కుమమోటో: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న మూడో టోర్నమెంట్‌లోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ 23వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా ప్లేయర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–17, 16–21, 17–21తో పోరాడి ఓడిపోయింది.
మిచెల్లి లీ చేతిలో సింధుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. మిచెల్లిపై 10 సార్లు నెగ్గిన సింధుకు ఈసారి మాత్రం నిరాశ తప్పలేదు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... ఆ తర్వాతి రెండు గేముల్లో కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకుంది.
2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో రెండుసార్లు (మిక్స్‌డ్ టీమ్ మ్యాచ్, సింగిల్స్ సెమీఫైనల్) సింధును ఓడించిన మిచెల్లి ఆ తర్వాత 2023లో థాయ్‌లాండ్ ఓపెన్‌లో మూడోసారి సింధుపై నెగ్గింది. ఈ ఏడాది ఆర్క్‌టిక్ ఓపెన్‌లో నాలుగోసారి సింధును ఓడించిన మిచెల్లి నెల తిరిగేలోపు జపాన్ ఓపెన్‌లో మరోసారి గెలుపు రుచి చూసింది.
Comments
Please login to add a commentAdd a comment