సింధు, శ్రీకాంత్‌లపైనే దృష్టి
టోక్యో: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) తర్వాత భారత అగ్రశ్రేణి క్రీడాకారులు తొలి పరీక్షకు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విశ్రాంతి కోరుకున్న సైనా నెహ్వాల్... చీలమండ గాయంతో పారుపల్లి కశ్యప్ ఈ టోర్నమెంట్ బరిలోకి దిగడంలేదు. ఈ నేపథ్యంలో భారత ఆశలన్నీ మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌లపై ఆధారపడి ఉన్నాయి. టోర్నీ తొలిరోజు మంగళవారం కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత తొలి అంతర్జాతీయ టోర్నీలో ఆడుతోన్న సింధు తొలి రౌండ్‌లోనూ, రెండో రౌండ్‌లోనూ క్వాలిఫయర్స్‌తో ఆడనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)తో సింధు ఆడాల్సి ఉంటుంది. మరో పార్శ్వంలో ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్), నాలుగో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) ఉన్నారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఆరుగురు మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు. శ్రీకాంత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు భమిడిపాటి సాయిప్రణీత్, ఆనంద్ పవార్, సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్, హెచ్.ఎస్.ప్రణయ్‌లకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు లభించింది. తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్ యున్ హూ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; షో ససాకి (జపాన్)తో శ్రీకాంత్; సోనీ ద్వి కున్‌కురో (ఇండోనేసియా)తో ఆనంద్ పవార్; తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)తో అజయ్ జయరామ్; వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)తో ప్రణయ్; క్వాలిఫయర్‌తో సౌరభ్ వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో హిరోయుకి సయెకి-తహోతా (జపాన్) జోడితో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం ఆడుతుంది. మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు బరిలోకి దిగడంలేదు.