన్ తుది పోరులో యామగుచిని కట్టడి చేయడంలో విఫలమైన పీవీ సింధు.. మరోసారి అదే క్రీడాకారిణి చేతిలో ఓటమి చెందారు. (ఇక్కడ చదవండి: సాయి ప్రణీత్ కొత్త చరిత్ర) తొలి గేమ్ ఆరంభంలో సింధు ఆధిక్యంలో నిలిచినప్పటికీ ఆపై ఒత్తిడికి లోనై వరుసగా పాయింట్లు కోల్పోయారు. దాంతో గేమ్‌ను కోల్పోయి వెనుకబడ్డారు. ఇక రెండో గేమ్‌లో యామగుచి విజృంభించి ఆడారు. రెండో గేమ్‌లో ఇరువురు క్రీడాకారిణులు 4-4తో సమంగా ఉన్న సమయంలో పైచేయి సాధించిన యామగుచి అదే ఊపును కడవరకూ కొనసాగించారు. దాంతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నారు. -
సాయి ప్రణీత్ కొత్త చరిత్ర
టోక్యో: భారత బ్యాడ్మింటన్ ఆటగాడు సాయి ప్రణీత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జపాన్ ఓపెన్ వరల్డ్ సూపర్-750 టోర్నమెంట్లో సెమీ ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-12, 21-15 తేడాతో సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నాడు. ఫలితంగా జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు చేరిన తొలి భారత క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో సాయి ప్రణీత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సాయి ప్రణీత్.. రెండో గేమ్‌లో కూడా అదే జోరును కొనసాగించాడు. ఓ దశలో సుగియార్తో నుంచి ప్రతి ఘటన ఎదురైనా సాయి ప్రణీత్ ఎక్కడ తడబడకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. కేవలం 36 నిమిష్లాలోనే సుగియార్తోను మట్టికరిపించాడు సాయి ప్రణీత్. ఈ ఏడాది సాయి ప్రణీత్‌కు ఇది రెండో సెమీ ఫైనల్. అంతకుముందు స్విస్ ఓపెన్‌లో సాయిప్రణీత్ ఫైనల్‌కు వరకూ చేరాడు. -
క్వార్టర్స్‌కు సింధు, ప్రణీత్
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 11-21, 21-10, 21-13 తేడాతో ఆయూ ఒహోరి(జపాన్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు.. ఆపై రెండో గేమ్ లో సత్తాచాటారు. ఇక మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైతం సింధు విజృంభించి ఆడారు. ఏ దశలోనూ ఒహోరికి అవకాశం ఇవ్వని సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక పురుషుల సింగిల్స్ సాయి ప్రణీత్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. సాయి ప్రణీత్ 21-13, 21-16 తేడాతో కాంటా సునెయామ(జపాన్)పై గెలిచి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. -
జపాన్ ఓపెన్: శ్రీకాంత్, సమీర్ ఔట్
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. బుధవారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–13, 11–21, 20–22తో మనదేశానికే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ చేతిలో పోరాడి ఓడాడు. 59 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో తొలి సెట్‌ను సునాయాసంగా దక్కించుకున్న శ్రీకాంత్ రెండో సెట్‌ను అలాగే జారవిడుచు కున్నాడు. నిర్ణయాత్మక మూడోసెట్లో పోరాడినప్పటికీ కీలకదశలో తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్ సమీర్ వర్మ 17–21, 12–21తో ఆండర్స్ ఆంటోన్సెన్(డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా– సిక్కిరెడ్డి ద్వయం 11–21, 14–21తో జెంగ్ సి వీ– హువాంగ్ యా క్వియాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి– చిరాగ్ షెట్టి ద్వయం 21–16, 21–17తో మార్కస్ ఎల్లిస్– క్రిస్ లాంగ్రిడ్జ్(ఇంగ్లండ్)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరింది. సింధు అలవోకగా... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు అలవోకగా రెండో రౌండ్లో ప్రవేశించింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–9, 21–17తో వరల్డ్ నెం.12 యూ హాన్(చైనా)పై గెలుపొందింది. తొలి సెట్ ఆరంభంలో 0–2తో వెనకబడిన సింధు ఆ తర్వాత వరుసగా 6 పాయింట్లు సాధించి 6–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే ఊపులో ప్రత్యర్థికి కేవలం మరో మూడు పాయింట్లు మాత్రమే కోల్పోయి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో సింధుకు ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే అనుభవాన్ని రంగరించిన సింధు సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. తదుపరి రౌండ్లో అయ ఒహొరి(జపాన్)తో సింధు తలపడుతుంది. -
మనోళ్ల సత్తాకు పరీక్ష
టోక్యో : ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. నేడు మొదలయ్యే జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజు పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పదో ర్యాంకర్ కెంటో నిషిమోటా (జపాన్)తో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ ఆడనున్నాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి; మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో మార్విన్ సీడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ)లతో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప తలపడతారు. బుధవారం జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో హాన్ యుయె (చైనా)తో పీవీ సింధు; ప్రణయ్‌తో శ్రీకాంత్; ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ పోటీపడతారు. గతవారం ఇండోనేసియా ఓపెన్ టోర్నీలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన సింధుకు ఈ టోర్నీలో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్‌ను అధిగమిస్తే ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్లో కిర్స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్) లేదా అయా ఒహోరి (జపాన్)తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సింధుకు క్వార్టర్ ఫైనల్లో ఇండోనేసియా ఓపెన్ విజేత అకానె యామగుచి (జపాన్), సెమీఫైనల్లో రెండో సీడ్ చెన్ యుఫె (చైనా) ప్రత్యర్థులుగా ఎదురు కావొచ్చు. -
సుమీత్–మనూ జంట సంచలనం
టోక్యో: భారత అగ్రశ్రేణి డబుల్స్ జంట సుమీత్ రెడ్డి–మనూ అత్రి జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్–మనూ అత్రి ద్వయం 15–21, 23–21, 21–19తో ప్రపంచ 10వ ర్యాంక్, రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన గో వీ షెమ్–తాన్ వీక్ కియోంగ్ (మలేసియా) జంటను బోల్తా కొట్టించింది. 54 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ రెండో గేమ్‌లో భారత జోడీ మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. అంతేకాకుండా నిర్ణాయక మూడో గేమ్‌లో 17–19తో వెనుకబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకొని ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ‘ఈ మధ్య మేమిద్దరం బాగా ఆడుతున్నాం. కీలకదశలో సంయమనం కోల్పోకుండా వ్యవహరిస్తున్నాం. సమన్వయ లోపం లేకుండా చూసుకుంటున్నాం. ఆసియా క్రీడల్లో ప్రిక్వార్టర్ ఫైనల్లో చైనా జోడీతో జరిగిన మ్యాచ్‌లో మేము 3 మ్యాచ్ పాయింట్లు కోల్పో యాం. ఆ మ్యాచ్‌లో గెలిచి ఉంటే కచ్చితంగా మాకు పతకం సాధించే అవకావకాశాలు ఉండేవి. ఏదేమైనా ఆ ఓటమితో మేము గుణపాఠం నేర్చుకున్నాం’ అని మనూ అత్రి అన్నాడు. మరో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 12–21, 17–21తో మూడో సీడ్ తకెషి కముర–కిగో సొనోడా (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 17–21, 13–21తో చాంగ్ యె నా–జంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గావో ఫాంగ్‌జి (చైనా)తో పీవీ సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 0–1తో వెనుకబడి ఉంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో విన్సెంట్ (హాంకాంగ్) తో శ్రీకాంత్; జిన్‌టింగ్ ఆంథోనీ (ఇండోనేసియా)తో ప్రణయ్ ఆడతారు. డబుల్స్‌లో హీ జిటియాంగ్–తాన్ కియాంగ్ (చైనా)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి; చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా తలపడతారు. ఇటీవల ఆసియా క్రీడల్లో విన్సెంట్ చేతిలో ఓడిపోయిన శ్రీకాంత్ ఈసారి గెలిచి లెక్క సరిచేయాలని పట్టుదలతో ఉన్నాడు. నేటి ప్రిక్వార్టర్ ఫైనల్స్ ఉదయం గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
సింధు శుభారంభం
టోక్యో: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలోకి దిగిన భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–17, 7–21, 21–13తో ప్రపంచ 13వ ర్యాంకర్ సయాకా తకహాషి (జపాన్)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 10–21, 8–21తో ఫాంగ్‌జి గావో (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ 21–13, 21–15తో హువాంగ్ యుజియాంగ్ (చైనా)పై, ప్రణయ్ 21–18, 21–17తో జకార్తా ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలుపొందారు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 18–21, 22–20, 10–21తో లీ డాంగ్ కెయున్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21–9, 21–6తో మాథ్యూ ఫొగార్టీ–ఇసాబెల్ జాంగ్ (అమెరికా) జంటపై నెగ్గింది. సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 13–21, 17–21తో ఇల్యు వాంగ్–డాంగ్పింగ్ హువాంగ్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. -
నేటి నుంచి జపాన్ ఓపెన్... బరిలో పీవీ సింధు
అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ తుది పోరులో ఓడిపోతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమైంది. ఈ ఏడాది ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్, థాయ్‌లాండ్ ఓపెన్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో రన్నరప్‌గా నిలిచిన సింధు నేటి నుంచి మొదలయ్యే జపాన్ ఓపెన్‌లో బరిలోకి దిగుతోంది. మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో జపాన్ అమ్మాయి, ప్రపంచ 13వ ర్యాంకర్ సయాకా తకహాషితో మూడో ర్యాంకర్ సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో ఇద్దరూ 2–2తో సమఉజ్జీగా ఉన్నారు. -
శ్రీకాంత్ శుభారంభం
►ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం ►సింధు, సైనా, సమీర్ వర్మ కూడా టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 12–21, 21–11తో తియాన్ హువీ (చైనా)పై గెలుపొందాడు. హువీతో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఆడిన శ్రీకాంత్ రెండోసారి మాత్రమే నెగ్గడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–12, 21–14తో అంటోన్సెన్ (డెన్మార్క్)పై, సమీర్ వర్మ 21–12, 21–19తో ఖోసిత్ ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)పై గెలిచారు. అయితే సాయిప్రణీత్ 23–21, 17–21, 14–21తో లీ డాంగ్ కెయున్ (కొరియా) చేతిలో, సౌరభ్ వర్మ 21–11, 15–21, 13–21తో లిన్ డాన్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 12–21, 21–15, 21–17తో మినత్సు మితాని (జపాన్)పై, సైనా 21–17, 21–9తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు; రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా; హు యున్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో ప్రణయ్; షి యుకి (చైనా)తో సమీర్ వర్మ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప 21–17, 21–13తో ఇస్రియానెత్–పచారపున్ (థాయ్‌లాండ్)లపై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 25–27, 15–21తో గిడియోన్–కెవిన్ (ఇండోనేసియా) చేతిలో... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 18–21, 15–21తో లీ జె–హుయ్–లీ యాంగ్ (కొరియా) చేతిలో... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నçప్ప 17–21, 12–21తో చాంగ్ యె నా–లీ సో హీ (కొరియా) చేతిలో ఓడిపోయారు. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్ పరాజయం
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. ప్రపంచ 15వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-18, 14-21, 19-21తో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడినా కీలకదశలో జ్విబ్లెర్ పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్ 12-16తో వెనుకబడినా వెంటనే తేరుకొని వరుసగా ఎనిమిది పాయింట్లు స్కోరు చేశాడు. ఆ తర్వాత జ్విబ్లెర్కు రెండు పాయింట్లు కోల్పోయి, తాను ఒక పాయింట్ సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో జ్విబ్లెర్ 9-7తో ఆధిక్యం సంపాదించి ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 16-13తో ముందంజ వేసి విజయందిశగా సాగుతున్నట్లు కనిపించాడు. కానీ ఈ దశలో శ్రీకాంత్ వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయి 16-19తో వెనుకబడి కోలుకోలేకపోయాడు. -
క్వార్టర్స్‌కు చేరిన శ్రీకాంత్
టోక్యో: జపాన్ ఓపెన్‌లో తలపడుతున్న భారత ఆటగాళ్లలో కిడాంబి శ్రీకాంత్ ఒక్కడే రేసులో మిగిలాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ తన సహచర ఆటగాడు అజయ్ జయరామ్‌తో తలపడగా 21-16తో తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. అరుుతే గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే జయరామ్ తప్పుకున్నాడు. తొలి గేమ్ ఆరంభంలో 12-11తో జయరామ్ ఆధిక్యం కనబరిచినా ఆ తర్వాత శ్రీకాంత్ పుంజుకుని గేమ్‌ను దక్కించుకున్నాడు. క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్.. మార్క్ జ్వీబ్లెర్ (జర్మనీ)తో తలపడతాడు. 2014లో జరిగిన ఇదే ఈవెంట్లో శ్రీకాంత్‌పై మార్క్ నెగ్గాడు. మరోవైపు హెచ్.ఎస్ ప్రణయ్ పోరాటం కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. 16-21, 19-21 తేడాతో రెండో సీడ్ విక్టర్ ఏక్సెల్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. 44 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో రెండో గేమ్‌లో ప్రణయ్ గట్టి పోటీనే ఇచ్చినా విజయం సాధించలేకపోయాడు. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్ అర్హత
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో కశ్యప్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాడు. డేవిడ్ ఒబెర్‌నోస్టెరెర్ (ఆస్ట్రియా)తో జరిగిన తొలి రౌండ్లో కశ్యప్ 11-3తో ఆధిక్యంలో ఉన్నదశలో అతని ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగాడు. ఇక రెండో రౌండ్లో కశ్యప్ 21-18, 21-12తో ఆండెర్స్ అంటన్సెన్ (డెన్మార్క్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ క్వాలియింగ్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి తన్వీ లాడ్ 21-19, 18-21, 9-21తో చిసాతో హోషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్‌తో కశ్యప్ ఆడనున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; సోనీ ద్వి కుంకోరో (ఇండోనేసియా)తో అజయ్ జయరామ్; జుల్కర్నైన్ (మలేసియా)తో ప్రణయ్ తలపడతారు. -
సింధు మరో నెల తర్వాత...
హైదరాబాద్: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ రజత పతక విజేత పీవీ సింధు మరో నెల రోజుల తర్వాత తొలి టోర్నీ ఆడనుంది. అక్టోబరు 18 నుంచి జరిగే డెన్మార్క్ ఓపెన్‌లో ఆడుతుంది. ఈ లోగా జరిగే రెండు పెద్ద టోర్నీలు జపాన్ ఓపెన్, కొరియా ఓపెన్‌లో ఆడటం లేదు. గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లో సింధు రన్నరప్‌గా నిలిచింది. సూపర్ సిరీస్ టోర్నీలలో తనకు ఇదే ఉత్తమ ప్రదర్శన. -
వెనుదిరిగిన కశ్యప్
జపాన్ ఓపెన్‌లో నిరాశపర్చిన భారత క్రీడాకారులు టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారీగా ఆశలు పెట్టుకున్న పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ కశ్యప్ 14-21, 18-21తో ఆరోసీడ్ చో టియాన్ చెన్ (చైనీస్‌తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు సత్తా మేరకు రాణించలేకపోయాడు. తొలి గేమ్‌లో స్కోరు 10-9 ఉన్న దశలో చెన్ వరుసగా ఓసారి నాలుగు, మరోసారి ఐదు పాయింట్లు సాధించాడు. కశ్యప్ రెండు, మూడు పాయింట్లకే పరిమితం కావడంతో గేమ్ చేజారింది. రెండో గేమ్‌లో హైదరాబాదీ పుంజుకునే ప్రయత్నం చేసినా.. చెన్ ర్యాలీల ముందు నిలవలేకపోయాడు. స్కోరు 2-4తో వెనుకబడి ఉన్న దశలో తైపీ ప్లేయర్ వరుసగా ఆరు, నాలుగు పాయింట్లు గెలిచి 12-5 ఆధిక్యంలోకి వెళ్లాడు. తర్వాత కశ్యప్ కాసేపు పోరాడాడు. 14-20 స్కోరు వద్ద హైదరాబాదీ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 18-20 తగ్గించాడు. కానీ చెన్ ఒకే షాట్‌తో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. -
సైనా శుభారంభం..!
టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ లో ఇండియన్ టాప్ షట్లర్, ప్రపంచ నంబర్ వన్ సైనా నేహ్వాల్ శుభారంభం చేసింది. సైనాతో పాటు పారుపల్లి కశ్యప్, కిదాంబిశ్రీకాంత్, ప్రణయ్ లు తొలి రౌండ్ లో విజయం సాధించారు. అయితే పీవీ సింధు కు మాత్రం తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో రెండో సీడ్ సైనా 21-14, 21-20 తేడాతో.. థాయ్ లాండ్ కి చెందిన బుసానన్ పై గెలిచింది. మరో మ్యాచ్‌లో సింధు 21-13, 17-21,21-11 స్కోర్ తో జపాన్ క్రీడాకారిణి మినట్సూమితాని చేతిలో ఓడిపోయింది. ఒకవేళ సింధు ఈ మ్యాచ్‌లో గెలిచిఉంటే ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా ఎదురయ్యేది. సింధు ఓటమితో ప్రిక్వార్టర్ ఫైనల్లో మితానీతో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ జపనీస్ ప్రత్యర్థి టకుమ మ్యాచ్ నుంచి మధ్యలో వైదొలగటంతో కశ్యప్ రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. మరో వైపు సింగిల్స్ ప్లేయర్ అజయ్ జయరాం తొలి రౌండ్ లోనే వెనుదిరిగాడు. మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల - అశ్వనిపొన్నప్ప జంట చైనా జంట ఎనిమిదో సీడ్ జుహో యున్ లీ- జాంగ్ జంట చేతిలో 22-20, 18-21, 21-13 స్కోర్ తేడాతో ఓడిపోయారు. -
జపాన్ ఓపెన్ లో సింధుకి షాక్
టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకి షాక్ తగిలింది. తొలి రౌండ్ మ్యాచ్ లోనే ఇంటి దారి పట్టింది. జపాన్ క్రీడాకారిణి మినట్సూమితాని చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకుంది. మూడు రౌండ్ల పాటు జరిగిన మ్యాచ్ లో 21-13, 17-21,21-11 స్కోర్ తో ఓడిపోయింది. మరో వైపు.. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్ లోకి అడుగు పెట్టాడు. జపనీస్ ప్రత్యర్థి టకుమ మ్యాచ్ నుంచి మధ్యలో వైదొలగటంతో కశ్యప్ రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. మరో వైపు సింగిల్స్ ప్లేయర్ అజయ్ జయరాం తొలి రౌండ్ లోనే వెనుదిరిగాడు. మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల, అశ్వనిపొన్నప్ప జంట కూడా ఓటమితో నిరాశ పరిచారు.