
న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) బోస్టన్‌లో జరిగిన ఇన్విటేషనల్ టోర్నీలో జాతీయ రికార్డు నెలకొల్పాడు. 3000 మీటర్ల ఇండోర్ రేసులో గుల్వీర్ సింగ్ 7 నిమిషాల 38.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. తద్వారా 16 ఏళ్ల క్రితం సురేందర్ సింగ్ (7:49.47) నెలకొల్పిన రికార్డును గుల్వీర్ బద్దలు కొట్టాడు. 2022 హాంగ్జూ ఆసియా క్రీడల 10,000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన గుల్వీర్... సీజన్ ఆరంభంలోనే రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు.
‘సీజన్ తొలి ఇండోర్ టోర్నీలోనే మంచి ప్రదర్శన కనబర్చడం సంతోషంగా ఉంది. దీంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఈ స్ఫూర్తితో ఔట్ డోర్ ఈవెంట్‌లలోనూ సత్తా చాటుతా’ అని 26 ఏళ్ల గుల్వీర్ పేర్కొన్నాడు.
ఇదే టోర్నీలో పాల్గొన్న భారత మరో రన్నర్ రాహుల్ 8 నిమిషాల 8.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ప్రస్తుతం గుల్వీర్ పేరిటే 5000 మీటర్లు, 10,000 మీటర్ల జాతీయ రికార్డులు ఉన్నాయి. 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేసిన గుల్వీర్... 10,000 మీటర్ల రేసును 27 నిమిషాల 14.88 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరగనున్న నేపథ్యంలో భారత మిడిల్, లాంగ్ డిస్టాన్స్ రన్నర్‌లు ప్రస్తుతం అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment