యోకోహామా: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ నుంచి సతీశ్ కుమార్ కరుణాకరన్ ఒక్కడే మిగిలాడు. టోర్నీ రెండో రోజు బుధవారం బరిలోకి దిగిన భారత క్రీడాకారుల్లో సతీశ్ మినహా మిగతా వారందరూ ఓడిపోయారు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్‌సెన్ (డెన్మార్క్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 47వ ర్యాంకర్ సతీశ్ 6–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు.
ఈ దశలో ఆంటోన్‌సెన్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలగడంతో సతీశ్‌ను విజేతగా ప్రకటించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కాంతాపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)తో సతీశ్ తలపడతాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో కిరణ్ జార్జి 19–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
జెస్పెర్ టాఫ్ట్–అమెలీ మాగెలుండ్ (డెన్మార్క్)తో జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 1–3తో వెనుకబడిన దశలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ గాయం కారణంగా వైదొలిగింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో రుతుపర్ణా పాండా–శ్వేతాపర్ణా (భారత్) ద్వయం 8–21, 14–21తో జూలీ ఫిన్–మాయ్ సురో (డెన్మార్క్) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment