
టోక్యో: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలోకి దిగిన భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–17, 7–21, 21–13తో ప్రపంచ 13వ ర్యాంకర్ సయాకా తకహాషి (జపాన్)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 10–21, 8–21తో ఫాంగ్‌జి గావో (చైనా) చేతిలో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొలి రౌండ్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–13, 21–15తో హువాంగ్ యుజియాంగ్ (చైనా)పై, ప్రణయ్ 21–18, 21–17తో జకార్తా ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలుపొందారు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 18–21, 22–20, 10–21తో లీ డాంగ్ కెయున్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21–9, 21–6తో మాథ్యూ ఫొగార్టీ–ఇసాబెల్ జాంగ్ (అమెరికా) జంటపై నెగ్గింది. సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 13–21, 17–21తో ఇల్యు వాంగ్–డాంగ్‌పింగ్ హువాంగ్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment