వెనుదిరిగిన కశ్యప్ | Fell Kashyap | Sakshi
Sakshi News home page

వెనుదిరిగిన కశ్యప్

Published Sat, Sep 12 2015 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

వెనుదిరిగిన కశ్యప్

వెనుదిరిగిన కశ్యప్

 జపాన్ ఓపెన్‌లో నిరాశపర్చిన భారత క్రీడాకారులు
 
 టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారీగా ఆశలు పెట్టుకున్న పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ కశ్యప్ 14-21, 18-21తో ఆరోసీడ్ చో టియాన్ చెన్ (చైనీస్‌తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు సత్తా మేరకు రాణించలేకపోయాడు. తొలి గేమ్‌లో స్కోరు 10-9 ఉన్న దశలో చెన్ వరుసగా ఓసారి నాలుగు, మరోసారి ఐదు పాయింట్లు సాధించాడు. కశ్యప్ రెండు, మూడు పాయింట్లకే పరిమితం కావడంతో గేమ్ చేజారింది.

రెండో గేమ్‌లో హైదరాబాదీ పుంజుకునే ప్రయత్నం చేసినా.. చెన్ ర్యాలీల ముందు నిలవలేకపోయాడు. స్కోరు 2-4తో వెనుకబడి ఉన్న దశలో తైపీ ప్లేయర్ వరుసగా ఆరు, నాలుగు పాయింట్లు గెలిచి 12-5 ఆధిక్యంలోకి వెళ్లాడు. తర్వాత కశ్యప్ కాసేపు పోరాడాడు. 14-20 స్కోరు వద్ద హైదరాబాదీ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 18-20 తగ్గించాడు. కానీ చెన్ ఒకే షాట్‌తో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement