
మహిళల టెన్నిస్‌లో మరో స్టార్ అవతరించింది. టీనేజ్ వయసులో తాను సాధిస్తున్న విజయాలు గాలివాటం కాదని రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆంద్రెయెవా నిరూపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీలో ఆంద్రెయెవా విజేతగా నిలిచింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్)తో జరిగిన తుది పోరులో ఆంద్రెయెవా మూడు సెట్‌లలో విజయాన్ని అందుకొని కెరీర్‌లో రెండో డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది.
కాలిఫోర్నియా: ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ రష్యా టీనేజ్ టెన్నిస్ స్టార్ మిరా ఆంద్రెయెవా రెండో టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సర్క్యూట్‌లో గ్రాండ్‌స్లామ్ టోర్నీ తర్వాత ఉన్నతశ్రేణి టోర్నీ అయిన 1000 సిరీస్‌లలో ఆమె వరుసగా రెండో టైటిల్‌ను దక్కించుకుంది. గత నెలలో దుబాయ్ ఓపెన్–1000 టోర్నీలో టైటిల్ సాధించిన ఆంద్రెయెవా తాజాగా ఇండియన్ వెల్స్ ఓపెన్–1000 టోర్నీలో చాంపియన్‌గా అవతరించింది.
భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 17 ఏళ్ల ఆంద్రెయెవా 2–6, 6–4, 6–3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)ను బోల్తా కొట్టించింది. ఈ ఏడాది బ్రిస్బేన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలలో సబలెంకా చేతిలో ఎదురైన రెండు పరాజయాలకు ఈ గెలుపుతో ఆంద్రెయెవా బదులు తీర్చుకుంది. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సబలెంకా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే తన లోపాలను సరిదిద్దుకొని రెండో సెట్ నుంచి ఆంద్రెయెవా విజృంభించింది.
మూడో గేమ్‌లో సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఆంద్రెయెవా నాలుగో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆంద్రెయెవా తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను 6–4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో ఆంద్రెయెవా మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో సబలెంకా సర్వీస్‌లను బ్రేక్ చేసి 6–3తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
విజేతగా నిలిచిన ఆంద్రెయెవాకు 11,27,500 డాలర్ల (రూ. 9 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సబలెంకాకు 5,99,625 డాలర్ల (రూ. 5 కోట్ల 19 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇండియన్ వెల్స్ టైటిల్‌తో ఆంద్రెయెవా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరుకుంది. ఐదు స్థానాలు ఎగబాకిన ఆంద్రెయెవా ఆరో ర్యాంక్‌ను అందుకుంది.
కంప్యూటర్ ర్యాంకింగ్స్‌ను 1975లో ప్రవేశ పెట్టాక ఒకే టోర్నీ ఫైనల్లో, సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ రెండో ర్యాంకర్‌లను ఓడించి విజేతగా నిలిచిన రెండో అతి పిన్న వయస్కురాలిగా ఆంద్రెయెవా గుర్తింపు పొందింది. ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీస్‌లో రెండో ర్యాంకర్ స్వియాటెక్ (పోలాండ్)పై ఆంద్రెయెవా గెలిచింది. 1979 యూఎస్ ఓపెన్‌లో ట్రేసీ ఆస్టిన్ (16 ఏళ్లు) ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.
మార్టినా హింగిస్ (1999లో) తర్వాత ‘బ్యాక్ టు బ్యాక్’ డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా ఆంద్రెయెవా నిలిచింది.
డ్రేపర్ ధమాకా
ఇండియన్ వెల్స్ ఓపెన్ పురుషుల విభాగంలో బ్రిటన్ ప్లేయర్ జాక్ డ్రేపర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో డ్రేపర్ 70 నిమిషాల్లో 6–2, 6–2తో హోల్గర్ రూనే (డెన్మార్క్)పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 సింగిల్స్ టైటిల్ సాధించాడు. డ్రేపర్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.
23 ఏళ్ల డ్రేపర్ టైటిల్ గెలిచే క్రమంలో సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్)ను ఓడించాడు. తాజా గెలుపుతో డ్రేపర్ సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 7వ ర్యాంక్‌ను అందుకున్నాడు.
ఆండీ ముర్రే, టిమ్ హెన్మన్, గ్రెగ్ రుసెద్‌స్కీ, కామెరాన్ నోరి తర్వాత ఏటీపీ మాస్టర్స్–1000 టైటిల్ నెగ్గిన ఐదో బ్రిటన్ ప్లేయర్‌గా డ్రేపర్ గుర్తింపు పొందాడు. విజేతగా నిలిచిన డ్రేపర్‌కు 12,01,125 డాలర్ల (రూ. 10 కోట్ల 41 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, రన్నరప్ రూనేకు 6,38,750 డాలర్ల (రూ. 5 కోట్ల 53 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment