న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనే 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించారు. పురుషుల జట్టును ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ నడిపించనున్నాడు. డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3నుంచి 11వరకు జరుగనున్న ఈ టోర్నీలో కశ్యప్, లక్ష్యసేన్, శుభాంకర్, సిరిల్ వర్మ, మను అత్రి, సుమీత్ రెడ్డి, అర్జున్, ధ్రువ్ కపిల, కృష్ణ ప్రసాద్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. మోకాలి గాయం కారణంగా ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ చాంపియన్ పీవీ సింధుతో పాటు సైనా నెహ్వాల్, అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డిలతో పాటు మాల్విక బన్సోద్, ఆకర్షి కశ్యప్, పూజ, సంజన సంతోష్, పూర్వీషా రామ్, జక్కంపూడి మేఘన జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేసి జట్టును ఎంపిక చేయాల్సి ఉంది.
ఈ మేరకు సెప్టెంబర్ 3–27 వరకు శిబిరం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో అకాడమీలోనే ఉంటూ ప్రాక్టీస్ చేసేందుకు కొందరు ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. పైగా క్యాంప్ ప్రారంభానికి ముందు నిబంధనల ప్రకారం వారం రోజుల క్వారంటీన్ తప్పనిసరి కావడంతో అంత సమయం లేదని భావించిన ‘బాయ్’ మొత్తం శిబిరాన్నే రద్దు చేసింది. థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ అనంతరం జరుగనున్న డెన్మార్క్ ఓపెన్ (అక్టోబర్ 13–18), డెన్మార్క్ మాస్టర్స్ (అక్టోబర్ 20–25) టోర్నీల్లోనూ శ్రీకాంత్, లక్ష్యసేన్, సింధు, సైనా, అశ్విని, సిక్కిరెడ్డి ఆడనున్నారు.
సారథులుగా శ్రీకాంత్, సింధు
Published Fri, Sep 11 2020 2:21 AM | Last Updated on Fri, Sep 11 2020 5:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment