టోక్యో : ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. నేడు మొదలయ్యే జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్‌లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజు పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పదో ర్యాంకర్ కెంటో నిషిమోటా (జపాన్)తో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ ఆడనున్నాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి; మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో మార్విన్ సీడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ)లతో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప తలపడతారు. బుధవారం జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో హాన్ యుయె (చైనా)తో పీవీ సింధు; ప్రణయ్‌తో శ్రీకాంత్; ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ పోటీపడతారు. గతవారం ఇండోనేసియా ఓపెన్ టోర్నీలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన సింధుకు ఈ టోర్నీలో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్‌ను అధిగమిస్తే ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్లో కిర్‌స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్) లేదా అయా ఒహోరి (జపాన్)తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సింధుకు క్వార్టర్ ఫైనల్లో ఇండోనేసియా ఓపెన్ విజేత అకానె యామగుచి (జపాన్), సెమీఫైనల్లో రెండో సీడ్ చెన్ యుఫె (చైనా) ప్రత్యర్థులుగా ఎదురు కావొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment