శ్రీకాంత్ శుభారంభం
►ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం
►సింధు, సైనా, సమీర్ వర్మ కూడా
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 12–21, 21–11తో తియాన్ హువీ (చైనా)పై గెలుపొందాడు. హువీతో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఆడిన శ్రీకాంత్ రెండోసారి మాత్రమే నెగ్గడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–12, 21–14తో అంటోన్‌సెన్ (డెన్మార్క్)పై, సమీర్ వర్మ 21–12, 21–19తో ఖోసిత్ ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)పై గెలిచారు.
అయితే సాయిప్రణీత్ 23–21, 17–21, 14–21తో లీ డాంగ్ కెయున్ (కొరియా) చేతిలో, సౌరభ్ వర్మ 21–11, 15–21, 13–21తో లిన్ డాన్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 12–21, 21–15, 21–17తో మినత్సు మితాని (జపాన్)పై, సైనా 21–17, 21–9తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు; రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా; హు యున్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో ప్రణయ్; షి యుకి (చైనా)తో సమీర్ వర్మ ఆడతారు.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప 21–17, 21–13తో ఇస్రియానెత్–పచారపున్ (థాయ్‌లాండ్)లపై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 25–27, 15–21తో గిడియోన్–కెవిన్ (ఇండోనేసియా) చేతిలో... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 18–21, 15–21తో లీ జె–హుయ్–లీ యాంగ్ (కొరియా) చేతిలో... మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నçప్ప 17–21, 12–21తో చాంగ్ యె నా–లీ సో హీ (కొరియా) చేతిలో ఓడిపోయారు.