ప్రపంచ 11వ ర్యాంకర్‌పై విజయం
కెరీర్‌లో 19వసారి బుసానన్‌పై నెగ్గిన భారత స్టార్ షట్లర్
కుమమోటో: జపాన్ ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్‌లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుసానన్ ఒంగ్‌మమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21–12, 21–8తో అలవోకగా గెలిచింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న బుసానన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకొని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఓవరాల్‌గా సింధు, బుసానన్‌ల మధ్య ఇది 20వ ముఖాముఖి పోరు కావడం విశేషం. సింధు ఏకంగా 19 సార్లు గెలుపొందగా... థాయ్‌లాండ్ ప్లేయర్ ఒక్కసారి మాత్రమే సింధును ఓడించింది. బుసానన్ ఆటతీరుపై స్పష్టమైన అవగాహన ఉన్న సింధుకు తొలి గేమ్ ఆరంభంలో గట్టిపోటీ లభించింది. ఒకదశలో సింధు, బుసానన్ (11–10) మధ్య ఒక్క పాయింటే అంతరంగా నిలిచింది.
అయితే నెమ్మదిగా సింధు జోరు పెంచగా... థాయ్‌లాండ్ ప్లేయర్ తడబడింది. స్కోరు 14–12 వద్ద సింధు చెలరేగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... వరుసగా ఏడు పాయింట్లతో అదరగొట్టిన సింధు తొలి గేమ్‌ను 21–12తో దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ ఆరంభంలో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. స్కోరు 5–4 వద్ద సింధు విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 10–4తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత బుసానన్ వరుసగా మూడు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. కానీ స్కోరు 10–7 వద్ద సింధు వరుసగా 10 పాయింట్లు సంపాదించి 20–7తో ముందంజ వేసింది. ఆ తర్వాత బుసానన్ ఒక పాయింట్ సాధించిన వెంటనే సింధు కూడా ఒక పాయింట్ నెగ్గడంతో భారత స్టార్ విజయం ఖరారైంది.
పోరాడి ఓడిన లక్ష్య సేన్
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత కథ తొలి రౌండ్‌లోనే ముగిసింది. భారత స్టార్ లక్ష్య సేన్ 74 నిమిషాల పోరులో కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు.
ప్రపంచ 31వ ర్యాంకర్ జున్ హావో లియోంగ్ (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 22–20, 17–21, 16–21తో ఓడిపోయాడు. గతంలో జున్ హావోపై మూడుసార్లు నెగ్గిన లక్ష్య సేన్ ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment