ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్...ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఘనత... బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో ఇలా ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్ స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రస్తుతం పునర్‌వైభవం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు.
ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన 31 ఏళ్ల శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి రాకెట్ పట్టి బ్యాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టనున్నాడు. జకార్తా వేదికగా మంగళవారం నుంచి మొదలయ్యే సీజన్ మూడో టోర్నమెంట్ ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్‌లో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ విభాగంలో పోటీపడనున్నాడు.
భారత్‌కే చెందిన ఆయుశ్ శెట్టితో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 45వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో చైనా ప్లేయర్ షి ఫెంగ్ లీతో తలపడే అవకాశం ఉంది.
గత ఏడాది శ్రీకాంత్ 14 టోర్నమెంట్‌లలో పాల్గొన్నాడు. స్విస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి కిరణ్ జార్జి, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ బరిలో ఉన్నారు.
తొలి రౌండ్‌లో కిరణ్ జార్జి క్వాలిఫయర్‌తో... టకుమా ఒబయాషి (జపాన్)తో లక్ష్య సేన్... కొడాయ్ నరోకా (జపాన్)తో ప్రియాన్షు ఆడతారు. తొలి రోజు మంగళవారం సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు, డబుల్స్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
బరిలో పీవీ సింధు
మరోవైపు... మహిళల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయింగ్‌లో ఇషారాణి బారువా, తాన్యా హేమంత్ పోటీపడనున్నారు. మెయిన్ ‘డ్రా’లో పీవీ సింధు, రక్షితశ్రీ, ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప; పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మిక్స్‌డ్ డబుల్స్‌లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్; తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి.
మరిన్ని క్రీడా వార్తలు
హరికృష్ణ ఖాతాలో తొలి ‘డ్రా’
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ మాస్టర్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ నగరంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. భారత్‌కే చెందిన లియోన్ ల్యూక్ మెండోకాతో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో జ్యోతి సురేఖ
ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మరోసారి కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. సోమవారం విడుదల చేసిన మహిళల
కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్స్‌లో విజయవాడకు చెందిన 28 ఏళ్ల జ్యోతి సురేఖ రెండు స్థానాలు పురోగతి సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్‌లో జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి సురేఖ అంతర్జాతీయస్థాయిలో 30 కంటే ఎక్కువ పతకాలు సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment