జాతీయ క్రీడల్లో రెండో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్
200 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచిన వైజాగ్ అమ్మాయి
ట్రాంపోలిన్‌లో షేక్ యాసీన్‌కు పసిడి
హెప్టాథ్లాన్‌లో నందినికి స్వర్ణం
డెహ్రాడూన్: భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ జాతీయ క్రీడల్లో మరోసారి ‘పసిడి’ ప్రదర్శనతో అదరగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 200 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన 25 ఏళ్ల జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 23.35 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించింది.
తెలంగాణ అమ్మాయి నిత్య (23.76 సెకన్లు)
కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గత ఆదివారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో వరుసగా మూడోసారి జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన సంగతి తెలిసిందే. జిమ్నాస్టిక్స్‌లో భాగమైన మహిళల ట్రాంపోలిన్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్ యాసీన్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
ఎనిమిది మంది పోటీపడిన ఫైనల్లో కాకినాడ జిల్లాకు చెందిన షేక్ యాసీన్ తన విన్యాసాలతో మెరిపించి 39.790 పాయింట్లతో విజేతగా నిలిచింది. 2022 గుజరాత్ జాతీయ క్రీడల్లో యాసీన్ రజతం నెగ్గింది.
నందిని నిలకడగా...
ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి అగసార నందిని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రెండు రోజులపాటు జరిగిన ఈ ఈవెంట్‌లో నందిని మొత్తం 5601 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది.
అంతేకాకుండా ఈ ఏడాది మే 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ విభాగంలో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ (44.767 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించింది.
మరోవైపు మహిళల నెట్‌బాల్ ఫాస్ట్–5 ఈవెంట్‌లో తెలంగాణ జట్టుకు రజత పతకం లభించింది. ఫైనల్లో తెలంగాణ జట్టు 20–23తో హరియాణా చేతిలో ఓడిపోయింది. తెలంగాణ నెట్‌బాల్ జట్టు తరఫున నట్టి అఖిల, సయ్యదా మస్రతున్నీసా, జంగా సుప్లవి రాజ్, యరువా యషశ్రీ, సాయిప్రియ, కొమర రిషిక, అలోనా, తరుణ, అంజలి, యదనవేణి దీప్తి ప్రాతినిధ్యం వహించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 17వ స్థానంలో... తెలంగాణ 14పతకాలతో (2 స్వర్ణాలు, 3 రజతాలు, 9 కాంస్యాలు) 27వ స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment